రావూరి నరసింహమూర్తి
జిల్లెళ్ళమూడి, అమ్మ ఉనికివల్ల ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అమ్మ తాను అవతరిస్తూ తనకు సంబంధించిన చాలా మందిని తనతో తెచ్చుకున్నది. ఎవరు ఏపనికి అవసరమో ఎవరిచేత ఏ పని చేయించాలో వారి చేత ఆపని చేయించింది, చేయిస్తున్నది. అందువల్ల జిల్లెళ్ళమూడిలో చర్మచక్షువులకు కనుపించే వారు కనుపించనివారు ఎందరో దేవతలు ఋషులు ఉంటుంటారు. మనలో ఉన్న మహనీయులను ఎంత మందిని మనం మనకు తెలిసి “రహి” మనతో తిరిగాడు. గుర్తించగలిగామా? అమ్మలోని అతిలోక మానుషత్వాన్నే అంగీకరించని వారున్నారు. సరే దానికేమి ? శ్రీకృష్ణుని కాలంలో కృష్ణుని గారడి వాడు అన్నాడు దుర్యోధనుడు, ఎప్పుడూ ఉంటుంటారు మంచివాళ్లు, చెడ్డవాళ్ళు. – అమ్మ మంచి, చెడ్డా ‘వాడి’వే అన్నది కనుక రెండూ సమానమే ఆమెకు. అందరికీ సుగతిని ప్రసాదించగల అపూర్వ అద్భుత మాతృత్వం మహనీయత్వం అమ్మదే. మహనీయులైన ఋషితుల్యు లెందరో అమ్మను సేవించుకున్న వారున్నారు. వారిలో అగ్రశ్రేణికి చెందినవారు రావూరి లక్ష్మీ నరసింహంగారు. అమ్మ మాత్రం ఆయనను నరసింహమూర్తి అని పిలిచేది.
నరసింహమూర్తిగారిది జిల్లెళ్ళమూడికి ఏడుమైళ్ళదూరంలో ఉన్న చెరుకూరు గ్రామం. 1960లో అమ్మను చూచారు. జిల్లెళ్ళమూడికి నడిచివచ్చేవారు. మొదటిసారి వారు జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు అన్నపూర్ణాలయంలో చింతకాయ పచ్చడి రోకళ్ళతో దంచుతున్నారు. ఆయన అమ్మ వద్దకు కూడా పోకుండా ఆ చింతకాయపచ్చడి దంచటంలో పాలు పంచుకున్నాడు. తరచు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ వాత్సల్యాన్ని పొందటమేకాక అందరింటిలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనేవారు. తన తల్లి దండ్రులకు ఒకడే కుమారుడు, గారాబంగా పెరిగాడు. ఐనా జిల్లెళ్లమూడిలో అందరింటి పునాదులు తీయటంలో, ఇటుకలు తయారుచేయడంలో, ఇటుకలు కాల్చడానికి, ఊకతోలడంలో, ఇటుకలు కాల్చటంలో, పొలంపనులు చేయడంలో, అమ్మ స్నానానికి కావళ్ళతో నీళ్ళు మోయటంలో ఆయన ముందుండి చేసేవాడు, చేయించేవాడు. తన ఇంట్లో ఒక పని కూడా చేసి ఎరుగడు. కాని జిల్లెళ్ళమూడిలో ఒళ్ళువంచి తన పనిగానే కాదు భగవత్కార్యంగా భక్తి ప్రపత్తులతో చేసేవాడు.
ఒకసారి అమ్మను, 108 బిందెలతో అభిషేకం చేసుకుంటానమ్మా ! అని అర్థించాడు. అమ్మ సరే నన్నది. అభిషేకం మొదలైంది. ఆయన ఒక్కడే కాదు ఆవరణలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి అమ్మకు అభిషేకం చేసుకోవటం మొదలైంది. అమ్మ సమాధి స్థితిలోకి వెళ్ళింది. అంత సేపు అభిషేకాలు చేస్తుంటే నాన్నగారికి కోపం వచ్చి మందలించారు. తర్వాత అమ్మ తనే చేసుకోమన్నానని చెప్పింది. నాన్నగారు శాంతించారు.
1968లో మాతృశ్రీ మాసపత్రిక నడపటానికి ‘మాతృశ్రీ ప్రింటర్స్’ పేర ఒక ప్రెస్ను మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టు అధీనంలో పెట్టటం జరిగింది. ఆ ప్రెస్లో మన వాళ్ళు కంపోజింగ్, ప్రింటింగ్ నేర్చుకుంటే మంచిదని అమ్మ నరసింహమూర్తిగారిని కూడా పంపింది. వారి కుటుంబంలో వారి కుమారుడు రావూరి ప్రసాద్, కుమార్తె రమాదేవి కూడా అమ్మ సేవగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసింహమూర్తిగారు నాలుగు సంవత్సరాలు ఆ బాధ్యతను నిర్వహించి అమ్మ నామ సంకీర్తనలో తన జీవితాన్ని పునీతం చేసుకోవాలని భావించారు. అమ్మ సరేనన్నది. బాపట్ల ప్రెస్పని చేస్తున్నవారు జిల్లెళ్ళమూడి వచ్చి అఖండ నామ సంకీర్తనలో పాల్గొన్నారు. శ్రమజీవి – వినయశీలి – సహన స్వభావుడు అయిన నరసింహమూర్తిగారు. నామయజ్ఞంలో ఒక తపస్విగా, ఋషిగా పాల్గొనేవాడు. ఎవరు నామ సంకీర్తనలో పాల్గొన్నా లేకపోయినా ఆయన తన అదృష్టంగా భావించి ఆ సమయం కూడా తనే సంకీర్తన చేసేవారు. భక్తి ప్రపత్తులతో అమ్మను శ్రీ కృష్ణునిగా భావించి ఆరాధించే వారు. ఎవరు ఏ పని చెప్పినా కాదనే వారు కాదు. అజాత శత్రువుగా ఉండేవారు. ఎంతో నిరాడంబరంగా జీవించేవాడు. తన వస్త్రధారణ ఎట్లా ఉన్నది అని కూడా పట్టించుకొనేవాడు కాడు.
