(ప్రభావతక్కయ్య)
ప్రభావతక్కయ్య 01.09.1942న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా పుల్లేటికుఱ్ఱు గ్రామంలో మాతామహుల ఇంట్లో పుట్టింది. బాపట్ల తాలూకా కొమ్మూరులో ఉన్న గంగరాజు లోకనాథరావు, బుచ్చమ్మల కుమార్తెగా ఆరుగురుతోబుట్టువులలో రెండవ సంతానం. లోకనాథంగారు, నాన్నగారు (బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు సన్నిహితులు, స్నేహితులు. ఆ రకంగా తరచూ జిల్లెళ్ళమూడి వస్తూ అమ్మ చేతి వంట తిన్న అదృష్టవంతుడు లోకనాథంగారు. అమ్మతో ఆ రోజులలో సీతారామాంజనేయ సంవాదం పుస్తకంలో విషయాన్ని గూర్చి సంభాషించినవాడు. ఆయన కుమార్తె ప్రభావతి. అమ్మతో సంభాషించిన లోకనాథంగారికి అమ్మ మానవతాతీత శక్తి పట్ల విశ్వాసం కుదిరింది. గంగరాజు లోకనాథంగారి కుమార్తె ప్రభావతి 1955లో తన 13వ యేటనే అమ్మ సేవకు వచ్చింది.
లోకనాథంగారిని షుగర్ జబ్బుతో గుంటూరు హాస్పిటల్లో చేర్చారు. కాలు తీసివేయాలన్నారు. అప్పుడు అమ్మ హాస్పిటల్కు వెళ్ళి ‘ఏది? ఈ కాలేనా? ఎక్కడి నుండి తీసివేయాలి’ అంటూ చేతితో ఆ భాగాన్ని రాసింది. ఆపరేషన్ లేకుండానే ఆ తర్వాత నయమయింది. ఆ సమయంలో ప్రభావతితో రిక్షాలో రాజుబావ వాళ్ళ ఇంటికి వెళ్తూ ‘నాతో జిల్లెళ్ళమూడి వస్తావా?’ అని అడిగింది. ప్రభావతి వస్తానన్నది. అక్కడ ఇక్కడ ఉన్నట్లుండదు ఇల్లు, తేళ్ళు, పాములు, ఎలుకలు, పిల్లులు ఇంట్లో తిరుగుతుంటాయి అన్నది. ‘నీవుండగా నాకేమి భయంలేదు వస్తాను’ అన్నది ప్రభావతి. ప్రభావతికి ఉబ్బసం ఉండటంతో అమ్మ వద్ద ఉంచితే తగ్గుతుందని లోకనాథంగారి నమ్మకం. అమ్మకు పనులలో సాయంగా ఉంటుందని మరొక కారణం. ఉభయతారకంగా అమ్మ మీద ధ్యాస మళ్ళేది. మళ్ళీ జిల్లెళ్ళమూడి ఇలా తిరుగుతూ, తిరుగుతూ అమ్మ దగ్గరే ఎక్కువ కాలం గడపటం అలవాటు చేసుకొన్నది. అమ్మే ప్రభావతికి సుబ్బారావును రవి, హైమ, లను అప్పజెప్పింది.
రాజబావ తండ్రి బాలకృష్ణశర్మగారు ప్రభావతి తండ్రి లోకనాథంగారు మేనత్త మేనమామ పిల్లలు. ఆ రకంగా రాజుబావ ప్రభావతి బావామరదళ్ళు. 1958 మార్చిలో వారి వివాహం జరిగింది. వారి వివాహంలో అమ్మ మంగళహారతి పాడింది. “రాజరాజేశ్వరి! దేవి కన్యాకుమారి! రక్షించు జగదీశ్వరి!కావవే” అంటూ జగన్మంగళకారణి పాడిన పాట వారి జీవితాలకు బాటలు వేసింది. పల్లకీలలో ఊరేగుతున్న వారి వెంట పల్లకిపై చేయి వేసి నడిచింది.
