(గజేంద్రమ్మక్కయ్య)
రావిపాటి గజేంద్రమ్మది గుంటూరుజిల్లా పొన్నూరు దగ్గర ఇటికంపాడు గ్రామము. భర్త సంపెంగరావు వ్యవసాయ దారుడు. 1957లో మొదటిసారి అమ్మను చూడటానికి వచ్చింది. ఆ రోజు పూర్ణిమ. రెడ్డిపాలెం కాంతయ్యయోగిగారు అమ్మను చూడటానికి అమ్మతో వేదాంతచర్చ చేయటానికి వచ్చిన రోజది. వారు అమ్మను రాజరాజేశ్వరిగా గుర్తించిన శుభదిన మది.
గజేంద్రమ్మ అమ్మను చూచినపుడు అమ్మ కన్నులలో పార్వతీపరమేశ్వరులు కనిపించారు. అమ్మలో మహాద్భుతశక్తి ఉన్నది, అమ్మ మనకు కనిపించే మానవమాత్రురాలు కాదు అని నిశ్చయించుకొని పదిరోజులపాటు అమ్మ సన్నిధిలోనే ఉన్నది. అమ్మ స్నానాలగదిలో ఒకరోజు బంగారు వడ్డాణం దొరికింది గజేంద్రమ్మకు. అది తీసుకెళ్ళి అమ్మకిచ్చింది. అమ్మ “అది మీ కోడలే నాకిచ్చింది” అని చెప్పింది. అలా అమ్మ సేవ మొదలైంది.
జిల్లెళ్ళమూడిలో ఆ రోజుల్లో సంస్థ పనులన్నీ సోదరీ సోదరులే చేసేవారు. కూలీలను పెట్టుకోవటం తక్కువ. పొలం పనైనా ఇల్లు కట్టేపనైనా ఏదైనా సరే, అన్నయ్యలు, అక్కయ్యలే చేసేవారు. మూలపాలెంలో 10 యకరాలు పొలం ఉండేది సంస్థకు. అక్కడ నాట్లు వేయటానికి, పంట కోయటానికి గజేంద్రమ్మ వెళ్లేది. గజేంద్రమ్మతో బెండపూడి రుక్మిణమ్మక్కయ్య, పోతుకూచి విద్యాసాగర్ గారి పిల్లలు, రావూరి ప్రసాద్ తల్లిదండ్రులు వెళ్ళి పనులు చేసేవారు. వాళ్ళు పనిచేసి అందరింటికి తిరిగివచ్చేసరికి అమ్మ గోళ్ళల్లో మట్టి ఉండేది. అమ్మ అలిసిపోయి ఉండేది, ఏమిటమ్మా! ఈ మట్టి ఈ చమల అంటే “పొలంలో పని నేను చేయకుండానే మీరు చేశారా?” అనేది అమ్మ. కోతలు కోసేవాళ్ళు, 300 బస్తాలు పురికట్టేవాళ్ళు.
గజేంద్రమ్మ వచ్చిన తొలిరోజులలో అమ్మకు పూజ చేస్తుంటే అమ్మ సమాధిలోకి వెళ్ళిపోయేది. ఎన్నో దేవతా ముద్రలు పడుతుండేవి. ఆశ్చర్యపోయేది. గజేంద్రమ్మ. అమ్మను ఆ రోజులలో రకరకాల వాళ్ళు రకరకాలుగా పూజలు చేసేవాళ్ళు. ఒకరు అమ్మకు వీచటానికి తాటాకు విసనకర్రలు తెచ్చి విసనకర్రలు పూలుగా పూజచేసేవాళ్ళు. సామాన్యంగా పూర్ణిమ, ఏకాదశి దినాలలో ఓంకారనదికి (నల్లమడకాలువ) స్నానానికి వెళ్ళేది అమ్మ. అమ్మతో చాలామంది వెళ్ళేవారు. గజేంద్రమ్మా వెళ్లేది. ఒకసారి ‘గజేంద్రమ్మ కాలువలో స్నానం చేసి గట్టుకు వెళ్ళింది. అమ్మ కాలువలో నుండి రాలేదు. కాలువలో కనిపించలేదు. గట్టుపై ఏడుస్తూ కూర్చున్నది గజేంద్రమ్మ. అమ్మ కాలువలో మునిగి మునక ఈతకొట్టి ఎక్కడకో వెళ్ళి తేలింది. అమ్మకనిపించేదాకా గజేంద్రమ్మ పడ్డ బాధ వర్ణనాతీతం. ‘తపసుఖేన మమసుఖం’ భగవంతుడి సుఖమే నా సుఖం అని భావించే గోపికలాగా గజేంద్రమ్మ బాధపడ్డది.
