1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు

ధన్యజీవులు

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 6
Month : October
Issue Number : 4
Year : 2007

(ఎక్కిరాల భరద్వాజ)

ఎక్కిరాల భరద్వాజ ‘సాయిమాష్టర్’గా ఆంధ్రదేశంలో ప్రసిద్ధుడు. సాయిబాబా దివ్యచరిత్రను వ్రాయటమేగాక వివిధ ప్రదేశాలలో సాయి మందిరాలు నిర్మించి చాల మంది ప్రజలను షిరిడీకి తీసుకొని వెళ్ళిన సాయి మార్గ ప్రచారకునిగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. 1963 మొదట్లో అన్నగారైన వేదవ్యాస్ తో కలసి అమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడి వచ్చాడు. ఆ సమయాన అమ్మ అందరికీ, పాయసం ప్రసాదంగా పంచుతున్నది. భరద్వాజకూ పెట్టింది. దానిలోని విశిష్టత వారిపై ప్రభావం చూపించి కొన్ని సంవత్సరాలు జిల్లెళ్ళమూడిలో ఉంచింది.

ఎక్కిరాల అనంతాచార్యులవారు సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము భాషలలో పండితులు. ఆయుర్వేదము, వేదాంతము, జ్యోతిషము వంటి శాస్త్రములలో నిష్ణాతులు, వారి సంతానంలో నలుగురు కుమారులు ఆయా రంగాలలో ప్రసిద్ధులే. ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు జగద్గురు పీఠం స్థాపించి ప్రపంచంలో 40 దేశాలలో దాని కేంద్రాలు స్థాపించి భారతీయ ధర్మచైతన్యాన్ని వ్యాపింప చేశారు. అలాగే ఎక్కిరాల వేదవ్యాస కూడా మరొక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి జాతి చేతనకు వారిసేవ వారు చేస్తున్నారు. బోధాయ మాధ్యం ఆయుర్వేద హోమియో వైద్యాలు వంటబట్టించుకొని ప్రజలకు వారి సేవ వారు చేస్తున్నారు. భరద్వాజ షిరిడీ సాయిబాబాను ఉపాసిస్తూ ఆ మార్గంలో ఎందరినో తరింప చేయటానికి ప్రయత్నించాడు. ఎందరికో ఆచార్యుడు ఆరాధ్యుడు అయినాడు.

నిరంతర సత్యాన్వేషి అయిన భరద్వాజ ఎందరో సాధువులను సంతులను దర్శించాడు. ఎన్నో క్షేత్రాలను చూచాడు. అమ్మ, రమణమహర్షి, షిరిడీ సాయిబాబాల ప్రభావం అతని మనసుపై చెరగని ముద్ర వేసింది. అతని సునిశిత పరిశీలన, అతని రచనల ద్వారా బోధల ద్వారా అవగతమవుతుండేది. అతను దర్శించిన ఎందరో మహనీయులను గూర్చి ఎన్నో గ్రంధాలు వ్రాశాడు. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి ఇంగ్లీషులో తెలుగులో కూడా ఎన్నోరచనలు చేశాడు. అవి ఇంగ్లీషులో తెలుగులో గ్రంధాలుగా వెలువడ్డాయి. వాటి ద్వారా పరిశీలిస్తే అతను అమ్మ సన్నిధిలో, అమ్మతో సంభాషణలలో, అమ్మతో ఉన్నవారి అనుభూతులతో ఎలా ప్రభావితుడైనదీ మనకు తెలుస్తుంది. తను చిన్నతనంలోనే తల్లిలేని పిల్లవాడుగా ఎలా పెరిగింది, దానిని అమ్మ వద్ద ఎలా భర్తీ చేసుకోగలిగిందీ తెలుస్తుంది. అమ్మ వద్ద గడపిన నాలుగైదు సంవత్సరాలలో వారు పొందిన ఆనందము తృప్తి తక్కువ కాదు. అమ్మ సంస్థ నుండి వెలువడిన ఆంగ్ల మాసపత్రికకు కొన్ని సంవత్సరాలు సంపాదక వర్గంలో ఉన్నాడు కూడా.

