1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (సుందరరామిరెడ్డిగారు (రెడ్డన్నయ్య))

ధన్యజీవులు (సుందరరామిరెడ్డిగారు (రెడ్డన్నయ్య))

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : October
Issue Number : 4
Year : 2008

జిల్లెళ్ళమూడిలో 30 సంవత్సరాల పైచిలుకు అమ్మ సన్నిధిలో జీవితాన్ని పునీతం చేసుకొన్న మహానుభావుడు సుందరరామిరెడ్డిగారు. (ప్రక్క చిత్రంలో అమ్మకు కుడిప్రక్కన) 1966లో మొదటిసారి అమ్మ వద్దకు వచ్చినప్పుడు అమ్మ రెడ్డిగారిని ఏయే క్షేత్రాలు చూశావు నాన్నా! అని అడిగింది. కాశీ, రామేశ్వరం, అరుణాచలం, పుట్టపర్తి, షిర్డి మొదలైన క్షేత్రాలను గురించి చెప్పారాయన. ‘పండరీపురం వెళ్ళావా నాన్నా!” అని అడిగింది. వెళ్ళానమ్మా! అన్నారు రెడ్డిగారు. అప్పుడు అమ్మ ‘అక్కడ ఎవరైనా ముత్తైదువ నిన్ను, ఏం నాన్నా! అని పలకరించిందా?’ అని అడిగింది. రెడ్డిగారికి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో 1930లో ఆయన పండరీపురం వెళ్ళిననాటి సంగతి అది. అక్కడ ఎంతో మంది జనం మధ్యలో, మన తెలుగుభాషలేని ఊళ్ళో ‘ఏం నాన్నా?’ అని ఒక ముత్తైదువ పలకరించింది. ఆమె తేజోవంతమైన చూపులు, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, బులాకీ, చూడటానికి ఈమె సామాన్యురాలుగా లేదు అనిపించింది. పలకరింపులో ఏదో ఆప్యాయత, తియ్యదనం వినిపించింది. “ఇక్కడ ఒంటరిగా కనిపిస్తున్నావు. నీతో మగవాళ్ళు ఎవరూ రాలేదా? అమ్మా?” అని రెడ్డిగారు అడిగారు. “ఊళ్ళోకి వెళ్ళారునాన్నా!” అన్నది ఆమె. “ఏం ఊరమ్మా! మీది?’ అని రెడ్డిగారు అడగ్గా “విజయవాడ నాన్నా!” అని చెప్పింది. ఆమెతో మాట్లాడి నాలుగడుగులు ముందుకు వేసి వెనకకు తిరిగి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఇంతలోనే మాయమై పోయిందేమిటబ్బా! అనుకున్నారు.

ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ ఈ విషయం ప్రశ్నించేదాకా వారికి జ్ఞాపకం కూడా లేదు. మరొక విచిత్రం ఏమిటంటే, అమ్మ తన దగ్గర ఉన్న ఒక ఫొటో చూపించి “ఇలాగే ఉందా నాన్నా! ఆమె” అనగా రెడ్డిగారు “అవునమ్మా? అచ్చం ఇలాగే ఉన్నది” అని అమ్మే ఆరోజు అలా కనిపించిందని అమ్మలోని సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వానికి విస్తుపోయి, అమ్మ వాత్సల్యతరంగాలలో ఓలలాడారు. 36 ఏళ్ళ క్రితమే తనను ఆనాడు ఏడు సంవత్సరాలు కూడ భౌతికంగా నిండని అమ్మ 1930లో ఒక ముత్తైదువుగా కనిపించి ఇన్నేళ్ళ తర్వాత తనను రప్పించు కోవటం తన బిడ్డగా తనను ఎన్నో ఏళ్ళనాడే ఎన్నుకున్నదని ఆనందించారు.

