1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు

ధన్యజీవులు

Pillalamarri Srinivasa Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 2
Year : 2012

(శేషగిరిరావన్నయ్య)

“అమ్మ దివ్యసిద్ధాంత తత్త్వ మహాలయ ప్రాకారానికి మూల స్వరూపంగా భాసిల్లి ఆ అన్నపూర్ణేశ్వరి ఆశయాభిలాషలకు ఊపిరిగా వర్ధిల్లి, జగజ్జనని తన బిడ్డల క్షేమానికై సంకల్పించిన విద్యా, వైద్య, ప్రయాణాది సమస్త రూపశాఖలకు పట్టుగొమ్మగా, ఆటపట్టుగా, జీవధారగా భాసించి, అమ్మ దర్శనార్ధమైవచ్చు అశేష జనసందోహ నివాసవిలసితమైన “అందరిల్లు”కు ఆయువుపట్టుగా, నిర్మాణ విరాట్టుగా కృషి సల్పిన పెద్ద అన్న అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య.

పొన్నూరులో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో అధరాపురపు కృష్ణారావు ప్రయాగమ్మల పూజాఫలంగా 23.5.1912న జన్మించిన శేషగిరిరావుగారు విద్యా వినయ వివేక సంపన్నులై చిన్నతనం నుండీ అందరికీ తలలోని నాల్కగా ఉండేవారు.

జిల్లెళ్ళమూడి రాకముందు మహాత్మాగాంధీ స్వాతంత్ర్యోద్యమంలో ప్రభావితుడై 17వ యేటనే చదువుకు స్వస్తి చెప్పి 1929లోనే విదేశవస్తు బహిష్కరణలో పాల్గొన్నారు. 18వ యేట ఉప్పు సత్యాగ్రహంలో తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని అరెస్టయి జైలు జీవితం గడిపారు. తమకున్న 200 ఎకరాల పొలాలు బీదలకు పంచటం చూచి భూదానోద్యమ నాయకుడు వినోబాభావే మెచ్చుకున్నారు. కులమత విచక్షణ లేకుండా వారింట్లో నిత్యభోజన వితరణ జరిగేది. పొన్నూరు చుట్టుప్రక్కల గ్రామాలలో దేవాలయాలలో హరిజన ప్రవేశం కావించారు. రాష్ట్ర మోటారు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా సేవాసమితి స్థాపించిన వారిలో ముఖ్యులై కొంతకాలం అధ్యక్షులుగా పనిచేశారు. జయప్రకాష్ నారాయణ చేత ప్రశంస లందుకున్నారు. 1955లోనే భావనారాయణస్వామి దేవాలయం వద్ద మహాత్మాగాంధీ మందిరాన్ని నెలకొల్పి గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

కల్మషమైన రాజకీయ రంగంలో కూడా కలుషహారియైన గంగానది వంటి పవిత్ర హృదయులు కొందరుంటారు – అనటానికి ఉదాహరణ వీరి జీవితం. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, మదనమోహన్ మాలవ్యా వంటి నిస్వార్ధ దేశసేవా పరతంత్రుల కోవకు చెందినవారు శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు.

ఏ విశ్వవిద్యాలయాల్లోనూ పట్టా పుచ్చుకోక పోయినా జీవితం నేర్పిన పాఠాలవల్ల, సత్స్నేహ సంపత్తివల్ల సద్గ్రంధ పరిచయం వల్ల సంస్కారవంతుడుగా తీర్చిదిద్దబడి చిన్నతనంలోనే మాతృదేశ దాస్యవిముక్తికై స్వాతంత్య్ర సమర రంగం లోకి దూకి శ్రీ కృష్ణ జన్మస్థానాన్ని దర్శించారు. పదవుల కోసం ప్రాకులాడక ప్రజాహితజీవనంలో తన ఆస్తిపాస్తులు కర్పూరంలా కరిగించిన త్యాగమయ జీవి. పొన్నూరు పంచాయతీబోర్డ్ అధ్యక్షుడుగా ఉన్నా, మరి ఏ ఇతర పదవులు చేపట్టినా, అవి పదవులుగా కాక, బాధ్యతలుగా స్వీకరించి ప్రజాసేవ ప్రధాన లక్ష్యంగా వ్యవహరించారు. ఎల్లప్పుడూ పదిమంది మధ్య చిరునవ్వుతో ఖద్దరు దుస్తులను ధరించిన ఆ స్వచ్ఛమైన విగ్రహం అందరినీ ఆకర్షించేది. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈయనలోని నిజాయితీని, స్వార్థ త్యాగాన్ని హర్షించేవారు, సాహసాన్ని, ధైర్యాన్ని ప్రశంసించేవారు. స్వాతంత్ర్య సమరయోధునిగా తనకిచ్చిన 5 ఎకరాల భూమిని అమ్మ సంస్థ అభివృద్ధికి సమర్పించారు.

