1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు

ధన్యజీవులు

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 7
Month : July
Issue Number : 3
Year : 2008

(పరుచూరి వీరయ్యచౌదరిగారు మహాలక్ష్మమ్మగారు )

వీరయ్యచౌదరిగారు రాష్ట్ర రెవెన్యూ విభాగంలో తహసిల్దారుగా పనిచేశారు. నర్సరావుపేటలో ఉండగానే అమ్మను. గూర్చి విని వారి భార్య మహాలక్ష్మమ్మ గారితో కలిసి దర్శించారు. నాన్నగారు. జిల్లెళ్ళమూడి కరణంకావటంతో వీరయ్యగారిని గౌరవంగా చూసేవారు. కాని నాన్నగారి యెడల వీరయ్యగారికి గౌరవము భక్తి. మహాలక్ష్మమ్మగారు, వీరయ్యగారు ఒకరికన్నా ఒకరు అమ్మ యెడల అత్యంత విశ్వాసము భక్తిశ్రద్ధలు కలవారు.

తాను చేసే ఉద్యోగముపట్ల కర్తవ్య పరాయణులై మెలిగే వీరయ్యగారిని కలెక్టర్లు సైతం గౌరవించేవారు. వృత్తిని కూడా దైవంగా భావించే వారాయన. ఏ పనిచేసినా అది అమ్మపనే అనే భావనతో చేస్తే అదే తరింపచేస్తుంది అని అమ్మ చెప్పిన మాట ఆయన పట్ల సార్థకం. వీరయ్య గారేమంత్రజపాలూ చేయలేదు. కాని అమ్మకు ఎంతో ఇష్టుడైనాడు.

మహాలక్ష్మమ్మగారు అమ్మ వద్ద మంత్రోపదేశం పొంది ఆ మంత్రం అక్షర లక్షలు చేసింది. అమ్మ దగ్గరే ఎప్పుడూ ఉండటానికి ఇష్టపడేది. కాని అమ్మ అంగీకరించేదికాదు. ఒకసారి వీరయ్యగారు అమ్మతో తన భార్యను గూర్చి చెపుతూ ఎప్పుడూ నీ ధ్యాసే దానికి వంటకూడా సరిగా చేయటం లేదు అన్నారు. అమ్మ మహాలక్ష్మమ్మగారిని ఇంటికి పంపిస్తూ, భర్తసేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లేనని చెప్పింది. నా దగ్గర ఉండే వాళ్ళ మీద కంటే దూరంగా ఉండే వాళ్ళే నాకు దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు నా ధ్యాస మీద ఉంటారు. నేను వాళ్ళ ధ్యాసమీద ఉంటాను అన్నది అమ్మ.

ఒకసారి అమ్మ మహాలక్ష్మమ్మక్కయ్యను రాత్రి పదిగంటలకు ఊరికి వెళ్ళమన్నది. ఇప్పుడెట్లాగమ్మా! దారి కనబడదు, బస్సులుండవు. నేను ఇప్పుడు వెళ్ళను, రేపు వెళ్ళుతాను అన్నది. అమ్మ అంగీకరించలేదు. పట్టుబట్టి నడిచి వెళ్ళు ఏమీ దొరకకపోతే అని పంపింది. బాపట్ల దాకానడిచి అక్కడ ఏదో బస్సు పట్టుకొని వెళ్ళింది అక్కయ్య. అప్పుడనుకున్నది ఇక అమ్మ దగ్గరకు రాను. ఇంత నిర్దయగా పంపించింది అని. కాని అక్కయ్య ఎప్పుడు అమ్మ తన వెంటే ఉన్నధ్యాస ఉండేది. అమ్మ ఏమి చెప్పినా ఏది చేయించినా దాని వెనుక ఏదో పరమార్థం ఉంటుంది. తనను అమ్మ ఆ అర్థరాత్రి పంపటంలోని అవసరం వెళ్ళిం తర్వాత గాని తెలియలేదు అక్కయ్యకు. వీరయ్య చౌదరిగారు భార్య అర్థరాత్రి రావటం చూచి ఆశ్చర్యపోయారు. అమ్మ చూపించిన కరుణకు ఆనందించారు.

