వీరమాచనేని ప్రసాదరావుగారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారితో కలసి అమ్మతో తత్వచింతన చేసిన జిజ్ఞాసి. అమ్మ ప్రత్యేకించి ఏ అద్వైతమార్గాన్నో, విశిష్టాద్వైతమార్గాన్నో, ద్వైతమార్గాన్నో అనుసరించిన వ్యక్తికాదనీ, అలా అని నిరీశ్వర వాది కూడా కాదనీ, అమ్మ సహజ స్వభావి అనీ, అమ్మకు ప్రత్యేకించి ఒక సిద్ధాంతంలేదనీ, అమ్మ సర్వసిద్ధాంత సార్వభౌమ అనీ, మల్లెపువ్వు తను మల్లెపువ్వు అని చెప్పుకో లేనట్టే అమ్మ సహజ స్థితిలో ఉంటుందనీ, అమ్మే తెలివి గనుక అమ్మను మనం గుర్తించాల్సిందేకాని అమ్మకు తానెవరో తెలుసుకోవటానికి తనకు భిన్నంగా వేరే ఏమీ లేదు గనుక అమ్మ తనకు చెప్పేదేమీ లేదని, అమ్మది ‘వల్లకాని మిట్ట ప్రదేశమని’ గుర్తించిన మహానుభావుడు.
అమ్మ సర్వజ్ఞ అని ఆయన అంటూ ఏది తెలిస్తే అంతా తెలుస్తుందో ఆ తెలుసుకొన్న స్థితి సర్వజ్ఞత్వం కదమ్మా! అంటే అమ్మ “సర్వజ్ఞత్వం అంటే అంతా తానై ఉండి మూడు కాలాలూ తెలిసికొని మూడుగా గుర్తించక ఉన్న స్థితిని సర్వజ్ఞత్వం అంటున్నారు. మీరు అన్నట్టు ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఏది కావాలంటే అది నాకు తెలుస్తుంది”. అన్నది నిజమే అంతా తెలిసిన వారికి ఎప్పుడు ఏదికావాలంటే అది తెలుస్తుంది. అన్నారు ప్రసాదరావుగారు.
ఆశ్చర్యమేమిటంటే సామ్యవాద సిద్ధాంతాలకు ప్రభావితుడై కమ్యూనిష్టు పార్టీలో రాటుదేలిన కార్యకర్తగా, పార్లమెంటు మెంబరుగా, సుప్రసిద్దుడైన వ్యక్తి ప్రసాదరావుగారు. 1970లో ఏదో పనిమీద తెనాలిలో వారికి తెలిసిన వారింటికి వెళ్ళాడొకసారి. వాళ్ళింట్లో అమ్మ బొమ్మతో గల కాలెండరు తగిలించి ఉన్నది. ఎవరామె? కాలెండరులో వుండగల విశిష్టత ఏమిటని ప్రశ్నించారు. వారు ఆయనతో అమ్మ అందరికీ వర్ణవర్గ విచక్షణ లేకుండా ఆకలే అర్హతగా అన్నం పెడుతుందనీ, అందరినీ తన బిడ్డలుగానే ప్రేమిస్తుందనీ, ఆర్తులపట్ల ఆదరణతో ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని స్వాంతన కలిగిస్తుందనీ చెప్పినమాటలకు ఆశ్చర్యపడి, కమ్యూనిష్టులుకాక ఇలా ప్రవర్తించే వారున్నారా! అయితే తప్పక ఆమెను చూడాల్సిందే అని జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మను చూచిన వారెవరైనా ఆ వాత్సల్యానికి, ఆ మమకారానికి, ఆ ఆప్యాయతకు లొంగి పోవలసిందే. కోపంతో, ద్వేషంతో వచ్చినా అమ్మ ప్రేమకు తలవంచాల్సిందే. ప్రసాదరావుగారిలో తానూ పూర్వం చూచిందీ, అనుభవించిందే కాక ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉన్నది అనిపించింది. వారిలో వారికి తెలియకుండానే మార్పు చోటుచేసుకున్నది. అక్కడి అన్నపూర్ణాలయంలో సమాదరణ, సహపంక్తి భోజనాలు, అక్కడి సంచరించే వారిలోని అక్కయ్య, అన్నయ్య అనే పలకరింపులు కల్మషం లేకుండా సహజ సిద్దంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. తాను చిరకాలంగా అనుసరిస్తున్న, ఆచరిస్తున్న సామ్యవాద సిద్దాంతం ఇంత తేలిగ్గా, ఇంత సహజంగా అక్కడ ఆచరణలో ఉండటం చూచి తాను భావించిన విప్లవం ప్రజల్లో ఇంత సహజంగా రావాలి అనుకున్నారు. అందరూ ఒక కుటుంబంలోని సభ్యులుగా మెలగటంచూచి ఆనందించారు.