1959వ సంవత్సరంలో ఆయన జీవితం రాజకీయాల నుండి మరో మలుపు తిరిగింది. జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించటం, ఆ పవిత్ర మాతృమూర్తి పాదపద్మాల దర్శన స్పర్శనం ఆయనలో ఒక వినూత్న సుప్తదీప్తిని జాగృతం చేసింది. మాతృత్వపు మమకారపు రుచులు చవిచూసిన ఆయన హృదయం నిరంతరం ఆ దివ్యత్వంలోని అమృతం సేవించాలనే ఆరాటంలో మునిగిపోయింది. అందువల్ల ఆయన వంటి కర్తవ్యపరాయణులు అమ్మ వద్ద అందరింటి బాధ్యతలు స్వీకరించి, అక్కడే ఉండవలసి వచ్చింది. నిరంతర కార్యశీలి అయిన శ్రీ శేషగిరిరావుగారు జిల్లెళ్ళమూడిలో నేడు కనిపిస్తున్న ప్రతిపనికి పునాది వంటివారు. ఆయన అగ్రేసరతలో అక్కడ పని రూపుదిద్దుకున్నది.

అధరాపురపు శేషగిరిరావుగారు జిల్లెళ్ళమూడి అందరింటి వాస్తుశిల్పి అంటే ఆశ్చర్యం లేదు. వారు సంస్థ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఇప్పుడున్న అందరిల్లు, అన్నపూర్ణాలయం నిర్మాణం జరిగాయి. వారి అవిరళ కృషి వల్లనే సంస్కృత పాఠశాల, కళాశాలలు ఏర్పాటు చేయటం జరిగింది. వారెప్పుడూ అర్థరాత్రి జిల్లెళ్ళమూడి వచ్చేవారు. ఒకరోజు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నిద్రిస్తుండటంతో నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు నిద్రపోవడానికి.

అమ్మ పడుకొని ఉన్నది. అమ్మ మంచం ప్రక్కనే గోపాలన్నయ్య పండుకొన్నాడు. మధ్యలో లేచి అమ్మ చేయి పట్టుకుంటే విపరీతంగా జ్వరం ఉన్నది. అమ్మా! జ్వరం 104 ఉన్నట్లున్నది అన్నాడు గోపాలన్నయ్య. “అయితే ఏం చేద్దాం?” అన్నది అమ్మ. గోపాలు శేషగిరిరావు గారి దగ్గర మందు తీసుకొని వస్తానన్నాడు. మొదటి రోజులలో సంస్థ నిర్వహణ బాధ్యతలు కొంతకాలం నిర్వహించిన సీతాచలంగారు ఆయుర్వేద డాక్టరు. వారు అమ్మకు మందులిచ్చేవారు. ఆ తర్వాత వచ్చిన శేషగిరిరావుగారు హోమియో డాక్టరు. సరే, వెళ్ళిరా! ఆయన ఎక్కడ ఉన్నాడని వెళ్తావు అన్నది అమ్మ. గోపాలన్నయ్య వెతకటానికి వెళ్ళి ఆవరణంతా వెతికి చివరకు అన్నపూర్ణాలయం డాబా మీదకు వెళ్ళి ఒక మూల మంచుపడకుండా దుప్పట్లు తలపై వేసి జాగ్రత్తగా ఒక వ్యక్తి పడుకొని ఉండటం చూసి, ఆయనే శేషగిరిరావుగారేమోనని అక్కడకు వెళ్లాడు. దగ్గరకు వెళ్ళుతున్నకొద్దీ అక్కడ ఏదో వడ్లు దంచుతున్న శబ్దం వినిపిస్తున్నది. ఇప్పుడెక్కడ వడ్లు దంచుతున్నారు? ఈ శబ్దం ఎటువైపు నుండి వస్తున్నది అని శ్రద్ధగా ఏకాగ్రంగా గమనించారు. ఆ శబ్దం శేషగిరిరావుగారి వైపు నుండి వస్తున్నది. ఇంకా శ్రద్ధగా గమనించారు. ఆయనలో నుండి “అంఆ, అంఆ, అంఆ” అనే శబ్దం వడ్ల దంపుడు వలె వినిపించింది. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి అలా వస్తున్నది. ఆయన పీల్చి వదిలే గాలిలో సైతం అమ్మ శబ్దతరంగాలు, జాగ్రత నిద్రావస్థలలో కూడా వారి ప్రాణంలో ప్రాణమై అమ్మ ఎలా సంచరిస్తున్నదో అర్ధమైంది. అటువంటి మహానుభావుల సాహచర్యం లభించినందుకు ఎంతో ఆనందించాడు. అమ్మ శేషగిరిరావుగారంటే ఎవరో ఏమిటో తెలియ చెప్పటానికే ఈ సన్నివేశం కల్పించిందేమో ! అని భావించాడు. గోపాలన్నయ్య. నెమ్మదిగా నిద్రలేపి అమ్మ జ్వరం విషయం చెప్పి, నిద్రమత్తులోనే వారు మందు పేరు చెబితే దానిని తెచ్చి అమ్మకు వేశారు. అమ్మకు తెల్లవారేటప్పటికి జ్వరం తగ్గింది.