అదృష్టం ఏమిటంటే అమ్మ చేతుల మీదుగా జరిగిన మొదటి వివాహం కూడా ప్రభావతి రాజుబావలదే. రాజుబావ అమ్మచరిత్రను అమ్మ తాత్విక చింతనను అర్థం చేసుకొని వ్రాసిన గీతాలు అమ్మ చేత అంగీకరింపబడి రాజుబావను ఒక వాగ్గేయకారుని స్థాయిలో నిలబెట్టాయి. పెళ్ళి అయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు ప్రభావతి జిల్లెళ్ళమూడిలో అమ్మదగ్గరే ఉన్నది. రాజుబావే ఉద్యోగానికీ జిల్లెళ్ళమూడికీ తిరుగుతుండేవాడు.
ప్రభావతి రాజుబావ వారికి పుట్టిన పిల్లలు నలుగురు సుహాసిని, సుభాషిణి, హైమ, ప్రేమకుమార్, బాలకృష్ణశర్మలకు అమ్మచేతనే నామకరణం చేయించారు. నామకరణం తర్వాతనే అమ్మచేతులమీదగానే పిల్లలను రాజుబావ చేతులలోకి తీసుకొనేవాడు.
ప్రభావతి అమ్మ సమాధి స్థితిలోకి వెళ్ళటం, ముద్రలు పడటం, ఎన్నోసార్లు చూచింది. అమ్మకు హారతి యిస్తే అమ్మే ‘కృష్ణా! మా యింటికి రారాదా!’ అనే పాట పాడటం విన్నది. అమ్మ ఇతర భాషలలో మాట్లాడటం విన్నది. రెండు వందల మంది వచ్చినా అవలీలగా వంట చేసి పెట్టేది. ఎన్నోసార్లు తనకు తేళ్ళు కుట్టినా ఏమందూ వాడకుండానే తగ్గిపోయేది.
అమ్మ – ప్రభావతిచేత హైమచేత తెల్లవారుజామున ధ్యానం చేయించేది. ప్రభావతి అమ్మ సేవకు ఎక్కడ ఆటంకం అవుతుందోనని అన్నం తినటం మానేసింది. ఒక మాఘపూర్ణిమ రోజున అమ్మ గంటా ముఫ్ఫై నిమిషాల కాలంలో 600 మందికి మంత్రోపదేశం చేసినప్పుడు ప్రభావతి కూడా మంత్రోపదేశం పొందింది. సాధన విషయంలో అమ్మ ప్రభావతితో ‘ప్రత్యేకించి సాధన చెయ్యవలసిన పనిలేదు. నీ మనస్సు ఎప్పుడూ నా మీదే ఉంటుంది’ అని చెప్పింది. పెళ్ళి అయిన తర్వాత శ్రావణమాసం నోములు నోయించటానికి ప్రభావతి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళుతానన్నది. ‘దానికే వ్రతాలు అక్కర్లేదు’ అన్నది అమ్మ.
