(భద్రాద్రి రామశాస్త్రి)
రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారు గుంటూరు నివాసి. సంప్రదాయ వైదిక కుటుంబంలో పుట్టి వేదాధ్యయనం చేసిన పండితుడు. కవిత్వము వేదాంతము అధ్యయనము చేసినవాడు. మంచి వ్యాకరణవేత్త. కాశీ కృష్ణాచార్యులు, పళ్ళెపూర్ణప్రజ్ఞాచార్యులు వంటి పండితులతో కలసి తిరిగినవాడు. గుంటూరు ఎ.ఇ.యల్.యం. కాలేజిలో ఆంధ్ర అధ్యాపకులుగా పని చేశారు. వీరు సర్వధారినామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి (1886) లో వెంకట శివావధాని సీతమ్మలకు జన్మించారు. 1960 సంక్రాంతి నాడు మొదటిసారి అమ్మను దర్శించుకున్నారు. అమ్మ వద్దకు రాకముందే శ్రీ రామచంద్రశతకము, మహేశ్వరీ శతకము, సీతారామ కళ్యాణము (ప్రబంధము), శివనారాయణ స్తవము మొదలగు గ్రంధాలు వ్రాశారు. ప్రబంధకవి – చతుర్విధ కవితా ధురీణుడు, చిత్రకవి, శ్లేషకవి, ప్రౌఢకవి అనే బిరుదులు పొందారు. బంధ, గర్భ, చిత్ర, శ్లేష కవిత్వములు చెప్పుటలో దిట్ట.
గాయత్రీ స్థగిత – రామాయణార్థక “అనసూయా స్తోత్రాన్ని రచించారు. అందులో అమ్మదయా విశేష సన్నివేశాలను చిత్రీకరించారు. “ముకుందమాల” అను కంద పద్యాలను వ్రాశారు. అమ్మ ఇచ్చిన అనుభూతులను “మానస బోధగా” రచించారు. అమ్మను గాయత్రీ మాతగా ఆరాధిస్తూ ‘మాతృశ్రీ’లో వ్యాసాలు వ్రాశారు.
అమ్మను చూచిన నాటి నుండి అమ్మ వద్ద ఉండాలనే తపన పెరిగిపోయింది. అమ్మ చరణాలకు అంకితమై అమ్మ వద్దే ఉన్నారు. 1966లో అమ్మ సంస్కృత పాఠశాల పెట్టి భద్రాద్రి తాతయ్యనే ఉపాధ్యాయునిగా ఏర్పాటు చేసింది. ‘హైమ’ అంటే వారికి చాల ఇష్టం. విద్యాసాగర్ గారి పిల్లలు ఝాన్సీ, సావిత్రి, హైమలు కూడా ఆ రోజుల్లో భద్రాద్రి తాతయ్య వద్ద సంస్కృతం నేర్చుకొని జిల్లెళ్ళమూడి వెళ్ళిన అందరినీ సంస్కృతంలో పలకరిస్తుండే వాళ్ళు. హైమ వారి ప్రియశిష్యురాలు. సంస్కృతం నేర్చుకున్నది. బుద్ధిమంతురాలు, తెలివిగలది, నెమ్మదస్తురాలు అని చెపుతుండే వారు హైమను గూర్చి.
ఒకసారి అమ్మ మంచం మీద అమ్మ ప్రక్కనే హైమ దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నది. తాతగారు వచ్చి అమ్మ పాదాలనుకొని హైమపాదాలకు నమస్కరించారు. హైమ తన పాదాలు ఎవరో ముట్టుకున్నారని చూస్తే భద్రాద్రి తాతగారు. “ఈ పాదాలు నావి తాతగారూ! అమ్మవి కావు” అని చెప్పింది. అప్పుడు |అమ్మ “ఏపాదాలకు నమస్కరించినా నాకే చెందుతవిలే అయినా ముందు ముందు ఆపాదాలకే నమస్కరించే రోజు వస్తుంది” అన్నది. అమ్మది తోలు నోరు కాదు కదా తాలుమాట రావటానికి? ఆ తర్వాత హైమ 1968లో దేవాలయంలో ప్రవేశించటం, ఆ ఆలయానికి భద్రాద్రితాతగారే ప్రథమ పూజారి కావటం యాదృచ్ఛికం కాదు. అమ్మ నిర్ణయంలో భాగమేననుకుంటాను. నిత్యము రుద్రాభిషేకము సహస్రనామ పూజలు హైమకు చేసేవారు శాస్త్రిగారు.
హైమను గూర్చి ఒక శతకం వ్రాశారు. అందులో హైమ దయామూర్తి అని, పతితజనోద్ధరణ తత్పరమతి అని, వేదములచే కొనియాడ దగినదని స్తుతించారు చూడండి.
“అతిభక్తిన్ యజియించుచుండెద మహాయాగక్రమారాధ్యయై
పతితోద్ధారణ తత్పరత్వమతియై భాస్వద్దయామూర్తియై
శ్రుతి సంస్తోత్రి మహాప్రభావనిధియై శోభిల్లియున్ మానవా
కృతి కన్పట్టుచు దైవతం బయిన శ్రీ గీర్వాణి హైమావతిన్ !”
