(శ్రీపాద మాతృశ్రీపాద)
డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు జిల్లెళ్ళమూడి అమ్మ సాహిత్యానికి సంబంధించినంత వరకు వేదవ్యాసుడే. అమ్మ గ్రంధాలు వ్రాయలేదు. ఉపన్యాసాలివ్వలేదు. తన దగ్గరకు వచ్చిన బిడ్డలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది. అవి అమ్మ అనుభవ వేదాంత నిధులు. అవి లోకానికి సూక్తి సుధలు. శ్రీపాద వారు అమ్మ వద్దకు వచ్చే నాటికే అమ్మ దినచర్య వ్రాసే అలవాటు కొందరు సోదరీ మణులకుండేది. అందులో అమ్మ వివిధ విషయాలపై చెప్పిన భావాలున్నవి. ఆ ముడి పదార్థాలను తీసుకొని శీర్షికలుగా విభాగించి ‘అమ్మ – అమ్మ వాక్యాలు’ ‘అమ్మతో సంభాషణలు’ మూడు భాగాలుగా వింగడించి సంపాదకత్వం వహించగా ప్రచురించారు. ‘అర్కపురి విశేషాలు’ అనేదానినే సంకలనం చేశారు. అవే ఈనాడు జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులకు వేదాలు. అమ్మది తోలునోరు కాదు కదా తాలు మాట రావటానికి. ఆ మాటలన్నీ ఆణిముత్యాలే.
అమ్మ మాటలలోని ప్రత్యేకతే శ్రీపాదను అమ్మ వద్దకు చేర్చింది. బాపట్ల ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్గా వచ్చిన శ్రీపాదతో స్నేహితుడు పద్మాజీ జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను చూచిరా, ఆమె మహిమాన్వితురాలు అని చెప్పాడు. ఇంకా ఎవరెవరో చెప్పారు. ఇంత మంది దైవం అని చెపుతున్న ఆమె ఎంతటిదో చూద్దాం అని 1964లో ఏప్రిల్లో అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ ముఖ మండలంలో వెలిగి పోతున్న ప్రశాంతత వారిని ఆకర్షించింది. కాని అక్కడి వారు అమ్మకు చేస్తున్న పూజలు చూచి అమ్మ తనను పూజ చేసుకోవటానికి అంగీకరించటం రుచించలేదు. వారికి. ఈ విషయాన్ని తనను అమ్మను చూడమని ప్రోత్సహించిన పద్మాజీకి వుత్తరం వ్రాసి టేబుల్పై పెడుతుండగా “ఆఁ! ఏమంటున్నావ్?” అని శబ్దం వినిపించింది. ఎవరూలేరక్కడ. టేబుల్ వైపు చూచారు. తను వ్రాసిన ఉత్తరంపై సిరా ఒలికి ఒక మూల అమ్మ చిత్రంగా రూపు దిద్దుకొని ఉంది. పైగా ఆ చిత్రంలో నుదుటను కుంకుమ ఉన్నది. ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది. ఈ రకంగా ప్రారంభమైన అమ్మతో సాన్నిహిత్యం అమ్మే సర్వస్వం అయ్యే వరకూ పెరిగింది.
సహజంగా శ్రీపాద సైన్సు విద్యార్థి. భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ సాధించినవారు. ఏ విషయాన్నైనా పరిశోధన చేసి నిగ్గు తేలిస్తేగాని అంగీకరించరు. సత్యాన్వేషణలో ఆయన నిష్ఠ అంతటిది. ఒక్క శాస్త్ర విషయంలోనేకాదు ఆధునిక సాహిత్యంలోను సంగీతంలోనూ, శిల్పకళలోనూ, మంచి పరిశోధన చేసిన ప్రతిభావంతుడు, మేధా సంపన్నుడు. ఆంధ్రవారపత్రికలో ‘విజ్ఞాన వీధులు’ = “వైజ్ఞానిక గాధాశతి” అనే శీర్షికలతో ఎన్నో వ్యాసాలు వ్రాశారు, గ్రంధాలుగా ప్రచురించారు. జానపదగేయాలలోని ‘గతి’ గురించి పరిశోధన చేసి వ్యాసాలు ప్రచురించారు. దామెర్లవారి చిత్రకళను గూర్చి, అజంతా, ఎల్లోరా, అమరావతి, హంపి, లేపాక్షిలలోని చిత్రకళను గురించి, చరిత్ర గురించి ఎన్నో వ్యాసాలు వ్రాశారు. “సత్యసాయి వాగ్విభూతి”, “షిర్డిసాయి తత్వప్రకాశము”, “సాయి వాక్యవిభూతి”, “శ్రీరమణవాక్యములు”, “ఉపనిషద్ వాణి” మొదలైన ఆధ్యాత్మిక గ్రంధాలు వ్రాశారు.