ఒకసారి శ్రీకృష్ణుడికి తలనొప్పివచ్చిందిట. ఎన్ని మందులు వేసినా తగ్గలేదట. నారదమహర్షి వచ్చాడు. ఏమి స్వామీ! ఏమిటీ గోల నీ బాధ ఎలా తగ్గుతుందో నీవే చెప్పరాదా? అన్నాడు “ఏం లేదు. నారదా! భక్తుని పాదరజం నా తలపై వేస్తే తగ్గిపోతుందయ్యా ! నీవు నా పరమభక్తుడివి కదా! నీ పాదరేణువు నా తలపై వెయ్యవయ్యా! అన్నాడట కృష్ణుడు. క్షమించు స్వామి జగదీశ్వరుడు, యోగీశ్వరుడు అయిన నీ తలమీద నా పాదరేణువులా? అలా చేసి పాపము మూట గట్టుకొని నరకానికి పోలేను. నావల్లకాదన్నాడు. మరి ఎట్లా ఈ తలనొప్పి తగ్గేది? నా భార్యల నడుగమన్నాడు కృష్ణుడు. నారదుడు వెళ్ళి రుక్కిణీ దేవితో సహా అందరినీ అడిగాడు. ఎవరూ ఆ మహాపాపం మేం చెయ్యలేం అన్నారు. అప్పుడు నారదుడితో కృష్ణుడు ఆ గోపికలేమన్నా ఇస్తారేమో కనుక్కోవయ్యా! వాళ్ళ పాదధూళి అన్నాడు. నారదుడు వెళ్ళి గోపికల నడుగగా అంతకంటే మహాద్భాగ్యమేముంది నారదా! మేం ఏ నరకానికి వెళ్ళినా సంతోషమే, కృష్ణుని ఆనందంకంటే మాకు కావలసిందేముంది? అన్నారుట. అదీ గోపికల సరసన. గజేంద్రమ్మ ఆ కోవకు చెందిన ఒక గోపిక అనుకుంటాను.
గోపికలంతా భర్తలను వదిలి పెట్టి భగవంతుడైన కృష్ణుని వద్దకు రాత్రిళ్ళు వస్తుంటే స్వామి అడిగారట గోపికలను. ‘ఇలా భర్తలను వదిలిపెట్టి రావచ్చా? వాళ్ళకు సేవచేస్తూ ఇళ్ళలోనే ఉండాలి గాని” అని. అందుకు వారు సమాధానం చెప్పారుట. “సత్యమే స్వామీ ! నీవు చెప్పింది. ఎవరు నిజమైన భర్త మాకేకాదు మా పతులందరికి పతియైన జగత్పతివి గదా! నీవు, నిన్ను సేవించటం కంటే గొప్ప పాతివ్రత్యం ఏమున్నది?” అన్నారుట గోపికలు.
గజేంద్రమ్మ అలాంటి గోపిక. “నాకంటే పురుషు డెవడురా? ఈ లోకంలో” అనగలిగిన పురుషిక అమ్మ. ఆ అమ్మను సేవించగలిగిన అదృష్టవంతురాలు గజేంద్రమ్మ. అమ్మకూడా గజేంద్రమ్మకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేది. ఏ పని ప్రారంభించాల్సి వచ్చినా జిల్లెళ్ళమూడిలో అమ్మ గజేంద్రమ్మను పిలిపించి మొదటిబోణి ఆమె చేతే వేయించేది.
ఒకసారి అడవులదీవి మధు లాండ్సిలింగ్ వ్యవహారాలలో చాలా ఇబ్బందులలో ఉన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఏ విషయమైనా అమ్మకు చెప్పుకొనే అలవాటు కనుక అమ్మ వద్దకు వచ్చాడు. అమ్మ అరే మధూ! హైమకు, ఒక వెయ్యి కొబ్బరికాయలు కొట్టుకోరా? అన్నది. బిత్తరబోయాడు. చేతిలో తిరుగుఛార్జీలకు కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితిలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టుకోవటమా? ఎలా సాధ్యం? నారుపోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? కన్నతల్లి కడతేర్చకుండా ఉంటుందా? అక్కడే ఉన్న గజేంద్రమ్మ “కొబ్బరి కాయలు నేనిస్తాను కొట్టుకో మధు” అన్నది. గజేంద్రమ్మ ఆ మాట అనేసరికి అమ్మే ఈ రీతిగా పలికించిందనుకుని పని పూర్తి చేశాడు. గజేంద్రమ్మ అలా ఎంతోమందికి అండగా ఉండేదో !