ఎన్ని క్షేత్రాలు తిరిగినా కలుగని అనుభవం ఆనందం అమ్మ దగ్గర కలిగే సరికి తన గమ్యం ఇదేనేమో! ననుకున్నారు. కాని అమ్మ ఉపన్యాసాలివ్వరు, భజనలు చేయించరు, ధ్యానం నేర్పించరు. మరి ఆధ్యాత్మిక పురోగతి ఎలా? అనుకున్నారు. కాని నిద్రలేచేసరికి వారి నుదుటన కుంకుమ బొట్టు ఉన్నది. తాను పెట్టుకోని కుంకుమబొట్టు ఎలా వచ్చింది? అమ్మ బొట్టు పెట్టి పిలిచింది రమ్మని అనుకున్నారు. పుట్టపర్తి వెళ్ళాలి అనుకున్న వారు జిల్లెళ్ళమూడి వెళ్ళారు. అమ్మలోని అతిమానుష వాత్సల్యానికి, అనురాగానికి పరవశించి అక్కడే ఉండిపోయారు.

అయితే అమ్మ వల్ల జరిగిన పనినైనా మనం అన్వయించుకొని అవగాహన చేసుకోవలసిందేగాని తన అస్తిత్వాన్ని అమ్మ అంగీకరించదు. తాను చేశానని ఒప్పుకోదుకదా! రెడ్డిగారితో జరిగిన సంభాషణలలో ఇలాంటి సన్నివేశమే ఒకటి జరిగింది.

ఉత్తరాది నుండి కొందరు సాధువులు రైలు ప్రయాణం చేస్తుండగా టిక్కెట్లు లేవని టిక్కెట్ కలెక్టర్ వాళ్ళను బాపట్ల స్టేషన్లో దించి వేశాడు. స్టేషన్కు ఎదురుగా ఉన్న గవర్నమెంట్ హాస్పటల్లో నేరేడు చెట్టుక్రింద వాళ్ళంతా కూర్చుని ఉన్నారు. అమ్మ మంచినీళ్ళ బిందెతో ఆ వైపు వెళ్ళుతూ వాళ్ళకేదైనా ఆహారం పెట్టుకోవాలనిపించి ఇంటి నుండి రొట్టెలు కూరచేసి తెచ్చి వారికి పెట్టింది. వాళ్ళంతా ఆశ్చర్యంగా అమ్మ వంక చూచి “నీవు మా దేశంలో ఇట్లానే పెట్టావుగదా మాకు.? ఇంతలోనే ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడిగారు. “ఏమో! నాకు తెలియదు. అక్కడ మీకు ఎవరు పెట్టారో ఏమో!” అన్నది. “కాదమ్మా! నీవే పెట్టావు. నీ వెవరో మాకు చెప్పవా?” అని అడిగారు. అమ్మ! “ఏమో నాకేం తెలియదు” అంటూ వాళ్ళందరికి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి పోయింది గబగబా. వాళ్ళలో కొందరు అమ్మ ఎక్కడ ఉంటుందో చూద్దామని అమ్మ వెనుకనే వెళ్ళారు. వాళ్ళు చూస్తుండగానే అమ్మ మాయమైంది.

అమ్మ ఎవరికి ఎప్పుడు ఏ రకమైన అనుభవాన్ని ఇస్తుందో చెప్పలేం. అమ్మ సాధువుల ఉదాహరణ రెడ్డిగారికి చెప్పటంలో ఉద్దేశ్యం తానే అక్కడకు వచ్చి దర్శన మిచ్చానని కాదు. ‘ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా ఉన్నది ఒకటే. ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా దర్శనాలు ఇస్తుంది ఆ చైతన్యం’ అని తెలియ చేయటానికే. “నేనూ మీలాంటి దానినే -నాకేం తెలియదు నాన్నా! మీరేదన్నా చెపితే వింటాను. నేనేం చదువుకోలేదు నాన్నా!” అనే అమ్మ సర్వత్రా తానే ఉన్నానని తన చర్యల ద్వారా తెలియచేసింది.

