తరువాత, మరొక్క విషయం. అమ్మకి ఇద్దరు కొడుకులు, ఒక్క కూతురు, లోక భావంలో. కూతురికి యుక్త వయస్సు వస్తే అందరూ లోక రీతిలో “అమ్మా, పెళ్ళి చెయ్యి, వయస్సు వస్తోంది కదా”, అంటే ఆమె చెప్పింది – “ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. జరిగేది జరగనీ” అన్నది. ఎవరికీ అర్థం కాలేదు. ఆ కూతురు, మామూలు కూతురు కాదు. అమ్మ బంగారం అయితే, అమ్మ శుద్ధ చైతన్యమయితే, ఆ బంగారాన్ని కోస్తే ఏమొస్తుంది? బంగారమే వస్తుంది. ఆ వచ్చిన బంగారమే ఆమె. పేరు హైమ. ఆ హైమ కాలాంతరంలో శరీరం చాలించింది. ‘మహా మహిమాన్విత స్వరూపిణి, ఎంత మందినో బ్రతికించింది. ఎంత మందికో రోగం పోగొట్టింది. తన కూతుర్ని కాపాడుకోలేకపోయింది’ అన్నప్పుడు ఒక మాటన్నది – “నేనే తెచ్చుకున్నాను, నేనే పెంచుకున్నాను, నేనే పోగొట్టుకున్నాను.” తనలో ఉన్న తన సర్వశక్తినీ హైమ అనే శరీరంలో ప్రవేశపెట్టి, అంటే ట్రాన్స్ఫర్ చేయటం, ట్రాన్స్మిట్ చేయటం, యోగశాస్త్రంలో ఉంది. తన శక్తినంతా ‘హైమ’ అనే దేహంలో పెట్టి “ఇక నుంచీ “ఈమె మీకు శక్తి స్వరూపిణి, ఏమన్నా కావాలంటే ఆమెని అడుగుతూ ఉండండి” అని చెప్పింది. సాధ్యమేనా! తాను స్వయంగా సమాధి చేసింది పక్కన కూర్చొని. ఇదీ, “హైమను పోగొట్టుకున్నప్పుడు అమ్మది గర్భశోకం” అన్నాడొకాయన. నేనన్నాను, “నీకు కంటికి కనిపిస్తున్న ఒక్క హైమ వల్ల గర్భశోకం కాదు, ఆమె అసలు రావటమే ఆగర్భశోకంతో వచ్చింది.
అందరూ నా బిడ్డలే అన్నప్పుడు, ఎంత మంది బిడ్డలు పోయినారో? అందుకే ఆమె ఆగర్భశోకంతో వచ్చింది” అని నేను భావన చేసి చెప్పాను.
తరతమ బేధాలు లేవు, పాప పుణ్యాలు లేవు. ఆ రోజుల్లో ‘బిన్ని’ చీరలు చాలా ఖరీదు. ఆమె అమ్మవారు గనుక, అమ్మవారుగా భావించారు కనుక, ఏదో పెద్దామె గనుక, ఏవో చీరెలు తెచ్చిచ్చేవారు. ఆమె తన కోసం బీరువాలో ఉంచుకున్నవి ఏమీలేవు. ఎవరొస్తే, ఎవరికవసరమైతే వాళ్ళకి ఇస్తుంటే, ఒకామె ఎవరో అన్నారు. అమ్మా అన్నీ ఇచ్చేస్తే ఎలా అని. “ఒరే నాన్నా! బిన్నీ కట్టుకున్న నాకు, గన్నీ అంటే జ్యూట్ కట్టుకుని నేను బ్రతకగలను. వాటి గురించి మర్చిపోండి” అన్నది. “శరీరానికి ఆచ్ఛాదన కావాలి కానీ ఇంకేం కావాలి, నాన్నా!” అన్నది.
అద్వైతాన్ని చెప్పటం చాలా తేలిక, హైపర్ బోల్స్ మాట్లాడటం చాలా తేలిక. భావావేశంతో చెప్పటం చాలా తేలిక. ప్రాక్టికల్గా అమ్మ చూపిన ఈ దారి రాజ మార్గమే. ఎన్నో ఇమిడి ఉన్న మార్గమిది. ధ్యానం చెయ్యి. నీకేదో, ఎవరో కనబడతారు. అదో పద్ధతి. ధ్యానం చెయ్. నీ మనసు కంట్రోల్ అవుతుంది. అది ఒక పద్ధతి. లేదా భక్తియోగంలో రోజూ భజనలు చెయ్, నర్తనలు చెయ్, భరతనాట్యం చెయ్, ఊగు, తూగు అన్నీ చెయ్… వీటికంటే క్షేత్రస్థాయిలో జీవుడు అధ్యాత్మని ఎలా అనుభవించాలో, సంపూర్ణంగా మనందరికీ విశదపరిచిన ‘జిల్లెళ్ళమూడి అమ్మ” ఆద్యంతరహితమైనది.
అమ్మ ‘అంఆ’ అని సంతకం పెట్టేది. ఆదీ తానే, అంత్యమూ తానే. అది వేదాంత భాష.
