1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ధాన్యాభిషేకం -17, జిల్లెళ్ళమూడి అమ్మ (సప్తదశశ్లోకాభిషేకం-2021)

ధాన్యాభిషేకం -17, జిల్లెళ్ళమూడి అమ్మ (సప్తదశశ్లోకాభిషేకం-2021)

Pillalamarri Srinivasa Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

1) అభిషేకం సదా కుర్యా ద్ధాన్యేన చ సభక్తికమ్I

ధన్యో భవేత్ పుమాన్నిత్యం ధన ధాన్య సమృద్ధిభిఃII

భావం: ఎంతో భక్తితో మనం ధాన్యాభిషేకం చేయాలి. ఎవరైతే ధాన్యాభిషేకంలో పాలు పంచుకుంటారో వారు ధనధాన్య రాశులతో ధన్యులు కాగలరు.

2 యో లోకో మోదమాప్నోతి ధాన్యరూప ధనేన చ !

సో లోక స్స్వర్గమిత్యాహు స్సర్వశాస్త్ర విశారదాః ॥

భావం : ఏ లోకమైతే ధాన్య సంపదతో సంతోషించునో ఆ లోకమే స్వర్గమని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు.

3) అన్నమేవ పరం బ్రహ్మ త్వనసూయా వసుంధరాI

దాత్రీ ధాత్రీ చ గాయత్రీ జగత్పోషక రూపిణీ॥

భావం: అన్నమంటే పరబ్రహ్మ స్వరూపం. మన అమ్మ అనసూయా దేవియే భూమాత. ఇచ్చేది, సర్వార్ధములను ధరించేది, తన బిడ్డలను రక్షించేది, లోకాన్ని పోషించేది కూడా మన అమ్మయే.

4) అన్నం నామాన్నపూర్ణేతి పూజా ధాన్య సమర్పణమ్I

ఇతి మత్వా జనాస్సర్వే పూజయంతి చ మాతరమ్॥

భావం: “ఆ అన్నపూర్ణ మాతయే అన్నము. ఆమెను పూజించడమంటే ధాన్యము అర్పించుటే” అని భావించి ప్రజలెల్లరు సర్వేశ్వరియైన అమ్మను ధాన్యముతో పూజిస్తున్నారు.

5) క్షుద్బాధాం వారయత్యేవ సర్వేషాం ప్రాణినాం సదా !

సైవేషా హి జగన్మాతా స్థితి కారక రూపిణీ II

భావం : స్థితి కర్త, జగన్మాత అయిన అమ్మ ఎల్లప్పుడు సమస్త ప్రాణుల యొక్క ఆకలి బాధను నివారించు చున్నది.

6) సర్వేషాం భోజనం దత్వాస్వయం తుష్టా క్షుధాం వినా ।

తస్యాః కృపాం లభేమాద్య ధాన్య యజ్ఞే సమర్చనాత్II

భావం: తాను తినక పోయినా అందరికి భోజనము పెట్టటం ద్వారా సంతోషించే తల్లి అనసూయమ్మ. ఈ ధాన్య యజ్ఞంలో భాగస్వామ్యం పొందుట ద్వారా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందెదము.

7) న చ తృప్తి ర్భవేత్తస్యాః యో జనో న హి భక్షయేత్I

న గచ్చేచ్చ కదా కో ప్య భుక్త్వా తు తత్ర భోజనమ్II

భావం: వేల మంది భోజనము చేసిన సరే ఒక్కరూ తినకపోయినా అమ్మ తృప్తి పడేది కాదు. ఎందుకనగా ఏ ఒక్కరు కూడా అన్నం తినకుండా అన్నపూర్ణాలయం నుంచి వెళ్ళకూడదని అమ్మ కోరుకునేది.

8) స్వల్పం ధాన్యం చ పర్యాప్త మనల్పపుణ్యకారకమ్I

దద్యాచ్చ శ్రద్ధయా నిత్యం భక్తి భావ పురస్సరఃII

భావం: మనమిచ్చే ధాన్యము కొంచెమైననూ అనంతమైన పుణ్యాన్ని కలిగించును. కాబట్టి శ్రద్ధతో, భక్తితో, ఎల్లప్పుడును అమ్మను సేవించాలి.

9) ధాన్యరూపేణ సించేచ్చ ధనరూపేణ వాథవాI

సమర్చయేత్సదా భక్త్యా పరమానంద యోగినఃII

భావం: మిక్కిలి సంతోషంతో, భక్తితో, నిరంతరం ధాన్య రూపంతో గాని ధన రూపంతో గాని పరాత్పరియైన మన అమ్మను లోకోపకారమునకై అర్చించాలి.

