అమ్మ వద్దకు గోపాలన్నయ్య, రామకృష్ణ కలసి 1960లో మొదటిసారి వచ్చారు. అంతకు ముందే అమ్మ అప్పికట్లలో గోపాలన్నయ్యను చాలాసార్లు చూసింది. గోపాలన్నయ్య వాళ్ళింట్లో రఘువరదాసుగారి నామ సప్తాహాలు జరుగు తుంటే వచ్చి అందులో పాల్గొన్నది. వాళ్ళింటి వరండాలో కూర్చొని భోజనం చేశానని చెప్పింది. అప్పికట్ల రోడ్డుమీద రామకృష్ణ, గోపాలన్నయ్య కలిసి నడిచి వెళుతుంటే చూచానన్నది.
బాపట్లలో ‘అత్రివాణి’ ప్రెస్, పుస్తకాల షాపు గోపాలన్నయ్యకుండేవి. ఆ పుస్తకాలషాపుకు చిదంబరరావు తాతగారితో కలసి వెళ్ళింది. 1962లో అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా మొదటిసారి ‘మాతృశ్రీ ప్రత్యేక జన్మదినోత్సవ సంచిక అత్రివాణి ప్రెస్లోనే ముద్రింపబడ్డప్పుడు అది ‘అత్రివాణిప్రెస్’ కాదు అత్రిరాణి ప్రెస్ (అనసూయా ప్రెస్) అని అభినందించింది. తర్వాత అమ్మవద్దకు గోపాలన్నయ్య వెళ్ళటం, రాత్రిపూట అమ్మ దగ్గర మేను వాల్చకుండా మేల్కొని ప్రొద్దునే బాపట్ల వెళ్ళటం నిత్యకృత్యంగా మారింది.
ఆ రోజుల్లో ప్రెస్, పుస్తకాల షాపు అమ్మేని తన సమక్షంలో ఉండమన్నది అమ్మ. సంసారము పిల్లలు ఉన్నారు కదా! అనుకుంటుంటే “ఇక్కడి సంసారం నీవు చూడు. నీ సంసారం సంగతి నేను చూచుకుంటాను” అన్నది. అలాగే గోపాలన్నయ్య వ్యవహారం తనే చూచింది.
|ఒకసారి హైదరాబాద్ పొత్తూరి వారింటికి వెళ్ళి చిన్నకారులో వస్తుండగా యాక్సిడెంట్ అయింది. చాలమంది జనం మూగారు డ్రైవర్ను పట్టుకున్నారు. గోపాలన్నయ్యను ఎవరో లారీ డ్రైవర్, కారులో చిక్కుకున్న వాడ్ని బయటకు లాగి విజయవాడ లారీలో ఎక్కించి గుట్టుచప్పుడు కాకుండా పంపించాడు. జిల్లెళ్ళమూడి వస్తే ‘బ్రతికొచ్చావా’ అని అమ్మ కౌగిలించుకుంది.
అలాగే ఒకసారి మద్రాసు నుండి హౌరా ఎక్స్ప్రెస్లో వస్తుంటే నెల్లూరు వద్ద ట్రెయిన్ ఆక్సిడెంట్ అయింది. ఆ కంపార్టుమెంట్లో గోపాలన్నయ్య కూర్చున్న సీటుకు అవతల నుగ్గు నుగ్గయిపోయింది. అంతా రక్తసిక్తం, భయానకం. అక్కడ నుండి బస్సులో ఎక్కించి నెల్లూరు చేర్చారు. డాక్టరు యస్.వి.సుబ్బారావుగారు. మత్తిచ్చి ఇంట్లో పడుకోబెట్టి తర్వాత తనే తన కారులో జిల్లెళ్ళమూడికి తీసుకొని వచ్చి అమ్మకు అప్పచెప్పి వెళ్ళారు.