ఒక దీపంతో మరొక దీపం వెలిగిస్తే రెండింటికీ తేడా కన్పించదు. అలాగే నీవు అమ్మ ఒకటే.
“అమ్మకును నీకు సుంత భేదమ్ము లేదు.
దీపమున దీపమొదలింప తేజమందు
రెండు దివ్వెల భేదంబు లుండబోవు” అన్నారు.
తాను పాఠాలు చెప్పిన గురువైనా హైమను ఆరాధించిన మహనీయుడు. నేను నీ బిడ్డను నన్ను వదిలి పెట్టబోకు. నీప్రేమ నాపై ప్రసరింప చేయమని వేడుకుంటారు.
హైమ వారి వద్ద చదువుకుంటున్న రోజులలో భద్రాద్రి తాతగారు అనారోగ్యంతో చిక్కిపోతే అమ్మతో “తాతగారు బాగా చిక్కిపోయారు – చూడమ్మా!” అని హైమ చెపితే అమ్మ నవ్వుకున్నది. వారి కన్నా ముందే హైమ ఆలయంలో చేరి వారిచేతే పూజలందుకున్నది.
మొదట్లో కవిగా, పండితునిగా బంధ, గర్భ, చిత్రశ్లేషాదులు బిగించి “అనసూయాస్తవము” వ్రాశారు. అది సామాన్యునకు అర్థంకావటం లేదని వారే భావించి తేలికగా ద్రాక్షాపాకంతో ఉండే విధంగా ‘గీతాంజలి’ అనే పేరుతో ఒక శతకం వ్రాశారు. అందులో అమ్మ మహిమ తెల్పటానికి వేదాలే వెనుకాడుతాయనీ, ఏమి చదువు సంధ్యలు రాని వాడు కూడా అమ్మ పాదాలకు మ్రొక్కితే మోక్షాన్ని పొందుతాడని, అన్యధా శరణం నాస్తి అని అమ్మను దర్శిస్తే చాలు వారి చింతలన్నీ పోగొట్టి ఓదార్చి శాంతిని ప్రసాదిస్తుందనీ, చెడ్డవాడ్ని మంచి వాడ్ని సమదృష్టితో ప్రేమించే కరుణార్ద్ర సుగుణ స్వభావనీ ఎన్నో రీతులలో ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ అనే మకుటంతో శతకం వ్రాశారు. జిల్లెళ్ళమూడిని కాశీగా ప్రక్కనే ప్రవహించే ఓంకారనది (మురుగు కాల్వ) గంగానదియనీ, వాకిట్లో ఉన్న కుక్కే కాలభైరవుడనీ, పర్ణశాలే దేవాలయమనీ, అమ్మ అపర్ణ అనీ, భక్తులంతా మునులు, ఋషులనీ మొత్తం ఇది పవిత్రమైన వారణాసీ క్షేత్రమని భావించి వర్ణించి తరించారు. తనకు జన్మలేదని విశ్వసించారు. “అమ్మ మంత్ర ముపాసించి అలరునేను – పొందనిక జన్మ జిల్లెళ్ళమూడి అమ్మ” అని ఎంతో ధైర్యంగా విశ్వాసంతో అమ్మతోటే చెప్పగలిగారు. మంత్రం అంటే ఏమిటో అమ్మతో చర్చించి చివరకు సర్వం సర్వానికీ ఆధారం అని గుర్తించి, అన్ని భూతాలలోనూ ఉన్నది ఒకటే అని విశ్వసించి, ఆబ్దికంనాడు పోయిన పెద్దలందరినీ తలచుకొని అగ్నిహోత్రంలో ఒక ముద్దవేసి మనం తినటమే అని అమ్మ చెప్పిన కూటమని నమ్మి ధన్యుణ్ణి అయినానన్న మహనీయుడు. అమ్మ ఇదంతా విన్నా వినకపోయినా ధన్యుడివే అనిపించుకొన్న విశిష్టవ్యక్తి.
ఆయన మరణంలో కూడా ఒక విశిష్టత ఉన్నది. తాను మరణించినపుడు తనను దహనం చేయవద్దని ఖననం చేయమని తన వీలునామాలో వ్రాసి పెట్టారు. విచిత్రంగా వారు మరణించిన రోజున తుఫాను వచ్చి ఎడతెరిపి లేని వర్షాలు. శ్రీ భోరున కురిసే వర్షాలలో వారిని దహనం చేయాలన్నా ఇబ్బందే. శాస్త్రప్రకారం దహనం చేయాలి. కాని వారి వీలునామా ప్రకారం ఖననం చేశారు. హైమను, అమ్మను ఆరాధించిన ఆ మహనీయునకు మూడవ నేత్రం (జ్ఞాననేత్రం) వికసించి అలా వ్రాశారో, లేక అందరికి సంకల్పాలు ఇచ్చే అమ్మే వారికి ఆ ఆలోచనను కలిగించిందో చెప్పలేం.
ఏమైనా భద్రాద్రి రామశాస్త్రిగారు తను, మన, ధనాలతో అమ్మను ఆరాధించి, హైమను సేవించి సర్వసమర్పణ చేసి తరించిన ధన్యజీవి.