(మల్లాప్రగడ శ్రీరంగారావు)
సుప్రసిద్ధ పౌరాణి కులు మల్లాప్రగడ శ్రీరంగారావు గారు అమ్మను మొదటిసారిగా మచిలీపట్నం లో 1974లో శ్రీ విన్నకోట ఉదయ భీమరాజు గారింట్లో చూశారు. పట్టణానికి మున్సిపల్ ఛైర్మన్గా చేసినవారు ఉదయభీమరాజుగారు. సుప్రసిద్ధ అడ్వకేటు. మనకు తెలిసేటట్లు చెప్పాలంటే బందరు సూరివాళ్ళ నాన్నగారు. తరువాత రెండవసారి 1978లో బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయంలో దేవీభాగవత ప్రవచన చేయటానికి వచ్చినప్పుడు శ్రీ కోటంరాజు సత్యనారాయశర్మగారితో కలసి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించారు శ్రీరంగారావుగారు. అమ్మ లలితాదేవిని గూర్చి చెప్పమని అడగ్గా శ్రీరంగారావుగారు కొద్ది నిమిషాలలోనే లలితాదేవిని గూర్చి వివరణ చేశారు. అప్పుడు అమ్మ “లలిత” ఉందో లేదో నాకు తెలియదు. వాడు రంగారావుగారు) పదినిమిషాలల్లో తన మాటలలో నాకు లలితను చూపించాడు”. అని చెప్పింది. అమ్మ చేత ప్రశంసింపబడిన శ్రీరంగారావుగారు. ఎంత అదృష్టవంతుడో.
అసలు మల్లాప్రగడవారిది కృష్ణాజిల్లా దివితాలూకా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామం. 1923 అక్టోబరులో సత్యనారాయణ సీతామహాలక్ష్మీ దంపతులకు ప్రథమ పుత్రునిగా జన్మించారు. బాపట్ల శంకర విద్యాలయంలో వేదశాస్త్రాలభ్యసించారు. నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యాప్రవీణులైనారు. తదనంతరం యం.ఎ. సంస్కృతం చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరమపట్టభద్రులైనారు. మహామహోపాధ్యాయ జమ్ములమడక మాధవ రామశర్మగారి వద్ద సాహిత్య, అలంకారశాస్త్రాలు అభ్యసించారు. శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతీస్వామి వారి వద్ద మంత్రదీక్షితులైనారు.
మచిలీపట్నంలో స్వతంత్రదినోత్సవం నాడు (15.8.1947) జైహింద్ హైస్కూలులో సంస్కృతాధ్యాపకులుగా చేరి జీవనం సాగించారు. కృష్ణాజిల్లా టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉపాధ్యాయుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దటమే కాక తన పురాణ ప్రవచనాలతో సామాన్యజనంలో కూడా ధర్మచైతన్యాన్ని కలిగించటానికి కృషి చేశారు. ఆంధ్ర సంస్కృత రామాయణ, భారత, భాగవతాలే కాక దేవీ భాగవతముతో సహా అష్టాదశ పురాణాలు ప్రవచనం చేసేవారు. రాష్ట్ర రాష్టేతరప్రాంతాలలో ఒక ఉద్దండుడైన పండితునిగా పండితలోకంలో పేరు ప్రతిష్ఠలు సాధించుకున్నారు.
1987లో శృంగేరీ శారదా పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థస్వామి వారు తమ పీఠ ఆస్థాన విద్యాంసులుగా ప్రకటించి విశిష్ట సత్కారం చేసి గౌరవించారు. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాలలో లెక్కలేనన్ని సత్కారాలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో “గండపెండేరం” తొడుగగా, విజయవాడలో కనకాభిషేకం చేశారు. గుంటూరు శ్రీనాధపీఠం వారు స్వరాజ్యలక్ష్మీ పురుషోత్తమ రాయకవి పురస్కారంతో సత్కరించారు.
ఒరిస్సా ఛత్రిపురం తెలుగు సంఘం వారు ‘మధురభారతి’ గానూ, విశాఖ ద్వారకానగర్ శంకరమఠం వారు ‘భాగవత సుధాసింధు వుగానూ, మచిలీపట్నం హిందూమత బాలసమాజం వారు ‘ఆర్షవిద్యాభూషణ’గానూ, మచిలీపట్నం సరస్వతీ కళాసమితి వారు ‘పౌరాణిక సార్యభౌమునిగానూ, విశాఖ పట్టణప్రజలు “ఉపన్యాసకోకిల’గాను గుర్తించి ఆయా బిరుదులతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు.