1975 డిసెంబరులో జిల్లెళ్ళమూడిలో నక్సలైట్లు పడ్డారు. నేను, గోపాలన్నయ్య అన్నపూర్ణాలయంలో భోజనం చేస్తున్నవాళ్ళం అరుపులు విని అమ్మగదిలోకి (ఇప్పుడు నాన్నగారి ఇల్లు) వెళ్ళాం. గది తలుపులు గడియ పెట్టాం. అమ్మ ప్రక్క భాగంలో ఉన్నది. ప్రక్క భాగంలోకి పంపించాం. నక్సలైట్లు తలుపులు పగలగొడు. తుంటే ఒక ఇనుప బీరువా తలుపులకు అడ్డం పెట్టాం. వాళ్ళు గొడ్డళ్ళతో, బరిసెలతో పగులగొట్టుతుంటే నిలువరించలేక పోయాం. నేను “మనం కూడా అవతలకు వెళదాం” అన్నాను. గోపాలన్నయ్య ఒప్పుకోలేదు. అక్కడే ఉన్నాడు. వాళ్ళు వచ్చి గోపాలన్నయ్యపై ఒక బరిసెవేశారు. అది అన్నయ్య చేతి ఉంగరానికి తగిలి చేయి రక్తసిక్తమైంది. చంపేద్దామని మళ్ళీ బరిసెలు, గొడ్డళ్ళు ఎత్తారు. గోపాలన్నయ్య అమ్మా! అన్న పిలుపు అమ్మకు వినిపించింది. అంతలో ‘టైమైపోయింది. వెంటనే బయటకు వచ్చేయండని’ వాళ్ళ నాయకుల నుండి పిలుపువచ్చి దొరికింది తీసుకొని బయటకు వెళ్ళిపోయారు.
ఈ రకంగా గోపాలన్నయ్య చాలా ప్రమాదాల నుండి అమ్మచే రక్షింప బడ్డవాడుగా చిరంజీవి. జిల్లెళ్ళమూడిలోనే 85 ఏళ్ళు నిండినా గడుపుతూ వచ్చాడు.
1962లో మొదలైన అమ్మను గూర్చిన మాతృశ్రీ పత్రికను 1966 నుండి మాసపత్రిక చేసి మానేజింగ్ ఎడిటర్గా ఉన్నాడు. తర్వాత 2001 నుండి వచ్చిన విశ్వజనని మాసపత్రికకు కూడా మానేజింగ్ ఎడిటర్గా ఉన్నాడు. శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యా పరిషత్లలో మార్గదర్శిగా చిరకాలం సేవ చేశాడు.
ఒకసారి పన్నాల రాధాకృష్ణశర్మగారు, గోపాలన్నయ్య అప్పికట్ల నుండి నడిచి సాయంత్రం 6 గంటలకు జిల్లెళ్ళమూడి చేరారు. అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నారు. అమ్మ ‘అన్నం తిన్నారురా’ అంది. తినేవచ్చాం అన్నారు. ఏడ్చారులే అని లక్ష్మీనర్సమ్మ వండితే పళ్ళేలు పళ్ళేలు అమ్మ ముద్దలు చేసి పెడుతూనే ఉ న్నది తింటూనే ఉన్నారు. రెండు బేసిన్లు అన్నం తిన్నారు. మూడో బేసిన్లో మజ్జిగన్నం తెప్పించి వాళ్ళకు సగం పెట్టి, మిగతా సగం అక్కడున్న వారికి ప్రసాదం పంచింది. ఆశ్చర్యం అంత అన్నం ఎలా తిన్నారో తెలియదు. ఆకలి లేదన్న వారు ఎలా తిన్నారు? అమ్మ గోరుముద్దల మహత్తది.
ఒకసారి లలితాకోటి నామార్చన జరుగుతున్నది. అమ్మ దగ్గర కూర్చున్న గోపాలన్నయ్యను కూడా వెళ్ళి పారాయణ చేయమన్నది. “అమ్మా నాకు లలిత నోరు తిరగదు. చదివితే తప్పులు వస్తాయి. లలితా సహస్రనామం తప్పులు చదివితే నెత్తి అణుస్తుందిట. నేను తప్పులు చదవటం ఎందుకు? నెత్తి అణగ్గొట్టించు కోవటమెందుకు? అయినా నాకు దాని మీద పెద్దగా శ్రద్ధ లేదులే. “నీ దగ్గరే కూర్చుంటా” అన్నాడు. “నెత్తి అణుస్తుందని ఎవరన్నారురా? నెత్తి అణిస్తే ఆమె తల్లే కాదు. ఒక వేళ అణిస్తే నేను చూసుకుంటాలే ఆమె సంగతి నీవు వెళ్ళి చెయ్యి” అన్నది. అంతే వెళ్ళి తానూ 4 సార్లు చేశాడు. అప్పటి నుండి తనూ పారాయణలో పాల్గొంటున్నాడు.
