శ్రీ అన్నంరాజు మాధవరావుగారు గుంటూరు నగరంలో సుప్రసిద్ధ న్యాయవాది అయిన అన్నంరాజు సీతాపతిరావుగారి తమ్ముడు. శ్రీ అన్నంరాజు వెంకట కృష్ణయ్య, బుచ్చమ్మగార్లకు కలిగిన ఏడుగురు సంతానంలో మాధవరావుగారు అయిదవ కుమారుడు. వెంకట కృష్ణయ్యగారికి అన్నంరాజు సీతాపతిరావు, పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, రామారావు, మాధవరావు అయిదుగురు మగపిల్లలు. సుబ్బమ్మ, పున్నమ్మ ఇద్దరు ఆడపిల్లలు.
మాధవరావుగారు కూడా న్యాయవాద వృత్తిలోనే చేరారు. వారు యం.ఎ.యల్.యల్.బి. లక్నో విశ్వవిద్యాలయంలో చదివారు. మంచి టెన్నిస్ ఆటగాడు. పోటీలలో కప్పులు కూడా గెలిచారు. 1942లో లా చదివిన మాధవరావుగారు 1955 వరకు తెనాలిలో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 1955 నుండి సీతాపతిరావుగారు అనారోగ్యవంతులు కావడంతో గుంటూరు వచ్చి వారి వద్ద జూనియర్గా చేరారు.
శ్రీ మాధవరావుగారికి విజయవాడలో శ్రీ రామమోహన్ గ్రంథాలయము, శ్రీ రామమోహన ఆయుర్వేద వైద్యశాలలు నెలకొల్పిన శ్రీ శంకర వెంకట్రామయ్యగారి కుమార్తె కనకదుర్గాంబనిచ్చి వివాహం చేశారు. వివాహమై అయిదు సంవత్సరాలయినా పిల్లలు పుట్టలేదు. దాంతో మాధవరావుగారికి రెండవ వివాహం చేద్దామనుకున్నారు పెద్దలు. మాధవరావు అన్నగారు రామారావుగారు కుసుమహరనాధ భక్తులు. కుసుమహరనాధ భక్తి ప్రచారం చేసే శ్రీ రాళ్ళబండి వీరభద్రరావుగారి వద్దకు తీసుకువెళ్ళారు. వారు కుసుమనాధ పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. కనకదుర్గాంబగారు నిరంతరం ఆ జపం చేసింది. సీతాపతిరావు గారింట్లో కుసుమహరనాథ్ బాబా ఏకాహం జరుగుతుండగా బాబా ఫోటోలో నుండి ఒక పిల్లవాడు, పాకుతూ దుర్గాంబగారి ఒడిలోకి వచ్చాడు. ఆ తర్వాత మురళీకృష్ణ పుట్టాడు. తర్వాత రెండున్నర సంవత్సరాలకు ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టిన పిల్లకు ఫిట్స్, తల్లి దుర్గాంబకు కళ్ళు కనిపించలేదు. కుసుమ హరనాధ్ బాబాకు అమ్మపేరు పెట్టుకుంటామని మ్రొక్కుకున్న తర్వాత అన్ని జబ్బులు తగ్గిపోయాయి. అందుకు ఆ పిల్లకు ‘కుసుమకుమారి’ అని పేరు పెట్టుకున్నారు. ఆ రకంగా కుసుమహరనాధ్ బాబా భక్తిలో అనుష్ఠానంలో కాలం గడుపుతుండగా దుర్గాంబగారికి వసంతకుమారి, రాజ్యలక్ష్మీకుమారి, సీతారామారావు జన్మించారు.
1958లో దుర్గాంబగారు మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించింది. తెనాలిలో మాధవరావుగారి అన్నగారు వెంకటేశ్వరరావుగారు న్యాయవాది. వారి కుమార్తె సరోజినీదేవి, కొమరవోలు గోపాలరావుగారు. జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకుంటుంటే వారితో వచ్చిన దుర్గాంబగారితో నిన్ను 1956కు పూర్వమే తెనాలిలో చూచానని అమ్మ చెప్పింది. అప్పుడే నీ ఒడిలోకి ఎందుకు తీసుకోలేదమ్మా! అంటే దేనికైనా తరుణం రావాలిగా అని బదులిచ్చింది.
తరువాత మాధవరావుగారు, అన్నంరాజు రామకృష్ణారావుగారు వారి తండ్రిగారి ఆబ్దికం జిల్లెళ్ళమూడిలో పెడుతుంటే వెళ్ళారు. బ్రాహ్మణుడు లేకుండా మంత్రాలు లేకుండా అమ్మకు నైవేద్యం ఇస్తుంటే ఇదేమిటి? ఈ ఆబ్దికం అని బాధపడుతున్నారు. ఇంతలో అమ్మ “ఏది గారెల్లోకి ఆవపచ్చడి చేయించలేదా?” అని అడిగింది. ఆ మాటలు వారి అన్నగారైన శ్రీ వెంకటేశ్వరరావు గారి గొంతులా వినిపించడంతో ఆశ్చర్యపోయారు మాధవరావుగారు.
