బూరుగుపల్లి వెంకటవాసుదేవాచారి గారు చీరాల కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తూ 1970 దశకం నుండి అమ్మ వద్దకు వస్తుండేవారు. జిల్లెళ్ళమూడి వచ్చే వాళ్ళల్లో ముగ్గురు వ్యక్తుల తీరు చాలా జెంటిల్గా సోబర్గా ఆ మాటతీరు, ఆ మాట్లాడే పద్ధతి చిరునవ్వుతో సమాధానంగా చెప్పే అలవాటు, చూస్తుంటే ఒక విశిష్టమైన వ్యక్తితో మాట్లాడుతున్నాం మనం అనిపిస్తుంది. నెల్లూరు డాక్టర్ యస్.వి.సుబ్బారావు గారు మరొకరు పొత్తూరి వెంకటేశ్వరరావుగారు. వాసుదేవాచారిగారు కాలేజీలో ఇంగ్లీషు పొయిట్రీ చెప్పటం చాలా గొప్పగా ఉండేదని వారిని కాలేజిలో అధ్యాపకులు, విద్యార్థులు ‘జాన్కీట్స్’ అని పిలుస్తుండేవారు.
క్లాసులో వారు పాఠం చెపుతుంటే మళ్ళీ ఇంటి దగ్గర చదవాల్సిన పనిగానీ, నోట్స్ కావలసిన అవసరం కాని ఉండేది కాదు. అలా విద్యార్ధుల మనసును ఆకట్టుకొనే విధంగా బోధన ఉండేది. విద్యార్థులను మందలించటంలో కూడా అరవటం, కొట్టటం ఉండేది కాదు. విద్యార్ధి అంతట విద్యార్థి తన తప్పు తెలుసుకొనే రీతిలో విశిష్టమైన రీతిలో ఉండేది. మంచి టెన్నిస్ ప్లేయర్గా ఉండేవారు. ఎన్.సి.సి. మాస్టర్గా కూడా కాలేజీలో చేశారు.
మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శేషమ్మ, శ్రీకృష్ణాచార్యులకు 1930లో జన్మించిన వాసుదేవాచారి గారు విశ్వకుటుంబంలో నిజమైన బ్రాహ్మణునిగా జీవించారు. సుమతీ సతిని పొందినవారు. కాలేజీ విద్యార్థులకే కాదు కాన్వెంట్ విద్యార్ధులకు సైతం ప్రేమతో ఆదరంతో విద్యగరిపారు. ప్రిన్సిపాల్గా 1980-85 మధ్యకాలంలో జిల్లెళ్ళమూడిలోనే మాతృశ్రీ విద్యాలయం ప్రిన్సిపాల్గా పనిచేశారు. అక్కడ చదివే బాలబాలికలతోనే కలసి టిఫిన్-భోజనం చేసేవారు. ఏ రకమైన ప్రత్యేకతను ఆశించేవారు కాదు. ఆ విద్యాలయంలో చదివిన బాలబాలికలు ఈనాడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, యం.యల్.ఎ.లుగా, వివిధ రంగాలలో, విదేశాలలో సైతం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. వారి తర్ఫీదు క్రమశిక్షణ ఎంతో ఆదర్శనీయమైనది.
వారి అక్కగారు తలచెడి వారివద్దనే ఉంటున్నది. ఆమెకు కాన్సర్ ముదిరిపోయింది. తన అశ్రద్ధవల్లనే అలా ముదిరిపోయిందని, తండ్రిగారు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయానే అని బాధపడుతూ, దిక్కులేనివాళ్ళకు దేవుడేదిక్కనే సామెతకు చిహ్నంగా అమ్మ పాదాల వద్దకు వచ్చి భోరున విలపించారు. అమ్మ వాసుదేవాచారి గారిని దగ్గరకు తీసుకొని ‘అదేం కాదు లే, నాన్నా!’ అన్నది. ఇలా అమ్మవద్దకు, పరీక్షలు చేయించుకొని కాన్సర్ అని డాక్టర్లచే నిర్ధారింపబడి వచ్చిన కొందరికి “అది కాన్సర్ కాదేమోలే నాన్నా” అని అమ్మ అంటే, తర్వాత కాన్సర్ కాదని తేలిన సందర్భాలున్నాయి. వల్లూరి జగన్నాథరావు కుమారుడు వెంకట రమణకు కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా “అదేం కాదులే, నాన్నా!” అన్నది అమ్మ. వాసుదేవాచారి గారు తన అక్కయ్యను మద్రాసు అడయార్లోని ఆస్పత్రికి తీసుకెళ్ళారు అమ్మ చెప్పిం తర్వాత. మొదట సెకండరీసు వచ్చాయేమోనన్నారు. మర్నాడు టి.బి. వచ్చిందన్నారు. ఆ మర్నాడు టి.బి. లేదు, కాన్సర్ లేదు అమెకేం ఫర్వాలేదన్నారు. అమ్మ ఆ మాట అన్న తర్వాత ఆమె 26 ఏళ్ళు అమ్మ సేవ చేస్తూ, అమ్మ నామం చేసుకుంటూ బ్రతికింది. బయాప్సీ తీసి పరీక్షించిన విషయాలలోనే అమ్మ మాటతో వెనుదిరిగిన సందర్భాలెన్నో. అవి వారి విశ్వాసానికి నికషోపలాలు.
