1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (శ్రీ జి వై యన్ బాబు)

ధన్యజీవులు (శ్రీ జి వై యన్ బాబు)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 3
Year : 2023

మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, మాతృశ్రీ సంస్కృత పాఠశాలల కరస్పాండెంట్, జిల్లెళ్ళమూడిలో (అమ్మ సేవలో, అందరింటి సేవలచిరకాలంగా ఉన్న శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు, ఇప్పటికీ సేవ చేస్తున్న శ్రీమతి భ్రమరాంబక్కయ్యల మేనల్లుడు) శ్రీ జి.వై.యన్. బాబును గూర్చి కొందరికి తెలిసి ఉండవచ్చు.

కాని బాల్యం నుండి అమ్మను చూడటానికి, ఆరాధించటానికి తన తండ్రితో, శ్రీనాథపీఠ కార్యకర్తగా డాక్టర్ ప్రసాదరాయకులపతిగారితో కలిసి చాలాసార్లు వచ్చినట్లు చాలామందికి తెలియదు. అసలు జి.వై.యన్.బాబు పూర్తి పేరు గుడిపూడి యేడుకొండల నాగేశ్వర బాబు అని సన్నిహితులుగా తిరిగే వారికే తెలియదు. కాని సభానిర్వహణాదక్షునిగా, శ్రీనాథపీఠ వేదికలపై బాబుగారు లోకానికి తెలుసు.

చిన్నప్పుడు గుంటూరులో ఆంధ్ర లలిత కళాపరిషత్ వారు ఏర్పాటు చేసిన నాటకాలలో, బాలానందకేంద్రం వారు ఏర్పాటు చేసిన నాటకాలలో బాలపాత్రలు వేస్తుండేవాడు. చదువు సంధ్యలు గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించి, లా డిగ్రీని పూర్తి చేసినా, లాయరుగా వృత్తిని చేపట్టలేదు. తండ్రిగారు శ్రీ జి.టి.డి. రామచంద్రరావు గారి మార్గంలో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాలలో, సేవాపథంలో ప్రయాణం చేశారు.

బాల్యంలోనే పాఠశాల విద్యాభ్యాసకాలం నుండే తమ ఇంటికెదురుగా ఉన్న “గౌడీయ మఠం” లో ఆ సంస్థలోని సన్యాసులతో కలసి రాధాకృష్ణుల సేవ చేస్తుండేవారు. వారంతా శ్రీబాబును దగ్గరకు తీస్తుండే వారు. నామ సంకీర్తన చేసేటప్పుడు బాబు మృదంగం వాయిస్తుండేవాడు. సంగీతంలో ప్రవేశం ఉన్నది.

యౌవనంలోనే గుంటూరు బాలానందకేంద్రం సభ్యులై, ఆ బాలానంద కేంద్రానికి కార్యదర్శిగా ఎదిగి పదిహేనేళ్ళ పై చిల్కుగా సేవచేస్తూ మూడున్నర కోట్ల రూపాయలతో మూడంతస్తుల భవన నిర్మాణం చేసి అర్ధ శతాబ్దికి పైగా ఉన్న ఆ సంస్థకు ఒక శాశ్వతత్వాన్ని, వైభవాన్ని కలిగించారు. కేంద్రంలో సంగీత, నృత్య, శతకపద్య, భగవద్గీత పఠన పోటీలు జిల్లావారీగా పెట్టి విద్యార్థినీ విద్యార్ధులకు ప్రోత్సాహాలు కల్పించేవారు. అక్కడ సభ్యులైన పెద్దల అండదండలతో హిందూకాలేజి అండ్ హైస్కూల్స్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికై నూట యాభై సంవత్సరాలుగా మూడుపూలూ ఆరుకాయలుగా వెలుగొందుతున్న ఆ సంస్థకు కౌన్సిల్ కార్యదర్శిగా, హిందూకాలేజి హైస్కూలు కార్యదర్శిగా ఒక దశాబ్దం పైగా నిలబడి సమర్థవంతుడైన కార్యదర్శిగా పేరు ప్రతిష్ఠలు సాధించారు. హిందూకాలేజీ అదనపు కార్యదర్శిగా దాని అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

కొంత నగరంలోని పెద్దల ప్రోత్సాహంతో ‘నీలగిరీస్’ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించి ఆ సంస్థను అభివృద్ధిపథం లోనికి తెచ్చారు.

బాబుగారు గుంటూరుజిల్లా ‘రెడ్ క్రాస్’ సంస్థ జిల్లా కార్యదర్శిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో బ్లడ్ బాంక్ (రక్తనిధి) కార్యక్రమం ఒకటి. సంస్థ ఒక అనాథ బాలుర హాస్టల్ నిర్వహిస్తున్నది. దాని బాధ్యత ఒకటి. కలెక్టర్ మరియు ఊళ్ళో పెద్దలను కలుపుకొని చేసే సేవా కార్యక్రమాలివన్నీ. దానికి తోడు గత రెండు సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సంస్థకు రాష్ట్రకార్యదర్శి బాధ్యతలు కూడా నెత్తిన పడ్డాయి. సామాన్యంగా దానికి ఐ.ఎ.యస్. ఆఫీసర్ కార్యదర్శిగా ఉండటం పద్ధతి. నియమింపబడ్డ యే ఐ.ఎ.యస్. ఆఫీసర్ అందుకు సుముఖంగా రాకపోవడంతో గవర్నరు గారు పిలచి ఆ బాధ్యత కూడా బాబుగారికి అప్పగించారు. అది తప్పలేదు. జిల్లాలన్నీ తిరుగుతూ చేయవలసిన పని. కరోనా కాలం. శ్రమ అధికం. శరీరాన్ని మనసును అతలాకుతలం చేశాయి.