అమ్మ ఒకసారి తన పాదాలకు తానే పూజచేసుకోవడం చూచిన భరద్వాజలో విచికిత్స మొదలైంది. దైవము తానే, జీవుడుతానే, బుద్ధితానే, ప్రేరణతానే, భక్తితానే అయిందన్నమాట. భక్తుడి దృష్టిలో భగవంతుని ధ్యానిద్దామన్న సంకల్పం తాను, సంకల్పంకల మానవుడూ తానే. అందుకే అమ్మ “దైవ సంకల్పం కాదు సంకల్పమే దైవం” అన్నది అజ్ఞాని దృష్టిలో దైవం వేరు, తాను వేరు. కాని దైవం దృష్టిలో భక్తుడు, భక్తి, పూజ అన్నీ తానే అయి ఉంటాడు. అదే అమ్మ తన పాదాలకు తాను పూజ చేసుకోవటంలోని భావం అనుకుంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి మేము నీ పాదపూజ చేసుకుంటామమ్మా! అని అడిగితే అమ్మ భరద్వాజతో “అసలు జంటే ఏమిటి నాన్నా!” అని అడిగింది. వారు తన మనసులో జరిగిన ఆలోచనలన్నీ క్రోడీకరించుకొని “జరిగేదంతా పూజేనేమో! సృష్టే పూజేనేమోనమ్మా!” అన్నాడు. ‘అంతేగా!’ అన్నారు అమ్మ వారి కిచ్చిన ఆలోచన తనిచ్చిందే అని గుర్తుచేస్తున్నట్లుగా. అమ్మ తనకు తానే పూజచేసుకుంటుంటే ఎదుట ఉండే సర్వసృష్టిలోనూ తనను చూచుకోగలగటమేగా. దీన్ని అమ్మ బింబప్రతిబింబన్యాయం అని చెప్పింది. అందుకే ఆత్మకు ప్రతిబింబమేగా జగత్తు.

సర్వాలంకార భూషితయై అమ్మ ఉంటే, అమ్మకు అలంకారా లెందుకు? అందుకే అమ్మకిరీటాన్నెవరో దొంగిలించారట అని అనుకునే వారున్నారు. అమ్మ వీటిని గూర్చి చెపుతూ “కళంకరహితమైనదే అలంకారం నా కిరీటాన్ని ఎవరో దొంగిలించలేదు. అది ఒకరు పెడితే వచ్చింది కాదు, ఒకరు తీస్తే పోయేదీ కాదు” అన్నది అమ్మ. భారద్వాజ ఈ విషయాన్ని వివరిస్తూ అమ్మ అన్నీ అయి అర్థం కాని, ఆద్యంతములు లేనిదై, ఆద్యంతమంతా అయి. అడ్డులేనిదీ ఆధారమైనదీ. కావటమే అలంకారం. అమ్మలోని సర్వత్వం కిరీటం, సర్వకారిణి కావటమే. గాజులు. ఉంగరాలు, తన నడకే సృష్టినడకై, సర్వాన్నీ తన పాదాలలో ధరించడమే. బంగారు మెట్టెలు, పట్టాలు. తానే మూడై మూడూ ముడి వేసుకొని త్రిపుటి అయి త్రిపుర సుందరికావటమే కేశాలంకరణ, శబ్ద రూపిణియై సర్వసృష్టినీ వాక్కుగా చేసుకోవడమే కంఠాభరణాలు, సృష్టిస్థితిలయలు తన ఉచ్ఛ్వాస నిశ్వాస సంధులుగా శ్వాసల్లో సర్వకాలాన్నీ బంధించింది కనుకనే ఆకాశంలో వ్రేలాడే బ్రహ్మాండంలా అమ్మ బులాకీ. ఆభరణాలు ఎవరూ అర్పించక ముందే అమ్మకు సహజాలంకరణలై ఉన్నాయి అమ్మకు అంటారు.