అయితే అమ్మ ఏదీ తను చేశానని ఒప్పుకోదు. వాసుదేవాచారిగారి రెండవ కుమారుడు రామకృష్ణకు ఒంటి నిండా కురుపులొస్తే డాక్టర్కు చూపిస్తే ఎంతో వైద్యం చేశారు. తగ్గలేదు. అమ్మకు చెప్పకపోయినా అమ్మ వద్దకు వచ్చిన వారితో ‘ఏరా! వాడికి తగ్గటం లేదా? నా దగ్గర తైలం ఉన్నది. అది వ్రాయరా’ అని ఇచ్చింది. జబ్బు నయమైంది. అప్పుడు వాసుదేవాచారిగారు . ఆ తైలంలో శక్తివల్ల తగ్గలేదమ్మా! నీ విచ్చావుగాబట్టి తగ్గింది అన్నారు.
ప్రతివారం ఒకసారి కాన్వెంట్ పిల్లలను అమ్మ దర్శనానికి తీసుకెళ్లేవారు. వాళ్ళకు అమ్మ ఏదో ఒకటి తినటానికి పెట్టేది. వాళ్ళు తల్లిదండ్రులను వదలి ఇక్కడ ఉంటున్నారంటే ఆ తల్లి దండ్రులను మరపించేలా ఆదరంగా, ఆప్యాయంగా, ప్రేమతో కడుపు నింపుతూ చూచుకుంటేనే గదా మన దగ్గర ఉండి చదువుకునేది! అని చెపుతుండేది. అలా వారి నేతృత్వంలో అమ్మ మనుమరాలు దగ్గర నుండి మంత్రి ముద్దుకృష్ణమ్మ నాయుడు కుమారుడు వంటి పెద్దల పిల్లలెందరో యీ కాన్వెంట్స్కూలులో చదువుకున్నారు. అలా ఆ కాన్వెంట్ను అభివృద్ధిపథంలో నడిపించడానికి 6 1/2 ఎకరాలలో స్థలం కూడా కొనగలిగారు.
చీరాలలో రిటైరై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా కూడా పనిచేశారు. ఇక్కడ అధ్యాపకులు గురుకుల పాఠశాలలో పిల్లలకు నేర్పినట్లు పాఠాలు నేర్పేవారు. అందువల్ల మంచి ఫలితాలు వచ్చేవి. ఆ రోజుల్లో ఏ రకమైన ధనవనరులు లేకపోయినా ఉచిత భోజనం, ఉచిత విద్య, ఉచిత వసతి కల్పించి అమ్మ ప్రేమధనంతో పిల్లలను అభివృద్ధి పథంలో నడిపే వారు. ఈనాటికీ ఆ ఒరవడి సాగుతూనే ఉన్నది అన్నారు.
ఒక సంవత్సరం జిల్లెళ్ళమూడిలో జరిగే నూతన సంవత్సర వేడుకులకు కుటుంబ సహితంగా వస్తున్నారు కారులో. 7వ మైలు దగ్గరకు వచ్చేసరికి జిల్లెళ్ళమూడి టర్నింగ్ మార్గంలో అకస్మాత్తుగా కారుకు గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ అనుభవజ్ఞుడే. స్టీరింగ్ ఫెయిలయింది. బ్రేక్ వేశాడు. కాని ఆ ఉదుటికి పెద్ద కాలువలో పడాల్సింది కారు. అదే సమయంలో అధరాపురపు శేషగిరిరావుగారు వాన్లో వస్తూ ఆపి అందరినీ ఎక్కించుకొని అమ్మ వద్దకు వాసుదేవాచారి కుటుంబాన్ని చేర్చాడు. ఇద్దరూ కలిసే వచ్చారా నాన్నా! అన్నది అమ్మ. కాదమ్మా ఇలా పెద్ద ప్రమాదం తప్పింది. స్టీరింగ్ ఫైలయింది అన్నారు వాసుదేవాచారిగారు. అమ్మ తనను చూపిస్తూ “స్టీరింగ్ ఇక్కడ ఉన్నది కదా నాన్నా!!” అన్నది నవ్వుతూ. చాలా ఆశ్చర్యపడ్డారు వాసుదేవాచారిగారి కుటుంబం. నిజమే కదా! మన అందరి స్టీరింగ్లు అమ్మ చేతిలోనే ఉన్నాయ్ కదా! మనకు భయమెందుకు? ‘మృత్యువు యెడల భయం లేకపోవడమే మృత్యుంజయత్వం’ అన్నది. అమ్మ మీద సంపూర్ణభారం వేయగలగాలి. వేయగల మనస్థైర్యం అమ్మ మనకి ఇవ్వాలి.
చిలకలూరిపేటలో వాసుదేవాచారి గారింట్లో రాచర్ల లక్ష్మీనారాయణ ఉన్నాడు కొంతకాలం. అప్పుడు అమ్మ లక్ష్మీనారాయణ ఇంటికి, వాసుదేవాచారి గారింటికి వెళ్ళటం నాకు తెలుసు. అమ్మ అనురాగం, అనుగ్రహం పొందిన విశిష్ట వ్యక్తులలో వాసుదేవాచారిగారు ఒకరు. వాళ్ళ పిల్లలు, వారి కుటుంబం అలా అమ్మ ఆదరాన్ని పొందిన వారే. వయసు పైబడి తొంభై యేళ్ళు దగ్గర పడుతున్న యీ వృద్ధాప్యంలో 10.3.2019న మధ్యాహ్నం అమ్మలో ఐక్యమైనారు. ఆయన ధన్యజీవి.