ఒక సంవత్సర క్రితం జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, మాతృశ్రీ సంస్కృత పాఠశాలల కరస్పాండెంట్ కూడా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. చిరకాలంగా బాబు మేనమామ నాదెండ్ల లక్ష్మణరావుగారు ఆ సంస్థలో సేవకు బాధ్యతలు స్వీకరించమని కోరుతున్నారు. వారు అకస్మాత్తుగా అమ్మలో ఐక్యమౌతూ తన కోరికను బలంగా చెప్పటంతో ఒక సంవత్సరం క్రితం అక్కడి బాధ్యతను కూడా స్వీకరించక తప్పలేదు. అక్కడ కాలేజి ‘NAAC’ రికగ్నిషన్కు తగిన రీతిలో సమాయత్తం చేయాల్సి వచ్చింది. దాని కొరకు శ్రమిస్తున్నారు కరస్పాండెంట్.

శ్రీ ప్రసాదరాయ కులపతిగారి నేతృత్వంలో శ్రీనాథపీఠం గత యేబది యేళ్ళుగా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఎనలేని కృషి చేస్తున్నది. ఆ రోజులలోనే కులపతిగారి శిష్యునిగా ఆ సంస్థలో అడుగుపెట్టి సభానిర్వహణ దక్షునిగా పేరు తెచ్చుకున్నారు. వారితో కలిసి తిరుగుతుండటంతో చిన్న చిన్న పద్యాలు వ్రాసే స్థాయికి ఎదిగారు. సన్మానపత్రాలు వ్రాయటమూ అలవాటు చేసుకున్నారు. కుర్తాళపీఠం మాసపత్రిక మౌనప్రభ సంపాదక బాధ్యతలు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్గారు 20 యేళ్ళు నిర్వహించి వారికి ఎనభై యేండ్లు నిండిన కారణంగా ఆ బాధ్యత నిర్వహించలేననగా స్వామివారు దానిని కూడా యీ మధ్య బాబుగారిని చూడమన్నారు. బాబుగారు ఆ బాధ్యత స్వీకరించి రెండు నెలలు నడపగానే అనుకోని దురదృష్టం ఇలా వెంబడించి తీసుకొని వెళ్లింది. తిరుమలలో స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా చేస్తుండేవారు.

ఇక శ్రీ వడ్లమాని రవి, శ్రీ జి. శివరామకృష్ణప్రసాద్ గారితో కలసి కుర్తాళపీఠ నిర్వహణలోని సంతోషిమాత ఆలయంలో కూడా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకొనేవారు. ఇన్ని బాధ్యతలలో బహుకార్య నిమగ్నుడైన శ్రీ బాబుగారు ఇంటిని పడగొట్టి పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టి కొంతవరకు పూర్తి చేస్తూ మొదటి అంతస్థు, రెండవ అంతస్థు నిర్మాణం మధ్యలోనే ఉండగా అకస్మాత్తుగా ప్రపంచ కరోనా గత్తరలో భాగంగా అర్థాంతరంగా తన ప్రాణాలను శ్రీకృష్ణాష్టమి రోజున భగవంతుడు అమ్మలో లీనం చేశారు.

ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన బాబుగారు, జిల్లెళ్లమూడి అమ్మ యెడల, కుర్తాళపీఠ అధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి యెడల, రసయోగి శ్రీరాధికాప్రసాద్ మహారాజ్ యెడల యెంతో భక్తిశ్రద్ధలు గలవారు. వారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక రంగంలో సేవ చేస్తుండేవారు.

కమ్మని కంఠంతో పాటలతో పద్యపఠనం చేస్తూ, సభానిర్వహణలు కావిస్తూ, బహుముఖీనమైన ప్రజ్ఞతో సాహిత్య సాంస్కృతిక, విద్యా సేవా రంగాలలో సేవచేస్తూ గుంటూరు, గుంటూరుజిల్లా, రాష్ట్ర రాష్టేతర ప్రాంతాలలో పేరు ప్రతిష్ఠలు పొందుతున్న ఈ సమయంలో 56 యేళ్ళు కూడా నిండీ నిండని వయసులో అర్థాంతరంగా అవతారం చాలించడం మాతృలోకంలో అమ్మ శతజయంతి ఉత్సవాలకు అమ్మే ముందుగానే యువకుడు కావాలని పిలిపించుకుందేమో అనిపిస్తున్నది.

నాకు వ్యక్తిగతంగా బాబుకు అక్షరాభ్యాసం అమరేంద్రచే చేయించిన కాలం నుండి నేటి దాకా వయసుతో బాటు ఎదుగుతున్న అతని జీవిత ప్రగతిని అడుగడుగునా చూచిన నేను ఈ అకాల అశనిపాతానికి చింతిస్తున్నాను. జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులందరి పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమ్మ శబ్దకోశంలో పునర్జన్మ సిద్ధాంతం లేదు కనుక, అమ్మ కావాలనుకుంటే తప్ప జన్మరాదు కనుక అమ్మ స్థానంలో జి.వై.యన్. బాబుకు శాశ్వత స్థానం ఉంటుందని విశ్వసిస్తున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!