విశాఖ మాతృశ్రీ అధ్యయన పరిషత్ శ్రీ తంగిరాల కేశవశర్మగారి ప్రోత్సాహంతో మూడు పూలు ఆరుకాయలుగా విస్తరిల్లింది. కేశవశర్మగారికి విశాఖలో తమ అధ్యయన పరిషత్ పక్షాన ‘లలితాసహస్రనామ భాష్యం’ చెప్పించుకోవాలనే కోరిక కల్గింది. ఆ ప్రాంతంలో శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు సుప్రసిద్ధ పౌరాణికులు. కేశవశర్మ అమ్మ వద్దకు వచ్చి ఆచార్యుల వారిచే లలితాభాష్యం చెప్పించుకుందామని ఉందమ్మా అని అడిగారు. అందుకు అమ్మ “వారిని గూర్చి నాకు తెలియదు నాన్నా! బందరులో మల్లాప్రగడ శ్రీ రంగారావుగారున్నారు. వారు చెపితే లలిత మీకు కనిపిస్తుంది. ఆయన చేత చెప్పించుకోండి” అన్నది. విశాఖ అధ్యయన పరిషత్ పక్షాన 1981 ఫిబ్రవరిలో “శ్రీ లలితా సహస్రనామ భాష్య ప్రవచనం” 24 రోజులు శ్రీ రంగారావుగారి చేత చెప్పించుకోవటం జరిగింది.
ఆ తర్వాత 1981 నవంబరులో జిల్లెళ్ళమూడిలో అమ్మసన్నిధిలో శ్రీలలితా | సహస్రనామ ప్రవచనం చేశారు శ్రీరంగారావుగారు. అప్పటి నుండి అప్పుడప్పుడు అమ్మ వద్దకు రావటం జరుగుతుండేది. 1984లో అమ్మ సన్నిధిలోనే ‘శాక్తేయ ఉపనిషత్తుల’ ప్రవచనం కూడా రంగారావుగారు చేశారు. 1984లో కేశవశర్మగారు అమ్మ వద్ద చండీయాగం చేయాలనుకున్నారు. రంగారావుగారు ‘గాయత్రీ యాగం’ చేయమని సలహా ఇచ్చారు. జిల్లెళ్ళమూడిలో శ్రీరంగారావుగారి నిర్వహణలో గాయత్రీ యాగం అత్యంత వైభవంగా సర్వులకూ సంతృప్తి కలిగే రీతిలో జరిగింది. అమ్మ కోరికపై రంగారావు గారు ‘మహాభారతంలో యక్షప్రశ్నలు’ ప్రవచనం చేసి అందరి మన్ననలూ పొందారు. అలాగే త్రయీ విద్యను కూడా ప్రవచనం చేశారు.
1985 విశాఖ మాతృశ్రీ అధ్యయనపరిషత్వారు శ్రీరంగారావుగారి శ్రీ లలితా సహస్రనామ భాష్యాన్ని టేపులలో భద్రపరచిన దానిని వ్రాయించి ‘భారతీవ్యాఖ్య ‘ పేరుతో ప్రచురించారు. బాపట్ల మాతృశ్రీ ప్రింటర్స్లోనే అది ముద్రితమైంది. అమ్మ స్వయంగా ఆ గ్రంథాన్ని ఆవిష్కరించింది. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ అధ్యాపకులు రంగారావు గారి కుమారులు శ్రీ శ్రీమన్నారాయణ మూర్తి ముద్రణ కార్యభారం స్వీకరించి పూర్తి చేశాడు. ఇప్పుడు ఆనాటి భాష్యానికి విపుల వ్యాఖ్య కూడా తయారు చేస్తున్నారు పునర్ముద్రణకు.
