ఒక ఉపాసకునిగా, అధ్యాపకునిగా, పూజారిగా, అన్నపూర్ణాలయ నిర్వాహకు నిగా, సేవకునిగా, అమ్మతత్త్వ ప్రచారకు విగా, ధాన్యాభిషేక సేకరణకు గ్రామా లలో తిరిగిన వానిగా, అమ్మ ఆలయాలు ఎక్కడ ఉన్నా ఆ ఆలయాల ఉత్సవ ప్రచోదకునిగా శ్రీ ఇనమనమెళ్ళూరి హనుమబాబు గుర్తుకువస్తాడు. హనుమ బాబును అమ్మ మాత్రం “హనుమాన్ బాబు” అని పిలుస్తుండేది.
మొదటిసారి అమ్మవద్దకు 1966లో వచ్చాడు. గుంటూరు సంస్కృత కళాశాలలో చదువుకొనే రోజులలోనే ఒక మిత్రుని ద్వారా జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి విన్నాడు కాని అప్పుడు రావటం పడలేదు. హనుమబాబు స్వగ్రామం ఇటికంపాడు. జిల్లెళ్ళమూడికి దగ్గరే. అతని తల్లి భాగ్యమ్మ గారిది తెనాలి దగ్గరి అంగలకుదురు గ్రామం. మే నెల సెలవలలో బంధువుల ఇంటికి నండూరి వెళ్ళి అక్కడనుండి జిల్లెళ్ళమూడికి నడచివచ్చాడు. అమ్మను చూచాక తనకు పూర్వం ఉన్న రకరకాల భయాలు పడుతుంటే ఇంటికప్వు తనపై పడుతుందే. ఆకాశం నెత్తిపై పడుతుందేమో వంటివి సమసిపోయాయి. ఈ జిల్లెళ్ళమూడి అమ్మే మా అమ్మ ఇదే నా స్వగ్రామం అన్నంత భావన కలిగింది. మామూలుగా తినే అన్నం కన్నా ఆ చింతకాయ పచ్చడి, చారు, నీళ్ళమజ్జిగతో రెట్టింపు అన్నం తిన్నాడు తృప్తి పడ్డాడు. అమృతమయమైన ఒక రుచి. అది జిల్లెళ్ళమూడి స్థల విశేషమో, అమ్మ అదృశ్య హస్తమో అతనికి తెలియలేదు కాని అతని మనసును ఆ రోజు కట్టి పడేసింది.
అయితే హనుమబాబు జిల్లెళ్ళమూడికి స్థిరంగా రావటం ఒక విచిత్రమైన పరిస్థితే – తండ్రి వెంకటకృష్ణయ్య ఆలయ అర్చకుడు. రెక్కాడితే గాని డొక్కాడని. పరిస్థితి. ఆ పరిస్థితిలో పోషణకై హనుమబాబు తల్లి భాగ్యమ్మగారు వంట శేషయ్య గారి వెంబడి వంటలకు వెళ్ళేది. ఆ వచ్చిన ధనంతో ఎలాగోలా కాలక్షేపం చేస్తుండేవారు. 1966లో అకస్మాత్తుగా హనుమబాబు తండ్రి చనిపోయాడు. అనారోగ్యంతో. ఆ సమయంలోనే అమ్మ గుంటూరు శేషయ్య (వంట శేషయ్య గారితో జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయానికి ఒక వంటమనిషిని చూడమన్నది.
అంతకుముందు శేషయ్యగారికి సాయంగా వంటకు వచ్చేదే కనుక భాగ్యమ్మ గారు భర్త సంవత్సరీకాలు అయిన తర్వాత జిల్లెళ్ళమూడి చేరింది. ఆ రకంగా హనుమబాబు వాళ్ళమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడి వచ్చి పోతుండేవాడు.
