‘యధావృక్షస్య సంపుష్పితస్య దూరాద్గంధో వాత్యేవం
పుణ్యసకర్మణో దూరాద్గంధోవాతి’ (పుప్పించిన మొక్క నుండి సుగంధపరిమళాలు సుదూరప్రాంతాలకి ఏ విధంగా వీస్తాయో, అలాగే పుణ్యకర్మఫలం కూడా సుదూరతీరాలకి వ్యాపిస్తుంది) అని ప్రవచిస్తోంది వేదం. అందుకు ఉదాహరణ జిల్లెళ్ళమూడిలో అమ్మ శ్రీచరణ సన్నిధిలో నిర్వహించబడే ధాన్యాభిషేక ఉత్సవ నిర్వహణ ! విశిష్టమైన విలక్షణమైన ఆ ఉత్సవంలో పురాణ దంపతులైన శ్రీ అనసూయేశ్వరులను ధాన్యంతోనూ, బియ్యంతోనూ అభిషేకిస్తారు ప్రతి ఏటా ఫిబ్రవరి 17వ తేదీన. ఆ రోజు అమ్మ భర్త (నాన్నగారు) శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు ఆలయ ప్రవేశం చేసిన రోజు.
‘శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం’ అని శ్రీ శంకరులు సౌందర్యలహరిలో పేర్కొన్నరీతిగా జగన్మాత అమ్మ పాణిగ్రహణంతో నాన్నగారు జగత్పిత అయినారు. కాగా ఫిబ్రవరి 17వ తేదీన పరిమిత రూపాన్ని పరిత్యజించి అక్షర పరబ్రహ్మ రూపంగా అర్చామూర్తిగా ప్రతిష్ఠితులైనారు. వాస్తవానికి చరాచర జగత్తూ… అంటే సకల జంతుజాలమూ, జీవులే కాదు దేవుళ్ళూ… అన్నీ అమ్మ విరాట్స్వరూపంలో భాగాలే. అమ్మే స్వయంగా నాన్నగారి ఆలయప్రవేశం చేసింది; తర్వాత వైష్ణవ సంప్రదాయంలో వారి దక్షిణభాగాన్ని అలంకరించింది. ‘అనసూయ’ అనేది అమ్మ నామం. అనసూయేశ్వరులు అంటే అమ్మ భర్త ‘నాన్నగారు’. కనుక ‘అనసూయేశ్వరాలయం’ అని నామకరణం చేసింది. ఆ అసదృశ ఆలయం శివకేశవుల అభేదతత్వానికి దర్పణం పడుతుంది.
నాన్నగారు జిల్లెళ్ళమూడి గ్రామకరణం గారు. అప్పట్లో జిల్లెళ్ళమూడి చిన్నపల్లె; రేటూరు గ్రామానికి చెందిన ఒక పాలెం. అమ్మ మెట్టిన పుణ్యభూమి అదే. జగజ్జనని పావన పాదస్పర్శతో ముక్తి క్షేత్రం అయింది. పెళ్ళి ఆధ్యాత్మికసాధనకి అవరోధం అనే మౌఢ్యాన్ని తొలగించింది,
“సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచి పెట్టేదే వివాహం అనీ ఆచరణాత్మకంగా అమ్మ ప్రబోధించింది.
పసితనం నుంచీ అమ్మలో దైవత్వ లక్షణాలు ప్రస్ఫుటమైనాయి సహజంగా; ఎందరో అసంఖ్యాక దివ్య అభుభూతులు పొందారు; ఆ అలౌకిక మధుర మాతృమూర్తి చెంతకు పరిసర గ్రామాల నుంచీ, క్రమేణా దేశం నాలుగు చెరగుల్లోంచి ఎందరో ఆకర్షితులయ్యారు.
అమ్మను దర్శింపవచ్చే వారికి భోజన భాజనాలు నాన్నగారింట్లోనే. ఆ కుగ్రామంలో అందుకు వేరే సౌకర్యం లేదు. అమ్మే స్వయంగా వండి, వడ్డించేది. ఉన్నవారనీ లేనివారనే భేదం లేకుండా ఆకలి గొన్నవారిని తన కన్నబిడ్డలుగావించి, ఆదరణ ఆప్యాయతలను రంగరించి భోజనం పెట్టేది. అమ్మ కంటికి మానవాళి గుణాలే కనిపిస్తాయి, దోషాలు కాదు. కులమత గుణ గణ భేదం లేకుండా ఆబాలగోపాలం ఆ తల్లి చల్లని ఒడిలో పురిటిబిడ్డలై ఒదిగిపోయేవారు.
క్రమేణా జిల్లెళ్ళమూడి వచ్చే యాత్రికుల సంఖ్య పది, వంద….కి పెరిగింది. కనుకనే చీరాల సోదరులు వేరే వంటశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కానీ నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు. ‘ఎదిగి వచ్చిన బిడ్డలు తండ్రికి ఆసరా అయినట్లు; రెక్కలు వచ్చిన సోదరులు రాని వారి కోసం చేసుకునే ఏర్పాటు అది’ అని అమ్మ సర్ది చెప్పింది. అపుడు నాన్నగారు అంగీకరించారు.