భరద్వాజకు సాధన చేయటమంటే చాల ఇష్టం. అమ్మ వద్దకు వచ్చేవారు, అమ్మ వద్ద ఉన్నవారు ఇంతటి దివ్యమూర్తి సన్నిధిలో ఉంటూ కూడా ఏ సాధనా చేయకుండా మామూలు కార్యక్రమాలలో కాలం వృధా చేసుకుంటున్నారేమీ? అని అనుకుంటుండేవాడు. దానికి అమ్మే ఒకసారి సమాధానం చెప్పింది. “ఏ కొండల్లోకో అడవుల్లోకో పారిపోయి అక్కడ కళ్ళూ ముక్కూ మూసుకొని ఏకాగ్రతకోసం విఫలప్రయత్నం చేయటం, సృష్టిలో సహజసిద్ధమైన స్త్రీపురుష సంబంధాన్ని అణచుకోలేక తపో భంగం పొందేకంటే ఈ ఆవరణలో ఎప్పుడూ అమ్మను ప్రేమిస్తూ, అమ్మ నామాన్ని ఉచ్చరిస్తూ, సోదర ప్రేమలోనూ, సేవలోనూ, సంపూర్ణ మానవత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిత్యకార్యకలాపాల్లో వాళ్ళ దేహాలను దగ్ధంచేసే వీరి తపస్సు చాల సుగమం, సులభం, పతనానికి తావులేనిది. ఈ దృక్పథంతో చూస్తే సర్వత్రా విజ్ఞానాన్ని పొందవచ్చు” అన్నది. 

ఒక రోజు భరద్వాజ అమ్మ చాల మందితో మాట్లాడుతుండగా నమస్కారం చేసుకోవటానికి వెళ్ళాడు అమ్మ వద్దకు. నమస్కారం చేసుకొని వెడతాను అన్నాడు. ఏ ఊరు? నవ్వుతూ అడిగింది అమ్మ. ఈ ఊరే అన్నాడు భరద్వాజ “ఈ ఊరికైతే ఒక్క కాల్చాలు” అన్నది. అమ్మ అలా అన్నదేంటి? అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ అమ్మ అదే మాట “ఈ ఊరుకు ఒక్క కాల్చాలు” అన్నది. అప్పుడు స్ఫురించింది. భరద్వాజకు. ఇంగ్లీషులో ‘కాల్’ అంటే పిలుపు అని అర్థం కదా! అంటే అమ్మ సంకల్పంలో ఒక్కసారి రమ్మని పిలిస్తే మనమింక జిల్లెళ్ళమూడి మళ్ళీ మళ్ళీ వెళ్ళక తప్పదని అర్థమయింది వారికి.

అమ్మ మహాత్మ్యాలు చెయ్యదు. ఒకవేళ జరిగినా వాటి పట్ల తన కర్తృత్వాన్ని అంగీకరించదు. ఒకసారి భరద్వాజ అమ్మను అడిగాడు. అమ్మా! నీ వల్ల జరిగే మహాత్మాలను నీవు చేసినట్లు అంగీకరించ వెందుకని? అట్లా చేస్తే మాకు నమ్మకం భక్తీ బాగా వృద్ధి పొంది మేం బాగుపడతాం కదా? అని. అమ్మ దానికి సమాధానం చెపుతూ “సరియైన నమ్మకం అలాంటి వాటివల్ల కలుగదు నాన్నా! వాటి ననుసరించి ఏర్పడ్డ నమ్మకం అట్లా జరుగని మరుక్షణం సడలి పోతుంది. సరైన నమ్మకం ప్రేమలా నిర్హేతుకంగా ఏర్పడుతుంది. తరుణం వచ్చినప్పుడు, అంటే నీ కేర్పడడం అవసరం అని నా కనిపించినప్పుడు” అన్నది. భరద్వాజకు అమ్మ తాత్కాలికంగా అమ్మ తన నోరు మూయించడానికి ఆ సమాధానం ఇచ్చింది అనుకున్నాడు కాని తర్వాత బైబిల్ చదివినప్పుడు క్రీస్తు తనను విశ్వసించని ధామస్తోతో “నీవు నన్ను చూచావు గనుక నమ్మావు కాని నన్ను చూడకనే నమ్మినవారు ధన్యులు” అన్నమాటతో, అమ్మ చెప్పిన మాటలలోని సత్యం అర్థం చేసుకున్నాడు.