హనుమబాబు అంతకుముందు గుంటూరు హిందూకాలేజి హైస్కూలులో కొద్ది కాలం తెలుగు పండితునిగా చేసి జిల్లాపరిషత్ పాఠశాలలో పనిచేయటానికి వెళ్ళాడు. పూండ్ల, చందోలు గ్రామాల్లో పనిచేసి బదిలీపై రేటూరు వచ్చాడు. భాగ్యమ్మగారు జిల్లెళ్ళమూడిలోనే ఉంటున్నది కదా! అని జిల్లెళ్ళమూడిలో కాపురం పెట్టి రేటూరు రోజూ పోయివస్తుండేవాడు. 1979లో ఒకరోజు వాత్సల్యాలయంలో అమ్మవద్ద హనుమబాబు కూర్చొని ఉంటే “నీవు ఇక్కడ సంస్కృత కాలేజిలో పనిచేస్తావా?” అని అడిగింది. నాకు భాషాప్రవీణలో ఫస్ట్ క్లాస్ లేదమ్మా అన్నాడు. “సరే చదువుకో నాన్నా! తీసుకుంటారు” అన్నది అమ్మ. సంధ్యావందనాలు, సుప్రభాతాలు, అన్నపూర్ణాలయంలో తల్లి భాగ్యమ్మగారికి సాయం చేయటంలో తీరేదికాదు. అయినా పట్టుదలతో రాత్రిళ్ళు నిద్రమేల్కొని ఎమ్.ఏ. లో 50.5% మార్కులు సాధించుకున్నాడు.
తీరా జిల్లెళ్ళమూడిలో ఒక ఉద్యోగం ఖాళీ వచ్చింది. అదే సమయంలో బి.యల్. సుగుణ ఎమ్.ఏ. ఫస్ట్ క్లాస్ పాసై వచ్చింది. అప్పుడు హనుమబాబు అమ్మతో నాకేదో ఒక ఉద్యోగం ఉన్నది కదమ్మా! ఆ అమ్మాయికి అవసరం. సుగుణకే ఈ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అన్నాడు. అమ్మ చర్యలు ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా ఉంటాయి. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న తూములూరి దక్షిణామూర్తి ఇక్కడ ఉద్యోగం మానుకొని పొన్నూరులో సంస్కృత కళాశాలకు వెళ్ళాడు. ఆ రకంగా ఇద్దరికీ ఉద్యోగాలు ఇక్కడే మన కళాశాలలోనే వచ్చే అవకాశాన్ని అమ్మ కల్పించింది.
అప్పటినుండి హనుమబాబు పూర్తిగా జిల్లెళ్ళమూడి అమ్మ సేవలోనే లభించింది.
కాలేజీ అధ్యాపకత్వంతో పాటు వంటయింటి పనిలో శేషయ్యగారికి, భాగ్యమ్మగారికి సహాయ సహకారాలందించటమే కాక వడ్డనలో, విస్తర్లు తీసివేయటంలో ఆ పని ఈ పని అనిలేదు గుడిలో పూజ ఎంత శ్రద్ధగా చేస్తారో అలా వంటయింటి సేవ చేసేవాడు. అయితే మనసులో ఒక శంక ఉండేది. అంతకుముందు పంచదశి మంత్రం దీక్షతో చేసేవాడు. ఇప్పుడు చేయలేక పోతున్నానే అనేది మనసులో పీకుతుండేది. ఒకసారి లక్ష్మణయతీంద్రులవారి దగ్గరకు అమ్మ సూచన మేరకు వెళ్లాడు. వారి దగ్గర తన సంశయం వెళ్ళగక్కాడు. వారు దానికి సమాధానమిస్తూ “వంట చేయాలి, వంట చేయాలి” అనుకోవటం మంత్రం, వడ్డన చేయడం అనుష్ఠానం. మీరు జపం చేయకపోయినా అనుష్ఠానం చేస్తున్నారు. రామనామం చేయటం జపం, రామునిలా జీవించడం అనుష్ఠానం” అన్నారు. అమ్మ లక్ష్మణయతీందుల ద్వారా వారికి సమాధానం ఇప్పించింది. అన్నపూర్ణాలయ సేవలో ఉంటే అదే జపం, అదే అనుష్ఠానం అనే భావం బలపడింది. తన తల్లి భాగ్యమ్మగారు తన చిన్నప్పటి నుండి పడుతున్న కష్టం చూశాడు కనుక ఆ తల్లికి సాయం చేయాలని జిల్లెళ్ళమూడి వంటశాలకు చేరి ఈ అందరమ్మ తనకు విశ్వకుటుంబంలో పిల్లల కోసం పడుతున్న తపన చూచి తన జీవితాంతం ఈ అమ్మ సేవలోనే ఉండాలనే కృతనిశ్చయంతో పనిచేసేవాడు.
