‘పది నెలల వాడికే చాలా చురుగ్గా మాటలు వచ్చు పిల్లల్లో సుబ్బారావునే చెప్పాలి, అంత త్వరగా పిల్లల్లో మాటలు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. 10 నెలల వాడు ఇంటి పేర్లతో సహా పలికే వాడు. పొలము పొలాల నెంబర్లు చెప్పేవాడు.
“1942లో రాఘవరావు అన్నయ్య బుర్రకథ వ్రాస్తున్నాడు. మంగళపాండ్య, ఝాన్సీలక్ష్మీబాయి, ముసుగువేసి చిరుకప్పులో ప్రాణం వదలుతున్న చోట చాల బాగుంది. చెప్పటం కూడా మొదలు పెట్టాడు వాళ్ళ మామయ్య కథ చెబుతుంటే వీడు (సుబ్బారావు) కూడా చిటికెలు వేస్తుండేవాడు. ఇట్లా ఉన్న వాడికి ప్రథమంగా పాల ఉబ్బసం వచ్చింది. మొదటిసారి భయపెట్టింది.”
అమ్మ సుబ్బారావును గూర్చి చెప్పిన మాటలివి. ఇందులో సుబ్బారావు చాల తెలివి గలవాడని, జ్ఞాపకశక్తి కలవాడని. విషయాన్ని ఇట్టే గ్రహించగలడని, అయితే చిన్నతనం నుండే అనారోగ్యం వెంటపడ్డదని తెలుస్తున్నది. అయితే పెద్దవాడయిం తర్వాత కూడ తెలివి తేటలలో ఎక్కడా లోపం లేదు కాని, ఆయాసంతో ఉబ్బసంతో బాధపడ్డట్టు దాఖలాలేం లేవు.
సుబ్బారావు పాఠశాల చదువు వదిలి కాలేజీ చదువుకు వచ్చినప్పటి నుండి కాస్తో కూస్తో అతనితో నాకు సాన్నిహిత్యం ఉంది. అతను, నేను కలసి 4, 5 సంవత్సరాలు మమేకంగా తిరిగాం కూడా. బంధువుల ఇళ్ళకు గానీ అమ్మ వద్దకు వచ్చే ఆత్మబంధువుల ఇళ్ళకు గానీ, రావిపాడు, సింగుపాలెం, తెనాలి, విజయవాడ, రాజమండ్రి ఇలా చాల ఊళ్ళు పర్యటించాం.
అక్కడి వారు అమ్మతో ఉన్న వారి అనుభవాలు చెబుతుంటే కొన్ని రికార్ట్ కూడా చేశాం. ఆ రోజుల్లో – నాతో కలసి సుమారు రెండు సంవత్సరాలు ఉద్యోగం కూడా చేశాడు మా పాఠశాలలో. 1961లో మొదటిసారిగా గుంటూరులో డాక్టర్ వై.వి. సుబ్బారావు గారి హాస్పిటల్లో సుబ్బారావుకు ఆపరేషన్ జరిగింది. గోవిందరాజుల దత్తు గారు అక్కడ చేర్చారు. సుబ్బారావుకు దగ్గరుండి ఆ పది పదిహేను రోజులు సేవచేసే అవకాశం కలిగింది నాకు. అప్పటి నుండి చాలా సంవత్సరాలు ప్రతి యేడూ ఆపరేషన్ జరిగిన రోజున అమ్మకు పూజ చేసుకుంటుండే వాడు. ఆ పూజా కార్యక్రమంలో నన్ను కూడా పాలుపంచుకునే అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు.
1962లో అమ్మ పుట్టిన రోజు పండుగ నాడు ఒక ప్రత్యేక సంచిక మాతృశ్రీ ప్రథమ సంచిక తేవాలని సంకల్పించాడు. నేను సుబ్బారావు కలసి ఆ ప్రయత్నం చేశాము. గుంటూరులోనే సాహిత్య రంగంలో చాల మంది నాకు బంధువులు మిత్రులు కావడంతో వాళ్ళలో చాల మంది అమ్మ వద్దకు వచ్చి అమ్మ వాత్సల్యాన్ని ప్రేమామృతాన్ని గ్రోలిన వారు కావడంతో తమ తమ రచనలు ఇవ్వవలసిందిగా కోరాం. అందరూ ఎంతో ఆనందంతో వ్రాసి ఇచ్చారు. ఆ రకంగా మాతృశ్రీ జన్మదిన సంచికలు ప్రారంభించడానికి సుబ్బారావే ప్రథముడు. పిమ్మట నాలుగేళ్ళు జన్మదిన సంచికలుగా వచ్చి, తర్వాత నెలసరి పత్రికలుగా రావడం జరిగింది. ఆరంభానికి మాత్రం సుబ్బారావే కారణం.
