శ్రీమత్పయోనిధి నికేతన! చక్రపాణే”!
భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే!
యోగేశ శరణ్య ! భవాబ్ది పోత !
లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబమ్
సంసార సాగర విశాల కరాళకాల
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగలసదూర్మి నిపీడితస్య
లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబమ్
జిల్లెళ్ళమూడి అందరింటి ఆవరణలో గంభీరంగా మధురంగా ఈ శ్లోకాలు వినిపిస్తుంటే అవి సిరిగిరి సుబ్బారావువి అని అందరికీ గుర్తు. ఆర్తితో అతడు చేసే లక్ష్మీ నరసింహస్వామి విన్నాడో లేదోగాని అమ్మ మాత్రం మళ్ళీ మళ్ళీ పాడించుకొని వినేది. అమ్మ వద్దకు వచ్చే సోదరీసోదరులు కూడా సుబ్బారావు పాడే పాటలు పద్యాలు స్తోత్రాలు వింటూ ఆనందించే వాళ్ళు. లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం మాత్రం అతడు పాడే వాటిలో హైలైట్ అని అందరూ అనుకునే వాళ్ళు.
సుబ్బారావు పుట్టుగుడ్డి. పర్చూరు నివాసి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అలాటి కళ్ళులేకుండా జీవించటం దురదృష్టకరం. డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు అనటం నిజమే. సుబ్బారావు బీదవాడు. కళ్ళులేని బీదవాని స్థితిని ఊహించుకుంటే అర్థమౌతుంది అతని బాధ. నిర్వీర్యుడై నిస్తేజుడై నిరాశోపహతుడై లోలోపల కుమిలి కుమిలి చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించే స్థితికి దిగజారాడు. స్థితిలో అమ్మ కేక వినిపించేదేమో! 1962లో కొందరు సోదరులు జిల్లెళ్లమూడి వెళ్ళి అమ్మ ఒడిలో చేరితే నీ జీవితం ఉద్దరించి బడుతుందని సలహా ఇచ్చారు. ఒక శుభముహూర్తంలో అమ్మ పాదాలపై వ్రాలిపోయి అంధుడను, అనాధను, పాపిని, అపరాధిని రక్షించే బాధ్యత నీదేనమ్మా? అనాలని అనుకున్నాడు. కాని దేహం కంపించింది, మాటరాలేదు. ఆగకుండా. కంటి వెంటకన్నీరు, కంఠంగాద్గదికమైంది. ప్రేమ బిక్షకోసం అమ్మ పాదాలపై పడిపోవటం జరిగింది.
అమ్మ తన అమృత హస్తంతో తలనిమిరి “భయపడకు నాన్నా! ఆత్మహత్య చేసుకుందామనుకున్నావా? నేనున్నాను నాన్నా? నీ జీవితం ఏలా జరుగుతుందని బాధపడుతున్నావా? సర్వమూ జరుగవలసినరీతిలో జరుగుతుంది. కళ్ళు ఉన్న వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేయగలగుతున్నారా? పిచ్చి భ్రమ. అయినా నీకు జరుగని దేముంది? జీవితాన్ని గూర్చిన బాధ అక్కరలేదు. ఇక్కడే ఉండు అని అన్నం తెప్పించి కలిపి ముద్దలు నోటి కందించింది.
ఆ రోజు నుండి అతడికి జీవితాన్ని గూర్చిన భయం పోయింది. తనకు అండగా అమ్మ ఉన్నదనే ధైర్యం వచ్చింది. హరికథలు చెప్పేవాడు. కావాలను కున్నప్పుడలా వచ్చి అమ్మ పద్యాలు పాటలూ పాడేవాడు. అవి ఎంతో మధురంగా ఉండేవి. బ్రహ్మాండం సుబ్బారావు వ్రాసిన “పాపాల పాకలో పాపాయి పుణ్యాల పాలకై పిలిచేవా”, అలాగే బృందావనం రంగాచార్యుల వారు అమ్మను గూర్చి వ్రాసిన ‘పూజా పుష్పాలు’లోని పద్యాలు చదివే వాడు. రాజు బావపాటలు సరేసరి.. రోజులలో అందరికీ అవే వేదవాక్యాలు. ఆ రోజుల్లోనే నా చేత ఒకటి రెండు పద్యాలు వ్రాయించుకున్నాడు.
నిండుగుండెలపైన కండనాస్తి
కనగ లోకమునందు గౌరవంబదినాస్తి
రంగు రు హోరంగునాస్తి
జ్ఞానమార్గమునాస్తి
గానమార్గము ఆస్తి
కోనకోనలలోన గోమునాస్తి
కన్నులవి రెండు దుమ్ముచేకప్పబడియె
అమృత శీతల శాంత రసార్ద్రమైన
నీదు కమనీయమగు స్పర్శ నెగడుజేసి
దివ్యవాత్సల్య జలధిలో తేల్చుమమ్మ !
ధ్యానమార్గములోన తరియింతునందునా
మాయదారి మనసు మాటవినదు.
ఆర్తితో నీపైన కూర్తు పద్యములన్న
ఛందాల అందాలు సాగిరావు |
కనులార నిన్నెపు కాంచెద నందునా
అంధుడనైయుంట అలవిగాదు.
అమ్మ మాటలలోని అర్థమ్ము నెరుగగా
అఆలు కూడ నాకసలురావు
భక్తితో నీదుపాదాలు పట్టుకొనెడి
రక్తి యొక్కటి నాకు శ్రీరామరక్ష.
ప్రేమతోనీవు నిమురుట నేమొ తల్లి
లక్ష్మ స్వర్గాలు అక్షయాపేక్షలగును
ఈ ఆ పద్యాలను వింటూ అమ్మ “అరె సుబ్బారావు ఏదీ నీ పద్యాలు పాడు” అంటుండేది. సుబ్బారావు గొంతెత్తి పాడుతుంటే అతని కంఠంలోని ఆర్తికి చలించి పోయి అమ్మ కళ్ళ వెంట నీరుకార్చేది.
అమ్మ పాదాలపై సమర్పింప బడటానికి కుంటి, గుడ్డి పూలైనా యోగ్యాలే. మనసు ప్రధానంగాని రూపంకాదు. అమ్మకు అవిటి వారన్నా, అంధులన్నా, సమాజం నుండి విసిరివేయబడ్డ వారన్నా విపరీతమైన ప్రేమ. మంచివారిని అందరూ ఆదరిస్తారు వీళ్ళను నేనాదరించకపోతే ఏలా? అయినా తల్లికి తప్పే కనిపించదని. అందరికీ సుగతేనని చెప్పినతల్లి ఆదరణకు అనురాగానికి నోచుకున్న సిరిగిరి సుబ్బారావు ధన్యుడు.