గుంటూరు ఆదిశేషయ్య
గుంటూరు ఆదిశేషయ్య అంటే జిల్లెళ్ళమూడి వచ్చే ఎక్కవ మందికి తెలియదు. వంట శేషయ్య అంటే అందరికీ తెలుసు. అందరింటికి తొలి రోజులలో లక్ష్మీనరసమ్మగారు చింతకాయపచ్చడి, చారు వేసి అన్నం పెట్టినా ఎంతో రుచిగా లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. అలాగే 1966కు పూర్వం ఎప్పుడున్నా అమ్మ పుట్టిన రోజు ఉత్సవానికో, కళ్యాణ మహోత్సవానికో వేలకు వేలు జనం వస్తే ఆ పండుగలకు పెద్ద వంటవాడిగా వచ్చి వంట చేసి వెళ్ళుతుండేవాడు. హనుమ బాబు వాళ్ళ అమ్మ భాగ్యమ్మగారు చిరకాలం వంటింట్లో సేవ చేసింది. భాగ్యమ్మగారు కూడా అమ్మ వద్దకు రాకపూర్వం వంటలు చేయటానికి శేషయ్యగారి వెంట వెళ్ళుతుండేది. ఆ పరిచయంతో భాగ్యమ్మగారు వచ్చిం తర్వాత శేషయ్యగారు కూడా జిల్లెళ్ళమూడి రావటం మొదలైంది. శేషయ్యగారు బాపట్ల చుట్టు ప్రక్కల ఆరితేరిన వలలుడిగా ప్రసిద్ధి చెందినవాడు. వలలుడంటే విరాట రాజు కొల్వులో అజ్ఞాత వాసం చేసే రోజులలో పాండవులున్నప్పుడు, భీముడు వలలుడు అనే పేరుతో వంటవాడుగా ఉండేవాడు. విరాటరాజు కొలువులోకి వెళ్ళేముందు భీముడు.
“వలలుడనంగ పేరునను వంటల వాడనయై విరాటునిం గొలిచి మహానసంబున అకుంఠితతేజము మీర నేర్పుమై పలురుచిరంబులైన రసవత్ నవపాకములందరు మెచ్చునట్లుగా పెలుచన కూడు కూరలును పెట్టిన రేనికి ప్రీతి బుట్టగన్ అంటారు.
శేషయ్యగారు కూడా అమ్మకు ఇష్టమయ్యేటట్లుగా, అమ్మకు ఇష్టం కావటం అంటే అందరింట్లోని అందరూ ఇష్టపడేవిధంగా వంట చేసి పెట్టేవాడు. శేషయ్య సాంబారు చేశాండంటే ఆ సాంబారు ఘుమఘుమలు ఈనాటికి మనకు జ్ఞాపకం రావలసిందే, మన నోరూరిస్తూనే ఉంటుంది.
ఎప్పుడు ఎంతమంది అనుకోకుండా వచ్చినా, అర్థరాత్రి, అపరాత్రి అని అనుకోకుండా 4, 5 బస్సుల జనం వచ్చినా బయటకు వచ్చి ఒకసారి తెరిపార చూచి అర గంటలో వంట తయారుచేసే నేర్పు శేషయ్య గారిదే. ఎక్కడా ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగేది కాదు.
అసలు శేషయ్యగారు వంటవాడు కావటమే ఒక విచిత్రం. భీముడంతటి వాడు వలలుడైనట్లు, నలమహారాజంతటివాడు ఋతుపర్ణుడైనట్లుగా 40 ఎకరాల సుక్షేత్రమైన పొలమున్న శేషయ్యగారు కూడా వంట వాడైనాడు. కాలం, కర్మం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందట. శేషయ్యగారిది గుంటూరు జిల్లాలోని పోలూరు గ్రామం. తండ్రి దక్షిణామూర్తి, తల్లి కనకమ్మ. చిన్నప్పుడే అంటే శేషయ్యగారికి 7 సంవత్సరాలున్నప్పుడే తల్లి చనిపోయింది. చిన్నతనమంతా చెరుకూరులో అమ్మమ్మగారింట్లోనే పెరిగాడు. తను పెరిగి పెద్దవాడు కాకముందే తండ్రి గతించాడు. కుటుంబ భారాన్ని మోయటంలో ఆనాటి వైదిక వృత్తిలో తగిన ఆదాయంరాక, బ్రాహ్మణ వ్యవసాయం గిట్టుబాటు కాక తండ్రి అమ్మింది అమ్మగా, తానే పెద్ద కొడుకు కావడంతో తమ్ముళ్ళను పైకి తేవలసిన బాధ్యతతో ఉన్నపొలం కూడా ఊడి పోయింది. కర్పూరంలా కరిగి పోయింది.
