- ధాన్యాభిషేకమునకై
అన్యాలోచనలు మాని అడుగిడ వలదే!
ధన్యులమై, మన మిక ధన
ధాన్య సమృద్ధిని గడింప తరుణం బిదియే.
- శ్రీ ప్రణాళికలు మీ ప్రయత్నములున్
మీదు శక్తి యుక్తి మీదు భక్తి
విశ్వజనని కొరకు వెల్లువ లెత్తగా
అన్నపూర్ణ నిధికి అడ్డు గలదె?
- నిత్య చైతన్య శీలురు నిజము మీరు
అమ్మ సేవకు మీరెల్ల అగ్రగాము
లగుచు ధాన్యాభిషేకమ్ము నద్భుతముగ
జరుపరండోయి మన అమ్మ చరణములకు.
- అమ్మ ఆశయమగు ఆకలిపై యుద్ధ
మనవరతము జరుగు అర్కపురిని
అమ్మ బిడ్డ లెల్ల అలుపు సొలుపు లేక
కదనరంగ మందు కదల వలదె?
- మానవసేవ యొనర్పగ
పూనికతో మాధవునికి పూజ యొనర్పన్
కనుగొన్న ఉపాయ మిదియె
ఒనరగ ధాన్యాభిషేక మొకటియె చాలున్.
- అమ్మ పాదములకు అర్పించు ధాన్యమ్ము
సిరులు సంపదల లిడు వరము కాదె!
గుప్పెడంత ఇచ్చి కొండంత పొందగా
తరుణ మీదెయటంచు తలప వలదె?
- ఇమ్ముగ జనులకు ఆకలి
వమ్మయి పోవలెను గాక! వసుధ నటంచున్
నెమ్మది సంకల్పించిన
అమ్మకు ధాన్యాభిషేక మానంద మహో!
- ఇమ్ముగ అందరిలోకటి ఏర్పడ జేసిన అమ్మ లక్ష్యమున్
నెమ్మనమందు గుర్తెఱిగి నీమము భక్తియు మేళవింపగా
అమ్మకు ధాన్య మిచ్చెడు మహత్తరమైన సమర్చంబునన్
సమ్మతితోడ పాల్గొనుడు; సార్ధకమౌనిక సర్వ సంపదల్.
- అమ్మయె మూలకారణ మనంత జగత్తున కెల్ల వేళలన్
అమ్మయె ప్రేరణమ్ము గద అర్థము శబ్దము రూపుదాల్చగా
అమ్మయె ప్రాణశక్తియగు నంతట సర్వము నిర్వహింపగా
అమ్మను మించి వేరుగలదా! మరి ఏడుగడౌను అమ్మయే.