అమ్మ అన్న ప్రకారమే ప్రభావతి ఏ పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా మనస్సు మాత్రం అమ్మ ధ్యానంలోనే ఉండేది. అమ్మ ఆలయంలో ప్రవేశించిన తర్వాత కూడా కలల్లో అమ్మ కనిపించేది. జ్యోతిస్వరూపంగా కూడా దర్శనం ఇచ్చేది. అమ్మ ఇచ్చిన మట్టి, కుంకుమ ఎంతో సువాసన రావటం గమనించింది. అమ్మలోని అణిమ -గరిమ శక్తులు చూచింది. ప్రభావతి అమ్మను తాను ఎత్తుకుంటే అతి తేలికగా అయిపోయేదిట. అమ్మ తన కోసం కాకపోయినా ఎవరికోసమో అడిగి అడిగి పదార్ధాలు చేయించుకొని తినేది. అమ్మ ఎంతో మందికి తీర్థంతో, బత్తాయి రసంతో జబ్బులు తగ్గించిన సన్నివేశాలు చూసింది. పాలు, ఆవకాయ అన్నం, సాంబారు అన్నం బారెన్ వద్ద పెడితే శ్యామల, శకుంతల, అపర్ణవంటివారు తినిపోయేవారు. నాన్నగారు ఎక్కడ ఉన్నా రాత్రిళ్ళు జిల్లెళ్ళమూడి నుండే అమ్మ మాట్లాడుతుంటే చూసింది ప్రభావతి. కొమ్మూరులో ఆంజనేయస్వామి విగ్రహం వెనుక అమ్మ కనిపించింది. అమ్మ నాగేంద్రుని రూపంలో చాలామందికి కనిపించటం కూడా గమనించింది. అమ్మ కట్టుకున్న చీరెలు, రవికలు కూడా మంచి సువాసనలు వెదజల్లటం చూచి అడిగితే అమ్మ ‘దానిదేముంది నీ గుడ్డలూ అలా వాసనలు వస్తాయి అన్నది’. అలా అన్న కొద్దిరోజులు ప్రభావతి గుడ్డలు కూడా సువాసనలు వచ్చేవి. ఏది ఏమైనా ప్రభావతి జీవితాన్ని అమ్మ తీర్చిదిద్దింది. ప్రభావతి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో చేరిస్తే అమ్మ, హైమ ఆమెకు ఇరుప్రక్కలా నిలబడటం ప్రభావతి చూచింది. అమ్మ చెప్పిన రీతిలో పతినిదేవతగా భావించి సేవించింది. సంసార సముద్రాన్ని యీదింది. అమ్మఒడ్డుకు చేరింది.
శరీరం వచ్చిం తర్వాత ఎప్పటికైనా రాలిపోక తప్పదు. లోకంలో ముత్తయిదువగా కాలం చేసిన వారంతా గౌరీలోకానికి వెళ్ళుతారని నానుడి. భర్తను వదిలి ముందుగా శరీరాన్ని స్త్రీలు వదలటం అమ్మ హర్షించలేదు. స్త్రీలు భర్తను ముందు పంపి తర్వాత భార్య శరీరం వదలటం ధర్మం అన్నది. స్త్రీలకు అంత స్వార్థం పనికిరాదన్నది. భర్తకన్నా ముందు వెళ్ళినా, భర్తను పంపి తర్వాత వెళ్ళినా వెళ్ళేది ఒక చోటికే, ఆ గౌరీలోకానికే, తనలోకే అని స్పష్టంగా చెప్పింది. ఏమైనా అమ్మ సేవలో, అమ్మ భావనలో తరించిన ప్రభావతి ధన్యురాలనడంలో సందేహంలేదు.
అమ్మ నాన్నగారు కుటుంబంలో ఒదిగిపోయి సేవలు చేసింది. చివరి సమయంలో అమ్మను, హైమను దర్శనం చేసుకొన్నది. 8.1.2012 ఆదివారం ఆదిశక్తి అయిన అమ్మలో లీనమైంది. ధన్యురాలు ప్రభావతి.
ప్రభావతి అక్కయ్య అంత్యేష్టి యజ్ఞాన్ని రాజుబావ, వారి పిల్లలు జిల్లెళ్ళమూడిలోనే అమ్మ సన్నిధిలో జరపాలని నిర్ణయించారు. అమ్మ చేయించే రీతిలో అనసూయేశ్వరాలయంలో కొడుకు, కోడలు అభిషేకాలు చేశారు. రాజుబావ తాను అమ్మను గూర్చి వ్రాసిన పాటలన్నింటినీ అమ్మ సమక్షంలో పాడి అమ్మకు నివేదన చేశారు.
పతివ్రతకు పరాకాష్ఠ భర్త చేత కూడా తల్లిగా ఆరాధింపబడటం అనే అమ్మసూక్తిని నిదర్శనంగా రాజు బావ ప్రభావతికి చేసిన ఈ గీతనీరాజనం అమ్మ ప్రభావతికి అందించి ఉంటుంది. ప్రభావతిని తనలో లీనం చేసుకొని ఉంటుంది. ఆ రకంగా ప్రభావతి మనందరికీ ఆదర్శవంతురాలైంది.