1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు

ధన్యజీవులు

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 5
Month : July
Issue Number : 3
Year : 2006

(స్టేషన్ మాష్టరు పినమాక వెంకట్రామయ్య)

అమ్మకు 13 సంవత్సరాలు నిండి 14వ సంవత్సరం జరుగుతున్న రోజులలో తెనాలి వెళ్ళింది తన అమ్మమ్మ వాళ్ళింటికి. అక్కడ మౌలాలీ, శ్యామల, మోహన, హనుమాయమ్మ, నాగభూషణం అమ్మను వదలకుండా అమ్మతో సంభాషణలు చేస్తూ అమ్మలోని అతిలోక మానవత్వాన్నీ దైవత్వాన్నీ గుర్తిస్తుంటారు. అమ్మ మన్నవ వెళ్ళటానికి సిద్ధపడుతూ వాళ్ళందరినీ కొంతకాలం మహానందిలో ఉండమని చెప్పింది. వాళ్ళందరినీ పంపించి రావటానికి సుబ్బయ్య తాతగారితో చెప్పి రైల్వేస్టేషన్కు వచ్చింది. వాళ్ళు అమ్మ రాక కోసం చూస్తూ టిక్కెట్లు తీసుకోలేదు. ఇంతలో రైలు వచ్చింది. అమ్మ అప్పుడే స్టేషన్ ప్లాట్ ఫారం మీదకు వచ్చి ‘రైలెక్కండి’ “నీకోసం చూస్తూ టిక్కెట్లు తీసుకోలేదమ్మా!” అన్నారు. సరే మీరు రైలెక్కి కూర్చోండి నేను టిక్కెట్లు తెస్తానని స్టేషన్ మాష్టరు దగ్గరకు వెళ్ళి టిక్కెట్లు తీసుకున్నది. టిక్కెట్లు చేతిలో పెడుతూ “మీదేవూరు?” అంటే ఈ ఊరే నన్నది. మీ అమ్మా నాన్నా. ఏ ఊళ్ళో ఉన్నారు అంటే మన్నవలో అని చెప్పింది. మరి ఈ ఊరే నంటావేం? అని (అడగ్గా) నేనెక్కడుంటే అదే నా ఊరు అన్నది. బలిచక్రవర్తికి వామనుడు చెప్పినట్లుగా.. ఒక్కదానికి అయిదు టిక్కెట్లెందుకమ్మా? అంటే, అమ్మ అయిదుగురు ఉన్నారు నాయనా! ఎవరమ్మా అంటే, నా పిల్లలే నాయనా! అన్నది. ఇంత చిన్న పిల్లవు వాళ్ళు నీకు పిల్లలేమిటి? ఇంత చిన్న పిల్లప్పుడే నీవు పూజ చేశా వెందుకు? అని ఎదురు ప్రశ్నించింది అమ్మ. ఎవరి చిన్నప్పుడు? అన్నాడు. అర్థంకాక స్టేషన్ మాష్టరు. ఇంతకు క్రితం నీవు చిన్న వాడివే నేనూ చిన్న దానినే అన్నది. ఎప్పుడో ఎక్కడో చూచిన ముఖంగా ఉన్నదే అనుకున్నాడు. “చూస్తున్నకొద్దీ ముఖవర్చస్సు మారుతున్నది. నీ వెవరో చెప్పమ్మా?” అన్నాడు. వర్చస్సు మారేది కాదు నాయనా! అంటూ “నీకు ఎక్కడో చూచినట్లుంది” నాకు ఎప్పుడూ నిన్ను చూస్తున్నట్లే ఉన్నది. అన్నది. అంటే “చెప్పటానికి సందేహమెందుకు? చెప్పమ్మా! వీళ్ళందరూ ఎవరు? పోనీ అదన్నా చెప్పమ్మా?” అన్నాడు. “నీకేవరుగా కనబడుతున్నారు? నాకు తెలిస్తే అడగను గదా! పిల్లలంటావు? ఇంత చిన్న పిల్లకు అంత పెద్ద వారు పిల్లలేమిటి? అందుకు అమ్మ పొట్టిగా ఉన్నాననా చిన్నపిల్ల అంటున్నావు? అమ్మ కోసం ఉన్నవారంతా నవ్వుతూ ఇంతలో మౌలాలీ “రా అన్నయ్యా! కూర్చో. మనందరికీ అమ్మ ఆ చిన్నపిల్లే. అమ్మ ఎంత పెద్దదో మనకేం తెలుసు?” అనగానే స్టేషన్ మాష్టరుకు ఆశ్చర్యము రోమాంచము వేసి మౌలాలీని కౌగిలించుకొని ‘యేం అమ్మా! చెప్పవా?’ అన్నాడు.

