- ఏ అమ్మచారిత్ర మింపైన కథలతో అద్భుతావహమౌచు నలరుచుండు,
ఏ తల్లి దీవెన లెందరి బ్రతుకుకో వెలుగుబాటలు చూపి వెతలుతీర్చు
ఏ మాతనామంబు ఎల్లవేళలయందు వీనులవిందౌచు వినుతినొందె
ఏ యంబరూపంబు ఎంతయు కాంతితో నేత్రపర్వంబౌ నిండుమదిని
అట్టి దైవంబు గురువుగా అమరె మనకు
ఎంతో పుణ్యఫలమ్ముగా నిచటదొరికె
జనుల యాత్రకు సాఫల్యజనకమగుచు
అధిక సంతృప్తినిచ్చుట అబ్బురంబె.
- అమ్మ మహానుభావతను నందరుచూచి తరించుచుంద్రుగా
సమ్మతితోడ నందరకు సద్గతి నీయగ నేగుదెంచెనో
ఇమ్మహి సందరింట తగనెప్పుడు సుందర మందహాసమున్
అమ్మగ నాదరించు నిట ఆమనివోలె పరార్థమౌగతిన్.
- ఏ భావంబున నిన్ను చూడగలమో ఏ నామమున్ పిల్తుమో
ఏ భావంబున నిన్ను చేరగలమో ఏ మార్గ మింపైనదో
మా భాగ్యంబున నీదు దర్శనము మా కబ్బెం గదా పావనీ!
ఏ భాషల్ సరిపోవు నీ కరుణ వర్ణింపంగ నే మాత్రమున్.
- ఏ తల్లి నిలయాన నెల్లవేళలయందు అనసూయ నామమ్ము హాయిగొలుపు
ఏ మాత హృదయంబు నెల్లవారిని చూచి ఉత్ఫుల్లపద్మమై ఉత్సహించు.
ఏ అమ్మ ఆవాసమెవరు వచ్చినగాని ఆహారమందించి ఆర్తి బాపు
ఏ జనని జీవులనేమరకుండంగ కరుణ నిండిన కనుల కాచుచుండు
విద్యనేర్పను ప్రేమతో విశదముగను
కనుల ముందర వెలుగొందు కల్పతరువు
పూజలందెడు దేవత పుణ్య చరిత
పూర్ణ మానవ రూపాన పుడమి వెలసె.
సశేషం