మామూలుగా అమ్మ మన యింటికి రావటం అరుదు. అందులో స్వర్ణోత్సవం జరిగిందాకా అమ్మ ఎక్కడకూ కదిలేది కాదు. 1964లో ఒకసారి గోపాలన్నయ్యకు టైఫాయిడ్ జ్వరం తగిలింది. 21 రోజులు తగ్గలేదు. “నేను రోజూ వెళ్ళి రాత్రిపూట అమ్మ వద్దకు వెళ్ళి అక్కడ గడిపి వస్తున్నాను కదా! ఇన్ని రోజులు నేను వెళ్ళకపోతే అమ్మ నన్ను చూడడానికి ఒక్కసారన్నా రాలేదే” అనుకున్నాడు. ఇంతలో రాత్రి 9. గంటలప్పుడు వాళ్ళ నాన్నగారు లక్ష్మీనారాయణగారు, పినతల్లి జ్ఞాన ప్రసూనాంబగారూ లేచి ‘అరేయ్ గోపాల్ అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది’ అన్నారు. గోపాలన్నయ్య ఎక్కడ ఎక్కడ అని అడిగాడు. ఇప్పుడే ఇక్కడే కనిపించిదన్నారు. ఇద్దరూ. జ్వరం తగ్గిం తర్వాత గోపాలన్నయ్య జిల్లెళ్ళమూడి వెళ్ళి ‘ఏంటమ్మా! ఒక్కసారన్నా నన్ను చూడటానికి రాలేదు’ అని అడిగాడు. “నేనెందుకు రాలేదు ! నేను వచ్చానురా! మీ నాన్నను. పిన్నిని అడుగు” అన్నది. నిజమే గోపాలన్నయ్య అమ్మ వచ్చి తనను చూడాలనుకున్నాడు కాని తను అమ్మను చూడాలనుకోలేదు. కదా! అమ్మ వచ్చింది తనను చూచి వెళ్ళింది.
అమ్మ గోపాలన్నయ్యతో “నాకు చాలాకాలంగా ఒక తీరని కోరిక ఉన్నదిరా! అది ఎప్పటికైనా తీరుతుందా?” అన్నది. “చెప్పమ్మా! నేను తీరుస్తాను” అన్నాడు. అప్పుడు అమ్మ’ “నేను ఎప్పుడైనా నాన్నగారి గుండెల మీద హాయిగా పడుకొనే రోజు వస్తుందా” అని అపూర్వమైన తీరని కోరిక అడిగింది. ఆశ్చర్యమేమిటంటే నాన్నగారు చివరి నిమిషంలో గోపాలన్నయ్య చేతిలో ఒరిగిపోయారు. ఆ తర్వాత నాన్నగారిని అమ్మ గదిలోకి తీసుకొని వెళ్ళారు. అమ్మ నాన్నగారి మంచం మీద కూర్చొని నాన్నగారి గుండెల మీద వాలిపోయింది. ఆ గుండెల మీద నుండి కొన్ని గంటల పాటు లేవలేదు. అలా అమ్మ కోరిక నెరవేరింది.
“నీది పాల కుండ లాంటి హృదయం. అందులో విషపు చుక్క పడనీయకు. ఎవరు నిన్ను ద్వేషించినా, అందరినీ ప్రేమించు. ఈ సంస్థ విషయం నువ్వు చూడు. నీ ఇంటి సంగతి నే చూచుకుంటా. నీకు కవచం ఇస్తున్నాను. నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు” అని అమ్మ గోపాలన్నయ్యకు హామీ ఇచ్చింది. అలా చూచుకున్నది. అన్నయ్య అమ్మలో కలిసిన 12వ రోజు సంస్మరణ సభలో వాళ్ళ పిల్లలు అందరమ్మ మమ్మల్ని బాగా చూచుకుంది అని రవితోటి, సోదరీ సోదరులకు కూడా చెప్పారు.
ఒక రకంగా చెప్పాలంటే సోదరులు గోపాలన్నయ్య, రామకృష్ణన్నయ్య జయవిజయులు లాంటి వాళ్ళు. వాళ్ళు వైకుంఠ ద్వారపాలకులు. వీరిద్దరూ కూడా అలా అమ్మకు సేవ చేసినవారే. ఒకళ్ళోకరకమైన సేవ చేస్తే మరొకరు మరొకరకమైన సేవ చేశారు. గోపాలన్నయ్య కన్న రామకృష్ణ భావుకుడు, సంఘటానా సమర్థుడు, కవి, రచయిత. గోపాలన్నయ్య లోక వ్యవహారదక్షుడు కావటంతో అమ్మ ఆ రకంగా ఎవరి చేత ఏ పనిచేయించు కోవాలో ఆ రకంగా చేయించుకుంది.
గోపాలన్నయ్య సహనశీలి. మంచి చెడులను సమానంగా చూడగలిగిన సమదర్శి, చిన్నప్పుడే తనను వీడిపోయి గౌరీలోకం చేరిన తల్లిని – గౌరీదేవిగా ఉ న్న అమ్మలో దర్శించటం గోపాలన్నయ్య అదృష్టం. అమ్మ ఆ రకమైన దర్శనాన్ని సాక్ష్యాలతో సాకారంగా ప్రసాదించింది. నిజంగా ఆ తల్లికి తగ్గ తనయునిగా తనకు ప్రాణం పోసి జీవాన్ని ప్రసాదించిన తల్లికి తన ప్రాణాలు అడ్డం వేయటానికి సిద్ధపడ్డ త్యాగమయ జీవి. అందుకే అమ్మ ఇచ్చిన రక్షణ కవచం గోపాలన్నయ్యకు ఎన్నిసార్లో రక్షణగా నిలచింది. ఆ రకంగా మృత్యుంజయుడు గోపాలన్నయ్య. అంతేకాదు మృత్యువంటే ఆయనకు భయంలేదు.
సర్వసమర్పణ భావం గోపాలన్నయ్యకు ఉన్నట్లుగా మరొకరికి ఉన్నదని చెప్పలేం – అమ్మ నా కొకతీరని కోరిక ఉన్నదిరా! అని అంటే అదేమిటో చెప్పమ్మా నేను తీరుస్తాను అని అనగలిగిన ధైర్యం గోపాలన్నయ్యది. ధనం కాదు కావలసింది. గుండె ధైర్యం, తన పట్ల తనకు విశ్వాసం.
బాపట్లలో పుస్తకాల షాపు నిర్వహించే గోపాలన్నయ్య రాత్రిపూట నిద్రలేకుండా అమ్మవద్ద మేల్కొని ప్రొద్దుననే మళ్లీ షాపు తెరవటానికి వెళ్లేవాడు. ఆయనకా శక్తి ఎక్కడ నుండి వచ్చింది. అమ్మ ఎలా నిద్రపోతున్నట్లు మనకు కన్పించినా నిరంతర నిర్నిద్రంగా ఉండేదో ఆ అంశలో కొంత గోపాలన్నయ్యకు కూడా ఇచ్చిందేమో! అమ్మ కడకంటి చూపు సోకితే చాలుకదా ఏది రావటానికైనా!
స్వర్ణోత్సవాల పనులపై బయలుదేరే ముందు అమ్మ ధోవతి ఉత్తరీయం పెట్టితే ధోవతి తీసుకొని ఉత్తరీయం అమ్మ మంచం మీదనే పెట్టాడు. ‘ఏమిట్రా అక్కడ పెట్టావు దాన్ని’ అన్నది అమ్మ. ‘నేను ఉత్తరీయం వేసుకోనుకదమ్మా? మరొకరికి ఉపయోగపడుతుంది’ అని అన్నాడు గోపాలన్నయ్య. అమ్మ “అది కప్పుకొని కులకటానికి కాదు నీకిచ్చింది. అందరివద్దకు వెళ్ళినపుడు వాళ్ళు ఏదిస్తే అది (దూషణ, భూషణాలు) ఒడిబట్టటానికి” అన్నది. నిజమే గోపాలన్నయ్య అన్నీ ఒడిబట్టాడు. అన్నింటినుండీ కడిగిన ముత్యంలా బయటపడ్డాడు. గోపాలన్నయ్య నామయోగి. సుప్రభాతాలూ, సంధ్యావందనాలూ చెయ్యటమే కాదు. రఘువరదాసుగారి ప్రభావంతో నామం చెయ్యటం నేర్చుకున్నాడు. గోపాలన్నయ్య నామం చేస్తుంటే ఒక చైతన్యం వెల్లి విరుస్తున్నట్లుండేది. ఆ ఆవేశం ఆ హుషారు ఎంతో మాధుర్యంగా విన సొంపుగా ఉండేది. అమ్మ కూడా మెచ్చుకొనేది. అన్నయ్య సుప్రభాతానికి రాకపోతే ఇవ్వాళ సంధ్యావందనం చేసినట్లే లేదురా అనేది. అంతటి భావస్ఫోరకంగా మనస్సు లగ్నం చేసేవాడు.