ఫలితంగా 1958 ఆగష్టు 15వ తేదీన అమ్మ తన అమృతహస్తాలతో అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించింది. ‘ఈ పుడమిపై ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండరాదని, కడుపు నిండా తినాలి అనీ’ అమ్మ సంకల్పించిన రోజు అది. ఉన్నవారూ, మనస్సున్న వారూ తమశక్తి మేరకు నగదు రూపంగా వస్తురూపంగా అన్నపూర్ణాలయ నిర్వహణకి సహకరిస్తారు. కానీ పెట్టుపోతల్లో, పిల్లల లాలన పాలనల్లో అమ్మ దృష్టిలో తేడాలేదు. అది పదార్థం గానీ, సౌకర్యం గానీ అందరికీ అందాల్సిందే. లక్షమంది తృప్తిగా అన్నం తిన్న ఆనందం కంటే ఒక్కడు పస్తు ఉన్న బాధ అమ్మ హృదయాన్ని తొలిచి వేస్తుంది.
అన్నపూర్ణాలయంలో జరిగే నిరతాన్నదాన కార్యక్రమం వైశ్వానరాగ్నికి సమర్పించే హవిర్భాగం. అది అమ్మయాగశాల, ప్రేమ ప్రయోగశాల. యదార్థంగా అక్కడి అన్నప్రసాదం అమ్మ అనుగ్రహ ప్రసాదానికి ఒక మాధ్యమం (MEDIUM). అమ్మ వాత్సల్య రసామృత సాగరం కట్టలు త్రెంచుకొని పరవళ్ళు తొక్కి ప్రవహించగా, సహస్ర బాహువులతో అక్కడ అమ్మే స్వయంగా అన్నం తినిపిస్తోంది అందరికీ.
ఏ కుటుంబ పోషణ బాధ్యతైనా ఆ కుటుంబ యజమాని తండ్రి. కనుకనే నాన్నగారి ఆరాధనోత్సవంలో భాగంగా శ్రీ అనసూయేశ్వరులకు ధాన్యం, బియ్యపు రాశులతో ఫిబ్రవరి 17వ తేదీన ఏటా అభిషేకం జరుగుతోంది. దేశ విదేశాల లోని అన్నయ్యలు, అక్కయ్యలు పురాకృత, సుకృత ఫలంగా భావించి తమ విభవం కొలది సహకరించి ఈ కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవటం అంటే ఎవరికి వారు తినటం కాదు; ఆదరణతో నలుగురికి తినిపించటం.
ధాన్యాభిషేక పర్వదిన సందర్భంగా సమీకరించబడిన ధాన్యం అన్నపూర్ణాలయ నిర్వహణకి సంవత్సరం పొడుగునా సరిపోతుంది. ధాన్యాభిషేకోత్సవం ప్రారంభమైంది. శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాదుర్భావం తర్వాతే. ఈ అంశాల్ని సూక్ష్మంగా పరికిస్తే అందరింటి బిడ్డల పోషణ బాధ్యతని నాన్నగారే నాడూ, నేడూ వహిస్తున్నారని అర్థం అవుతుంది. ‘జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’
నాన్నగారి ఆశీర్వచనం, అనుమతితోనే అమ్మ ఏ విశ్వకళ్యాణకారకమైన కార్యక్రమాన్నైనా సంకల్పించేదీ, ప్రారంభించేదీ. తండ్రి జేబు నింపితే, తల్లి కడుపు నింపుతుంది. సాంఘిక వ్యవస్థలో కుటుంబ పెద్దగా నాన్నగారు గురుతరమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ధాన్యాభిషేకం కడుభక్తిశ్రద్ధలతో అన్యోన్య సహాయంతో అనుజులంతా జరుపుకునే సుప్రసిద్ధ ఉత్సవం అయింది.
ఆధ్యాత్మిక దృక్పధంతో చూస్తే మానవశరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలున్నాయి. అన్నమయ కోశమే. మిగిలిన వాటికి ఆధారమైనది. ‘కనుకనే శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’ అనేది ఆర్యోక్తి అయింది. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్ధ ప్రాప్తికి పటుతరమైన సాధనం శరీరమే. శారీరక ఆరోగ్యమే మానసిక ఆరోగ్యాన్ని, క్రమేణా అఖండానంద ప్రాప్తికి సోపానం అవుతుంది. కనుకనే అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించి అన్నమయ కోశాన్ని ఉద్ధరించడానికి గట్టి పునాది వేసింది.