ఆ తర్వాత వారు హైదరాబాదు వెళ్ళి డాక్టర్ శ్రీపాదవారు, డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, డాక్టర్ తంగిరాల సింహాద్రిశాస్త్రిగారు, శ్రీ చంద్రమౌళి వెంకటకృష్ణగారు వంటి వారితో అమ్మను గూర్చి చర్చించటం, అమ్మ ప్రసంగవశాన చెప్పిన విషయాలు తెలుసుకోవటం, అమ్మను గూర్చిన గ్రంధాలు చదవటం వంటివి చేశారు. ఈ సందర్భంలోనే వారి జీవితాన్ని మలుపు త్రిప్పే మరొక సంఘటన జరిగింది.
1972 అక్టోబరులో సికిందరాబాద్లో ప్రసాదరావుగారి కుమారుడు, కోడలూ ఒక జీపులో పోతుండగా ఆ జీపును ఒకలారీ వేగంగా వచ్చి ఢీకొన్నది. జీపు నుగైపోయింది. కుమారునకు గాయాలైనాయి. అయితే పెద్దగా ప్రమాదం లేదన్నారు వైద్యులు. కాని వారి కోడలుకు మాత్రం ముఖం అంతా ఎముకలు విరిగిపోయి, వికృత రూపమై ఆ ఎముకల ముక్కలు గ్రుచ్చుకొని మెదడు దెబ్బతిన్నది. స్పహతప్పిపోయింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు పెదవి విరిచారు. ప్రాణానికి హామీ యివ్వలేమన్నారు. ఆపరేషన్ జరుపటానికి మాత్రం నిశ్చయించారు. శస్త్ర చికిత్స జరుగుతున్నది. బయట ఉన్న బంధు గణంలో ఆతురత, ఉద్విగ్నత చోటు చేసుకొన్నాయి. ఆ సమయంలో ఆపద్బాంధవునిలాగా శ్రీ వెంకటరత్నంగారు అమ్మ వద్ద నుండి ప్రసాదమూ తీర్థమూ తెచ్చి ఇచ్చారు. లక్ష్మణుని బ్రతికించటానికి సంజీవి పర్వతం తెచ్చిన హనుమంతునిగా వెంకటరత్నంగారు కనిపించారు ప్రసాదరావుగారికి. వెంటనే తీర్థాన్ని కోడలి నోటిలో పోశారు. స్పృహ లేని కోడలు ఈ తీర్థాన్ని గుటక వేసింది. ఇక భయంలేదనుకున్నారు ప్రసాదరావుగారు. ఆమె కోలుకుంటుందనే ఆశ చిగురించింది.
ఇంతలో ప్రసాదరావుగారికి ఒక దృశ్యం కళ్ళముందు కదిలింది. అమ్మ డాక్టర్ వేషంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినట్లు, అమ్మ స్వయంగా ఆపరేషన్ జరుపుతున్నట్లు కనిపించింది. ఆపరేషన్ విజయవంతమైంది. బంధువులేకాక డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈలాటి శస్త్రచికిత్సలలో లక్షలలో ఒకటి విజయవంతమౌతుందని విస్మయం ప్రకటించారు. ఏదో బలీయమైన శక్తి మీ కోడలిని బ్రతికించింది అని ప్రసాదరావుగారితో చెప్పారు.