ఒక సందర్భంలో అమ్మ “నేను గురువును కాను మీరు శిష్యులుకారు, నేను తల్లిని మీరు బిడ్డలు” అన్నది. భరద్వాజ ఈ మాటను ఎవరి ద్వారానో అమ్మ సద్గురువునుకాను” అన్నదని విని అమ్మను అడిగాడు, అమ్మ దానికి “నేను సద్గురువును కాదని అనలేదు. గురువును కానని మాత్రమే అన్నాను. సద్గురువు అంటే నా ఉద్దేశందైవమనీ. నేను గురువును కాదు అన్నప్పుడు నా ఉద్దేశం ఈనాడు సంఘంలో ‘గురువు’ అన్నపదం బహుతేలిక అయినదని” అన్నది.

అమ్మ ఆహారం ఏమీ తీసుకోదు. పిల్లలు బలవంతం చేస్తే కాఫీ రెండు మూడు సార్లు తీసుకుంటుంది తప్ప. భరద్వాజకు ఒక అనుమానం. ఎందరో బలశాలులైన తన బిడ్డలను ఆశ్చర్యచకితుల్ని చేసే ఇంత శక్తి సామర్థ్యాలెక్కడివి. అమ్మకు? అని. దానికి సమాధానంగా అదే సమయంలో అమ్మ దర్శనానికి ఒక కుటుంబం వచ్చింది. వారిలో ప్రసంగవశాన అమ్మ “కొందరు ఏం చేసుకున్నా నాకు పెట్టిం తర్వాతే తిందామనుకుంటారు దూరదేశాల్లో ఉన్నా. కానీ జిల్లెళ్ళమూడి బయలు దేరే తొందరలో వాళ్ళ పిల్లలకు ఇడ్లీ పెట్టాలన్న ఆతురతలో పచ్చడిలేని ఇడ్లీ నాకు పెట్టి, వాళ్ళ పిల్లలకు మాత్రం చక్కగా నేతిలోంచి పచ్చడినలిపి పెట్టారు. నాకేమో ఒట్టివి తినడం కష్టమైపోతున్నది” అన్నది. ఆకుటుంబం అమ్మకు పదేపదే నమస్కారం చేసుకున్నారు. కళ్ళవెంట నీరు కారుతుండగా. ఆ సంభాషణ పొడుగునా అమ్మ వారినే సూచిస్తున్నదని భరద్వాజకు తెలిసింది అప్పుడు. ఇటువంటి అనుభవమే భరద్వాజకు కూడా కలిగింది. 19.8.1964 అమ్మ దగ్గరకు తాను వచ్చిన రోజని క్షీరాన్నం చేయించి అమ్మకు నివేదన ఇచ్చాడు భరద్వాజ. పెద్ద గిన్నె నిండా పరమాన్నం ఉన్నది. పొయ్యి మీద నుండి అప్పుడే తేవటం వల్ల పొగలు వస్తూ చాల వేడిగా ఉన్నది. సాధారణంగా అమ్మ ఒక చుక్క నోటిలో వేసుకొని మిగిలింది అందరికీ పెట్టమని ఇచ్చేస్తుంటుంది. ఈసారి మాత్రం ఆ వేడి వేడి పాయసాన్ని తినటం మొదలు పెట్టింది. పరధ్యానంగా గిన్నెలోని పాయసమంతా ఆరగించింది.

బాగా తినగలవాళ్ళకు ఎక్కువయ్యేంత పాయసమది. తాను తినేటప్పుడు తిను ఇంకొంచెం తినమ్మా!’ అని ఒక పసిపిల్లకు తినిపించినట్లు మాట్లాడింది. అంతా తిన్న తర్వాత “అంతా అయిపోయిందే! నీవేం తింటావు” అంటూ ఖాళీ గిన్నెలో చెయ్యి కడుగుకొని “నువ్వు ఇది తీసికో” అన్నది. ఎక్కడో అరణ్యాల్లో ఉండి అవసరాలు గమనించేందుకు ఎవరూ లేనివారిని ఎవరు చూస్తారు?” అన్న అమ్మ మాటలలోని నిగూఢమూ అసంపూర్ణమూ అయిన వాక్యంలోని సంకేతార్థం భరద్వాజకు బాగా అర్థమైంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు కదా! ఆ దేవుడే అమ్మ కదా?