అమ్మ అప్పుడు స్టేషన్ మాష్టరుతో ఏడు సంవత్సరాలక్రితం ఏలూరులో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ దొడ్లో నేను తులసీ దళాలకు వచ్చి కోస్తుండగా నా జడపుచ్చుకొని జడచూడు ఎట్లా ఉందో తాచుపామల్లే అని నా బుగ్గ మీద విసిరి కొట్టలా? స్టేషను మాష్టరుకు అప్పటికీ జ్ఞాపకంరాక ఎవరింటి దగ్గర ఎప్పుడు? అని అడిగాడు. అప్పుడు అమ్మ ఏలూరులో యల్లంరాజు హరినారాయణగారి ఇంటి దగ్గర మీ ఇల్లు ఉండేది. మీ నాయన ఓవర్సీరు నీ పేరు వెంకట్రామయ్య మీ ఇంటి పేరు పినమాకవారు. మీ నాన్న పేరు నరసింహరావు. ఎప్పుడూ చౌడేశ్వరీ పూజ చేస్తుండేవారు. నువ్వు నన్ను కొట్టగానే మీ నాన్నగారు వచ్చి నిన్ను వెనక్కులాగి నన్ను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చో బెట్టుకుని నా బుగ్గకందటం చూచి కొంచెం కొబ్బరి నూనె రాసి అప్పుడే నివేదనకు, రవ్వకేసరిని తెచ్చిన మీ అమ్మతో ‘జ్ఞానేశ్వరిదేవి మంగళవారం నాడు ఈ రూపంలో మన ఇంటికి వచ్చింది ఆ రవ్వకేసరి ఈ అమ్మకు పెట్టు’ అన్నారు. ‘ఆ దొంగ పిల్లను ఈ ఇంట్లో కూర్చోబెట్టేరేంటి’ అన్నావు నీవు. అంతకు వారం రోజుల ముందు నా చేతికి కారప్పూస పొట్లం ఇచ్చి నా చేతికి ఉన్న నాగవత్తులు లాగుతుంటే నీకు నొప్పి పుట్టుతుంది ఉండు అంటూ నేనే తీసి ఇస్తా అంటుండగా మీ జవాను వచ్చాడు. అప్పుడు నీవు దొంగ తనం బయట పడుతుందని పరుగెత్తి కెళ్ళావు. అని పాత సంగతులు చెబుతుండగానే స్టేషను మాష్టరు అమ్మ కాళ్ళ మీద పడ్డాడు క్షమించమంటూ. క్షమ ఎప్పుడూ ఉన్నది. నీవు గుర్తు చేయమంటే చేసా. నీవు చేసింది తప్పు అని నేను అనుకుంటే ఆ రోజే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి శిక్ష వేయించేదాన్ని అని అమ్మ అనగా అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఈ దుర్మార్గుడికి ఏదైనా శిక్ష వేయమ్మా అని అడిగాడు. “దుర్మార్గుడికి సరియైన శిక్ష ఇదే నాయనా! దుర్మార్గుడు దుర్మార్గాన్ని గుర్తించి సన్మార్గంలోకి మారి నాకు శిక్షవేయమని అడగటమే శిక్ష, రక్ష. అటువంటి శక్తే వాడికి రక్షణ” అన్నది అమ్మ.

