(కోరి అమ్మలో కలిసిన కొణకంచి జగన్నాథం)
కొణకంచి జగన్నాథంగారు మంచి జ్యోతిష్కుడు. మంచి వైద్యుడు. హనుమకొండ నివాసియైన వృద్ధ బ్రాహ్మణుడు. చాలమంది పిల్లలు పుట్టి పోయారు. భార్యా ఈ ముసలి వాడ్ని ఒంటరిని చేసి పోయింది. చనిపోయినవారు చనిపోగా మిగిలింది ఒక్క కూతురు. చాలా గారాబంగా పెరిగింది. వంట చెయ్యటం కూడా సరిగా రాదు. పెళ్ళి చేశాడు. ఒక పిల్లవాడు. ఆ మనుమడు ఈ ముసలి తాతను వదలడు. వచ్చీరాని మాటలతో తాత ఒళ్ళోనే వాడి నివాసం.
తాత జగన్నాథానికి తన జాతకం ప్రకారం తానూ తనువును విడిచి పెట్టే రోజులు దగ్గర పడుతున్నయ్యని తెలుసు. “కాశ్యాన్ మరణాన్ ముక్తిః అధవాపుత్రసన్నిధౌ” అనే నానుడి లోకంలో ఉన్నది. పురాణాలూ ఘోషిస్తున్నాయి. కనుక కాశీలో మరణించి ముక్తిపొందాలనుకున్నాడు. ఈ సమయంలోనే తంగిరాల కేశవశర్మ బావమరది దెందుకూరి శ్రీనివాసరావు జగన్నాధం గారికి తటస్థపడ్డాడు. “కాశీలో ఉన్నది రాతి బొమ్మ సజీవమైన అన్నపూర్ణ జిల్లెళ్ళమూడిలో ఉన్నది. అక్కడకు వెళ్ళు నీ జన్మతరిస్తుంది, నీకు ముక్తి వస్తుంది” అని చెప్పాడు. చెప్పినవాడు శ్రీనివాసుడు, విన్నవాడు జగన్నాథుడు. మనసుకు బాగా పట్టింది. క్షేత్రము, తీర్థము, దైవము మూడూ కలసిన ప్రదేశం జిల్లెళ్ళమూడి అని తెలుసుకున్న ఆ పుణ్యపురుషుడు అమ్మ పాదాల వద్ద తన ఆఖరి శ్వాస వదలాలనుకున్నాడు.
జగన్నాథంగారు 1959 సంవత్సరం భాద్రపద మాసంలో జిల్లెళ్ళమూడి గడ్డపై అడుగుపెట్టాడు. ఆ రోజు ఏకాదశి. అమ్మ పుట్టింది ఏకాదశినాడే. అమ్మ ఈ బిడ్డను కన్నది ఏకాదశినాడే కావటం యాదృచ్ఛికం కాదు. అప్పుడు చీరాలవారు అమ్మకోసం ఏర్పాటు చేసిన పాకలో తంగిరాల కేశవశర్మ, సొలస వెంకటేశ్వర్లు అమ్మ దగ్గర కూర్చొని ఉన్నారు. మాటల సందర్భంలో అమ్మ “కేశవా! ఎక్కడో మూలుగు వినపడుతుందిరా! అదొకరకంగా ఉంది” అన్నది. “నీకు ఎక్కడెక్కడివో వినిపిస్తుంటాయి. ఏ భక్తుడు ఆర్తితో, బాధతో నిన్ను తలుస్తున్నాడో” అన్నాడు. కేశవ. ఇంతలో ఒక ముసలివాడు చంకలో పసివాడితో వస్తూ అమ్మా! పార్వతీ ఎక్కడున్నావమ్మా! అంటూ వరండాలో పిల్లవాడ్ని చంకలో నుండి దించాడు. పిల్లవాడు అమ్మ కావాలంటూ ఏడుస్తున్నాడు. అదిగోరా! అసలు అమ్మ దగ్గరకే వచ్చాంబాబూ! అన్నాడు తాతగారు. కేశవ బయటకు వచ్చి తాతగారిని పట్టుకొని పిల్లవాడ్ని చంకలో ఎత్తుకొని అమ్మ వద్దకు తీసుకెళ్ళాడు. అమ్మ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తాతగారు అమ్మతో శ్రీనివాసు చెప్పాడమ్మా! కాశీ వెళ్ళితే చనిపోయాక కైలాసం వస్తుంది. జిల్లెళ్ళమూడి వెళ్ళితే సశరీరకైలాస ప్రాప్తినని. ఆ మాట మననమై మంత్రమై నన్ను నీ దగ్గరకు చేర్చిందమ్మా! అంటూ పిల్లవాడితో అదిగోరా! అమ్మ పో! అంటూ అమ్మ వద్దకు త్రోశాడు. పిల్లవాడు ఏడుస్తూ కదలలేదు. పోరా! అంటూ కసిరాడు. అప్పుడు అమ్మ “ఇవ్వాళ నా దగ్గరకు రాడు రేపు నీ దగ్గర ఉండడు” అన్నది. నాక్కావాల్సింది అదే వాడ్ని ఆశీర్వదించమ్మా! అని తన కుటుంబ గాధ చెప్పటం మొదలు పెట్టాడు.
నాకు జోతిష్యం తెలుసు. గాలిపాటులకు, గ్రహవీక్షణాలకు తాయత్తులు కట్టుతుంటాను. ఈ నెలలో నాకు గండం ఉన్నది. ఏదో ఒక పుణ్యక్షేత్రంలో పోతానని వ్రాసి ఉంది. నా బిడ్డ అమాయకురాలు, దాని మీద మమకారం. నాకున్నంతలో ఏదో ఇచ్చాను. అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడు. హనుమకొండలో నాదగ్గరే ఉంటాడు అని చెప్పాడు. జగన్నాధం గారికి 104 డిగ్రీల జ్వరం. ఇంటి దగ్గర బయలు దేరిందగ్గర నుండి విరేచనాలు. రక్తం కూడా పడుతున్నది. నిద్రలేదు, కూర్చోలేదు. మృత్యువు తప్పదని అల్లుడితో చెప్పి వచ్చాడు.
అమ్మ తాతగారికి ప్రక్క వేయించి సపర్యలు చేయించింది. రెండు రోజులు తాతగారు ఆఖరి ప్రయాణానికి సిద్ధమైనట్లున్నదని అమ్మకు వచ్చి చెప్పారు. అమ్మ శొంఠిపొడి తేనె కలిపి నాలుకపై వేసింది. గుండె, పొట్ట తడిమింది. పాదాలు రాసింది. తాత ఉలిక్కిపడి నొచ్చుకున్నారు అపరాధం చేసినట్లుగా. అమ్మ పాదాలు పట్టుకున్నారు క్షమించమని. తాతగారి ఒళ్ళు చల్ల బడ్డది. జ్వరం లేదు. లేచి కూర్చుని “నీవు పార్వతి దేవివి అనుకున్నాను గాని పార్వతీ పరమేశ్వరులకు కూడా తల్లివి నీవు” అన్నాడు. అమ్మ తడి గుడ్డతో ఒళ్ళుతుడిచి క్రొత్త ధోవతి కట్టించింది. లక్ష్మీ నరసమ్మ గారితో చెప్పి చారు అన్నం వండించి పెట్టింది.