మాధవరావుగారి కూతురు కుసుమ పెళ్ళి గుంటూరులో జరిగింది. అన్నంరాజు రామకృష్ణారావుగారు జిల్లెళ్ళమూడి నుండి పెళ్ళికి గుంటూరు బయలుదేరుతుంటే అమ్మ “మీ పిన్నికి పుట్టింటి వారెవరూ లేరు కదరా అని కనకదుర్గాంబగారికీ, మాధవరావుగారికి బట్టలు, పెళ్ళికూతురికి మధుపర్కాలు, తలంబ్రాలు, ప్రసాదం, తీర్థం అమ్మ స్వయంగా ఇచ్చి పంపింది. రామకృష్ణారావుగారు వాటిని తీసుకొని సరాసరి గుంటూరు చేరారు. గుంటూరులో మాధవరావుగారి భార్య దుర్గాంబగారు ఒంట్లో బాగోలేక అపస్మారకంలో ఉన్నది. పీటల మీద పెళ్ళి ఆగిపోతుందేమోనని భయం. మరునాడు పెళ్ళి. ఇక్కడ పరిస్థితి. ఇది.
బందరు చక్రవర్తిగారి కుటుంబానికి ఫోను చేసి తరలి రావద్దని చెబుదామనుకున్నారు. అప్పుడు రామకృష్ణారావుగారు “అమ్మ ప్రసాదం ఇచ్చి పంపింది. పిన్ని లేస్తుంది. భయపడవద్దు. పెళ్ళికి ఎటువంటి ఆటంకం రాదు” అని దుర్గాంబగారికి అమ్మ ఇచ్చిన కుంకుమతో బొట్టు పెట్టి తీర్థం ఇచ్చి పిన్నీ! అమ్మ మీకు బట్టలు, ప్రసాదం పంపింది అని చెవిలో గట్టిగా చెప్పాడు. స్పృహలో లేని దుర్గాంబగారు కదిలింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పీటల మీద కూర్చొని కన్నెధార పోసింది. డాక్టర్లకే అంతుబట్టని విషయంగా మిగిలిపోయింది. ఆనాటి విషయం.
గుంటూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్తువారు వారం వారం అమ్మ పూజలు పెట్టేవారు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరింట్లో జరిగేది. మాధవరావుగారు, దుర్గాంబగారు పార్వతీ పరమేశ్వరుల్లాగా ప్రతివారం పూజలకు వచ్చేవారు. మాధవరావుగారు చిన్నలలో చిన్నగా, పెద్దలలో పెద్దగా సంచరించేవాడు. అమ్మవద్దకు వచ్చి శ్రీశైలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్న శ్రీ పూర్ణానందస్వామి మాధవరావు గారిని వృద్ధబాలుడు అనటం నిజంగా వారికి బాగా సరిపోతుంది. అంత ఉత్సాహంగా ఉండేవారు. దుర్గాంబగారికి క్రిందపడి చేతులకు ప్రాక్చరయింది. ఆపరేషన్ చేయిద్దామనుకున్నారు. ఈ వయసులో దానికి ఆపరేషన్ ఎందుకు వద్దులే అని అమ్మ అన్నది. మాధవరావుగారు అమ్మ చెప్పింది. కనుక ఆపరేషన్ వద్దనుకున్నారు. కాని కూతురు కుసుమ ఒప్పుకోలేదు. రామకృష్ణారావుగారు అయితే అమ్మను ఒప్పించు అలాగే చూద్దాం అన్నారు. కుసుమ జిల్లెళ్ళమూడి అమ్మవద్దకు ఒకరోజు అనుకున్నదానికన్నా ముందే వచ్చింది. అదే మొదటిసారి కుసుమ అమ్మ వద్దకు రావటం. ఒకరోజు ఉందామని వచ్చిన కుసుమ అమ్మ కోర్కెపై నాలుగురోజులు ఉండటానికి ఒప్పుకొన్నది. కాని మూడవరోజు మాధవరావుగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని కబురు వచ్చింది. అమ్మ ఫరవాలేదమ్మా! తగ్గిపోతుంది! అన్నా మనసు ఆగక గుంటూరు వెళ్తానమ్మా! అని అడిగింది. అమ్మ గారె, ప్రసాదం ఇచ్చి పంపింది. ఇక్కడ అమ్మ ప్రసాదం కుసుమ చేతిలో పెట్టిందో లేదో అక్కడ మాధవరావుగారికి తగ్గటం మొదలైంది. కోలుకున్నారు. గుంటూరు వెళ్ళిన కుసుమ మాధవరావుగారిని, తల్లిని తీసుకొని మళ్ళీ జల్లెళ్ళమూడికి వచ్చి అమ్మను అర్చించుకున్నారు.