ఏకా అంజన్ (అంజన్ కుమార్ ఆత్రేయ) కొంతకాలం బాపట్లలో మాతృశ్రీ ప్రెస్లో అకౌంటెంట్గా పనిచేస్తూ జిల్లెళ్ళమూడికి వచ్చేవాడు. అమ్మ గజేంద్రమ్మ ఇంటిని అతనికి నివాసంగా ఏర్పాటు చేసింది. పాపం రాత్రి ఎంత ఆలస్యంగా వస్తాడో బిడ్డ అని అంజన్ కోసం మంచం ప్రక్క వేసి ఆహారం రెడీగా ఉంచేది. అతని ఆలనాపాలనా చూస్తూ ఆదరించేది గజేంద్రమ్మ.
ఇలా ఎందరో గజేంద్రమ్మ ప్రేమను పొందినవారు ఒక నంబులనో, ఒక వాన్ డ్రైవర్ వెంకటేశ్వర్లనో ఎంత మందినని చెప్తాం? పాతవారు ఎవరు జిల్లెళ్ళమూడి వచ్చినా వారి కుంటుంబ వ్యవహారాలు, భార్యపిల్లల క్షేమసమాచారాలు విచారిస్తూ ఆప్యాయంగా పలకరించేది. కొన్నివందల మందిని వేలమందిని అమ్మ పెళ్లికొడుకులుగా, పెళ్ళికూతుర్లుగా చేస్తే వాళ్ళందరికీ తలంట్లు పోయటం గజేంద్రమ్మ కృష్ణవేణమ్మల పని. అలా ఎంత మందిని నూతనవధూవరులుగా తీర్చిదిద్దిందో గజేంద్రమ్మ.
హరిదాసుగారు సంస్థ చూసే రోజులలో అమ్మ వెంబడి ఒక సర్పం కూడా తిరగటం గజేంద్రమ్మ చూచింది. అమ్మకు పూజ జరిగిన తర్వాత, ముందుగా అమ్మ. తీర్థం చాకలి శంకరానికిచ్చేది. ఒకసారి అమ్మతో చెప్పకుండా పుట్టమన్ను ప్రసాదంగా తీసుకెళ్తుంటే అమ్మచూచి తప్పు అన్నట్లుగా ముక్కుమీద వేలు వేసుకున్నది. అప్పటి నుండి శంకరం పూజ జరుగుతుంటే అమ్మ వద్దకు వచ్చేవాడు కాదు అని గజేంద్రమ్మ చెప్పింది.
అమ్మ గజేంద్రమ్మతో “నా తలుపులు నీ కోసం ఎప్పుడైనా తెరుస్తారు, నీకు ఏ ఆటంకం లేదు రావచ్చు” అని చెప్పింది. గజేంద్రమ్మ మేడ ఎక్కలేక అమ్మను చూడలేదే ఇవ్వాళ అనుకుంటే చాలు అమ్మ మేడ చివర పిట్టగోడవద్దకు వచ్చి గజేంద్రమ్మకు కనిపించేది. అందుకే గజేంద్రమ్మ అటుండేది! “నేను అమ్మ దగ్గరకు పోనక్కరలేదు. అమ్మే నావద్దకు వస్తుంది” అని ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం అమ్మ పట్ల.
