1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (శ్రీమతి తంగిరాల దమయంతి)

ధన్యజీవులు (శ్రీమతి తంగిరాల దమయంతి)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : October
Issue Number : 4
Year : 2016

అమ్మచే ఉద్ధరింపబడిన కుటుంబాలు ఎన్ని వందలు వేలున్నాయో మనకు తెలియదు. అమ్మ జీవిత మహోదధిలో మునిగితే ఎప్పటికి పైకి తేలుతామో తెలియదు. మనకు తెలిసినవే కొన్ని వందలున్నాయి. ఒక సాగరుగారనో, రాజుపాలెం వారనో, గంగరాజువారనో, మన్నవ వారనో, తంగిరాల వారనో, రావూరివారనో, రాచర్ల వారనో, యల్లాప్రగడవారనో, కొండముదివారనో ఒకరనేమిటి ఎన్ని కుటుంబాలు ఉద్దరింపబడుతున్నాయో తరతరాలుగా.

శ్రీమతి తంగిరాల దమయంతి

అలా అమ్మ అనుగ్రహం పొందిన కుటుంబాలలో తంగిరాల వారిది ప్రముఖమైనస్థానమే – తంగిరాల వారింటికి తన ఎనిమిదవ యేటనే కోడలిగా వచ్చిన దమయంతిగారు కోనసీమలోని పొడగట్లపల్లిలో కొంపెల్ల సింహాద్రి శాస్త్రి మాణిక్యాంబ దంపతులకు 1915లో జన్మించింది. సింహాద్రిశాస్త్రి గుంటూరు పొన్నూరులో పోలీసు ఇన్స్పెక్టరుగా ఉండగా తన కూతురు దమయంతికి ఎనిమిదవ యేటనే తంగిరాల సత్యనారాయణతో వివాహం జరిపించారు. అప్పటికి సత్యనారాయణగారు మద్రాసులో యల్.యం.పి. వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారిది అసలు పశ్చిమగోదావరి జిల్లా, తణుకు. వైద్య విద్య పూర్తిచేసిన సత్యనారాయణ గారు స్వగ్రామమైన తణుకుకు వచ్చి ఆ చుట్టుప్రక్కలనే వైద్యం చేస్తూ వచ్చారు.

1944లో గుంటూరు జిల్లా అప్పికట్లలో లోకల్ ఫండ్ డిస్పెన్సరీలో డాక్టరుగా ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో సహా అప్పికట్ల వచ్చి కొండముదివారి కుటుంబాలతో సాన్నిహిత్యం ఏర్పడింది. అమ్మ ఎవరో వారికి తెలియని రోజులలోనే అమ్మ వారి వద్ద ఇన్పెక్షన్ చేయించుకున్నదిట. అమ్మ తర్వాత వారికి చెప్పేదాకా వారికి తెలియదు. ఆ రోజులలో రఘువరదాసుగారు రామనామ సప్తాహాలు చేస్తుండేవారు అప్పికట్ల, ఈతేరు, మట్టిపూడి గ్రామాలలో.

ఆ సప్తాహాలలో డాక్టరుగారి కుటుంబం కూడా వెళ్ళేవారు. అమ్మ ఆ సప్తాహాలకు వస్తుండేది. 1953 దాకా దాదాపు 10 సంవత్సరాలు డాక్టరుగారు అప్పికట్లలో ఉన్న రోజులలో లోకనాధం బాబాయి (నాన్నగారి తమ్ముడు) అక్కడ స్కూల్లో ఉపాధ్యాయుడు. సుబ్బారావు, రవి అక్కడ చదువు కుంటుండేవారు. డాక్టరు గారి రెండవ కుమారుడు సింహాద్రి శాస్త్రి (మాతామహుని పేరే) సుబ్బారావు క్లాస్మేట్.

దమయంతిగారు ఆధ్యాత్మిక చింతనాపరురాలు. కనకదుర్గాదేవిని నిత్యం ఆరాధిస్తుండేది. సంప్రదాయ సిద్ధమైన అన్ని నోములు నోచుకుంటుండేది. ఆమెలోని ప్రేమ, వాత్సల్యము, నవ్వుతూ పలకరించే తీరు, ఆ వర్చస్సు మొదటిసారి చూచిన వారికి ఒక దేవతామూర్తిలా ఉండేది. ఒక మహారాణిలా ఆమెలోని ఆ ఠీవి ఎవరినైనా ఆకర్షిస్తుంది.