శ్రీ సుబ్బారావు మంచి కవి. అతడు వ్రాసిన గేయాలు ఎన్నో సిరిగిరి సుబ్బారావు పాడేవాడు. సుబ్బారావు వ్రాసిన ‘పాపాల పాకలో పాపాయీ పుణ్యాల పాలకై ”పిలిచేవా’ అనే గేయం చాల ప్రసిద్ధి చెందింది. ‘లేచింది గజక్క గొంతు’ అని గజేంద్రమ్మక్కయ్య మీద. ‘అమ్మమ్మా! ఎత్తుకో పళ్ళెం’ అంటూ అందరమ్మమ్మ మీద 1964-65లలోనే వ్రాసిన పాటలు హాస్యస్ఫోరకంగా వాస్తవాలకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి.
రాజకీయాలలో సుబ్బారావు గుంటూరులో శ్రీ జన్నాభట్ల వెంకటరామయ్యగారి సాహచర్యంలో చిన్న తనంలోనే ప్రవేశించినా, రాజకీయ దురంధరులైన నడింపల్లి నరసింహారావు, కోన ప్రభాకరరావు, కాసు వెంగళరెడ్డి వంటి ఉద్దండుల వాత్సల్యంతో రాటు తేలాడు. అయితే తన రాజకీయ జీవితాన్ని గ్రామసర్పంచికే పరిమితం చేసాడు కాని, లేకపోతే జిల్లా, రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడో సమ్మున్నత స్థానాన్ని సంపాదించుకొని ఉండేవాడు.
నాటక రంగంలో కూడా సుబ్బారావుకు అనుభవం ఉంది. తను చదువుకొనే రోజుల్లోనూ ఆ తర్వాత కూడా కొంపల్లి శేషు సాహచర్యంలో నాటకాల్లో పాల్గొన్నాడు. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ క్రీడా సాంస్కృతిక (మాతృశ్రీ కల్చరల్) సంస్థ నొకదానిని స్థాపించటానికి మూలకారకులలో ఒకడు. సంస్థ తరఫున కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఆర్థికపుష్టిని కలిగించేవాడు.
జిల్లెళ్ళమూడికి వచ్చే యాత్రికులు 1960 ప్రాంతాలలో చాలా ఇబ్బందులు పడుతుండేవారు. కాలువలు దాటలేక, తాటిబొందలపై దాటుతూ, మోకాలులోతు, మొలలోతు బురదలో కూరుకుపోతూ నడచి రావల్సి వచ్చేది. పంచాయితీ బాధ్యతలు సర్పంచిగా చిన్న వయసులోనే చేపట్టి చక్కటి తారురోడ్డు రావడానికి అతను పడ్డ శ్రమను తలచకుండా ఉండలేం.
సుబ్బారావు చక్కటి స్నేహశీలి, అమ్మకోసం వచ్చేవారు అతి తక్కువ కాలంలోనే సుబ్బారావుకు సన్నిహితులయ్యేవారు. సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, నాటక, క్రీడారంగాలలో అతనికున్న ప్రవేశం వల్ల ఏ విషయం మీదైనా చక్కటి సంభాషణ చేసే చాతుర్యం ఉండేది. హాస్యలాస్యవరివస్యుడు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు. నలుగురిలో కలిసిపోయేవాడు. జిల్లెళ్ళమూడికి పోస్టాఫీసు తేవడానికి అతను ఎంతో శ్రమించి కృతార్థుడైనాడు.
బయట ప్రపంచంలో పనులు చేయడానికి, చేయించడానికి వెళ్ళినప్పుడు. అమ్మగారి కుమారుడిగా చెప్పుకొనేవాడు కాదు. తన వ్యక్తిత్వం ద్వారా ఆ పనులు పూర్తి చేసుకొచ్చేవాడు. తర్వాత ఎపుడో సుబ్బారావు ‘ఫలానా’ అని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ముందు చెప్పనందుకు నొచ్చుకొనేవారు.