అక్కయ్యకు నిరంతరం అమ్మనామస్మరణే. ఒకసారి అమ్మ “ఎప్పుడు నన్ను గూర్చే ఆలోచిస్తూ కూర్చోకపోతే చందాలు వసూలు చేసి జిల్లెళ్ళమూడి పంపవచ్చుగా” అని అన్నట్లు అక్కయ్యకు వినిపించింది. అక్కయ్య చందాలు వసూలు చేయటానికి బయలుదేరింది. ఇంటి బయటకు రాగానే ఒక ముత్తైదువ ఎదురువచ్చి అక్కయ్యతో మీకోసమే వస్తున్నాను. జిల్లెళ్ళమూడికి ఈ వెయ్యి రూపాయలు పంపించండి అని ఇచ్చింది. ఆ తర్వాత అక్కయ్య కలెక్టరుగారింటికి వెళ్ళి కలెక్టరుగారి భార్యతోఅమ్మ కబుర్లు చెపుతూ కూర్చున్నది గాని చందా అడగటం మరచిపోయింది. ఇంతలో మరొక ముత్తైదువ అక్కడకి వీళ్ళ సంభాషణవిని జిల్లెళ్ళమూడికి అయిదు వందల రూపాయలు చందా ఇవ్వాలని వచ్చాను తీసుకోండి అని అక్కయ్య అక్కడకు ఎందుకు వచ్చిందో గుర్తుకు వచ్చేటట్లు చేసింది. అక్కయ్య ఆశ్చర్యపోయి అమ్మ ఇన్ని రూపాలలో ఇన్ని రకాలుగా వచ్చి తన కర్తవ్యాన్ని గుర్తుచేసి తన చేత చందాలు వసూలు చేయించింది అమ్మే అనుకున్నది. అంతేకాదు ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి జిల్లెళ్ళమూడికి పంపిస్తుండేది. ఆ రోజుల్లో నర్సరావుపేటనుండి అక్కయ్య చేసే సేవను గుర్తించి అమ్మ ఎందరికో చెపుతూ ఉండేది. .

వీరయ్య చౌదరిగారి పెద్ద కుమారుడికి అమ్మంటే నమ్మకం ఉండేది కాదు. మనుషులను పట్టుకొని దేవత అనటం ఏమిటి? ఏమిటీ గోల? ఈలా ఆమె చుట్టూ తిరగటమేమిటి, రాత్రి పగలనకుండా? అనుకునేవాడు. ఒక రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక 14 ఏళ్ళ బాలిక వాళ్ళ ఇంటికి వచ్చి ఆకలిగా ఉన్నది అన్నం పెట్టమని మహాలక్ష్మమ్మక్కయ్యను అడిగింది. ఆ అమ్మాయిలో అమ్మ పోలికలు కనిపించి అక్కయ్య అప్పుడే వండిన వేడి వేడి అన్నము, గోంగూర పచ్చడి తెచ్చి పెట్టబోగా ఆ అమ్మాయి లంగాలో పెట్టమని పైకి పట్టుకున్నది. ఇప్పటి దాకా క్రిందకు వ్రేలాడుతున్న లంగాలో పైకిపట్టగానే అందులో నూకలు, బియ్యము ఉన్నవి. ఇవెక్కడ? అని అక్కయ్య అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి నాకు కట్టుకోటానికి ఒక లంగా, జాకెట్టు ఇమ్మని అడిగింది. అమ్మ చిన్నప్పుడు చేసిన అల్లరి విని ఉన్న అక్కయ్య అమ్మే ఈ అమ్మాయి అనుకుంటూ లోపలి కెళ్ళి తన కూతురు లంగా జాకెట్టు తెచ్చి ఇచ్చింది. ఆ పిల్ల అక్కయ్య ఇచ్చిన లంగా జాకెట్టు వేసుకొన్నది. ఈ తంతంతా చూస్తున్నాడు వాళ్ళ అబ్బాయి.