అమ్మ తన చేతులమీదుగా హనుమబాబు పెద్దకూతురు పెళ్ళి చేసింది. అమ్మ ఆలయంలో చేరిన తర్వాత కూడా హనుమబాబు ఇంటి శుభకార్యాలు మరో కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి అన్నీ జిల్లెళ్ళమూడిలో జరుపుకున్నాడు. కాలేజీ నుండి విశ్రాంతి పొందినా అవిశ్రాంతంగా అమ్మ తనకు వప్పగించిన వంటపనిని ఊపిరిగా చేశాడు. జిల్లెళ్ళమూడి ముక్తిక్షేత్రమని అక్కడ పాదరక్షలు లేకుండానే సంచరించేవాడు.
అమ్మను గూర్చి ప్రచార విభాగంలో కూడా షుమారు 25 గ్రామాలలో భజనలు, పాటలు, ఉపన్యాసాలు చెప్పి చెప్పించి అమ్మ ధాన్యాభిషేకానికి ఎంతో సహాయభూతునిగా ఉండేవాడు. అన్నపూర్ణాలయంలో రేపటి కెట్లా అన్న సందర్భాలుండేవి. అయితే తెల్లారేటప్పటికి ఏవేవి ఎంతెంత కావాలో అన్నీ సమకూ రేవి. అన్నపూర్ణాలయం అమ్మ గుండె. అది నిరంతరం కొట్టుకుంటుంది. అది అవిచ్ఛిన్నంగా నిరంతరంగా చైతన్యవంతంగానే ఉంటుంది. అది నా అనుభవం అనేది హనుమబాబు విశ్వాసం.
20.9.1945న జన్మించిన హనుమబాబు అనారోగ్యంతో చివరి రోజులలో కొంత బాధపడ్డా అమ్మ అనుగ్రహంతో పిల్లలందరినీ సమర్థవంతంగా జీవించే అవకాశం చేసి 4.10.2011న జిల్లెళ్ళమూడిలో అమ్మలో ఐక్యమైనాడు.
జిల్లెళ్ళమూడిలో ‘అందరికీ సుగతే’ అన్న అమ్మ సూచనను స్వీకరించి జిల్లెళ్ళమూడిలో తమ అంత్యక్రియలు జరగాలి అనుకునేవారికి ‘సుగతిపథం’ అనే భవనాన్ని అందరి సహాయ సహకారాలతో నిర్మింపచేశాడు. ప్రతి ధనుర్మాసంలో పౌరాణికునిగా తిరుప్పావై ప్రవచనం చేసేవాడు. కార్తీకమాసంలో కార్తీకపురాణం చెప్పేవాడు. కార్తీక భోజనాలు అమ్మాలయం వద్ద ఏర్పాటు చేసేవాడు. సప్తసప్తాహలకు సారధ్యం వహించేవాడు. నామ సంకీర్తన చేసేవాడు. ఒకటేమిటి బహుముఖీనమై ప్రజ్ఞతో జీవించాడు. ఆ హనుమాన్ రామదాసు అయితే, నిజంగా హనుమబాబు అమ్మదాసుడు – ధన్యజీవి.