(డాక్టర్ నారపరాజు శ్రీధరరావు)
తొలిరోజులలో అంటే 1958 ప్రాంతంలో అమ్మ వద్దకు తరచుగా చీరాల నుండి వచ్చిన వారిలో శ్రీహర్ష రావుగారొకరు. వారి ద్వారా అమ్మను గూర్చి విన్నారు డాక్టర్ నారపరాజు శ్రీధరరావుగారు. 1961లో మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను చూశారు. ఒకసారి చూసినవారెవరూ అమ్మను వదలలేరు. నిజానికి అమ్మే వారిని వదలదు.
శ్రీధరరావుగారిది ఇంకొల్లు గ్రామం (ప్రకాశంజిల్లా). వారి తాతగారు రామచంద్రయ్య ఆయుర్వేద వైద్యులు – కవి. తండ్రి సీతారామయ్య సంస్కృత పండితులు, ఉపాధ్యాయులు. వీరిద్దరి నుండి శ్రీధరరావుగారికి అటువైద్యము కవిత్వము ఇంట బుట్టి వంటబట్టినయ్యనుకుంటాను. అయితే పార్వతీదేవికి తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్వీకరించింతర్వాత గాని తాను సతీదేవిననే విషయం తెలియలేదు. అలాగే శ్రీధరరావుగారికి కూడా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించిన తర్వాతనే వారిలోని కవితా శక్తి ఉద్బురం కాలేదు. ‘కవిత పుట్టిల్లు ఇంకొల్లు కారణమిల్లు’ అనే నానుడి ఉన్నా శ్రీధరరావుగారు మాతృశ్రీ పదపద్మ సేవాలబ్ధ సారస్వతుండను అని చెప్పుకున్నారు. శ్రీధరరావుగారు అమ్మను గూర్చి నివేదన, అమ్మ, వ్యాకృతి, అమ్మ అలంకృతి, అమ్మ యతి అనే గ్రంధాలే కాక దాదాపు 18 గ్రంధాలు వ్రాశారు.
వైద్యవిద్యను నేర్చిన శ్రీధరరావుగారు రెండవ ప్రపంచ యుద్ధంలో (I.M.S.) ఆఫీసర్గా పనిచేశారు. విశాఖపట్నం ఆంధ్రవైద్య కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగించారు. అటు దేశసేవ, ఇటు భాషాసేవ, రెండూ చేశారు. చీరాలలో 1960లో వైద్యశాల ఏర్పాటు చేసుకొని సేవాభావంతో రోగులకు ఆరోగ్యాన్ని చేకూర్చే రోజులలో 1962లో అమ్మ వారింటికి వెళ్ళింది. పదిహేను రోజులున్నది. అదే వారి జీవితానికి పెద్ద మలుపు.
అమ్మ వాడరేవులో ఉండగా శ్రీధరరావుగారు అమ్మను దర్శించటానికి వెళ్ళారు. అమ్మ వారితో పూరీలు చేయించుకురారా! అన్నది. అమ్మ అడగటమే మహాభాగ్యమని పూరీలు చేయించుకొని అమ్మ వద్దకు తీసుకొని వెళ్ళారు.
అయితే అమ్మ దర్శనం కాలేదు. కొన్ని గంటల కాలం అలావేచి ఉండాల్సి వచ్చింది. మామూలుగా కోపస్వభావుడైనా అమ్మతో వ్యవహారం కనుక ఎంతో ఓర్పుతోనే ఉన్నారు. కాని సహనం పోయి ఆ పూరీలన్నిటిని సముద్ర తీరంలో ఉన్న జాలరివాళ్ళకు, కుక్కలకు పందులకు పెట్టారు. ఖాళీ చేతులతో తిరిగివస్తూ పోని ఇప్పుడైనా అమ్మదర్శన మవుతుందేమో చూద్దాం అని వచ్చారు. ఈసారి వెంటనే అమ్మ దర్శనమైంది. నిష్ఠూరంగా జరిగింది అమ్మకు నివేదించారు. అమ్మ ‘పోనీలే నాన్నా! వాటికి మాత్రం ఎవరు పెడతారు? ఎవరు తింటే ఏమిటే?” అన్నది. అయినా పూరీలు తీసుకు రమ్మన్నది తనకోసం కాదు. సముద్ర తీరంలోని ఆ జంతువుల కోసం, జాలర్ల కోసమే. అలా వాటికి పెట్టాలనే ఆ ప్రేరణ ఇచ్చింది అమ్మేకదా! అవి కూడా అమ్మ సంతానమే కదా! శ్రీధరరావుగారిలోని ఆ ఆలోచనకు లోచనం అమ్మదే….