ఒకసారి దుర్గాంబగారు జిల్లెళ్ళమూడి వెళ్ళింది. ఆమెతో అమ్మ ‘మీరేమో ఇడ్లీలో కారప్పొడి నెయ్యి, కొబ్బరి చట్నీ అన్నీ వేసుకొని తింటారు. నాకేమో వట్టి ఇడ్లీ పెట్టారు. ఎట్లా తినేది’ అన్నది. హడావిడిగా నివేదన పెట్టడంలో మరచిపోయిన విషయం అమ్మకు తెలిసిందని ఆశ్చర్యపోయిందామె. దుర్గాంబగారు జిల్లెళ్ళమూడిలో ఉంటే మాధవరావుగారు పులిహోర చేసి అమ్మకు నివేదన పెట్టారు. అబ్బాయి ఇవాళ పులిహోర చేశాడు. చాలా బాగుంది అని చెప్పింది దుర్గాంబకు అమ్మ. ఇంటికి వెళ్ళాక అడిగితే అవును నేనే చేశాను అన్నారు మాధవరావుగారు. అమ్మకు మనస్సు ప్రధానం. బిడ్డలపై మమకారం. అన్నింటిలో అందరిలో ఉన్నది అమ్మే కదా! ఆమెకు తెలియందేముంది. అందుకే అమ్మ అన్నది ‘మీరు నన్ను మానవిగా చూస్తారు. నేను మిమ్మల్ని దేవతగా చూస్తాను. అని. దుర్గాంబగారు ఆమెకు ఏజబ్బు చేసినా అమ్మ కుంకుమ నీళ్ళలో వేసి త్రాగటమే మందు. ఎవరికేం చేసినా అదే మందు అందరికీ ఇచ్చేది, తగ్గిపోయేవి. నిరంతరం అమ్మ నామం చేస్తూ ఇస్తుంటే తగ్గక యేంచేస్తుంది. విశ్వాసం
మాధవరావుగారి కుటుంబం అంతా అమ్మకు సన్నిహితులైనవారే – అమ్మను తప్ప మరొకరిని తలవనంతగా తలమునకలైనవారు మాధవరావుగారి కుమారుడు. మురళీకృష్ణ, కుమార్తె కుసుమ ఇద్దరూ అమ్మను ఆరాధించేవారే. అమ్మను above God గా భావిస్తాడు మురళీకృష్ణ. విశాఖలో అమ్మకు వారింట్లోనే గుడి కట్టించి నిత్యం మూడుసార్లు పూజలు చేసుకొనే కుసుమ, భర్త చక్రవర్తి ఇద్దరూ ఆదర్శమూర్తులు. మురళీకృష్ణకు కూడా గుంటూరులో దేవాలయం నిర్మించాలని దృఢ సంకల్పం. అంతేకాక తనను రక్షించి తన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చిన అమ్మను అందులో భాగస్వామిని చేయాలని అతని సంకల్పం.
మాధవరావుగారికి వార్ధక్యంలో జిల్లెళ్ళమూడిలో నివాసమేర్పరచుకోవాలని ఉండేది. కాని అమ్మవారికి అది అనుగ్రహించలేదు. వారి కుమారుడు మురళీకృష్ణ స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. అయితే మాధవరావుగారి మరణం మహాద్భుతం. గడ్డం చేసుకొని కుర్చీలో పేపరు చదువుతూ అనాయాసంగా అమ్మలో లీనమైనారు. అలాగే కనకదుర్గాంబగారు నిరంతరం అమ్మ జపం చేస్తూ అమ్మలో లీనమైనారు. 29.05.1909న పుట్టిన మాధవరావుగారు 25.04.1972న అమ్మలో కలిసిపోయారు.
మాధవరావుగారి శతజయంతి ఉత్సవాన్ని వాళ్ళ పిల్లలంతా కలిసి 29.05.2009వ తేదీన గుంటూరులో అమ్మవ్రతం అనసూయవ్రతం చేసుకొని వందమందికి అన్న వితరణ చేశారు. అమ్మ చెప్పినట్లు ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు’ అన్న మాటను అక్షరాలా పాటించినవారు మాధవరావు కనకదుర్గాంబా దంపతులు. వారు అమ్మ సేవలో తరించటమే కాక వారి పిల్లలకు కూడా అమ్మ ఆ అనుగ్రహాన్ని ప్రసాదించింది. నిజంగా మాధవరావు, కనకదుర్గాంబా ధన్యజీవులు.