ఆ ఉదయం అమ్మ వద్ద ఈ విషయం ప్రస్తావన వచ్చింది. శేషగిరి రావుగారు నేను మందు చెప్పానా? నాకేమీ జ్ఞాపకం లేదే అన్నారు.

మరి అమ్మే ఆయన రూపంలో చెప్పి మందు వేయించుకున్నదేమో? యీ సంఘటన వల్ల తెలుస్తున్నది. అలాంటి మహనీయులు ఎంత మందో అమ్మ సేవలో తరించారు. ధన్యులైనారు. శేషగిరిరావు అన్నయ్య వంటి వారి మార్గదర్శకత్వమే గోపాలన్నయ్య లాంటి వారికి అమ్మ సేవచేసి తరించేందుకు ఆలంబనమైంది.

శ్రీ శేషగిరిరావు గారు జిల్లెళ్ళమూడి వచ్చిన క్రొత్తల్లోనే నాన్నగారి వద్దకు పోయి అమ్మను వదలి ఉండలేని తన స్థితిని వివరించి తనను నాన్నగారి రెండవ కుమారుడైన రవి తర్వాత బిడ్డగా స్వీకరించమని అర్ధించాడు. సంస్థ అభివృద్ధికై ఆయన ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు పరచడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఆయన తపస్సు. ఆ పనిలో అన్నం, నీరు పట్టేవి కాదు, ఎండ, వాన లెక్క చేసేవారు కాదు. అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నా ఏదో ఒక మహత్తర జ్యోతి ఆయనకు ముందు దారి చూపిస్తూ తీసుకొని పోయేది. ధ్యాసే ధ్యానం అన్న అమ్మ మాట ఆధారంగా సర్వవేళలా అమ్మ ధ్యాసలోనే ఉండేవారు. పొంగు క్రుంగులు ఆయనలో లేవని నేననను. కాని అమ్మ ఓదార్పు లాలనలు ఆయనకు శాంతిని ప్రసాదించేవి. అయితే, చేపట్టిన పని పూర్తయ్యేవరకు విశ్రమించేవారు కాదు.

ఒకసారి శేషగిరిరావన్నయ్య అమ్మతో ‘అమ్మా! నువ్వు జిల్లెళ్ళమూడిలో వచ్చిన నీ బిడ్డలకు దర్శన మిస్తుండగా నేను మద్రాసు మౌంట్ రోడ్డులో నిన్ను తలచుకుంటూ నడుస్తుంటే నీకెలా అనిపిస్తుంది?” అని అడిగారు. అందుకు అమ్మ “నాకంటి ముందు నడుస్తున్నట్లే ఉంటుంది” అని చెప్పింది. అలాగే మరొకసారి 1961లో హైదరాబాద్ తంగిరాల కేశవశర్మ ఇంటికి వెళ్ళారు. అప్పుడే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ సరియైన ఉద్యోగం దొరక్క నానాయాతనలు పడుతూ, తిన్ననాడు తింటూ, లేని నాడు వస్తుంటూ గడుపుతున్న రోజులవి. శేషగిరిరావు గారిని చూడగానే కేశవ ఆనందించి ఆయన కేదన్నా పెడదామని చూచాడు. ఏమీ కనిపించక, చివరకు దొండకాయలు ఆయనకు పెట్టారు. శేషగిరిరావుగారు కేశవ పరిస్థితికి బాధపడి అమ్మ వద్దకు వచ్చి కేశవ శర్మ పరిస్థితిని వివరించి కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు అమ్మ వాడు నాకేం చెప్పలేదుగదా అన్నది. కాని అలా చెప్పిన కొద్ది కాలానికే కేశవశర్మకు మంచి ఉద్యోగం రావటం జీవితంలో స్థిరపడటం జరిగింది.