అమ్మను నిశితంగా పరిశీలించారు, డైరీలు చదివారు, అధ్యయనం చేశారు. అమ్మ మాటలలోని విలక్షణత, విశిష్టత, వినూత్నత, అమ్మ వ్యక్తిత్వము వారిని ఆకట్టుకొన్నాయి. వారు ఎందరో మహనీయులను చూశారు, మాట్లాడారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు చదివారు, ఉపనిషత్తులు అధ్యయనం చేశారు. మహనీయుల జీవిత చరిత్రలు చదివారు, వారి బోధలు చదివారు. ఎక్కడా అమ్మ మాటలలోని పరిపూర్ణత వారికి కనుపించలేదు. అందువల్లే పూర్ణచంద్రుణ్ణి చూడాలంటే జిల్లెళ్ళమూడి రావలసిందే. ఇంకెక్కడైనా చంద్రవంకలే అన్నారు. అమ్మను గూర్చి చెప్పటమంటే బాపట్ల దగ్గర ఇసుక పాతర త్రవ్వటమే అనేవారు. ‘మాతృశ్రీ’ తెలుగు ఇంగ్లీషు పత్రికల ద్వారా అమ్మ తత్వాన్ని లోకానికి అందించటానికి ప్రయత్నించారు. “అమ్మచెప్పేది”, “అమ్మను గురించి”, “అమ్మ సూచించే కొత్తదారి”, “అమ్మ – మహర్షి” అనే గ్రంధాలు స్వతంత్రంగా వ్రాశారు. తాను నమ్మిన అమ్మ సిద్ధాంతాన్ని, తనకు తృప్తి నిచ్చిన అమ్మ మార్గాన్నీ పదుగురికి తెలియ చేయాలని తాపత్రయపడేవారు. అమ్మ సందేశం జగద్వ్యాప్తం కావాలని ఆరాటపడేవారు. వారు ఎంతో విశ్వాసంతో ఔద్ధత్యంగా ఉపన్యసించేవారు. అమ్మ సిద్ధాంతమనే గండ్రగొడ్డలి తీసుకొని బయలుదేరుతున్నాను ఎవరైనా అడ్డగించగలిగిన వారుంటే ముందుకు రమ్మనేవారు.
తనకు ఊహతెలిసి నప్పటినుండి క్రొత్త విషయాలు తెలసుకోవాలనే జిజ్ఞాస, శాస్త్రవితరణ, పరిశీలన, సమన్వయము శ్రీపాద వారిలో జీర్ణించిన లక్షణాలు. నిర్దుష్టమైన భావాలు, నిష్కలంకమైన నడవడి, దేనికీ భయపడని మనస్తత్వము, ఏకాగ్రత, నిష్ఠ, ప్రేమించే గుణము, ఆప్యాయత వారిలో మనకు కనిపించే లక్షణాలు.
అమ్మ తత్వాన్ని అధ్యయనం చేసిన శ్రీపాద అమ్మ తత్వం అనుభవాన్నించి వచ్చిందని, శాస్త్రాలు చదివితే వచ్చిందికాదని, అందుకే అమ్మ చెప్పే జవాబులు శాస్త్రాలను తెగేసుకుంటూ పోతున్నట్లుంటాయనీ, అమ్మవల్ల గుర్తెరిగిన వారేకాని అమ్మకు గుర్తుచూపించిన గురువులెవరూ లేరనీ, అమ్మ మాటలు జీవితానికి సంబంధించినవిగానూ, జీవితంలో పొందటానికి వీలైనవిగానూ వినిపిస్తాయనీ, అమ్మ చెప్పే మాటలు సంప్రదాయ విరుద్ధంగా కనిపిస్తాయికాని పరిపూర్ణ సత్యం నుండి వచ్చే కాంతులేననీ, అమ్మ చెప్పేది దారికాదు గమ్యమేననీ, అమ్మ సూక్తులు ఏది పట్టుకున్నా “అంతా అదే” దగ్గరకు తీసుకు వెళ్ళుతుందనీ, ఇలా జీవితాన్నంతా సమన్వయించినవారు ఇది వరకు లేరనీ, వేరెవరూ ఇంత బలంగా సూచించలేదనీ అందుకే అమ్మ వద్దకు రాని సామాన్యులు కష్టాలను ఏడుస్తూ అనుభవిస్తారనీ వచ్చినవారు నవ్వుతూ అనుభవిస్తారనీ, అమ్మ సన్నిధి అపురూప నిధి అమ్మ – ఐహికానికి ఆముష్మికానికి వారధి అనీ, అందరిల్లు లోకానికి నమూనా అనీ, అమ్మ జగన్మాత జిల్లెళ్ళమూడిలో పిలిస్తే పలికే అమ్మ అయి ఉన్నది, అని తన అనుభవసారాన్ని జనానికి తెలియచేశాడు.