అమ్మను అడిగారు, “అమ్మా మాకిన్ని కష్టాలుంటాయి కదా. మేమొచ్చి రోజూ ఏదో ఒక ఇబ్బంది మీకు చెప్తూ ఉంటాము కదా. మీకు కూడా ఏమన్నా కోరికలు, తాపత్రయాలు ఉంటాయా ?” అంటే “నాన్నా మీ అందరికీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క తాపత్రయం ఉంటుంది. మీ అందరి గురించి తాపత్రయం నాయందు ఉంటుంది. ఆ తాపత్రయం ఏమిటో తెలుసునా? మీరందరూ హాయిగా ఉండాలి. రోజూ చక్కగా అన్నం తినాలి. ఆనందంగా బ్రతకాలి. ప్రేమైక జీవులుగా ఉండాలి. ఇది నా తాపత్రయం నాన్నా. నాకు మాత్రం తాపత్రయం లేకుండా ఎక్కడికి పోయింది?” అన్నది. వేరే వారైతే, “తాపత్రయం ఎప్పుడో వదిలేశాను, ఇక మీ బాగోగులు చూడటం కోసమే పీట మీద కూర్చున్నాను” అంటారు.
అనేకమైన గ్రంథాలను మనం చూసే విధానం వేరు, అమ్మ చూసే విధానం వేరు. చాలా గంభీరమైన, లోతైన విషయాలన్నిటినీ సమన్వయపరుస్తూ ఆమె ప్రకటించిన విషయం మాత్రం ఒకటి మనం చెప్పుకోవాలి. “నేను నేనైన నేను”. నేను అనసూయగా, జిల్లెళ్ళమూడి అమ్మగా, ‘మరొకరుగా కనిపిస్తున్న ఈ నేను’, నేనైన అంటే నేనుగా మారిన అంటే జిల్లెళ్ళమూడి అమ్మగా రాలేదుగా నేను వచ్చింది. అనసూయగా వచ్చి, నేనైన జిల్లెళ్ళమూడి అమ్మగా అయి, నేనుగా ఉన్న ఆ నేను ఎవరంటే, ఈ మేను దాటిన నేనే ఆత్మస్వరూపిణిని అని చెప్పింది. సంసారం ఉన్నప్పటికీ ఆమె నిరంతరం బ్రహ్మమునందు చరించింది కనుక ఆమె బ్రహ్మచారిణి అయింది. గృహస్థాశ్రమంలో ఉన్నది కనుక గృహిణి అయింది. అలాగే అందరికీ అన్నపు ముద్దలు కలిపి పెట్టి కర్మఫలాలన్నీ తాను తీసుకొని మధుర ఫలాలుగా మార్చి మళ్ళీ మనకు ముద్దలు పెట్టి, భవ్య, దివ్యమైన జీవితాన్ని వరదానం చేసింది అమ్మ. ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియవు.
“భావస్థిరాణి జననాంతర సౌహృదాని” అంటాడు కాళిదాస మహాకవి! నా 12వ ఏట 1962 మే 9 అమ్మని నేను దర్శనం చేసుకున్నాను. ఆ ప్రాంతంలో చదువుకుంటున్నందు వల్ల అమ్మని చూద్దామని వెతుక్కుంటూ బస్సులో వెళ్ళి, చూసి, హాలిడేస్లో 9 సందర్భాలలో అమ్మ దగ్గర ఉంటే అమ్మ ఒకటే అనేది – “నా కోసం వచ్చావు. నా దగ్గరే ఉండు నాన్నా!” అని అనటానికి నేను అమ్మకేమీ ఉపయోగం లేదసలు. ఏ రకంగానూ నాకు పని ఇవ్వలేదు. ఫలానా పని చేయి. విస్తరాకులు పట్టుకురా. తోరణాలు కట్టు. ఈ పనులేమీ చెప్పలేదు. నా దగ్గరుండు నాన్నా అన్నది. ఆ ఉండటమే నాకు అపరోక్షానుభూతిని అనుగ్రహించింది అమ్మ.
భగవాన్ సత్యసాయి బాబావారు అంటారు, “నీవు వేయి సంవత్సరాలు గురువు దగ్గర ఉన్నా, నీవు మహా సముద్రం మధ్యలో ఒక గండ శిలవలె ఉన్నట్లయితే, ఒక్క చుక్క కూడా నీలోకి ఇంకదు. నువ్వు ఉన్నావు. ఆ గురువూ ఉన్నారు. ప్రయోజనం లేదు. గురువు వస్తున్నాడు, కెరటం వలె వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తాకుతున్నాడు, తడుముతున్నాడు, తడుపుతున్నాడు. వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆరిపోతావు. కాని ఒక మట్టి బెడ్డవలే ఉండగలిగినట్లయితే, నీరు దీనిని తాకగానే, మట్టిబెడ్డే, సముద్రమయిపోతుంది.” అట్లా అమ్మ దగ్గర నేను కూర్చున్నప్పుడు మహా పండితులొచ్చేవారు. వచ్చి అమ్మ దగ్గర మాట్లాడేవారు. వాళ్ళకి పరిష్కారం చెప్పేది. వాళ్ళకి పాపం పరిష్కారం దొరక్క ఈ శాస్త్రంలో అదుంది, ఇదుంది, అంటే, సులువుగా చెప్పేసేది. ఇంకెవడో పామరుడొచ్చేవాడు. “అమ్మా, పిల్ల పెళ్ళి కావటం లేదు”, అంటే “అవుతుందిలే” అనేది. ఎప్పుడవుతుంది, ముహుర్తమేమిటి, ఇవన్నీ చెప్పేది కాదు. ‘అవుతుందిలే’ అన్నదంటే అది అయిపోతుంది. అంటే, అమ్మది ‘వశ్యవాక్కు’ ఆమె చెప్పింది. “ఇదేమన్నా, తోలునోరా, తాలు మాటలు బయటికి రావటానికి! ” అని.
(సశేషం)
(శ్రీ వి. యస్. ఆర్. మూర్తి గారి గ్రంథం ‘అంఆ తత్త్వదర్శనమ్’ నుండి గ్రహించబడినది.)