రెడ్డిగారిది నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామం. 40 ఏకరాల పొలాన్ని తన చాకచక్యంతో, తన నిరంతర కృషి ఫలితంగా 100 ఎకరాలుగా పెంచిన ఆదర్శ రైతు రెడ్డిగారు. ‘చెట్లకు రూపాయిలు కాయిస్తామయ్యా! మేము’ అంటూ ఉండేవాడు. రైతుగా ఉంటూనే ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంచుకొన్న మహామనీషి రెడ్డిగారు. ఒకసారి రెడ్డిగారితో కలిసి నేనూ, రవీ, గోపాలన్నయ్య రమణాశ్రమం, అరవిందాశ్రమం, ఏర్పేడు ఆశ్రమం చూడటం జరిగింది. ఆశ్రమాలలో ఉండేవారు ఎంతటి సేవా భావంతో ఉంటారో, ఎంతటి త్యాగమయజీవనం గడుపుతుంటారో, ఆశ్రమాలంటే ఎలాంటి వాతావరణం ఉంటుందో చూపించి చెప్పేవారాయన. రెడ్డిగారు కూడ అలా నిరాడంబరంగా, నిస్సంగంగా, తన దినచర్యతో గడిపేవారు. త్రోవలో వెళ్ళుతూ పొలాల్లో పంపులదగ్గర స్నానాలు పూర్తి చేసేవారు.

అమ్మను ఏమీ ప్రశ్నించే వారు కాదు. అడగాల్సిన పనేముంది అన్నీ ఆమె, చూచుకుంటుంది. ఏది ఎవరికి ఇవ్వాలో అది వారికి ఇస్తుంది. అమ్మది అనుభూతిపరమైన హృదయానుభూతి. పరుసవేదిని తాకితే ఇనుము బంగారమైనట్లు మానవులు అమ్మ దర్శన స్పర్శనలలోనే మంచిగా మారుతారు అని రెడ్డిగారి విశ్వాసం.

అందరింట్లో ఒకసారి వంట ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఎట్లా అని కార్యకర్తలు మధనపడుతున్నారు. ఇంతలో రెడ్డి అన్నయ్య పంపించాడని ఒక బండి నిండా బియ్యం బస్తాలతో వచ్చింది. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకున్నారు అక్కడివారు. మరుసటి రోజు రెడ్డి గారు జిల్లెళ్ళమూడి వచ్చారు. అన్నయ్య ఆపదలో ఆదుకున్నందుకు అందరూ ప్రశంసించారు. రెడ్డిగారు బిత్తరపోయారు. నేనేమిటి? బియ్యం పంపడమేమిటి? నాకేమీ తెలియదే! అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం విశ్వజననీ పరిషత్ కార్యకర్తల పనైంది. రెడ్డిగారు వెళ్ళి అమ్మను అడిగారు. “ఏమిటమ్మా ఇదంతా?” అని. “ఏమి లేదునాన్నా! పని జరిగింది కదా! ఎవరు పంపితే ఏమిటి?” అని దాటవేసింది విషయాన్ని. అన్నపూర్ణాలయం తన గుండెకాయ అన్నందుకు దానిని ఎలా నిరంతరం ఆగకుండా నడిపిస్తున్నదో అర్ధం చేసుకుంటే బ్రహ్మదేవుడు చేసిన మాయను శ్రీకృష్ణుడు గొల్లపిల్లలుగా, గోవులుగా, దూడలుగా మారి గోపాలుర ఇండ్లలోకి వెళ్ళిన విషయం స్ఫురణకు తెప్పిస్తుంది. ఈ సన్నివేశానికి రెడ్డిగారు ఉపకరణం కావటం వారి అదృష్టం మన భాగ్యం.

ఒకసారి అమ్మ రెడ్డిగారిని తమ ఊరువెళ్ళి మూడువేల అరటికాయలు, 6 వేల అరటి ఆకులు, రెండు వేల నిమ్మకాయలు తెమ్మని చెప్పింది. వారి ఊరిలో అన్ని దొరకటం అసంభవం అనిపించింది వారికి. ఎందుకంటే ఆ ఊరిలో కాసే పంటను గూర్చి వారికి క్షుణ్ణంగా తెలుసు గనుక. కాని అమ్మ చెప్పింది – ఏమో! చూద్దాం అని వారు విడవలూరు వెళ్ళారు. ఆశ్చర్యం! పూర్వం బీడులా ఉండే భూమి అరటితోటలతో, నిమ్మతోటలతో కళకళ లాడుతూ ఉండటం చూశారు. అమ్మ అక్కడి నుండే విడవలూరు తోటలు పంటలు చూచిందన్నమాట. అమ్మ చెప్పినట్లుగా అన్నీ తీసుకొని జిల్లెళ్ళమూడి చేరారు. మధ్యలో లారీని చెకో పోర్టు వాళ్ళు అటకాయించగా ‘ఇవి జిల్లెళ్లమూడిలో అన్నసంతర్పణకు తీసుకొని వెళ్ళుతున్నాము’ అనగా ఆశ్చర్యంగా ముందు అంగీకరించని వాళ్ళే ఆదరంగా పంపారు.