అమ్మ వద్దకు వచ్చే చాల మంది ఎందుకని వెక్కివెక్కి ఏడుస్తుంటారు? భరద్వాజకు సందేహం కలిగి అమ్మనే ప్రశ్నించే సాహసం చేశాడు. చాలాసార్లు సమాధానం చెప్పటం దాటవేసేది. ఒక్కొక్కసారి “ఎదుటి వ్యక్తిలో మంచితనాన్ని

చూస్తే ఏడుపొస్తుంది” అని ఏదో ఒక సమాధానం యివ్వటానికి చెప్పినట్లు చెప్పేది. అసలు కారణం చెప్పమని గట్టిగా ప్రాధేయపడ్డాడు భరద్వాజ. అప్పుడు అమ్మ “పుట్టగానే పసిబిడ్డ ఎందుకు ఏడుస్తుందో అదే కారణం దీనికి కూడా” అన్నది. దర్శనంతో వారి ఆంతర్యం పునరుద్భవించినట్లా? అని ఎవరో అనగా “అవును. నిజానికది విచారం కాదు. అంతకన్నా మంచిపదం దొరకక ఏడవటం అంటున్నాం”. అన్నది. భరద్వాజకు అలా అశ్రువులకు లోనుకాని, వాటిని అదుపులో ఉంచగలననే ధీమా ఉండేది. ఆ విధంగా అమ్మతో చెప్పాడు కూడా. కానీ అది ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పోయాడు. ఒకసారి వేదికపై ఉన్న అతని వైపు చూచింది. భావావేశం కట్టలు త్రెంచుకొని బయట పడుతున్నట్లున్నది. కావాలని అమ్మ భరద్వాజ వైపు చూడ కుండా దృష్టి మళ్ళించింది. కాసేపయింతర్వాత మళ్ళీ చూచింది. ఆ చూపులో ఏమహత్తున్నదో అతని కళ్ళనిండా నీళ్ళు నిండాయి. గొంతు గద్గదమైంది. అశ్రువులు నరికట్టే ప్రయత్నంలో మనస్సు బిగుసుకుపోయింది. అప్పుడు అమ్మ తన దృష్టి భరద్వాజపై నిలిపింది. కళ్ళనుండి, అశ్రువులు ధారాపాతంగా కురిశాయి. అతనిలోని పట్టుసడలి చాల హాయిని అనుభవించాడు. నిజంగా నియమనిష్టలతో ఏ సాధన చేయలేని వారిని అమ్మ స్పృశింపగానో, అమ్మ ఒక మాట పలికితేనో తీవ్ర భక్త్యావేశం, ఆధ్యాత్మికోన్నతికి తీసుకొని వెళ్ళుతుందంటే అది అమ్మ అనుగ్రహమే. ఇదే అమ్మ వద్ద కన్నీటిలోని దివ్యత్వం. అమ్మ యొక్క అదృశ్యోపదేశం ప్రాప్తిస్తుంది. అంతరంగ శాంతి లభిస్తుంది. వ్యక్తుల జీవితాలలో అమ్మ ప్రభావంతో వారికి తెలియకుండానే ఒక నూతన పంథాలో ప్రయాణం మొదలవుతుంది.

అమ్మ ఒకసారి “ముక్తి పొందేది కాదు. నిర్ణీత సమయంలో దైవ సంకల్పం చేత అనుగ్రహింప బడుతుంది. కావలసిన అర్హత కూడా దానంతట అదే వస్తుంది. మానవ ప్రయత్నం వల్ల వస్తుందని తెలియని వారనుకుంటారు” అన్నది. దానికి భరద్వాజ “ప్రతిచిన్న విషయమూ పూర్వమే అంతా నిర్ధారణ అయిపోయి అంతమార్చలేనిదే అయితే జరుగుతున్న అద్భుతాలకు అర్థమేమిటి? మహర్షులు, ప్రవక్తలు మరణించినవారిని పునరుజ్జీవింప చెయ్యలేదా? దైవ సంకల్పం కూడా మానవ రూపంలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. దైవం తన నిర్ణయాన్ని తాను తప్పక మార్చ గలిగి తీరుతుంది. లేకపోతే అది సర్వోత్కృష్టమే కాదు కదా” అని అమ్మను

అందుకు అమ్మ “దైవం తన నిర్ణయాన్ని మార్చగలదు. తాను కావాలను కున్నప్పుడే అలా జరిగేది. తన సంకల్పం మార్చుకోగోరితే అది సంకల్పమే కాదు. సర్వోత్కృష్టమే కాదు. మనకు లాగే ఒక కల్పన అవుతుంది. అయినా మీరు చెప్పే అద్భుతాలు అద్భుతాలే కాదు నా దృష్టిలో. సృష్టికి మించిన అద్భుతమేమున్నది? అద్భుతాలనబడే ఆ సంఘటనలు కూడా ముందుగా నిర్ణయింపబడినవే” అన్నది.