శేషగిరిరావుగారి భార్య రమాబాయమ్మ అక్కయ్య కూడా అమ్మ సేవలో ఏమాత్రం తీసిపోయేది కాదు. అమ్మ వద్దకు వచ్చిన వారికి తలంట్లు పోయటం, పెళ్ళి కొడుకులను చేయటం వంటి కార్యక్రమాలలో పాల్గొంటుండేది. తమ ఇంటికి వచ్చిన వారి కార్యక్రమాలలో పాల్గొంటుండేది. తమ ఇంటికి వచ్చిన వారికి పెట్టిపోతల విషయంలో కూడా ఎంతో ఆప్యాయత, ఆదరణ కనబరిచేది. అమ్మ శేషగిరిరావు గారింటికి వరుసగా 1961, 62 సంవత్సరాలలో ఏప్రియల్లో వెళ్ళటం నేను ప్రత్యక్షంగా వారింటి వద్ద అమ్మను దర్శించడం, వారి ఆతిధ్యం స్వీకించడం జరిగింది. కొన్ని వందల మంది అమ్మతో వారింటికి వచ్చారు. పొన్నూరులో అమ్మకు వైభవంగా ఊరేగింపు జరిపారు శేషగిరిరావుగారు. అమ్మతో పాటు హైమను కూడా వాళ్ళింట్లో దర్శించుకున్నాం ఆనాడు. అక్కడ నుండి అమ్మ జన్మస్థలమైన మన్నవలో అమ్మ జన్మదినమహోత్సవానికి వెళ్ళాము.

అమ్మపై ఆయన ఆరాధన భావం అచంచల మయినది. ఆయన విశ్వాసం చెక్కు చెదరనిది. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని బాధలు కల్గినా ఆఖరికి తన ఆరాధ్య దైవమే తనను పరీక్షలకు లోను చేసినా ఆ విశ్వాసం నుంచి కించిత్తు కూడా చలించలేదు.

అమ్మ ఆజ్ఞ అయితే అది కొండ మీద కోతినయినా తేవలసిందే. ఆ స్వామి భక్తి పరాయణత అటువంటిది. ఆ ప్రయాసలో శరీరము మనస్సు స్వస్థత తప్పినా లెక్కించేవారు కాదు. రామునకు ఆంజనేయునిలా, అమ్మకు శేషగిరి రావు అన్నయ్య ఉండేవారు. ఆయన నమ్మకానికి తగ్గట్టే అమ్మ కూడా ఆయనకు ఎన్నో అనుభవాలను ప్రసాదించింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉదహరిస్తాను.

అన్నయ్యకు ఒకనాడు తన భార్య రమాబాయమ్మ గారు కృష్ణుడుగా అమ్మగా కనుపించింది. ఆయన ఆశ్చర్యపోయి కళ్ళు నులుముకొని చూచాడు. తన నిరంతర భావనే అలా అనిపించిందేమోనని. కాని అలా కాదు అమ్మ రూపం ప్రత్యక్షంగా కనిపించింది. ఇక ఆనాటి నుండి ఆయన మనస్సన్యాసియై ఆమెలో అమ్మను దర్శించారు. “పాతివ్రత్యానికి చరమదశ భర్త కూడా భార్యను అమ్మా! అని పిలవటం” అని అమ్మ అన్నారు. కాని భర్త భార్యను అమ్మా అని పిలిచే స్థితికి వచ్చినపుడు ఆ భర్తను ఏమనాలి? శ్రీ శేషగిరి రావన్నయ్య పండిపోయాడనాలి. సర్వత్రా మాతృత్వాన్ని చూచే జ్ఞానపరాకాష్ఠ అది.

కారణాలేవైనా శేషగిరి రావన్నయ్య పద్మనాభరావు (బాబురావు) గారింట్లో ఉండగా 26.12.1970లో అమ్మ చింతనలో ఉంటూ అమ్మలో లీనమైనారు. అందరిల్లే ఆయనకు ఆధారమైంది. అమ్మే ఆరాధ్యమైంది. అమ్మే సర్వస్వమైంది. సర్వసంగపరిత్యాగిని చేసింది. ముక్తిని ప్రసాదించింది.