ఆ గ్రంథ ముద్రణ జరిగే రోజులలో ఒకనాటి సాయంత్రం అమ్మ సన్నిధిలో శ్రీమన్నారాయణమూర్తి ఉండగా అమ్మ “నాన్నా! నీకు శంకరాచార్యులను గురించి తెలుసా?” అన్నది. కొద్దిగా తెలుసునమ్మా ! అంటూ శంకరాచార్యుల జీవిత విశేషాలు సంగ్రహంగా చెప్పారు శ్రీమూర్తిగారు. అమ్మ “నాన్నా! శంకరాచార్యులు ఏయే గ్రంథాలు వ్రాశారురా?” అని అడిగింది. ఆచార్యుల వారి రచనలన్నింటిని గూర్చి సవిస్తరంగా వివరించారు శ్రీమూర్తిగారు. అమ్మ “నాన్నా! శంకరాచార్యులు విష్ణు సహస్రనామ భాష్యం వ్రాశారంటున్నావు. ఆయన దేవీ భక్తులు కదా! లలితా సహస్రనామాలకు వ్యాఖ్యానం వ్రాయలేదా?” అని అడగ్గా మూర్తిగారు లేదమ్మా! కానీ ‘లలితాత్రిశతి’కి భాష్యం వ్రాశారు అన్నారు. ‘లలితా సహస్రనామాలు ఎందుకు వ్రాయలేదురా?’ అని అమ్మ అడిగింది. ఏమో తెలియదమ్మా! అన్నారాయన. అప్పుడు అమ్మ ‘నేను చెప్పనా? మీ నాన్న వ్రాస్తాడని ఆయన వదిలేశాడురా’ అన్నది. శ్రీమూర్తిగారు పులకితగాత్రుడై ముకుళిత హస్తాలతో సజలనయనాలతో అమ్మ పాదాలకు నమస్కరించాడు. ఎన్ని గంటల సేపు ఉపన్యాసం చేసి చెప్పి వివరించినా “లలితా సహస్రనామ భాష్య రచనకు” శ్రీరంగారావు గారు అర్హుడు అని ఒక్క వాక్యంలో అమ్మ ఇచ్చిన ఈ యోగ్యతా పత్రానికి సాటి కాదు. అంతగా అమ్మ కరుణకు పాత్రులైనవారు శ్రీ రంగారావుగారు.
శ్రీ విశ్వజననీ సేవా సమితి, హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లోనూ, బందరు, గుంటూరులలో జరిగిన ప్రేమార్చన ఉత్సవాలలోనూ పాల్గొని సభలకు నిండుదనం చేకూర్చారు శ్రీరంగారావుగారు. 1983లో అమ్మ వత్రోత్సవాలలో జరిగిన సభలలో ఎన్నింటిలోనో కీలకపాత్ర పోషించారు.
అమ్మతో శ్రీరంగారావుగారికి ఒక చిత్రమైన సంభాషణ జరిగింది. అమ్మ ఎన్నో తాత్విక అంశాలు వారితో చర్చిస్తుండేది. అమ్మ సన్నిధిలో లలితాభాష్య ప్రవచనాలు చేసే రోజుల్లో ప్రవచనానంతరం మసుంధర అందించిన వేడి మిఠాయిలు తన చేతిలోకి తీసికొని అమ్మ తానే స్వయంగా నోటితో ఊది వేడి చల్లార్చి శ్రీరంగారావుగారికి నోటికి అందించేది. రంగారావుగారు పాలు త్రాగిన తర్వాత ఆప్యాయంగా ఆయన పొట్టనిమిరేది. అలా నిమిరుతూ “ఈ చిన్ని బొజ్జలో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు – ఇన్ని ఎలా ఇమిడి ఉన్నాయి. నాన్నా!” అంటూ అవ్యాజ ప్రేమ వాత్సల్యాలను కురిపించేది. ఒకసారి అమ్మ శ్రీరంగారావుగారితో ‘నీకూ నాకూ ‘రక్తసంబంధం’ ఉందిరా అన్నది. రంగారావుగారు ఆశ్చర్యంగా “అదేమిటమ్మా! అయినా నువ్వు విశ్వజననివి కదా! బిడ్డలందరం నీ రక్తం పంచుకొని పుట్టినవాళ్ళమే” అన్నారు. అందుకు అమ్మ “అది సరేలే మనిద్దరికీ ప్రత్యేకంగా ‘రక్తసంబంధం’ ఉన్నదిరా! నువ్వూ ‘రుధిరోద్గారి’లోనే పుట్టావు నేనూ ‘రుధిరోద్గారి’లోనే పుట్టాను. రుధిరం అంటే రక్తం కదా! మనది ‘రక్తసంబంధం’ కదా” అన్నది. శ్రీరంగారావుగారు మౌనంగా అమ్మ పాదాలపై వ్రాలిపోయారు. 2007 ఏప్రిల్ 9న అమ్మలో కలిసిపోయారు. నిజంగా మల్లాప్రగడ శ్రీరంగారావుగారు ధన్యజీవి.