రెడ్డి గారికి నాన్నగారితో సాన్నిహిత్యముండేది. నాన్నగారంటే గౌరవమూ ఉండేది. నాన్న గారితో రెడ్డిగారు “మా ఊళ్ళో ఇంత ఫలసాయం ఉందని నాకే తెలియదు. అమ్మకెట్లా తెలిసిందో నాన్నగారూ!” అని అన్నారు. నాన్నగారు ఆ విషయమై అమ్మను ప్రశ్నించి రెడ్డిగారు ఇలా అనుకుంటున్నారు అని, అందుకు అమ్మ “నాకు అవసరం అనుకున్నప్పుడు చూస్తాను” అని చెప్పింది. ఆ విషయం నాన్నగారు రెడ్డిగారికి తెలియచేశారు.

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం – నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వ జీవన్ముక్తిః” అని నమ్మినవారు రెడ్డిగారు. రెడ్డిగారు నీతి శతకాలలోని పద్యాలన్నీ చెప్పి వాటిని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుండేవారు. ఆయనను ఎవరైనా పొగిడితే అది వేరయ్యా! నేను మామూలు రైతును అని తన నిరాడంబరతను తెలియచేసేవారు. వారికి రామకృష్ణపరమహంస, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ అంటే అత్యంత ఇష్టమైనవారుగా ఉండేవారు. ఆధునికంలో పరమహంస అని మరెవరికీ లేదనీ, మహర్షి అని ఇంకెవరికి పేరులో లేదనీ అలాగే అమ్మలాగా సర్వులనీ బిడ్డలుగా చూచుకొనే వారు ఎవ్వరూ కనబడరని వారు చెపుతుండేవారు. అమ్మ నామస్మరణ మాత్రంచేతనే సర్వసంశయాలు నివారణ అవుతాయనేవారు. నిరంతరం అమ్మ నామస్మరణలో కాలం గడిపేవారు. ఎవరు ఏ విషయానికి దిగులు పడుతున్నా ‘ఏం బాధపడకండయ్యా! అన్నీ అమ్మే చూసుకుంటుంది’ అనేవారు. ఆ విశ్వాసం ప్రబలంగా ఉన్న వ్యక్తి రెడ్డిగారు. “ఏది కాదు అమ్మ కరుణ? కష్టమైనా సుఖమైనా అన్నీ అమ్మకరుణే అనుకుంటే గొప్ప విషయమైనా స్వల్ప విషయమైనా బాధపడటం ఉండదు” అని అమ్మ చెప్పిన విషయం అక్షరాలా నమ్మిన వ్యక్తి రెడ్డిగారు.

ఒకసారి రెడ్డిగారు అమ్మ మన మనస్సును, ఆలోచనలను ఎట్లా గ్రహించగలదో ఒక ఉదాహరణ చెప్పారు. ఒక సారి ఒక విదేశస్థుడు అమ్మకు విసనకర్రతో విసురుతున్నాడు. ఇంతలో అతడి మనసులో భగవత్సేవ అంటే ఇదే కాబోలు అనుకుంటున్నాడు. ఆ ఆలోచన అతనిలో రాగానే అమ్మ “నాన్నా! నీవు ఇప్పటి దాకా చదివి ప్రక్కన పెట్టిన పుస్తకంలో ఫలానా పేజీతీసి చదువు” అని చెప్పారు. అతడు ఆ పేజీ చూచి అందులో ఉన్న “ఏ పని చేసినా అది భగవంతుని సేవేనని నమ్మి చేసేవారు చేస్తే అది తప్పక భగవంతునికి చెందుతుంది” అన్నవాక్యాలు చూచి ఆశ్చర్య పోయాడు. ఆ విషయమే చెప్పాడు. రెడ్డిగారు అప్పుడక్కడే ఉన్నారు.