ఇంతలో వీరయ్య చౌదరిగారు ఇంటికి వచ్చి మరొక విచిత్ర సంఘటన చెప్పారు. ఆయన బస్సుకోసం ఎదురుచూస్తూ బస్టాండ్లో నిలబడి ఉన్నారుట. అంతలో అయిదు సంవత్సరాలు చిన్నపిల్ల ఒక రూపాయి ఇవ్వవా? అని వీరయ్యగారిని అడిగింది. చిల్లరలేదు అని చెప్పారు వారు. వెంటనే ఆ అమ్మాయి సరాసరి వీరయ్యగారింటికే వచ్చి మహాలక్ష్మక్కయ్యను అన్నం పెట్టమని అడిగింది. అక్కయ్యలోపలికి వచ్చి అన్నం తెచ్చేసరికి అంతకు ముందు ఏమీ చేతిలోని ఆ అమ్మాయి చేతిలో వెండి గిన్నెలాంటిది ఉన్నది. అందులో అన్నం పెట్టింది. అక్కయ్య. వాళ్ళ రెండవ అబ్బాయి ఈ రెండు సంఘటనలు గమనిస్తున్నాడు. ఈ అమ్మాయి వంక గిన్నెవంక చూస్తూ నిలబడ్డాడు. అక్కయ్య ఆ అమ్మాయిని ప్రశ్నలు వేస్తున్నది. అన్నిటికి సమాధానాలు చెపుతూ అమ్మ లేదుకాని నాన్న ఉన్నాడనీ, ఒక అన్నయ్య కూడా ఉన్నాడని చెప్పుతూ అక్కయ్య వంక ఒక ఓర చూపు చూసింది. అది అచ్చం అమ్మ చూచిన చూపు లాగే ఉన్నది. అమ్మే. అమ్మే అని అక్కయ్య అనుకుంటుండగా ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి ఉత్సుకతతో బయటకు వెళ్ళి ఆ అమ్మాయికోసం చూశాడు. ఎక్కడా కనుపించలేదు. ఇంతలోనే ఎట్లా మాయమైంది? అనుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇంతలో తాసిల్దారు వీరయ్యగారు ఇంటికి వచ్చారు. వీళ్ళు చెప్పిందంతా విని తనకు బస్టాండ్ దగ్గర ఒకమ్మాయి ఒకరూపాయి అడగటం, చిల్లర లేదని చెప్పటం తర్వాత చూడగా తన జేబులోని వందరూపాయలనోటు మాయం కావటం చెప్పి ఇవన్నీ అమ్మ లీలలే అని అనుకున్నారు. ఇదంతా ప్రత్యక్షంగా చూచిన వాళ్ళ మొదటి అబ్బాయికి అమ్మ పట్ల దేవత అనే విశ్వాసం రూఢి అయింది.

మహాలక్ష్మమ్మగారు ఒక రకంగా యోగిని, తపస్విని. అమ్మ చెప్పింది కదా! నిరంతర తపనే తపస్సని. అమ్మను గూర్చి చింతనే ఆమెకు ఎప్పుడూ. అమ్మ మంత్రంజపించి అమ్మకుంకుమ, తీర్ధం ఇస్తే ఎంత కష్టప్రసవమైనా, సుఖంగా జరుగుతుంది, ఎంత బాధతో వచ్చినా నయమై హాయిగా వెళ్ళేవారు. ఒకసారి రాచర్ల కమల నడుము నెప్పితో బాధపడుతూ అక్కయ్య వద్దకు వెళ్ళింది. అక్కయ్య నడుముకు కుంకుమరాసి, మంత్రం జపించి తీర్థాన్నిచ్చింది. అలా మూడు రోజులు చేయగా నడుం నొప్పి పూర్తిగా తగ్గి పోయింది.