జిల్లెళ్ళమూడి వచ్చిన వారిలో తరచుగా నేను చూచే అత్యంత సహజము ప్రధానమైన విషయం ఒకటున్నది. చావు యెడల భయం లేకపోవటం. ఆయన మృత్యు ముఖంలో ఉన్నప్పుడు కూడా డాక్టరు బ్రహ్మాండం రాము చూడటానికి వెళ్ళితే, మరణాన్ని గూర్చి నాకేనాడూ భయం లేదు. ఆ చనిపోయేటప్పుడు అమ్మ పదాల మీద యీ తల ఆన్చి ప్రాణం వదలాలని ఉన్నది. చనిపోయేలోగా అమ్మను ఒకసారి చూడాలని ఉన్నది అన్నారు. అన్నయ్య కోరిక ఏ రూపంలో అమ్మ నెరవేర్చిందో తెలియదు కాని ఆయనకా కోరిక తీరకపోయెనే అనే వెలితి మాత్రం మా అందరినీ బాధ పెట్టింది. తను, మన, ధనాలతో అమ్మను ఆరాధించిన ధన్యుడు శ్రీ శేషగిరిరావు అన్నయ్య.

స్వయంగా నాకు వారితో జరిగిన అనుభవం చెబుతాను. వారితో ప్రయాణం చేస్తే బస్సులు చాలా తేలికగా దొరుకుతాయి. అది అలా ఉంచండి. ఒకసారి హైదారబాద్లో ఒక ఆఫీసులో పని చేయించవలసి వచ్చింది. నేను అన్నయ్యగారి వద్దకు వెళ్ళి ఈ పని చేయించాలి. మీరు హైదరాబాద్ వెళ్ళేప్పుడు చెప్పండి. నేను కూడా మీ వెంట వస్తాను అని అడిగాను. అందుకాయన నీవు వెంట వస్తేగాని ఆ పని చేయనా? ఈ పనికి నీవు రానక్కరలేదు. ఎల్లుండికి నీకు ఆ పని జరిగినట్లు ఉత్తరం వ్రాస్తాను అన్నారు. తన స్వంత పనిగా భావించి తన ఖర్చుతో నా పని చేసి పెట్టిన ఆ వ్యక్తిని చూసి చలించిపోయాను. ఇలా ఎంతమందికి ఎన్ని పనులు చేసిపెట్టారో !

అమ్మ వద్ద కూచుంటే ఆ ఆనందాతిరేకంతో హృదయం ద్రవించి కళ్ళవెంట నీరు కారుస్తుండే వారు. ఆ మహనీయుని భావశబలతకు, ఆరాధనకు ఎంతో సంతోషించేవారు అమ్మ. ఈలాంటి అన్నయ్య మనకు కొండంత అండ అనుకునేవాళ్ళం.

‘నేటి జిల్లెళ్ళమూడి రోడ్డు నిర్మాణంలో వారి స్వేదధార ఉన్నది. జిల్లెళ్ళమూడిలోని విద్యుద్దీప కాంతిలో వారి విజ్ఞాన రోచిస్సు ఉన్నది. దినదినాభివృద్ధి నొందే అన్నపూర్ణాలయపు గాడిపోయ్యి మంటలో విశ్వశ్రేయస్సుకై వారి వేదనా జ్వాల ఉన్నది. సముచితమై సర్వజనాశ్రయమై తనరారే భవనద్వయ సౌందర్యంలో వారి మందస్మితం ఉన్నది. మాతృశ్రీ పత్రిక ప్రాదుర్భావంలో వారి విశ్వజనీన సహృదయ స్పందన ఉన్నది. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పునాది రాతిలో వారి సర్వస్వం ఉన్నది” అని వారి తర్వాత సంస్థ బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ అన్నయ్య వ్రాసిన వ్రాతలు అక్షరాల నిజా

అమ్మకు అత్యంత ప్రియతమ పుత్రుడయిన శ్రీ శేషగిరిరావు అన్నయ్య జిల్లెళ్ళమూడిలోని ప్రతి అణువణువులోనూ ప్రతక్షమౌతారు. ఆయన చిరంజీవి. ఆయన వేసిన బాటలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్వకత్వం నెరవుతుంటవి.

వారి శతజయంతి సందర్భంగా పొన్నూరు ఆర్.టి.సి. బస్ స్టాండ్లో వారి మిత్రులు శేషగిరిరావుగారి, విగ్రహం నెలకొల్పారు. శ్రీ విశ్వజననీ పరిషత్ తమ వంతు సాయం అందించింది. అందిరింటి సోదరీ సోదరులందరూ హర్షించదగ్గ విషయం ఇది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!