దత్తన్నయ్యగా జిల్లెళ్ళమూడిలో ప్రసిద్ధుడైన సోదరుడు శ్రీ మన్నవ దత్తాత్రేయ శర్మ అమ్మ జన్మించిన పవిత్రమైన మన్నవ వంశంలోనే జన్మించాడు. దత్తు తండ్రి రామబ్రహ్మం, తల్లి సీతారత్నం. ఆమెను అందరూ పుల్లమ్మ అని పిలచేవారు. దత్తు ఆరుగురు సోదరులలో చివరివాడు. ఇతనికన్న పెద్దవాడైన వెంకటేశ్వర్లు కూడా జిల్లెళ్ళమూడిలోనే ఉండేవాడు. అతనిని అందరం బుజ్జన్నయ్య అని పిలిచేవాళ్ళం.
దత్తు తండ్రి రామబ్రహ్మం గారు రామభక్తుడు. వాసుదాస స్వామివారికి సన్నిహితుడు. రామబ్రహ్మంగారు అమ్మకు పినతండ్రి వరుస. అమ్మ తండ్రి సీతాపతి తాతగారు. సీతాపతి గారి తండ్రీ, రామబ్రహ్మంగారి తండ్రీ అన్నదమ్ములు. మరిడమ్మ తాతమ్మతో పొన్నూరు నుండి మన్నవ వెళుతున్న అమ్మను తాతమ్మను వాసుదాసస్వామి వద్దకు రమ్మని పిలిచారు రామబ్రహ్మం గారు. తాతమ్మ నేను రాలేను అనసూయని తీసుకెళ్ళమంటుంది రామబ్రహ్మం గారితో. ఆయన భార్య పుల్లమ్మగారు సరే పిల్లలను ఎత్తుకోవటానికన్నా ఉంటుంది పంపమంటుంది. అలా అమ్మ వాసుదాస స్వామిని దర్శించి వారికి రామునిగా దర్శనమిస్తుంది. ఆ రామబ్రహ్మంగారి చివరి కుమారుడే దత్తు.
మన్నవ రామారావు చిదానందమ్మ అనే భార్యాభర్తలు జిల్లెళ్ళమూడి అమ్మ సేవలో కొంతకాలం గడిపారు. ఆ రోజులలోనే రామారావు 1957లో దత్తు పెద్ద అన్నగారికి ఉత్తరం వ్రాశాడు అమ్మ మహిమను గూర్చి. ఆ తరువాత అమ్మ వద్దకు దత్తురాక ముందరే దత్తుకు అమ్మ ప్రకృతిని ఆవరించిన ఒక మహత్తర శక్తిగా హృదయానుభూతిని ప్రసాదించింది. 1959లో దత్తు అప్పికట్ల రామకృష్ణ ఇంటికి వచ్చి అక్కడ నుండి మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాడు. రెండవసారి 1960లో వచ్చాడు. అప్పుడు రాచర్ల లక్ష్మీనారాయణ మేనత్త లలితాంబగారు పూజ చేస్తుంటే అమ్మ శరీరంపై వివిధ రకాలైన దేవతా యోగ ముద్రలు పడటం చూచాడు.
ఒకసారి వాళ్ళ నాన్నగారు రామబ్రహ్మంగారు ప్రసాదం తెమ్మంటే అమ్మ కుంకుమ పొట్లాలిచ్చింది దత్తుకు. వాళ్ళ నాన్నగారికి ఇస్తే కుంకుమ పొట్లమే పటిక బెల్లంగా మారింది.
జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడల్లా అమ్మకు బిందెలతో, పీపాలతో సాగర్ గారితో కలసి చెఱువు నుండి నీరు తేవటం జరిగేది. ఒకసారి అప్పికట్ల నుండి వస్తుంటే కాలువ గట్టుమీద అరడగు దూరంలో పాము ఎదురైంది. కదలకుండా నిలబడ్డాడు. పాము ఏమీ చేయకుండా ప్రక్కకు పోయింది. చిన్నప్పుడు విపరీతంగా ప్రతి దానికీ భయపడేవాడు. అప్పుడు వాళ్ళనాన్న రామబ్రహ్మంగారు హనుమంతుని శ్లోకాలు చదువుకో అని చెప్పారు. అవి చదువుకున్న తర్వాత భయపడటం పోయింది. అమ్మ వద్దకు వచ్చిం తర్వాత అమ్మ స్మరణే. మొదట అమ్మ అక్కగారే దత్తుకు. తర్వాత అమ్మగా సర్వులకూ అమ్మగా, సర్వసాక్షిగా, లోకబాంధవిగా అర్థమైంది.