రెడ్డిగారు ఒక రకంగా మృత్యుంజయుడు. ‘మృత్యువంటే భయంలేకపోవటమే మృత్యుంజయత్వం’ అని అమ్మ చెప్పింది. అలా మృత్యువంటే భయంలేకుండా నిర్మమునిగా జీవించిన మహాయోగి రెడ్డిగారు. అన్నీ తెలిసినా ఏమీ పట్టనట్లు, అడిగితే మాత్రమే తగురీతిలో సమాధానం చెప్పేవారు.

అమ్మ విశ్వజనీనత్వంపట్ల, అఘటన ఘటనా సామర్థ్యంపట్ల, అచంచల విశ్వాసంతో మూడు దశాబ్దాల పైచిల్కుగా జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో ఒక మునిగా, ఒక ధ్యానయోగిగా, ఒక నిస్సంగునిగా, నాన్నగారు ఆలయంలో చేరిన తర్వాత అందరింటి పెద్దగా, జీవితాన్ని ఒక తపస్సుగా, గడిపిన మాన్యులు శ్రీ మేనకూరు సుందరరామిరెడ్డిగారు. సంస్కృత కళాశాల విద్యార్థులంటే ఎంతో ప్రేమవారికి. తల్లిదండ్రులను వదిలి ఎంతో దూరం నుండి వచ్చి కష్టనష్టాలు భరిస్తూ విద్యను ఆర్జిస్తున్నవారిపట్ల ఎంతో సానుభూతి, అందరింటిలో పనిచేసే వారిపట్ల కూడా వారికి అటువంటి ఆదరమే ఉండేది.

అన్నపూర్ణాలయ భవన నిర్మాణంలో, అన్నపూర్ణాలయ సామానులు భద్రపరిచే స్టోర్ రూము నిర్మాణంలో, వాటర్గాంకులు ఏర్పాటు చేయటంలో వారి పాత్ర అందరూ ఎరిగినదే. అవసరమైన సమయాలలో ప్రచ్ఛన్నంగా అన్నపూర్ణాలయ నిర్వహణలో తను ఉదారహస్తాన్ని అందించటంలో రెడ్డిగారెప్పుడూ ముందుండేవారు. నిజమైన బ్రహ్మచారిగా అమ్మను బ్రహ్మచారిగా గుర్తించి అమ్మచారియైన బ్రహ్మచారి.

ఏదైనా ఇబ్బంది వచ్చి విశ్వజననీ పరిషత్ కార్యకర్తలు రెడ్డిగారిని అడుగుతానుంటే అమ్మ అంగీకరించేదికాదు. రెడ్డిగారిని మనం అడగ వలసిన పనిలేదు. అవసరాన్ని గుర్తించి ఆయనే ఇస్తాడు. ఆయనను ఎప్పుడూ అడగకండి అని చెప్పేది. అలాగే రెడ్డిగారు కూడా తగిన రీతిలో నడుచుకొనేవారు. సర్వస్వం అమ్మ పేరనే వ్రాసి ఉంచారు 26.7.2002లో వారు అమ్మలో లీనం కాకముందే.

శ్రీ విశ్వజననీ పరిషత్ కోశాధికారిగా కొంతకాలం, మాతృశ్రీ విద్యాపరిషత్ ఉపాధ్యక్షునిగా కొంత కాలం ఆయా సంస్థల పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వహించారు. అందరింటి తలలోని నాల్కగా మెలిగారు. అన్నపూర్ణాలయ వార్షికోత్సవం నాడు వారి సంస్మరణార్ధం ఊరి ప్రజలకు విందు భోజనం ఏర్పాటు చేయటంలో కూడా ఔచిత్యం ఉందని పిస్తున్నది. జిల్లెళ్ళమూడి అందరింటి చరిత్రలో రెడ్డన్నయ్య ఒక స్వర్ణాధ్యాయం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!