జిల్లెళ్ళమూడికి కరెంటు తెప్పించటానికి నీటి పంపులు వేయించడానికి, ఆర్.టి.సి. బస్సులు రప్పించడానికి ఎంతో కృషి చేశాడు. గోపాపురం మీదుగా జిల్లెళ్ళమూడికి రోడ్డు వేయించాలని జిల్లా పరిషత్లో ఎంతో కృషిచేశాడు. వారిచే అంగీకరింపచేశాడు. అది ఇంకా కార్యరూపం ధరించాల్సి ఉంది.
ఈ రకంగా జిల్లెళ్ళమూడి సర్వతోముఖాభి వృద్ధికి సుబ్బారావు ఎంతో శ్రమించాడు. చాలా విజయాలు సాధించాడు. జిల్లెళ్ళమూడి చరిత్రలో సుబ్బారావుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.
అవిరామంగా ఇంత కృషిచేస్తూన్నా అతని ఆరోగ్యం విషయంలో తగు శ్రద్ధ తీసుకోలేదనిపిస్తుంది. చిన్నతనం నుండి ఏదో ఒక వ్యాధి అతడి శరీరాన్ని దెబ్బతీస్తూనే ఉన్నది. సేవాకార్యక్రమాలలో శరీరాన్ని ఒకరకంగా ఆహుతి చేశాడు. షుమారు గత 20 సంవత్సరాలుగా మధుమేహవ్యాధి అతని శరీరంలోని అంగాంగాన్ని దెబ్బతీస్తూనే ఉన్నది. గత సంవత్సరంగా దాని విజృంభణ మరీ పెరిగింది. ఆఖరికి రెండు రోజులకొకసారి రక్తశుద్ధి చేయవలసిన పరిస్థితికి దారి తీసింది.
ఇంత కష్టాల్లో కూడా ఎంతో మెచ్చుకోవలసిన విషయం – సుబ్బారావు సహనం. ఆ ఓపిక ఆ ఓర్పుకు ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. విచిత్రమేమిటంటే 51 సంవత్సరాల సుబ్బారావుకు 56 సార్లు రక్తశుద్ధి చేశారు. 57వ సారి చేయటం పూర్తికాలేదు. మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. అతని జీవితంలాగే సుబ్బారావుకు వైద్య సహాయం అందించిన సోదరులెందరో దేశవిదేశాల్లో ఉన్నారు. ఆర్థికసాయం చేసిన వారు కొందరైతే, సేవ చేసినవారు కొందరు. ఒక లక్ష్మీనారాయణనో, ఒక పూర్ణచంద్రరావునో, ఒక రిచర్డ్ నో, ఒక అప్పారావునో, ఒక ఉపేంద్రనో, ఒక నాగేంద్రమ్మనో ఒక రమేషునో పేరు పేరునా చెప్పటం మొదలు పెట్టితే పెద్ద పట్టిక అవుతుంది. అందరిలో తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు గనుక సుబ్బారావు ఆరోగ్యాన్ని కూర్చి ‘రవి’ పడ్డ తపన మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వానికన్నా మించింది.
వైద్యం కొరకు మద్రాసులో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా జిల్లెళ్ళమూడి మీద సుబ్బారావుకున్న ప్రేమ అపారం. జిల్లెళ్ళమూడికి వెళ్ళాలనే నిరంతరం తపన. ఈ ఊరి మీద ఈ నేల మీద అతనికున్న ఆప్యాయత అది. అంతర్గతంగా అది అమ్మ మీద అచంచల విశ్వాసం.
‘మంచిగాని చెడుగాని ఏదిస్తే అది నా కరుణ’ అని చెప్పిన అమ్మ మాత్రం తన బిడ్డలకు మరణమంటే భయం లేకుండా చేసింది. జిల్లెళ్ళమూడిలో అమ్మ వద్దకు వచ్చినవారి ప్రత్యేకత అది. సుబ్బారావు అన్నయ్యకు మృత్యువు అంటే భయం లేకుండా చేసి మృత్యుంజయత్వాన్ని ప్రసాదించింది అమ్మ.
విశ్వజనని పెద్ద బిడ్డ. శ్రీ విశ్వజననీ పరిషత్ శాశ్వత సభ్యుడు జిల్లెళ్ళమూడి పంచాయితీ సర్పంచ్ శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు ధన్యమూర్తి. జిల్లెళ్ళమూడి చరిత్రలో అతని పాత్ర మాన్యమైనది – అసామాన్యమైనది.