అమ్మ వద్దకు వచ్చిన వాళ్ళెవరూ ధనవంతులు కాదు. వచ్చి ధనవంతులు కాని వాళ్ళు లేరు. అమ్మ ఒకసారి నలుగురితో మాట్లాడుతూ ‘మీరేమడిగారు? నేనేమియ్యలేదో చెప్పండి?’ అన్నది. మనకేం కావాలో అసలు మనకు తెలుసా? అమ్మకు తెలిసినట్లుగా. అడిగితే అడిగిందే ఇస్తాను, అడగకపోతే కావాల్సింది. తెలుసుకొని ఇస్తాను అన్నది అమ్మ – అసలు ధనమంటే ఏమిటో తెలియాలి ముందు. కమల అమాయకురాలు. తనకేం కావాలో తనకు తెలియదు.
సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన లక్ష్మీనారాయణ, శ్రీమతి కమల దంపతులు 1958లోనే జిల్లెళ్ళమూడి వచ్చారు. నేను పూర్వం చెప్పినట్లు లక్ష్మీనారాయణ ఒక తెల్లపిల్ల భర్తగానే అందరింటి సోదరీ సోదరులకు పరిచయం. లక్ష్మీనారాయణ తండ్రిగారు అనంతరామయ్య గారు తరచుగా జిల్లెళ్ళమూడి వస్తుండే వారు. సరే. లక్ష్మీనారాయణ తమ్ముడు శ్రీరామమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ సేవలో చాలాకాలం ఉన్నాడు. కమల అక్కకూతురు ఇక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తున్నది. అలాగే కమల తమ్ముడు సాయి మన మాతృశ్రీ ప్రింటర్స్లో పనిచేశాడు. అలా ఆ కుటుంబం అంతా అమ్మతో పెనవేసుకుపోయిన కుటుంబమే.
గుంటూరులో మొదట కాపురం పెట్టినప్పుడు రామచంద్రపుర అగ్రహారంలో ఒక తడికెలు అడ్డం కట్టిన మట్టి ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ సొంత యిల్లు కట్టుకొని నలుగురికి అన్నం పెట్టే స్థాయికి ఒక వ్యాపారిగా ఎదిగాడు అమ్మ కృపతో. పాత గుంటూరులో ఉండగా ఒకసారి వారింట్లో దొంగలు పడ్డారు. కొన్ని బంగారు, వెండి వస్తువులు దొంగిలింపబడ్డాయి. ఎన్ని ఉన్నా దొంగలింపబడేవే కదా! అని తమకున్న బంగారం వెండి మొత్తం తెచ్చి అమ్మ పాదాలపై సమర్పించారు. లక్ష్మీనారాయణ ఏ పనిచేయాలన్నా కమల సహాయం లేకుండా ఏమీ చేయగలిగేవాడు కాదు కదా, ఇంటిలోని పోరు ఇంతింతకాదయా అన్నట్లు ఎడ్డెమంటే తెడ్డెమనే వారైతే లక్ష్మీనారాయణ అమ్మకు లక్షలు లక్షలు సమర్పించగలిగేవాడు కాదు. తమకు లేకపోయినా అప్పుచేసి తెచ్చి ఇచ్చిన, ఇప్పించిన సందర్భాలు నాకు తెలుసు. ఆ తెగింపు భార్యా భర్తలిద్దరిలోనూ ఉన్నది. నేను బాగా సన్నిహితంగా ఉండి గమనించినవాడిని. ఏది జరిగినా అమ్మకు వైభవంగా జరగాలనేది ఆ దంపతుల కోరిక. అమ్మ స్వర్ణోత్సవాలకు అర్కపురీ ముఖద్వారం కట్టించింది. అమ్మ భౌతికంగా ఉన్నంత కాలం ఉన్నది. తుఫాను దెబ్బలకు ఒరిగినా, ప్రభుత్వం వారు వంతెన నిర్మాణానికి అడ్డము వచ్చిందని తీసేశారు. మళ్ళీ దాన్ని లక్ష్మీనారాయణ కమలల స్మృతి చిహ్నంగా దానిని నిర్మించాల్సిన అవసరం ఉన్నది ! అమ్మ ఎప్పటికి నెరవేరుస్తుందో!
గుంటూరులో లక్ష్మీనారాయణ ఉద్యోగరీత్యా ఉన్నంతకాలం పూజలు బాగా జరిగేవి. భార్యభర్తలిద్దరూ ఎంతో శ్రద్ధాసక్తులతో పాల్గొనేవారు. ఆలయాల అభివృద్ధికి అమ్మ ఎన్నుకున్న బిడ్డలలో కమల, లక్ష్మీనారాయణలు ముఖ్యులు. నాన్నగారి ఇంటివద్ద నవ నాగేశ్వరాలయ నిర్మాణంలో, యజ్ఞశాల నిర్మాణంలో, వినాయకాలయ నిర్మాణంలో ఆ దంపతుల ప్రాధాన్యం విశిష్టమైనది.
ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయటంలో కమలది ప్రత్యేక స్థానం. బ్రహ్మాండం సుబ్బారావు అనారోగ్యం చేసినప్పుడు ఆ కుటుంబం అండగా ఉన్నది. హైమ అన్నా, హైమాలయం అన్నా ఆ కుటుంబానికి ఎంతో భక్తి శ్రద్ధలు – వారి పిల్లల విషయంలో కూడా అమ్మ ఎలా చెపితే అలా నడుచునే వారు. భగవతి పెళ్ళి తన చేతులమీదుగా చేసింది అమ్మ.
లక్ష్మీనారాయణ 2014లో అమ్మలో ఐక్యమైన తర్వాత కమలలోని జవసత్వాలు తగ్గుతూ వచ్చి బెంగుళూరులో చిన్నకొడుకు ‘రహి’ వద్ద ది. 1.11.2018న అమ్మలో ఐక్యమైనది. ఆ దంపతులు అమ్మ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నవారు – ధన్యులు – త్యాగధనులు.
బహుశా అమ్మతో భౌతికంగా సంచరించి అనుభూతి ఆనందాలు పంచు కున్న తరం త్వరత్వరగా కనుమరుగవుతున్నదా! అనిపిస్తున్నది.