ఆ సమయంలో బ్రతుకు తెరువు కోసం వంటవాడు కాక తప్పలేదు. పరిస్థితుల ప్రభావంతో వంట విద్యలో ఆరితేరి గుంటూరు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన వంటవాడుగా ఎదిగాడు. స్వీట్లు, వివిధ రకాల పిండి వంటలు చేయటం బొంబాయి వెళ్ళి చేయి తిరిగిన వంట వాళ్ళ వద్ద నేర్చుకొని వచ్చాడు.
మేనమామ కూతురు కమలమ్మతో వివాహమైంది. మూడుపూలు ఆరు కాయలుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో 1966లో అమ్మ వద్దకు రావటం జరిగింది. అప్పటికే శేషయ్యగారి పేరు విన్న అమ్మ అందరింట్లో వంట బాధ్యతను అప్పగించింది. అమ్మ గుండెకాయ అనిపించుకొనే అన్నపూర్ణాలయానికి శేషయ్యగారు ప్రధానాధికారియైనాడు. శేషయ్యగారికి అన్నపూర్ణాలయం అప్పగించిం తర్వాత అమ్మ ఎప్పుడూ దాని గూర్చి, ఆశాక పాకాలను గూర్చి ఆలోచించాల్సిన అవసరం కలుగ లేదు. ఎందుకంటే ఆయనే గుండె అయి గుండిగలకు, గుండిగలు దించాడు. జిల్లెళ్ళమూడిలో ఆర్థిక వనరులు లేని రోజుల్లో ఉన్న వస్తువులతో రుచికరంగా చేశాడు. అర్థరాత్రి, అపరాత్రి భక్తులు వందలలో వచ్చినా తన యింటికి బంధువులు వస్తే ఎంత ప్రేమగా, ఆదరణగా చేసి పెట్టుతామో అలా చేసిపెట్టే వాడు. అంతేకాదు ఎవరు అందరి పెళ్ళిళ్ళు జరుపుకున్నా మొగ పెళ్ళివాళ్ళూ, ఆడ పెళ్ళి వాళ్ళూ మెచ్చుకొని సత్కరించి వెళ్ళేరీతిలో రుచికరంగా చేసేవాడు. తాను వంట చేయటమే కాదు వడ్డన కూడా చేసేవాడు. మా వంటి చిన్న వాళ్ళకు వడ్డన ఎలా చేయాలో, ఎక్కువ ఉన్న పదార్థం ఎలా వడ్డించాలి. తక్కువ ఉన్న పదార్థం ఎలా వడ్డించాలి. వంట మధ్యలో పదార్థం అయిపోతే భోజనం చేసే వారికి ఎలా ఏ కార్యక్రమంలో కాలక్షేపం చేయించాలి వంటి మెళకువలు నేర్పేవాడు. మామూలు రోజులు కానివ్వండి, ప్రత్యేక ఉత్సవాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి అన్నపురాశికి హారతి ఇచ్చింతర్వాతే వడ్డన కార్యక్రమం మొదలయ్యేది. అయితే వంట చేయటంలో నైపుణ్యం ఎవరికి వారు అనుభవంతో నేర్చుకోవాల్సిందేనని చెప్పేవాడు.
అమ్మ శేషయ్య గారితో… “పుట్టిన రోజు పండుగకు పదార్థాలు తక్కువ ఉండాలి. చేసినవి రుచిగా దండిగా ఉండాలి. అట్లా అయితే వడ్డన చాలా సులభంగా ఉంటుంది. అంతమంది మీద వడ్డన అందకపోతే కష్టం. పైగా నీళ్ళు త్రాగి త్రాగి ఉంటారు. పదిహేను పిండివంటలు చేసినా అందరూ తినలేరు. అయినా అప్పుడు ఆకలితో చకాచకా తింటారే కాని, ఎప్పుడు అమ్మ వస్తుందో అనే ధ్యాసలో అన్నాల మీద ఆసక్తి ఎవరికుంటుంది?” నేను తలంటి పోసుకొని వచ్చేలోగా భోజనాలు చేసే వాళ్ళను చెయ్యమనండి. ముఖ్యంగా పసిపిల్లలు, భజంత్రీలు సుడిపడకుండా ఉంటారు. దగ్గర ఉండి వంటకు ఎట్లా వసతిగా ఉంటుందనుకుంటే అట్టా కట్టించుకోండి గాడిపొయ్యి. ఏ పనివాళ్ళకు ఆ పనిలో మెలుకువ తెలుస్తుంది” అని చెప్పింది.