ఒకసారి అందరిల్లు కట్టే రోజులలో సున్నపు గానుగ పనులు, సిమెంట్ పనులు చేశాడు.. కాళ్ళూ చేతులూ పుండ్లయి అన్నం తినలేకపోయేవాడు. అమ్మే కలిపి ముద్దలు పెట్టింది. ఆ అమృతమూర్తి చేతిముద్దలు అనురాగంగా, ఆప్యాయంగా పెడుతుంటే ఎంత ఆనందాన్ని, తృప్తినీ అనుభవించాడో. శివశ్రీ శివానందమూర్తిగారు చెప్పినట్లు అమ్మ చేతి ఒక్కొక్క మెతుకు బ్రతుకులోని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అమ్మ అనంత వైభవానికి ఎంత దగ్గరకు చేరాడో.
అమ్మ తాను త్రాగుతూ అక్కడ ఉన్నవారికి కూడా కాఫీ ఇచ్చేది. ఆ కాఫీ త్రాగుతుంటే ఏదో శక్తి అమ్మ నుండి మనలోకి ప్రవహిస్తున్నదా అనిపించేది. ఒకసారి దత్తుకు కూడా అలాటి అనుభవమే జరిగింది. సహజంగా దత్తు చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సభ్యుడు. బాగా కసరత్తు చేసేవాడు. బస్కీలు, దండీలు వేలల్లో చేసేవాడు. ఏదైనా బరువు మోయటం అంటే లెక్క ఉండేది కాదు. ఒక్కొక్కసారి అమ్మ పాదసంవాహనం చేసేవాడు. అమ్మ ప్రక్కనే కూర్చొనేవాడు. అమ్మ పడుకొని ఒక చెయ్యి ఇతని భుజంపై వేసింది నిద్రపోతూ. అమ్మ చేతిబరువు రాను రాను పెరిగిపోయి ఇంత వస్తాదు కూడా మోయలేని స్థితి వచ్చింది. చివరకు ఎలారా భగవంతుడా అనుకుంటుండగా అమ్మ కదిలి చెయ్యి ప్రక్కకు తీసింది. వెయ్యి ఏనుగుల బరువు తనపై నుండి తీసినట్లయింది. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నో అనుభవించాడు. అమ్మగుడ్డలు ఇస్త్రీ చేయటం, అమ్మ ఏపని చేయమంటే ఆ పనిచేయటమే ధ్యేయంగా జిల్లెళ్ళమూడిలో జీవించాడు. రామకృష్ణ లేనప్పుడు వచ్చినవారికి అమ్మ అర్చకునిగా దర్శనాలు ఇప్పించేవాడు.
ఒకసారి అన్నం వడ్డిస్తుంటే ఉన్నవారికి అన్నం చాలదేమో అనిపించింది. ఎంతవడ్డించినా ఆ అన్నపు రాశి తరగలేదట. అలాటి అమ్మ మహిమలు ప్రత్యక్షంగా చూచాడు.
అమ్మ పెద్ద బిడ్డ సుబ్బారావు. ఎన్నో వ్యాపారాలు చేశాడు. ఆ పనులన్నింటిలో దత్తును ఉపయోగించుకున్నాడు. చాలా ప్రదేశాలకు వెంట తీసుకెళ్ళేవాడు. వివిధ పనుల మీద పంపేవాడు. అన్నీ అమ్మ నిర్ణయాలుగానే భావించి చేసేవాడు దత్తు. రైల్వేలో ఉద్యోగం వచ్చింది కాని అమ్మ తన దగ్గర ఉంచు కోవాలనుకున్నదేమో ఆ అపాయింట్మెంట్ ఆర్డరు కొన్ని రోజులు ఆలస్యంగా వచ్చింది. ఏది ఏమైనా అమ్మ సేవలో అస్ఖలిత బ్రహ్మచారిగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించింది అమ్మ.
ఆర్.యస్.యస్.సేవలో ఒక నెలరోజుల పాటు ఉద్యమకారునిగా జైలులో గడపవలసిన స్థితి వచ్చినా అమ్మ సేవ దేశసేవ రెండూ ఒకటే అని భావించి గడిపాడు. అమ్మ విశ్వజనని కదా! ఆర్.యస్.యస్. సంస్థ కూడా ఈ జాతి అభ్యున్నతికి, ప్రజల సాంస్కృతిక సముజ్జీవనానికి పాటుబడుతున్నదని చిన్నప్పటి నుండి ఉన్న తన హృదయగతభావాలకు అనుగుణంగా కృషి చేసి కృష్ణ జన్మస్థానాన్ని సందర్శించాడు.