ఇంత పవిత్రమైన అన్నయ్య ఏవరమ్మా? అని శ్యామల అడగ్గా నేను పవిత్రుణ్ణి కాదమ్మా! నా అంత అపవిత్రులు లేరు అని స్టేషన్ మాష్టరు అంటుండగా పవిత్రుల నోటి వెంట ఉచ్చరింప బడ్డావు కనుక నీవూ పవిత్రుడవే అన్నాడు. నాగభూషణం. అందుకు అమ్మ “పవిత్రులు అపవిత్రులు అంటూ లేరు నాయనా! అమ్మకు అందరూ పవిత్రులే” అన్నది. “అందుకే అమ్మల కమ్మ వైనావు” అన్నాడు మౌలాలీ. అమ్మ స్టేషను మాష్టరుతో “జరిగి పోయినదాన్ని గూర్చి విచారపడకు నాయనా! వీళ్ళను మార్కాపురం వెళ్ళే రైలు ఎక్కించి పంపించు” అన్నది అమ్మ. “వీళ్ళను మా యింటికి తీసుకెళ్ళుతానమ్మా! ఒక రోజు అట్టే పెట్టుకుంటా. ఇటువంటి వారి దర్శనం కావటం భగవంతుని దర్శనమైనట్లే. వీళ్ళు నను బాగుపర్చటానికే ఈ ఊరొచ్చినట్లుంది” అన్నాడు స్టేషను మాష్టరు. అమ్మను గూర్చి తెలుసుకోవాలనే ఉద్దేశం పోయింది. ఇప్పుడు అని నాగభూషణం అనగా, ఏదో అర్థం కాని శక్తి అని తోస్తున్నది కాని, మిమ్మల్ని గూర్చి తెలుసు కోవాలని ఉన్నది అన్నాడు స్టేషను మాష్టరు. మనం అంతా అర్థం కాని ఆ శక్తిలోని వాళ్ళమే అన్నాడు నాగభూషణం. అమ్మా వీరి మాటలు వింటుంటే వేదాల్లోని వాక్యాల్లా నావంటి అజ్ఞానికే అనిపిస్తున్నాయి. ఇక జ్ఞానులు ఈ మాటల్లో ఎంత సారం తీస్తారో అని స్టేషను మాష్టరు అనగా అమ్మ జ్ఞానులకు అన్ని మాటలు మహా వాక్యాలే. కొన్ని బాగుండటం కొన్ని బాగుండక పోవడం అజ్ఞానం. రెండుగా కనబడటం అజ్ఞానం. ఒకటిగా కనబడటమే జ్ఞానం అన్నది. అమ్మను కూడా తన ఇంటికి ఆహ్వానించాడు స్టేషను మాష్టరు. అమ్మ కూడా అంగీకరించింది.

స్టేషను మాష్టరు స్నేహితుడు అప్పుడే రాగా అమ్మను దేవతగా చెప్పి నమస్కరించమనగా ముందు ఒప్పుకొని అతడు అమ్మతో జరిగిన సంభాషణ తరువాత అమ్మ సాక్షాత్ భగవత్స్వరూపమేనంటూ అమ్మ పాదాల మీదపడి రెండు గంటలు అలాగే ఉండి పోతాడు. అమ్మ ఆప్యాయంగా తలనిమిరి లేపుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి స్టేషను మాష్టరు ఇంటికి వెళ్ళారు.

అక్కడ స్టేషన్ మాష్టరు వెంకట్రామయ్యగారు భార్యను పిలిచి బిందెతో నీళ్ళు, కాళ్ళు కడుగు పళ్ళెం తెప్పించి గడపదగ్గరే కాళ్ళుకడిగి వాళ్ళ పెద్దకూతురు ఇందుమతి తెచ్చిన టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు. అమ్మ కాళ్ళు కడిగిన తీర్థం అందరూ పుచ్చుకున్నారు. తమ అమ్మాయికి తెచ్చిన కొత్త పరికిణీ జాకెట్, స్టేషన్ మాష్టరుగారి ఉత్తరీయం వోణీగా తెచ్చి పూజా సామగ్రి దగ్గర పెట్టుకొని అందరూ పూజ చేసుకున్నారు. అమ్మ అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది.

అమ్మ ఇంటికి బయలుదేరి గడపలు దిగుతుండగా పెద్ద త్రాచుపాము గడపలో పడుకొని ఉన్నది. అందరూ దాన్ని చంపటానికి ప్రయత్నిస్తుండగా స్టేషను మాష్టరు భార్య శివకామసుందరితో తీర్థ ప్రసాదాలు తెప్పించి పాముకు పట్టించింది. అమ్మ. అమ్మ పాటపాడమనగా శివకామసుందరి పాడినపాటకు తగినట్టు తల ఊపుతూ నాట్యం చేస్తుంది పాము. ఆ రకంగా అమ్మ వెంకట్రామయ్య కుటుంబాన్కి దర్శన స్పర్శనాలు ప్రసాదించి ఎక్కడున్నా రక్షిస్తానని హామీ ఇచ్చి తరిపం చేసింది. అమ్మ కరుణ పొందిన ఆ స్టేషన్ మాష్టరు వెంకట్రామయ్య, ఆ కుటుంబము, అయన స్నేహితులు ఎంత ధన్యులో.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!