ఒకసారి మునిపల్లె నుండి కొందరు వచ్చి అమ్మకు ఫోటోలు తీశారు. వాటిలో అమ్మకు మూడు చేతులున్నవి. నాలుగో చెయ్యి ఎక్కడ దాచావు? అని గజేంద్రమ్మ అడిగితే “అవి నా ఫోటోలుకావు” అని అమ్మ మాటమార్చిందట. ఒకసారి గులాబిపూలతో అమ్మకు పూజ చేశారు. అమ్మ నోటి నుండి అమృతధారలు కారాయి ఆరోజు. అమ్మ వెంటనే ఆ ధారలు త్రాగటం గజేంద్రమ్మ చూచింది. 1962లో ఒకసారి అమ్మ చీరాల వెళ్ళింది. ఆ సమయంలో ఒక స్త్రీ జిల్లెళ్ళమూడి వచ్చింది. గజేంద్రమ్మ ఇంట్లో పడుకుంటానన్నది. గజేంద్రమ్మ వద్దన్నది. ఇది అమ్మ ఇల్లు కదా! అన్నది ఆమె. మర్నాడు గజేంద్రమ్మ చీరాలలో అమ్మవద్దకు వెళ్ళితే “నీ వద్దకు వచ్చిన ఆమెను ఎందుకు పడుకో వద్దన్నావు?” అని అమ్మ అడిగింది. అమ్మే ఆ రూపంలో వచ్చిన విషయం గుర్తించలేక పోయానే! అయ్యో! అని గజేంద్రమ్మ బాధపడ్డది.
అమ్మ “రవి” ఇంట్లో ఉన్న రోజుల్లో అమ్మ దగ్గరకు గజేంద్రమ్మ వెళ్ళగా “నాకు బఠానీలు, ఉప్పుశనగలు కావాలి’ అని అడిగింది. అవి తీసుకొని వచ్చి అమ్మ వద్దకు వెళ్ళగా అమ్మ పడుకొని నిద్రపోత్నుది అని చెప్పా రక్కడివారు. మర్నాడు గజేంద్రమ్మ వెళ్ళగా ఏవీ నేను అడిగినవి?” అని అమ్మ అడగగా “నేను వస్తే నీవు రాత్రి నిద్రపోతున్నావని చెప్పారమ్మా?” అని గజేంద్రమ్మ అనగా “నేను నిద్రపోతున్నానని వాళ్ళకు తెలుసా? అయినా నీకు అడ్డం లేదని చెప్పానుగా” అన్నది అమ్మ.
తొలిరోజులలో తన కిష్టమైనప్పుడు అమ్మవద్దకు వెళ్లేది. అమ్మ మంచం క్రింద పడుకునేది. తెల్లవారుఝామున లేచి చెరువుకు వెళ్ళి నీళ్ళు తెచ్చి గంగాళాలు నింపేది. రావూరిప్రసాద్ తల్లి స్వరాజ్యలక్ష్మి కూడా గజేంద్రమ్మతో కలసి అమ్మకు నీళ్ళు తెచ్చేది. ప్రసాద్ తండ్రి నరసింహం గారు ముక్కోటి ఏకాదశి నాడు అమ్మ నామం చేస్తూ అమ్మపాదాలపై వాలిపోవటం చూసిన గజేంద్రమ్మ అలా పోవాలయ్యా! అంటుండేది. అందుకే నేమో 20.11.2007 ఏకాదశినాడే తెల్లవారుఝామున (అమ్మ పుట్టింది ఏకాదశి తెల్లవారుఝామున) అమ్మలో కలిసిపోయింది.
గజేంద్రమ్మ వాళ్ళు పొలాల్లో పనిచేసి వస్తే వచ్చినవాళ్ళకి అమ్మ ప్రసాదాలు తన చేతితో తినిపించేది. మామూలుగా గజేంద్రమ్మ వంటచేసుకొనే తినేది. చివరిదాకా అంతే. చేసుకోలేని రోజులలో బ్రహ్మాండం శేషు తగు ఏర్పాటు చేసేది. అందరిల్లు డాబాకట్టే రోజులలో ఇసుక లారీలతోపాటు వెళ్ళి ఇసుక తెచ్చేది. తట్ట నెత్తిన పెట్టుకొని ఇటుకలు మోసేది. అమ్మకు మామిడికాయలు నివేదన చేయటమంటే గజేంద్రమ్మకు ఇష్టం.
రవి, సుబ్బారావు, కేశవశర్మ, మహాదేవశాస్త్రి, పొన్నూరు రవి, నేను గజేంద్రమ్మ ఇంటి ముందు కూర్చొని రేడియోలో క్రికెట్ మాచ్లు, పద్యాలు పాటలు వింటుండేవాళ్ళం. గజేంద్రమ్మ ఇల్లే కుర్రకారు అందరికీ విడిది గృహం. నాన్నగారు అప్పుడప్పుడు అక్కడకు వచ్చి ఏమిటర్రా! అందరూ ఇక్కడకు చేరారు అంటుండేవారు.