జిల్లెళ్ళమూడిలో నిర్వహించే ధాన్యాభిషేక సేవాకార్యక్రమ లక్ష్యం, ఫలం: సామాజికసేవ, ఆధ్యాత్మిక సాధన, భక్తి తత్పరత, జన్మసార్థకత ‘నీ మాతృ వాత్సల్య సంపూరితంబైన ఈ పట్టెడన్నంబు సంతృప్తికరము’ అని అమ్మ చేతి గోరుముద్ద ప్రభావాన్ని కీర్తించారు శ్రీరాజుబావ.
పూజ్యశ్రీ కందుకూరి శివానందమూర్తిగారు “అమ్మ చేతి అన్నం మెతుకులు ఎన్ని స్వీకరిస్తే, అన్ని జన్మల కర్మఫలం నశిస్తుంది” అని ప్రబోధించారు.
శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి కలిగించే ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన కుటుంబ సభ్యులు, హితులు, సన్నిహితులతో కలసి పాల్గొందాం. అనితర సాధ్యమైన సర్వసృష్టికారిణి అమ్మ అనుగ్రహాన్ని సునాయాసంగా పొందవచ్చు ఈ ధాన్యాభిషే క మహాయాగంలో పాల్గొనటం ద్వారా. ‘శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం సంవిదాదేయం’ అనే నిగమాగమసారానికి ఆచరణాత్మక రూపమే ధాన్యాభిషేకం.
అన్నదాతలంతా అమ్మకు వారసులే. ఈ మహాక్రతువులో పాల్గొనే దాత, గ్రహీత ఇరువురూ ధన్యులే. ఈ యజ్ఞఫలం అమృతత్వమే.
మనం ఆచరించేది ధాన్యాభిషేకం.
అమ్మ అనుగ్రహించేది అమృతాభిషేకం.
శ్రీ సీతాపతి తాతగారిని ‘నాన్నా!’ అనీ, శ్రీమతి రంగమ్మ అమ్మమ్మని ‘అమ్మా!’ అనీ ఏ స్వరస్థాయిలో సంబోదించిందో అదే ఆర్ద్రతతో మన అన్నయ్యలను, అక్కయ్యలను ‘నాన్నా!’ అనీ, ‘అమ్మా!’ అనీ సంభావన చేసింది అమ్మ.
అమ్మ కన్న బిడ్డలుగా మనం అన్నపూర్ణాలయ సేవ చేసికొని అమ్మ హృదయానికి ప్రతిబింబాలు కావటానికి పథకాలూ, ఆచంద్రతార్కారం అమృతత్వరసాస్వాదనకు సువర్ణావకాశాలూ ఇవిగో :
1) అన్నపూర్ణాలయ భవన నిర్మాణం కోటి రూపాయల వ్యయం అంచనగా అన్ని వసతులతో అన్నపూర్ణాలయ నూతన భవన నిర్మాణ నిమిత్తం రూ.36,500/-లు తక్కువ కాకుండా విరాళాన్ని అందజేయు దాతల పేర్లు శిలాఫలకముపై ప్రదర్శింపబడును.
2) శాశ్వత అన్నదాన పథకం : దాత సమర్పించిన రూ. 60,000/-లు విరాళాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, వడ్డీతో ప్రతి సంవత్సరము వారు కోరిన ఒక రోజున వారి గోత్రనామాలతో ఆలయాల్లో పూజ, అన్నపూర్ణాలయంలో ప్రసాదవితరణ జరుగును.
3) నిత్యాన్నప్రసాద వితరణ పథకం : రూ.3,500/ -లు విరాళాన్ని అందించు దాత గోత్రనామాలతో వారి పుట్టినరోజు, పెళ్ళిరోజు లేదా వారి పెద్దల పుణ్యతిధులలో ఆలయాల్లో పూజచేసి, అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాద వితరణ జరుగును.
4) శాశ్వత ధాన్యాభిషేకం రూ.10,000/-లు విరాళాన్ని అందించు దాత గోత్రనామాలతో ప్రతి సంవత్సరం ఫిభ్రవరి 17వ తేదీన ధాన్యాభిషేకం నిర్వహించి, వారికి అమ్మ ప్రసాదం పంపబడును.
5) సాలీనా ధాన్యాభిషేకం : ప్రతి సంవత్సరము నిర్వహించు ధాన్యాభిషేకం సందర్భంగా ధాన్యంతో అభిషేకానికి రూ.1,000/-లు, బియ్యంతో అభిషేకానికి రూ. 2000లు సమర్పించు దాతల పేరిట అభిషేకాన్ని నిర్వహించి, ప్రసాదం పంపబడును.
అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ ।
అన్నదాతలంతా అమ్మ (బ్రహ్మ)కు వారసులే!!
మధురమంటే తీపికాదు. ఎవరికి ఏది ఇష్టమైతే వాడికదే మధురం.
ప్రాణం పోయిన తరువాత కూడా ఆ శరీరంలో చైతన్యముంటుంది. కాని అది మనకు ఉపయోగపడక పోవచ్చు.
బరిపిడి వస్తే కాని మెరుదురాదు.