సత్యనారాయణగారు ఉద్యోగరీత్యా సత్తెనపల్లి, అచ్చంపేట, తాడికొండ, ప్రాంతాలు తిరుగుతూ 1958లో బదిలీమీద పర్చూరు వచ్చారు. పర్చూరులో అమ్మ వద్దకు అంతకు ముందు నుండే వస్తున్న ఐ.యల్.టి.డి.లో ఉద్యోగం చేసే అగస్త్య రాజు నారాయణరావుగారు డాక్టరుగారి కుటుంబానికి అమ్మలోని అతిలోక విశిష్టతను గూర్చి చెప్పి పర్చూరులోని చాలా మందికి అమ్మ వద్దకు వెళుతున్నామని చెప్పి, 1960లో డాక్టరు గారి కుటుంబాన్ని కూడా జిల్లెళ్ళమూడికి తీసుకొని వెళ్ళారు. అమ్మతో నారాయణరావుగారు డాక్టరు గారి కుటుంబాన్ని పరిచయం చేస్తుండగా అమ్మ తనకు తెలుసునని అప్పికట్లలో డాక్టరు గారి దగ్గర ఇన్ఫెక్షన్ తీసుకున్నానని అప్పికట్లలో నుండి జిల్లెళ్ళమూడి వెళ్తూ దమయంతి మఱిపూడి తోటలోని బావి నుండి ఎర్రచీరకట్టుకొని నీళ్ళు తెస్తుండగా చూచానని చెప్పటంతో ఆశ్చర్యపోవటం డాక్టరు గారి కుటుంబము, నారాయణరావుగారి వంతయింది.

అమ్మ వద్దకు తరచుగా ఆ కుటుంబం రాకపోకలు పెరిగి అమ్మను తమ ఆరాధ్యదైవంగా భావించి దమయంతిగారు తమ పూజామందిరంలో కనకదుర్గకు అమ్మకూ తేడాలేదని భావించి అమ్మ చిత్రపటాన్ని పెట్టి పూజించటం మొదలైంది. ఆ పూజా తీవ్రత ఎంతదాకా వెళ్లిందంటే అమ్మకు శూలం, శంఖం, చక్రం, కిరీటం పెట్టి కనకదుర్గాదేవికి వలెనే పూజించుకోవాలనే కోరిక ప్రబలంగా ఏర్పడింది. దమయంతిగారు తనవద్ద ఉన్న వెండి రూపాయలు, వెండి దీపారాధన కుందులు, పన్నీరుబుడ్డీలు, వెండి గిన్నెలు పోగుజేసి కొమ్మూరు డాక్టరు అనంతశేషాచలంగారి తమ్ముడు వీరాస్వామి (నందిపాడులో బంగారు, వెండి వస్తువులు తయారు చేస్తుంటాడు) చేత చేయించాలనుకున్నారు. ముందుగా అమ్మకు తమ కోరిక తెలియజేసి అమ్మ అనుమతి తీసుకొని ఆ వస్తువులన్నీ చేయించారు.

డాక్టరుగారి కుటుంబమంతా, పరుచూరిలోని పెద్దలు ఒక లారీ జనం ఆ రోజు జిల్లెళ్ళమూడి వచ్చి అన్నపూర్ణాలయ వార్షికోత్సవం రోజున ఆగష్టు 15, 1961 సంవత్సరంలో అత్యంత వైభవంగా పూజ చేసుకున్నారు. అమ్మకు తాము చేయించిన శంఖ చక్ర శూల కిరీటాదులు గులాబీలతో అమ్మకు అలంకరించి ఆ రోజు అమ్మకు తీసిన ఫొటో ఇప్పటికీ మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఆ ఫోటోను అమ్మ డైరీ వ్రాసిన భవానీకుమారి వారి తండ్రిగారు తీసిన ఆ ఫోటోను కలరుగా చేయించి నాకు బహూకరించింది కూడా.

దమయంతిగారికి హైమ (అమ్మ కూతురు) అంటే చాల ఇష్టం. కొంతకాలం తమ వద్ద ఉంచుకుంటామని అమ్మను ఆర్థించింది. నాదేముంది? నాన్నగారిని అడిగి వారు అంగీకరిస్తే తీసుకెళ్ళండి అన్నది. డాక్టరుగారు నాన్నగారితో హైమ విషయం ప్రస్తావిస్తే నాన్నగారు తమ అంగీకారాన్ని తెలిపారు. హైమతో పాటు అనారోగ్యంగా ఉన్న సుబ్బారావు (పెద్ద కుమారుడు) ను కూడా డాక్టరుగారి కుటుంబం వెంట వైద్యానికి పంపించారు.