అమ్మ కొన్ని బాధ్యతలు కొందరికి అప్పచెప్పేది. అన్నింటినీ భరిస్తూ ఆ బాధ్యతలు నెరవేర్చవలసిందే – నాన్నగారు ఆలయంలో చేరిం తర్వాత ఆ యింట బాగోగులు చూడటం గోపాలన్నయ్యకు అప్పగించింది. దానిని తన జీవితాంతం నిర్వహించాడు. ఒకసారి బ్రహ్మాండం రవి కూతురు పింకీ (అనసూయ) ఆరోగ్యం బాగో లేకపోతే కలతపడ్డ గోపాలన్నయ్య దాని ఆరోగ్యం కోసం నిత్యం రాత్రిపూట అన్నం మానివేస్తానని మొక్కుకొని జీవితాంతం ఆ మొక్కును పాటించాడు.
గోపాలన్నయ్య జిల్లెళ్ళమూడిలోని ప్రతి అణువులోనూ అణువై ఉన్నాడు. శ్రీ విశ్వజననీపరిషత్ సంస్థ కానివ్వండి, విద్యాపరిషత్ కానివ్వండి, మాసపత్రికలు కానివ్వండి, కాలెండర్లు, డైరీలు కానివ్వండి, ఏదైనా అతని సహాయ సహకారాలు లేకుండా ఏదీ రూపు దాల్చలేదనేది నిజం అందుకే పదిరోజులు కూడా జిల్లెళ్ళమూడి వదలి ఉండలేని అనుబంధం ఆయనది. ఆత్మీయత ఆయనిది. అజాతశత్రువు గోపాలన్నయ్య. ఆజాత శత్రువంటే ఆయననెవరైనా శత్రువుగా భావించవచ్చు గాని గోపాలన్నయ్య మాత్రం ఎవరినీ శత్రువుగా భావించలేదు. ప్రేమించాడు తప్ప.
కొందరితో అభిప్రాయ భేదం వచ్చింది. గోపాలన్నయ్యను నా చరిత్రలో నుండి నిన్ను తీసేశానని అన్నవారున్నారు. గోపాలన్నయ్య మాత్రం మిమ్మల్ని నా చరిత్రలో ఉంచాను అన్నాడు. అంతటి సౌజన్యమూర్తి, అజాతశత్రువు గోపాలన్నయ్య.
గోపాలన్నయ్య పిల్లలు పరమయోగ్యులు. గోపాలన్నయ్యకు అవసరమైన ఏ ఖర్చులు సంస్థచే పెట్టనిచ్చే వారు కాదు. మందులు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, ఆఖరికి అన్నయ్య వ్రాసిన పుస్తకాల ప్రచురణ కానివ్వండి. అన్నీ వారే ముందుకు వచ్చి ఖర్చు పెట్టేవారు. అటువంటి పుత్రులను అనుగ్రహించింది. అమ్మ. అది గోపాలన్నయ్యపట్ల అమ్మకున్న బాధ్యత. అమ్మ దేవతగా విశ్వరూప సందర్శనం ఇవ్వవచ్చు, ఎన్నో ప్రమాదాల నుండి రక్షించవచ్చు, కాని ఇటు అమ్మగా లౌకిక బాధ్యతలు కూడా నెరవేర్చింది. అటు తను-గోపాలన్నయ్య వేరుకాదనే జ్ఞానాన్ని ప్రసాదించటమే కాదు, భీష్మాచార్యుల వారికి తండ్రి ప్రసాదించినట్లు ఇచ్ఛా మరణాన్ని ప్రసాదించింది. ఇంతకన్న ఏ జీవికైనా కావలసిందేమున్నది? గోపాలన్నయ్య మహాఋషి, మహాజ్ఞాని, జిల్లెళ్ళమూడి చరిత్రలో చిరస్మరణీయుడు.
తన పిల్లలు తమ దగ్గర ఉండమని బలవంతం చేస్తే వెళ్ళి గట్టిగా నెలరోజులు కూడా ఉండలేని పరిస్థితి. జిల్లెళ్ళమూడి వదలి ఉండలేని అనుబంధం ఆయనది. తన కాళ్ళూ, కళ్ళు, చెవులు, చేతులూ కూడా పనిచేయలేని స్థితికి వచ్చినా జిల్లెళ్ళమూడిలోనే ఉండాలని తపన. తన చివరిరోజులు, తన ప్రాణము జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో అమ్మలో కార్తీకమాసంలో కలసి పోవాలన్న ఆయన ఆరాటమూ అమ్మ నెరవేర్చింది.
25.4.1932న పుట్టిన గోపాలకృష్ణమూర్తి 21.10.2017న మధ్యాహ్నం అనాది లగ్నంలో ఆదెమ్మలో కలసిపోయాడు. అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన ధన్యజీవి.