10) కియద్దేయం కథం దేయమితి చిన్తా చ నోచితమ్I

సద్యోదేయం సదా దేయం సేవా భావ మనస్విభిఃII

భావం: ధాన్యాభిషేకానికి ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి అనే ఆలోచనే తగినది కాదు. ఇవ్వాలనుకున్నది వెంటనే ఇవ్వాలి. త్యాగ భావం కలవారు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వచ్చు.

11) శతయజ్ఞఫలం సర్వం శతవ్రత ఫలేప్సితమ్I

సిధ్యతే ధాన్య వర్షేణ శ్రుణు పుత్ర! మహద్వచః ॥

భావం: కుమార! గొప్ప వాక్యము విను. నూరు యజ్ఞములు చేసిన ఫలము, నూరు వ్రతముల ద్వారా కోరే ఫలము ధాన్యమును అర్పించుట ద్వారా కలుగుతుంది.

12) దుఃఖార్తో ముచ్యతే దుఃఖాత్ బంధనాచ్చ విముచ్యతే

తృణాభిషేక కార్యేణ సర్వపాపాత్ప్రముచ్యతే

భావం : పుణ్య మగు ధాన్యాభిషేక కార్యము ద్వారా ఆకలితో బాధపడే వారి దుఃఖమును పోగొట్టుట ద్వారా తన దుఃఖము నుండి విడువబడును. బంధనములు తొలగిపోవును. అన్ని పాపములనుండి విముక్తుడగును.

13) కృష్ణార్పణమిదం సర్వం యదస్మాభి స్సమర్పితమ్I

తస్మాద్ధాన్యంచ దాతవ్యం మనోవాక్కాయకర్మభిఃII

భావం: మనం సమర్పించేది ప్రతీది “ కృష్ణార్పణం” అంటారు. అందువలన త్రికరణశుద్ధిగా మనం సమర్పించే ధాన్యం కూడా కృష్ణార్పణమే కదా. అమ్మ కృష్ణునిగా సాక్షాత్కరించెను కదా!

14) సత్కార్యంచ బృహత్కార్యం కోటిపుత్రాభిరంజకమ్I

దినదినాభివృద్ధిశ్చ లప్స్యతే పుణ్య కర్మభిః

భావం: ఇది ఒక మంచి కార్యమే కాదు. గొప్పదైన, బృహత్తర మైన కార్యక్రమం. కోట్లాది బిడ్డలను సంతోష పెట్టే కార్యక్రమం. ఇటువంటి పుణ్య కర్మల ద్వారా దినదినాభివృద్ధి జరుగుతుంది.

15) భవతి! దేహి భిక్షామిత్యే తద్వాక్యం జనైః శ్రుతమ్I

అత్రత్వన్నప్రసాదం చ న తు భిక్షాన వేతరాII

భావం: లోకంలో ‘భవతి! భిక్షాం దేహి’ అనే వాక్యం వింటూ ఉంటాం. కాని జిల్లెళ్ళమూడిలో అది అన్నప్రసాదమే తప్ప భిక్ష కాదు, మరే ఇతర మైనది కాదు.

16) నాగేశ్వరాన్నదాతారం జగత్పితేవ భాజనమ్I

తం చ మహోన్నతం వందే మాతుః పరదైవతమ్II

భావం: జగత్తుకు తండ్రి వలే ప్రకాశించు, ఈ అన్నప్రసాదానికి మూలకారకుడు, మహోన్నతుడగు, తల్లికి అత్యంత దైవస్వరూపుడగు నాగేశ్వరరావు నాన్నగారికి నమస్కరించు చున్నాను.

17) పుష్పైస్సప్తదశశ్లోకై రర్చితా ధాన్యరూపిణీ ।

ధాన్యాభిషేక సంతుష్టా దద్యాన్మాతా శుభావళిమ్ ॥

భావం: ఈ 17 శ్లోకాల ద్వారా శ్లోకార్చన స్వీకరించిన, ధాన్య రూపమగు మా అమ్మ ధాన్యాభిషేకం ద్వారా సంతోషించినదై మాకు శుభములను కలిగించు గాక!

జయహూ మాత మాతాన్నపూర్ణేశ్వరికి……జై జగత్పిత నాన్న గారికి…. జై

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!