శస్త్రచికిత్స సక్రమంగా జరిగినా ముఖాకృతి వికృతంకావచ్చు. కాని మళ్ళీ ముఖం మారకండా ఆ కళ్ళు, ముక్కు ఏ స్థానంలో అవి అమరి స్మృతి కలిగి మాటలు వచ్చాయి. అమ్మ అకారణ కారుణ్యానికి ఆనందించారు. అమ్మ. చేసిన ఈ రకమైన విశిష్టతను తనతోటి కమ్యూనిష్టులకు పార్లమెంటు మెంబర్లకూ ప్రసాదరావుగారు చెప్పితే హేతువాదులైన వాళ్ళంతా ‘ఇట్లా మారిపోయాడేమిటి మనవాడు’ అని వాళ్ళు అనుకుంటుంటే, ప్రసాదరావుగారు చెప్పారు. “పూర్వం ఇటువంటి అనుభవాలు, నిదర్శనలూ, నిరూపణలూ లేవు- ఇప్పుడు వచ్చాయి నమ్మకపోతే ఎట్లా? ఏమీ అనుభవంలేకుండా మూఢంగా నమ్మితే ఎట్లా? అని పూర్వం అనుకున్నాను. అనుభవిస్తూ, చూస్తూ కూడా నమ్మకపోతే మూర్ఖత్వమే కదా!” అని చెప్పారు వాళ్ళకి, ఆపత్సమయాల్లో ఎందరిని ఆదరించిందో అమ్మ గ్రంధాల్లో చదివిన ప్రసాదరావుగారు అనుభవంలోకి వచ్చేటప్పటికి అమ్మను గూర్చి లోతుగా తెలుసుకోవాలనే ఆరాటం బయలు దేరింది. 1974 నుండి శ్రీపాదవారితో కలిసి అమ్మ దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ ఎన్నో అనుమానాలు తీర్చుకుంటూ అమ్మ తత్వచింతన చేస్తూ అమ్మను గూర్చి లోకానికి తెలియచేయాలని ఆరాటపడ్డారు.
శ్రీరాజుపాలెం రామచంద్రరావుగారు తనతో అమ్మ చెప్పిన నాన్నగారి, బామ్మగారి, పొట్లూరి సుబ్బారావుగారి పునర్జన్మలను గూర్చిన విషయంగల వ్యాసం నేనొకసారి 1986 తర్వాత మాతృశ్రీలో ప్రచురించాను. వారికి మనస్సు కష్టం వేసి నన్ను ‘ఇదేమిటి? ఇలాంటివి ప్రచురించారు?’ అని నిలదీశారు. “మీకు అమ్మ ఎలా జన్మలు లేవని చెప్పిందో – రామచంద్రరావుగారికి, పొట్లూరి సుబ్బారావుగారికి ఉన్నవని చెప్పింది. వారు వ్రాశారు. వారు వ్రాసింది. అబద్ధమని అనలేంకదా! మీరు లేవని అమ్మ చెప్పింది” మీ వ్యాసంలో వ్రాయండి అన్నాను. వారు వ్రాయలేదు. అమ్మ పరిణామ సిద్ధాంతాన్ని ఒప్పుకొన్నది. ప్రతిక్షణమూ జరిగే మార్పుకూ, చావనుకొనే మార్పుకూ తేడాలేదా అంటే గుర్తింపు వస్తున్నది. లేకపోతే ఇంత ఏడుపెందుకు? శరీరం వదలిన తర్వాత అది ఏమవుతున్నదో, ఉందో లేదో తెలియదు. ఇదీ పరిణామమే అదీ పరిణామమే – మన కర్థం కాని మార్పు జరుగుతున్నది అన్నది అమ్మ.
ఏది ఏమైనా ప్రసాదరావుగారు అమ్మను ప్రగాఢంగా విశ్వసించిన మరజీవి. అందరికి సుగతిని ప్రసాదించిన అమ్మ ప్రసాదరావుగారిని తనలోనే కలుపుకున్నది. ఆయన ధన్యజీవి