దమయంతిగారి వద్ద సొంతకుమార్తె కన్నా ఎంతో సన్నిహితంగా ఉండేది హైమ. దమయంతిగారు కూడా హైమను ఎంతో గారాబంగా, ప్రేమతో చూస్తుండేవారు. ఆ చనువుతో హైమ దమయంతిగారిని వారి పిల్లల మాదిరిగానే అమ్మా! అనే పిలిచేది. ఆమె కొంగుపట్టుకొని పసిపిల్లలాగా వెంట వెంట వదలకుండా తిరిగేది.

హైమ పరుచూరులో ఉండగానే మరొక విచిత్రం జరిగింది. ఇంకొల్లు నుండి కొందరు అమ్మ బిడ్డలు ఇంకొల్లులో అమ్మ పూజాకార్యక్రమం చేయాలని సంకల్పించి అమ్మను రమ్మని పట్టుబట్టారు. అమ్మ తాను రాలేనని తన బదులు పర్చూరులో ఉన్న హైమను తీసుకెళ్ళమని చెప్పింది. వారు పర్చూరు డాక్టరు గారింటికి వచ్చి హైమను ప్రార్థించారు. దమయంతి గారి ప్రోద్బలంతో హైమ ఇంకొల్లు రావటానికి అంగీకరించింది. హైమకు తోడుగా దమయంతిగారు. కూడా ఇంకొల్లు వెళ్ళారు. అక్కడి భక్తులందరూ అమ్మ స్థానంలో హైమను కూర్చోబెట్టి పూజచేయటానికి సిద్ధమయ్యారు. హైమ ససేమిరా వీలుకాదన్నది. దమయంతి గారే హైమను బ్రతిమాలి వాళ్ళందరి తరఫున బిడ్డగా తనమాట మన్నించమని అభ్యర్థించి ఒప్పించింది. ఇంకొల్లు సోదరసోదరీ మణులు ఎంతో ఆనందంగా అమ్మ పూజ హైమకు చేసుకున్నారు. హైమ మనందరికీ ముందు ముందు ఆరాధనీయురాలౌతుందని తెలియ జేసింది అమ్మ.

1961 డిసెంబరులో దమయంతిగారు తమ కుటుంబంతో హైమను కూడా తీసుకొని స్వగ్రామమైన తణుకు వెళ్ళారు. వారి అక్కగారి కూతురు పెళ్ళి సందర్భంగా దమయంతిగారి సోదరుడు వచ్చి డాక్టరుగారి పెద్ద కుమారునికి తన వదినగారి కూతురును ఇచ్చి ఆయన స్వగ్రామమైన పొడగట్లపల్లిలో వివాహం జరిపిస్తానని అడిగాడు. అందుకు దమయంతిగారి సోదరులు కొంపల్లి హనుమంతరావుగారు వెంటనే అంగీకరించి తాంబూలాలు పుచ్చుకొని 1962లో సుబ్బారావు వివాహంలో సర్వలాంఛనాలు హైమవతికి ఇచ్చి పెళ్ళి జరిపించి పరుచూరు తిరిగి వచ్చారు. ఆ తర్వాతనే హైమను జిల్లెళ్ళమూడిలో అమ్మ నాన్నగార్లకు అప్పగించటం జరిగింది. పరుచూరులో హైమ ఉన్న రోజులలో నేను వెళ్ళి హైమను చూచిరావటం జరిగింది కూడా.

డాక్టరుగారికి కొల్లూరు బదిలీ కావటంతో అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలోనే దమయంతిగారికి అనారోగ్యం చేసి డాక్టర్లకు చూపించగా గర్భసంచి కాన్సర్ అని తేలింది. గుంటూరు కాన్సర్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. ఆ సమయంలో రాధ, గుంటూరులో చదువుకుంటుండేవారు. వారితో కలసి హాస్పిటల్కు పోయి వస్తుండేవాడ్ని నేను. రాధ చాలా అమాయకుడని, వాడ్ని కనిపెట్టి ఉండమని నన్ను అభ్యర్థిస్తుండేది. దమయంతిగారు. వ్యాధి ముదరటంతో హైదరాబాదు తీసుకెళ్ళి చూపించారు. వైద్యులు పరీక్షించి వ్యాధి మూడవ రకం చేరిందని లాభం లేదని చెప్పి త్రిప్పి పంపించారు. ఇంటికి వచ్చి అమ్మను తలచుకుంటూ 12.6.1963 రాత్రి ఎదురుగా గోడకు తగిలించి ఉన్న అమ్మ చిత్ర పటాన్ని చూస్తూ అమ్మలో లీనమైంది. అమ్మ ఆశీస్సులు పొంది, హైమను బిడ్డగా లాలించగల్గిన ధన్యురాలు దమయంతిగారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!