అందరింటి యువకులు మాతృశ్రీ క్రీడా సాంస్కృతిక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా పక్వమైన క్రీడలు, నాటకాలు ఏర్పాటు చేస్తే, మంచి శ్రుతి, కంఠంగల నరసింహమూర్తి. గారు నాటకాలలో పిల్లల్లో పిల్లవాడుగా పాల్గొని వాళ్ళకు ఎంతో ఉత్సాహాన్ని కల్గించారు. ‘ఛైర్మన్’ నాటకంలో స్వాములవారుగా పాల్గొని ఆధ్యాత్మిక కీర్తనలు మధురంగా ఆలాపన చేయటం నేను కూడా విన్నాను. పౌరాణిక నాటకాలలో హరినాగభూషణం గారితో, విద్యాసాగర శర్మగారితో కలసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. తోటి వారిపట్ల ఎంతో ప్రేమతో దయార్ద హృదయుడై సాయం చేస్తుండేవారు.
అమ్మను ‘పరమాత్మా’ ! అని పిలచేవారు. నామయజ్ఞంలో రోజుకు 18, 20 గంటలు పాల్గొన్న రోజులు కూడా ఉన్నవి. సంధ్యా వందనంలో పాల్గొనే వారు. అమ్మ నామం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నిలచి పోయింది. ఆయన సేవా తత్పరతకు నిరాడంబరతకు శ్రమైక జీవనానికి నిదర్శనంగా ఆయన మురుగుకాలువలు కడుగుతుంటే, పరిశుభ్రం చేస్తుంటే చూచాము చాల మందిమి. ఎవరిని పల్లెత్తుమాట అనంగా చూడలేదు. శాంతంగా చిరునవ్వుతో పలుకరించేవారు. ఒక సాధు పుంగవునిగా, నామయోగిగా కాలం వెళ్ళబుచ్చాడు. ఒక తపస్విగా ఋషిగా జీవనం సాగించాడు. అమ్మ అంటే అకుంఠిత విశ్వాసం.
ఇంకా రెండు మూడు రోజులలో చనిపోతాడనగా అమ్మ వద్దకు చేరి ఏకాంతంగా అమ్మతో “ఇన్నాళ్ళూ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకోసం ఉండాలని పించేది. సర్వ సృష్టిని పాలించే అమ్మవు నీవుండగా నేను చేసేదేముంది నన్ను నీలో కలుపుకో తల్లీ” అని అర్థించాడు. అమ్మ “ఏ సంవత్సరం వచ్చా ఎక్కడకు?” అని అడిగింది. “1960లో వచ్చానమ్మా” అన్నాడు. “అలాగే నాన్నా!” అని దగ్గరకు తీసుకుంది.
కృష్ణాష్టమి పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలలో ఒక గోపాలునిగా పాల్గొనటం ఆయనకు ఇష్టం. 12.8.1974న కృష్ణాష్టమి. ఆ పూజలలో అమ్మ వద్దకు ఎవరినీ వెళ్ళనీయలేదు. అమ్మను తాకనీయ లేదు. నరసింహమూర్తిగారు మాత్రం ఎవరినీ లెక్కచేయకుండా వెళ్ళి అమ్మ పాదాల పైబడి నమస్కరించి ఇవతలకు వచ్చారు. ఆ రాత్రే హైమాలయం వద్ద అఖండ నామయజ్ఞంలో పాల్గొంటున్నారు. నామం చేస్తూ చేస్తూనే రాత్రి 1 గంటకు అమ్మలో ఐక్యమైనారు. జీవితంలో కష్టాలు పడలేదనికాదు. కష్టాలను భరించే శక్తి, కష్టాలు కూడా భగవంతుడిచ్చినవే అని భావించే శక్తి అమ్మ ఆయనకు ప్రసాదించింది.
తన ధ్యేయమేదో తనకు తెలిసింది. ఆ ధ్యేయానికి చేరే మార్గం తెలిసింది. మార్గంలో నిరంతర నామయోగిగా తపస్విగా తన సర్వస్వాన్నీ అమ్మ పాదాలపై అర్పించిన పుణ్యజీవి – ధన్యజీవి శ్రీ రావూరి నరసింహమూర్తిగారు.