అమ్మ ఆలయంలో చేరిం దగ్గరనుండి అమ్మకు స్థానమైన వాత్సల్యాలయాన్ని అంటిపెట్టుకొని దర్శించటానికి వచ్చిన సోదరీ సోదరులందరికీ అమ్మ ప్రసాదంగా కుంకుమపొట్లాలిస్తున్నాడు. అమ్మ నీ అనుభవాలు కూడా గ్రంథస్థం చేయరా అని చెప్పిన మాటలకు కట్టుబడి ‘పీయూష’ అనే కలం పేరుతో వ్యాసాలు బృహత్తర గ్రంథాలు “లోకబాంధవి”, “అమృతవాహిని”, “తాత్వికతేజఃపుంజాలు” “అన్నపూర్ణ” వంటివి ప్రచురించాడు. ఎన్నో వ్యాసాలింకా ప్రచురణకు నోచుకోక ఉన్నాయని చెపుతున్నారు. అవి కూడా త్వరలోనే వెలుగు చూడగలవని భావిద్దాం.
దత్తు షుగర్వ్యాధి పీడితుడైనాడు. అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా పనులలో నిమగ్నమయ్యేవాడు. గానగంధర్వుడు, అమ్మనామామృతపానంలో తరించిన అంధసోదరుడు రాధాకృష్ణరెడ్డి వెంట దేశమంతా తిరిగేవాడు. ఇతడి సేవాభావం, అమ్మపట్ల గల అచంచల విశ్వాసానికి సంతసించిన రాధాకృష్ణరెడ్డి 1993లో కేంద్ర ప్రభుత్వం వారి సాంస్కృతిక శాఖ నుండి రచయితలకు, సంగీతకారులకు ప్రసాదించే పెన్షన్ దత్తుకు వచ్చేందుకు కృషి చేసి అమ్మ దయతో సాధించి పెట్టాడు.
జీవితం జీవనం అమ్మదే చైతన్యవంతమైన జీవితంలో వచ్చే ఒడుదుడుకులు సైతం నిశ్చంచలమైన దివ్యభావాన్ని ప్రసాదిస్తాయి. దివ్యత్వం భౌతికం కాక, భౌతికాన్ని దివ్యమయం చేసి మన అంతరంగాలను, జీవితాలను నడిపే అమ్మ అని గ్రహించే స్థితికి చేరిన దత్తు ధన్యుడు.
మంచివారి మంచితనం మరణంలో తెలుస్తుంది అని పెద్దలంటారు. షుగర్ వల్ల గుండెకు వెళ్ళే రక్తనాళాలలో బ్లాకులు ఏర్పడి ఆపరేషన్ చేయాల్సిన స్థితి వచ్చింది. సోదరులు బ్రహ్మాండం రవి, రావూరి ప్రసాద్, దుర్గపిన్ని కొడుకు హరి, లాలాయ్ వంటి వారెందరో హాస్పిటల్ సేవకు ముందుకు వచ్చారు. కాని ఆశ్చర్యమేమిటంటే జిల్లెళ్ళమూడిలో 19.1.2018న శ్రీ మల్లాప్రగడ వారిచే భాగవత సప్తాహం మొదలైంది. ఉదయం ఆ ప్రవచనం విని దత్తు క్రిందకు వెళ్ళి భోజనం చేశాడు. చేతులు కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు పోతున్నాడు. అదే సమయంలో హార్ట్ టాక్ వచ్చింది. పెద్దగా “అమ్మా ! లోకబాంధవీ! అంటూ పెద్దగా కేకవేసి పడిపోయాడు. అందరూ పోగైనారు. డాక్టర్ ఇనజకుమారి వచ్చి పరీక్షించి అమ్మలో కలసిపోయాడని చెప్పింది.
పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి ఏడు రోజులలో భాగవతం చెప్పి ముక్తిని ప్రసాదించాడు. శ్రీమల్లాప్రగడవారు అమ్మ అనుగ్రహంతో భాగవతా ప్రవచనం ఒక్కరోజు చెప్పగానే దత్తు అమ్మ పాదాల చెంత అమృతుడై ముక్తుడైనాడు. ఎంత ధన్యాత్ముడు.
షుమారు 1945లో అమ్మ అవతరించిన మన్నవలో జన్మించిన దత్తు 2018లో మాతృక్షేత్రమైన అర్కపురిలో అమ్మ సన్నిధిలో అర్ధశతాబ్ది పైగా అమ్మ సేవలో జీవించి తరించిన పుణ్యాత్ముడు, ఆదర్శవంతుడు, ధన్యజీవి.