గజేంద్రమ్మకు సంస్థలో ఏ వస్తువైనా వృధా చేస్తుంటే సహించేది కాదు. వస్తువు జాగ్రత్త చేయకపోతే మందలించేది. అరిచేది. సంస్థకు కాపాలాదారగా ఉండేది. బ్రహ్మాండం సుబ్బారావు సరదాగా అందరిమీద పాటలు వ్రాస్తుండేవాడు. గజేంద్రమ్మ గట్టిగా అరవటం చూచిన సుబ్బారావు “లేచింది గజక్క గొంతు, దద్దరిల్లిది ఆవరణమంతా” అని వ్రాసి సిరిగిరి సుబ్బారావు చేత పాడిస్తుండేవాడు. ఆ రోజులలో సరదాగా వుండేది. నాన్నగారి పట్ల ఆ కుటుంబం పట్ల ఎనలేని గౌరవము, ప్రేమ గజేంద్రమ్మకు.
హైమ (దేవత) ఎక్కడకైనా ఊరు వెళ్ళితే అమ్మ గజేంద్రమ్మను, కృష్ణవేణమ్మను తోడు ఇచ్చి పంపేది. ఒకసారి హైమకు ఏదో అనారోగ్యం చేయగా గోవిందరాజు దత్తాత్రేయ శర్మగారు హైమను గుంటూరుకు తెచ్చారు. వారితో గజేంద్రమ్మ, కృష్ణవేణమ్మ వచ్చారు. హైమతో నాకున్న సాన్నిహిత్యం వల్ల మా ఇంటికి హైమను తీసుకెళ్తానండీ అని అడిగాను. ఆరోగ్యం బాగయ్యేదాకా ఎక్కడికీ పంపించేదిలేదన్నారు. తర్వాత చివరలో మాయింటికి తీసుకెళ్ళటానికి అనుమతించారు. గజేంద్రమ్మ హైమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు తీసుకొనేది. అలాగే మరొకసారి శిష్టాదక్షిణామూర్తి భార్య అన్నపూర్ణవాళ్ళింటికి వచ్చినపుడు కూడా గజేంద్రమ్మ వెంట ఉండి నా అభ్యర్థన మన్నించి మా యింటికి హైమను తెచ్చింది. నా పట్ల మా కుటుంబం పట్ల గజేంద్రమ్మకు వాత్సల్యం ఉండేది. బయటకు కరుకుగా మాట్లాడే గజేంద్రమ్మ హృదయం వెన్నపూసవలె మెత్తన, నిక్కచ్చి మనిషి.
బ్రహ్మాండం సుబ్బారావు పిల్లలపట్ల గజేంద్రమ్మ అత్యంత శ్రద్ధ కనబరచేది. రవి కుంటుంబ క్షేమసమాచారాలు నిరంతరం కనుక్కుంటుండేది. నే నెపుడు జిల్లెళ్ళమూడి వెళ్ళినా మా అబ్బాయి రాలేదా? అని రవిని గూర్చి వాకబు చేసేది. ఏమైనా జిల్లెళ్ళమూడి వినీలాకాశంలో ఒక ధృవతార రాలింది. ఒక దివ్యజ్యోతి అమ్మలో కలసిపోయింది.
జిల్లెళ్ళమూడి అందరింటికి నాలుగు స్థంభాలుండేవి. వాళ్ళు లక్ష్మీనరసమ్మగారు, అందరమ్మమ్మ, కృష్ణవేణమ్మ, గజేంద్రమ్మ అని సరదాగా అనుకుంటుండేవాళ్ళం తొలిరోజుల్లో. ఇప్పుడు నాలుగో స్థంభం కూడా ఊడిపోయింది భౌతికంగా ‘ఏడవ మైలులోని స్వర్ణోత్సవ సింహద్వారం – ఊగుతున్నదమ్మా?’ అంటే అమ్మ ‘అవును నా శరీరంలా’ అన్నది. అవును ఈనాడు గజేంద్రమ్మ కూడా భౌతికంగా శరీరం వదిలినా అమ్మలో లీనమై అమ్మ అతిమానుష దైవిక సౌధానికి మూలస్థంభంగా చేరి ఉంటుంది.
అమ్మను, జిల్లెళ్ళమూడి సంస్థను తను, మన, ధనాలతో సేవించి తరించిన ధన్యజీవి గజేంద్రమ్మ.