మొదట్లో అమ్మ మీద శేషయ్యగారికి దేవతగా తలవటం ఇష్టం లేదు. అయితే రెండు సన్నివేశాల్లో కలిగిన అనుభవాలు ఆయనకు అమ్మ మీద విశ్వాసం కలిగించాయి. ఒకసారి తనకు తెలియకుండా తన శరీరం అవశమై క్రిందపడిపోయి స్పృహలేదు. అమ్మ శేషయ్యగారికి చేయించిన సేవవల్ల తనకేదో జరిగింది. అమ్మ రక్షించింది అనుకున్నాడు. రెండవది సలసల మరుగుతున్న పులుసుకళాయిలో చేయిపెట్టి అమ్మ పులుసులోని ముక్కలను, పులుసును రుచి చూసింది. అలా చేస్తే చేయి ఏమౌతుందో ఆయనకు తెలుసు. కాని |అమ్మకు ఏమీ కాకపోవటం, బాధ లేకపోవటం ఈమెలో ఏదో మహత్తర శక్తి ఉన్నది అనిపించి స్థిరమైన విశ్వాసం కలిగింది.
అమ్మ స్వర్ణోత్సవాలలో లక్షమందికి ఒకే పంక్తిన భోజనం పెట్టిన ఘట్టం శేషయ్యగారి జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ నిర్వహణలో విశిష్టమైన ఘట్టం. వారి ఆధ్వర్యంలో వంద ఎకరాల పొలంలో 200 గాడిపొయిలపైన వంట జరిపించటం, అన్నపురాశికి హారతి యిచ్చి అన్నం తినే అన్నయ్యలను, అక్కయ్యలను చూడటానికి బయలుదేరటం ఒక మరపురాని మనోహర దృశ్యం. శేషయ్యగారి పర్యవేక్షణ అమోఘం అనితరసాధ్యం. పులుసుబెట్టి అరటి కాయ కూర, దోసకాయ ముక్కల పచ్చడి, సాంబారు, పులిహోర, పెరుగు వంటి పదార్థాలు యీనాటికీ గుర్తున్నాయంటే శేషయ్యగారి నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన ఆ సమయంలో చేసిన గోంగూర పులుసుకూర నెల రోజుల వరకు పాడుగా కుండా అందరూ తిన్నారంటే అమ్మ మహిమకు తోడు శేషయ్యగారి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. భోజనాలకు ముందు ‘జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి’ అమ్మ నామం చేయించేవాడు. తాను ఒక వంట వానిగా, ఉద్యోగిగా ఎన్నడూ భావించ లేదు. అందరింటిలో అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ తలా ఒక పని చేస్తున్నట్లే ఎవరికి ఏ పనిలో అభినివేశం ఉంటే ఆ పనిని నైపుణ్యంగా వారు చేస్తున్నట్లే. శేషయ్యగారు కూడా వంట పని చేసేవాడు. తను చేసే పనిని అమ్మ మెచ్చుకొనేటట్లుగా భగవంతునికి చేస్తున్న సేవగా, సమర్పిస్తున్న నివేదనగా చేసేవాడు.
సహజంగా శేషయ్యగారంటే అందరికీ భయం, కోపంగా కనిపించేవాడు. కాని వెన్నలాంటి మనస్సు ఆయనది.
శేషయ్యగారి కూతురి పెళ్ళి అమ్మ తన చేతుల మీదుగా జరిపింది. 1966 నుండి 1980 దాకా షుమారు 14 సంవత్సరాలు అందరింటిలో అమ్మ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. వృద్ధుడై అనారోగ్యంతో వంట చేయలేక బాపట్లలో ఉండి అప్పుడప్పుడు జిల్లెళ్ళమూడి వచ్చినపుడు శేషయ్యగారిని చూచి అమ్మ మనం పెన్షన్ ఏర్పాటు చేయలేక పోయామే అని బాధపడటం నేను చూచాను. 26.8.1986 నాడు మానసిక స్థిమితం తప్పి రైలు క్రిందపడి అమ్మలో కలిసి పోయినట్లుగా తెలిసి జిల్లెళ్ళమూడి సోదరులు, అందరింటి సభ్యులు ఎంతో విచారించారు. తన వృత్తి ధర్మం నిర్వహిస్తూ అందులోనే అమ్మకు సేవ చేసుకున్న శేషయ్యగారు ధన్యజీవి.
(ఈ వ్యాసం విషయ సేకరణలో సహకరించిన సోదరుడు లక్కరాజు సత్యనారాయణకు (లాలా) కృతజ్ఞతలు)