వీటన్నిటి కన్నా జిల్లెళ్ళమూడిలో భరద్వాజను కట్టిపడేసిన అంశం మరొకటి ఉన్నది. 1942లో భరద్వాజకు 4వ ఏట తల్లి చనిపోయింది. ఎన్నో కొన్ని సంఘటనలు మాత్రమే అతని మనస్సుపై చెరగని ముద్రవేసాయి. తల్లికోసం తనెప్పుడూ ఏడ్వలేదు. అయితే తనను పూర్తిగా అర్థం చేసుకో గలిగే వ్యక్తి మళ్ళీ కనబడదు అని మాత్రం అనిపిస్తుండేది అతనికి. కాని ఆ ఆలోచనలకు భిన్నంగా జిల్లెళ్ళమూడిలో “హైమ” కనిపించింది. తనను కన్నబిడ్డగా ఆదరించే పరిపూర్ణ మాతృత్వంగా నిలిచింది. హైమ అత్యంతము ప్రేమించి లాలించిన ఆటవస్తువు భరద్వాజ. భరద్వాజ కోరుకున్న తల్లి కాదు హైమ హైమ కోరుకున్న బిడ్డ భరద్వాజ. భరద్వాజ తనకు తెలియకుండా తాను అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, బైటకు కనపడకుండా లోలోపల అంతర్గతంగా అనుభవిస్తున్న విచారాన్ని పోగొట్టాలని కోరుకున్నది హైమ. తానొక తల్లియై మూడేండ్ల బిడ్డకు తల్లి ఎలాటి సేవ చేస్తుందో ఆ సేవలన్నీ నీళ్ళు పోయటం, అన్నం పెట్టటం, తలదువ్వటం, ఒడిలో పడుకో బెట్టుకుని లాలించటం, నిద్రపుచ్చటం, భరద్వాజకు తానే చేయాలని హైమకోరుకున్నది. భరద్వాజతో ప్రమేయం లేకుండా “నా బాబు లాగా పెంచుకోవటం నీకు కాకపోయినా నాకు అవసరం. ఆ ఆలోచన వస్తే చాలు నా హృదయంలోని ఒంటరితనం, విచారము దూరమైపోతాయి. నిన్ను చూచిన నాటి నుండి నీపై మమత పెరుగుతూనే ఉన్నది. నీతో మాటాడకముందే నిన్ను చూచాను. నీ గురించిన ఆలోచనలు వదిలి పెట్టటం నాకు సాధ్యం కావటం లేడు” అని తన మాతృత్వ మమకారాన్ని క్రుమ్మరించింది. ఆ మాటలు కాదనగల సాహసం చేయలేక పోయాడు భరద్వాజ. హైమసాన్నిధ్యంలో మళ్ళీ శైశవాన్ని బాల్యాన్నీ గడుపగల అదృష్టాన్ని పొందాడు.

హైమదేవాలయంలో చేరిన తర్వాత జిల్లెళ్ళమూడి వదిలి వెళ్ళాలని ఆలోచిస్తుండగా భరద్వాజతో అమ్మ “నీలో హైమను చూచుకుంటాను. – దాని అపేక్షకి ప్రియమైన వాడివి నువ్వు. నీ జాగ్రత్త నేను తీసుకోవాలని తన చివరి మాటగా నాకు చెప్పింది. హైమకు ప్రియమైన జాగ్రత్త తీసుకోవటంలో నాకానందం కనుక నిన్ను ఉండమంటున్నాను” అన్నది.

నిజమే ఎవరి జాగ్రత్తనైనా అమ్మకన్నా ఎవరు తీసుకోగలరు. భరద్వాజ నిజంగా ధన్యజీవి. జిల్లెళ్ళమూడి సోదరియైన రాజుబావ చెల్లెలు మంగను వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు ఒక కూతురు.

చిరంజీవియై ఎందరి హృదయాలలోనో మెదులుతూనే ఉన్నాడు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!