అక్కయ్య దగ్గరకు ఎవరువచ్చినా గంటల తరబడి అమ్మ సంగతులు చెపుతూ ఉండేది. వంట ఎప్పుడు చేస్తావమ్మా? అని అడిగితే, అమ్మే చేసి పెడుతుందిలే అనేది. పొయి మీద పెట్టివస్తే అన్నీ అలా తయారు చేయబడి ఉండేవిట. పూర్వం మరిడమ్మ తాతమ్మగారికి కూడా ఇలాటి అనుభవాలెన్నో జరిగాయి. ఆమె ఇంట్లో పని చేసుకొని రోలు దగ్గరకుపోగా ఆ రోట్లో బియ్యం పిండి చేయబడి ఉన్నది. అది ఆమె గురువుగారు మల్లెల రత్తమ్మగారి మహిమ అనుకున్నది. తర్వాత తర్వాత గాని అమ్మ మహిమ అర్థం కాలేదు.

మహాలక్ష్మక్కయ్యగారికి అలాకాక అన్నీ అమ్మ చేయించేవే అనే విశ్వాసం ప్రబలంగా ఉండేది. వాళ్ళ ఇంట్లో అమ్మ వచ్చిన వానికి గుర్తుగా రకరకాల సుగంధ వాసనలు వచ్చేవి. అక్కయ్యను బలవంతంగా ఇంటికి పంపిన నాటి నుండి ఆమె జిల్లెళ్ళమూడి వెళ్ళ లేదు. తర్వాత అమ్మ ఒకరి ఒంటి మీదకు వచ్చి జిల్లెళ్ళమూడి రమ్మని బలవంతం చేయటం అక్కయ్య వెళ్ళటం జరిగింది. అమ్మను ఎత్తుకొని ఆవరణ అంతా తిరగాలనీ అక్కయ్య అమ్మను అడగగా, అమ్మ సరే అన్నది. అమ్మ కాసేపు బరువుగా అనిపించగా అమ్మ నామం తలచుకోగానే తేలికైనది. ఇలా అమ్మతో అక్కయ్యకు, వీరయ్య చౌదరిగారికి వాళ్ళింట్లో వారికి ఎన్నో ఎన్నో అనుభవాలు అమ్మ ప్రసాదించింది.

భార్యభర్తలిద్దరూ అమ్మలో కలిసి పోవటం కూడా విశేషసన్నివేశాలే మహాలక్ష్మమ్మఅక్కయ్యను పిచ్చికుక్క కరిచింది. కుక్కలాగా అరుస్తూ అందరినీ దగ్గరకు పిలిచేది. భయపడి ఎవరూ దగ్గరకు పోయేవారు కాదు. చివరకు అమ్మను పెద్దగా పిలుస్తూ నీ దగ్గరకు వస్తున్నా నమ్మా! అంటూ అమ్మలో లీనమైంది. ఇక వీరయ్య చౌదరిగారు కూడా అదృష్టవంతుడే. ఎవరైనా వైకుంఠంలోనో, కైలాసంలో తాము తమ ఆరాధ్య దైవం ముందు అంతిమ ఘడియలు గడపాలనుకుంటారు. అలాగే వాళ్ళ కుటుంబం అంతా విదేశాలకు వెళ్ళాల్సి రావటం, వివిధ కారణాలతో వీరయ్యగారిని జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆశ్రమంలో అందరింటికి చేర్చటం జరిగింది. ఒక రకంగా అదృష్టవంతుడు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తేగాని పొందలేని అర్కపురిలో అమ్మసంచరించిన పవిత్ర భూమిపై కాలం గడపటం అమ్మ ముంగిట అమ్మపాదాల చెంత అంతిమశ్వాస విడిచి అమ్మలో లీనం కావటం అమ్మ కారుణ్యవిశేషమేమరి. ధన్యజీవి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!