శ్రీధరరావుగారి రెండవకుమార్తె వివాహం 1962 జూన్లో అమ్మ దగ్గర ఉండి జరిపింది. అలాగే శ్రీధరరావుగారి శ్రీమతి ప్రభావతిగారికి మెనోపాస్ సమయంలో రోజూ అధిక రక్తస్రావమౌతూ బాధపెట్టేది. ఎన్ని మందులేసినా తగ్గలేదు. శ్రీధరరావుగారికి ఏం చేయాలో తోచలేదు. ఆఖరికి ఆపరేషన్ చేయించాలి అని కూడా అనిపించలేదు. అమ్మ చీరాలలో పర్యటిస్తూ మీ యింటికి వస్తున్నానని కబురు చేసింది. ఆ రోజున కూడా ఆమెకు బాగోలేదు. అమ్మకు హారతివ్వటానికి కూడా ఆమె బయటకు రాలేకపోయింది. అమ్మ ఆమె ఉన్న గదిలోకి వెళ్ళి తన అమృతహస్తంలో పొత్తికడుపును నిమురుతూ “ఇక్కడేనా అమ్మా! నొప్పి” అని ఆప్యాయంగా పలకరించింది. ఔనన్నది ఆమె. అంతే తగ్గించమని అమ్మని అడగలేదు. అమ్మకు చెప్పలేదు. ఆ రోజు నుండి ఆ బాధ నుండి విముక్తి పొందింది. ఆ తర్వాతకూడా డాక్టర్ గారికి అంతుచిక్కని బాధలు ఆమెకు వచ్చి వేధించాయి. అమ్మ అనుగ్రహంతో మాయమై ఆరోగ్యవంతురాలైంది.
శ్రీధరరావుగారు ప్రసిద్ధ వైద్యుడే అయినా ఒక్కొకసారి భగవచ్ఛక్తి తోడైతే తప్ప మందులు కూడా పనిచేయవేమో – వారి మూడవ కుమార్తెకు అన్నం అరగక వాంతులవుతూ కడుపు నొప్పితో నరకయాతన అనుభవించేది. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమేగాని జబ్బు తగ్గలేదు. అమ్మ మదరాసు వెళుతూ శ్రీధరరావును కూడా తమతో రమ్మన్నది. ఇల్లు వదిలి బయటకు వెళ్ళటానికి తొందరగా ఇష్టపడడు. అమ్మ పట్టుబట్టడంతో అమ్మతో మద్రాసుకు వెళ్ళక తప్పింది కాదు. ఆయన మద్రాసులో ఉన్నప్పుడు ఆ మూడవ అమ్మాయికి మళ్ళీ నొప్పి వచ్చింది. చీరాలలోని శ్రీధరరావుగారి మిత్రుడు డాక్టర్ ప్రతాప్ కుమార్కు చూపించటం జరిగింది. ఆ డాక్టర్ ఈ అమ్మాయికి ఎపెండిసైటిస్ 24 గంటలలోపల ఆపరేషన్ చేసితీరాలి. డాక్టరుగారు ఎక్కడ ఉన్నా వెంటనే పిలిపించండి అన్నారు. ఆశ్చర్యం అమ్మ అదే సమయానికి శ్రీధరరావుగారిని ఫోన్లు టెలిగ్రాములు లేకుండానే చీరాల వెళ్ళమని చెప్పటం జరిగింది. శ్రీధరరావుగారు రావటం వెంటనే ఆపరేషన్ చేయించటం జరిగింది. శ్రీధరరావుగారే ఉంటే ఏదో మందు వేసేవారు. తాత్కాలికంగా తగ్గేది. చివరకు ప్రాణాపాయ స్థితి వచ్చేది. అమ్మవారిని తనతో తీసుకొని వెళ్ళి వేరే డాక్టరు చేత పరీక్ష చేయించి సమయానికి మళ్ళీ పంపించింది అంతా అమ్మ చూపించిన లీలగా వారు భావించారు.
అమ్మను గూర్చి వారి మాటలలోనే చెప్పాలంటే “అమ్మ జీవితమే వేదము. శాస్త్రములలోని సత్యముల కాచరణ రూపమయిన బృహద్గ్రంథమామె జీవితము. ఒకసారి అమ్మ పరిచయము గల వ్యక్తి మనః ఫలకముపై ఆమె మాటలు తుడిచి వేయరాని శిలాక్షరములు. ఆమె మానవ నైతిక ఆర్థిక ప్రగతికి ధృవతార”.