శ్రీపాద 27.9.1908 శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జోగమ్మ – కామేశ్వర రావులకు జన్మించాడు భౌతికంగా తనే కని వారి తల్లిదండ్రులకు పెంపుడిచ్చాను. అన్న జగజ్జనని అమ్మమాట ప్రకారం ఆధ్యాత్మిక పుత్రుడై తను వెతుక్కుంటున్న గమ్యాన్ని చేరగలిగిన ఒక యోగి, భక్తుడు, జ్ఞాని. మామూలు సామాన్య వ్యక్తికూడా. తన ఆలోచనల ద్వారా జిజ్ఞాసద్వారా పూర్ణ సత్యాన్ని కనుగొనవచ్చు అని అమ్మ వాక్యాల నుండి క్రొత్త దర్శనాన్ని పితికిన గోపాలుడీ గోపాలకృష్ణుడు. శ్రీపాదవారు ఎందరో విద్యార్థులకాచార్యులైనా అమ్మ పాదాల వద్ద ఒక విద్యార్థిగా ఉన్నాడు.. అమ్మను గూర్చి ఎంతో తెలుసుకున్నా వారు అమ్మతో “నిన్నెరుగుదును అనటానికి ఎవరికీ దమ్ములేదు” అన్న వినయ వినమిత పూర్ణుడు. అందుకే వారిని గూర్చి చెపుతూ “తపించాడు తరించాడు అంతా అమ్మే అయినాడు” అన్నది అమ్మ. – ఈ రకంగా అమ్మ ఇంకెవరిని గూర్చి చెప్పినట్లు వినలేదు.
|అమ్మ మానవిగా జిల్లెళ్ళమూడి కరణంగారి భార్య. ఆ సంబంధమే లేకపోతే అమ్మ మనకు అంది ఉండకపోను. “అమ్మను మనం మొక్కుబడి దేవతగానో, లౌకికమైన ఈతిబాధలు తీర్చమనోకాదు కోరవలసింది. ఆధ్యాత్మిక పథంలో మన తప్పటడుగులు దిద్దమని, చైతన్యపు భాషనేర్పమని, గుండె ధైర్యమిమ్మని, ఆనందభుక్తి పెట్టమని, పాపకూపంలో పడకుండా ఎత్తుకొమ్మని ప్రార్థించాలి” అన్నారు శ్రీపాద. కాని అమ్మకు లౌకికము ఆధ్యాత్మికము అని రెండు లేవు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. అందరినీ తన బిడ్డలుగానే భావించింది. శ్రీపాద రాజమండ్రిలో చనిపోతే శరీరాన్ని జిల్లెళ్ళమూడికి తెప్పించింది. వారి కూతురు గాయత్రిచేత అంతిమ సంస్కారాలు చేయించింది. ప్రేమారామంలో రాలిపోయిన ఆ పుష్పాన్ని తన గుండెలకు హత్తుకున్నది. ముద్దుపెట్టుకున్నది. కన్నీరు కార్చింది. శ్రీపాదకేం! మాతృశ్రీ పాదమైనాడు. అమ్మలో లీనమైనాడు అమ్మేతానైనాడు.
ఈ అందరిల్లు ఒక అగ్రజుని కోల్పోయింది. సాహిత్యలోకం ఒక స్రష్టను కోల్పోయింది. ఒక సత్యవిమర్శకుని కోల్పోయింది. ఒక చారిత్రక పరిశోధకుని కోల్పోయింది. శ్రీపాదధన్యజీవి, శ్రీపాద మాతృశ్రీపాద.