డాక్టర్ సాంబయ్య వచ్చాడు జ్వరం ఏలా ఉన్నది అంటూ. సాంబయ్యతో తాతగారు నేను కాలం వచ్చి చిక్కానుగాని కాళ్ళు లేక కాదండీ! నేనూ వైద్యుణ్ణి అంటూ కొన్ని గంటలపాటు వైద్యాన్ని గూర్చి విధానాల గూర్చి చర్చించారు. తన దినచర్య పుస్తకంలో ఇంటి దగ్గర నుండి బయలుదేరిం దగ్గర నుండి అప్పటి దాకా జరిగినదంతా వివరంగా వ్రాశారు. ఇంతలో బయటకు వెళ్ళాల్సి వచ్చి అమ్మా! నాకు మూలమలం కదిలింది, మరణం తప్పదు. బాగా ఆకలి వేస్తున్నది అన్నం పెట్టించమ్మా అన్నారు. తాతకు ఇష్టమైన దోసకాయ పప్పు, పెరుగు వేసి అన్నం పెట్టారు. భోజనం చేస్తుండగానే అమ్మా! ఓ మృత్యుదేవతా! వస్తున్నావా! అంటూ అన్నంతిని లేచారు. కొద్ది సేపటికే జగన్నాథంగారు అమ్మలో కలిసి పోయారు. ఆ రోజు మహాలయ అమావాస్య పుణ్యకాలం. తెల్లవారితే దేవీనవరాత్రులు మొదలు.
అమ్మకు దేవుళ్ళూ బిడ్డలే బిడ్డలూ దేవుళ్ళే. “నేను మీలో దైవత్వం చూస్తాను. మీరు నాలో మానవత్వం చూస్తారు” అన్నది అమ్మ. నిజమే! దూరంగా ఉన్నప్పుడు అమ్మను దేవత అంటుంటాం గాని దగ్గరకు వెళ్ళంగా అమ్మను మానవిగానే చూస్తాం. అమ్మ అన్నట్లు ఈ మంచం మీద కూర్చున్న అమ్మ కాదు. అమ్మ అంటే – కొందరికి ఒక్క మాటతోనే జ్ఞానోదయమౌతుంది. కొందరికి సంవత్సరాల తరబడి అమ్మ దగ్గర ఉన్నా కాదు. ఏం చేస్తాం. జగన్నాధం గారికి శ్రీనివాస్ చెప్పిన ఒక్క మాట మంత్రమై జగన్నాథం గారిని ముక్తిని పొందేలా చేసింది. మరి మూడు రోజులలో ముక్తిని పొందిన జగన్నాథం గారు ధన్యుడు కదా! ఏడు రోజులలో ముక్తిని పొందిన పరీక్షిత్తుకంటే – “అర్కపురీ క్షేత్రే మరణాన్ముక్తిః” అనే విశ్వాసం ఆయనకు కావాల్సింది ఇచ్చింది. విశ్వాసమే భగవంతుడు కదా! పార్వతిగా పార్వతీ పరమేశ్వరులను కన్న తల్లిగా, మరణ దేవతగా, దర్శన మిచ్చి తనలోకి చేర్చుకోవటం ఆయన అదృష్టం. కోరినరీతిగా ముక్తుడైన – కైలాసాన్ని మించిన అర్కపురికి చేరిన ధన్యజీవి.
జగనాథంగారు ముక్తుడైన తర్వాత జరిగిన కథకేమి? మాటలు వచ్చీరాని వారంతా అమ్మ అనుగ్రహంతో జిల్లెళ్ళమూడి అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం అమ్మ కరుణకు పాత్రులు కావటం మనకు తెలిసిన అంశాలే.
పోతూ పోతూ జగన్నాథం గారు చూపిన దారి ఆయన కుమార్తె దమయంతి, అల్లుడు రామచంద్రరావు, మనుమలు, మనుమరాండ్ర జీవితాలలో వెలుగు వెల్లువలు నింపినయ్యని వాళ్ళు తృప్తి పడటం మనందరికీ మననీయమైన విషయం. కొండముది రామకృష్ణ కొడుకు సుబ్బారావుకు జగన్నాథం గారి మనుమరాలినిచ్చి వివాహం చేసి జిల్లెళ్ళమూడితో ఉన్న అనుబంధాన్ని ఇంకా పటిష్ఠం చేసుకున్నారు. ఏమైనా కోరుకున్నట్లు కోరుకున్నచోటికే చేరిన ధన్యుడు శ్రీ జగన్నాథం గారు.