‘నివేదన’ అనే అమ్మను గూర్చి వ్రాసిన గ్రంధం అంకితమిస్తూ హైమను గూర్చి వారు పలికిన పలుకులు ఆణిముత్యాలు, అక్షరసత్యాలు” హిమమునంటి హైమకు, బంగారమునకు తావి తెచ్చు హైమకు, హిమాలయమువలె ఉన్నతమైన హైమకు, కోరికలు లేని హైమకు, జీవించుటకు ఆహరించు హైమకు – నిరాడంబరమూర్తి హైమకు – ఒక అన్నకాలిలో ముల్లునకు, ఒక చెల్లెలి కాలిన కాలికి ఒక తమ్ముని జ్వరమునకు, ఒక అన్న గుండెలో దిగబడిన కత్తికి, ఒక నేరస్తునకు విధింపబడిన శిక్షకు, ఒక కాఫీ కప్పులో బడి చనిపోయిన చీమకు, ఒక గూటి నుండి పడి గిలగిల లాడెడు పిచ్చుక పిల్లకు నవ్య నవనీతమగు నిండు హృదయంతో అత్యంత ఆత్మీయతతో కన్నీరు కార్చే హైమకు సర్వజీవరాసుల బాధను తనదిగా గణించు హైమకు ప్రాణావసాన పర్యంతము దేహధారులకు సుఖదుఃఖములలో అమ్మ నామము ఎట్లు చేయవలెనో చూపిన హైమకు – వయసున పిన్నయమ్యు సర్వకాల సర్వావస్థల యందు నాకు ఆదర్శ ప్రాయురాలైన హైమకు” అంకితమిస్తున్నాను – ధన్యో అన్నారు.
నిజానికి హైమకు, నాన్నగారికి వైద్యం చేసిన వైద్యుడాయన. అయినా వారి భావాలు ఎంత స్పష్టంగా, పరిణతి చెందిన జీవిత క్షణాలు కనిపిస్తున్నాయో గమనించండి.
అమ్మకు “లాలిశ్రీ మాతృమూర్తీ! అతిలోక కారుణ్య రాజ్యవర్తీ! లాలి సౌజన్యకీర్తీ! బుధవినుత పాదనీరజ స్ఫూర్తీ!” అంటూ వారు వ్రాసిన లాలిపాట జగద్విదితం. అంధసోదరులు శ్రీయార్లగడ్డ రాఘవయ్యగారి నుండి కవిత స్ఫూర్తిని పొంది, అమ్మ అనుగ్రహంలో వారి కవితా స్రవంతి సుదూరం ప్రయాణం చేసి వ్యాకరణం, అలంకారం, భక్తి, శృంగారం, సామాజిక విశ్లేషణ, యోగము, జ్ఞానముల గుండా ప్రయాణం చేసి నామరూపాతీతమై మాతృశ్రీ కృపాజలధిలో లీనమైంది.
అందువల్లనే అమ్మలోకి వారి మహాభి నిష్క్రమణం కూడా విశిష్టంగా వివేక వివేచనలోనే జరిగింది. మూడు సంవత్సరాలు మంచానికి పరిమితమైనా అమ్మ వారికి బాధనివ్వలేదు. మరణానికి ముందు రోజు కూడా వారి అల్లుడు శ్రీమన్నారాయణ మూర్తితో సంభాషిస్తూ “మరణమంటే మార్పేగదా!” అన్న అమ్మ మాటను, సనత్సుజాతీయంలోని “దేహానికి సంబంధించిన మార్పుల కంటే దేహాన్ని ధరించిన వాడు అతీతంగా ఉన్నాడని గుర్తిస్తే అంతర్యామితత్వం అనుభవంలోకి వచ్చి అమృతత్వం సిద్ధిస్తుంది. ఆ స్థితి నుండి ఏమరుపాటు కలిగితే అదే మరణం” అని శ్రీమన్నారాయణ గారు చెప్పగా శ్రీధరరావుగారు అయితే ఏమరుపాటులేకపోతే మరణానికి దుఃఖించవలసిన పనిలేదుగా, అసలు మరణం లేదుగా. అమ్మను గూర్చి నిరంతర చింతన వారిని చిరంజీవిని చేసింది. “నరః పతిత కాయోపి యశః కామేనజీవతి” నాస్తితేషాం యశః కాయే జరామరణజంభయమ్” అన్నట్లు వారి కీర్తి, శరీరాలు నిలిచే ఉంటాయి. వారిప్పుడు అమ్మలోనే ఉంటారు. వారింటికి వచ్చిన వారికి ఎలామృష్టాన్న భోజనం పెట్టారో, అలాగే, వారి రచనలలో కవితా పిపాసువులకు, ఆధ్యాత్మిక జీవులకు మృష్టాన్నభోజన సంతృప్తి కలిగించిన ధన్యజీవులు శ్రీ శ్రీధరరావుగారు.