(విశాఖ సో.శ్రీ చాగంటి శరభలింగం గారు ‘అమ్మ’తో తమకు గల విశేష అనుభవాలను గ్రంథస్థం చేసి అందించారు. దాని ఆధారంగా వారి అనుభవ పరంపరను ధారావాహికంగా అందిస్తున్నాము. మనలో ప్రతి ఒక్కరు తమ అనుభవాల్ని అందజేస్తే, ముఖ్యంగా భావితరాలకు ఒక అపూర్వ జ్ఞాననిధిని, అమూల్యమైన కానుకను అందించినవారు అవుతారని విజ్ఞప్తి చేస్తున్నాము – సంపాదకులు)
(గత సంచిక తరువాయి)
‘ఆలయంలో అభిషేకం ఎన్నిగంటలకు మొదలు అవుతుంది? అందు నిమిత్తం ఎంత కట్టాలి? ఎక్కడ కట్టాలి?” అని కొమరవోలు శేషు అక్కయ్యని అడిగితే, ‘ఏమీ కట్టనక్కరలేదు! ఉదయం గం.6.30 లకు వస్తే చాలు’ అన్నది. నాటి రాత్రికి శ్రీ చాగంటి వెంకట్రావుగారి గదిలోనే విశ్రమించి ఉదయం అభిషేకం చేసుకుని అమ్మ దర్శనం కోసం వెళ్ళాను.
“అభిషేకం చేసుకున్నావుగా, నాన్నా! నీకు లింగధారణ అయినట్లుంది. చూపించు” అని అడిగింది. మెడలో ఉన్న లింగమూర్తిని తీసి నా అరచేతిలో ఉంచి చూపించాను. అమ్మ ఆ లింగమూర్తిపై కుంకుమ ఉంచి “ఎంత ముద్దుగా ఉందో, నాన్నా!” అంటూ తిరిగి
భోజనం అయింది. తిరుగు ప్రయాణం కాగానే బొట్టు పెడుతూ ‘దసరాల్లో రా, నాన్నా! బాగుంటుంది” అంటూ పునర్దర్శన ప్రాప్తిని అనుగ్రహించింది. వస్తానమ్మా అని అమ్మకు పాదాభివందనం చేసి బయలుదేరాను.
అమ్మమహత్వం:
దసరా పండుగలకి నేను, నా శ్రీమతి సువర్చల, అమ్మాయి ఇందిర, అబ్బాయి రాజేష్ అందరం జిల్లెళ్ళమూడి చేరాం. ఎన్నాళ్ళనుంచో పరిచయం ఉన్నవారిలా ఆవరణలోని అందరూ ఆప్యాయంగా పలకరిస్తూంటే ఎంతో హాయిగా ఉంది. అందరింటి ఆవరణలోని ప్రశాంతత, ఆలయాల్లో కార్యక్రమాల్లో పవిత్రత, పైన అమ్మ కరుణ మైమరపింపజేసేవి.
ఒకనాడు అన్నపూర్ణాలయంలో భోజనానికి కూర్చున్నాం. కూరతోపాటు ఎర్రమిరప్పళ్ళ పచ్చడి వడ్డించారు. అవి అసలే గుంటూరు మిర్చి; కారం ఎక్కువ. పచ్చడి రుచి చూశాను; గూబగుయ్యిమంది. మా ఐదేళ్ళ అమ్మాయి ఇందిర పచ్చడి కలుపుతోంది. “అమ్మా, ఇందిరా! పచ్చడి చాలా కారంగా ఉంది. నువ్వు తినలేవు” అని ముందుగానే సూచించాను. “లేదు, డాడీ! ఎంతో కమ్మగా ఉంది’ అంటూ మారు వడ్డించుకుని మరీ తిన్నది. ఒకే పంక్తిలో కూర్చున్న వారికి ఒకే పాత్రలోని వంటకం విభిన్నమైన రుచులను ఇవ్వటం ఆశ్చర్యం అనిపించింది. అమ్మ మహత్వాన్ని తలచుకుంటూ ఆనందబాష్పాలను రాలుస్తూ భోజనాలు పూర్తిచేశాం.
మా అబ్బాయి రాజేష్ మూడేళ్ళ పిల్లవాడు. వాడికి ఏ సమయంలో అవసరం అవుతుందోనని, ఊళ్ళో ఒక పావుశేరు పాలు వాడకం పెట్టుకున్నాం. పాలు పుచ్చుకుని కాచుకునేందుకు అన్నపూర్ణాలయంలోకి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం దర్శనం కోసం అమ్మ వద్దకు వెళ్ళాం. నా శ్రీమతితో అమ్మ ‘అమ్మా! ఇక్కడ పాలు వుండగా వేరేచోట పాలు వాడిక పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని సూటిగా అడిగింది. అమ్మకు ఈ సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూంటే “నాకు ఈ గోడలు అడ్డు కావు” అన్న అమ్మ మాట గుర్తుకొచ్చింది. అమ్మ విశాలాక్షి అనే తత్త్వాన్ని అనుభవంలో చూడగలిగాము.
హైమవతీదేవి అనుగ్రహం:
విశాఖపట్టణంలో మా ఇంట్లో సంధ్యావందనం చేసుకుంటుంటే ‘నేను వస్తున్నాను’, ‘నేను వస్తున్నాను’ అనే మాటలు వినిపించాయి. ఎవరో, ఎక్కడి నుంచో తెలియలేదు. కనుక ఆ విషయం పట్టించుకోలేదు. మరలా అవే మాటలు వినిపించాయి. త్వరత్వరగా పూజ ముగించుకుని తయారవుతున్నాను. వీధి తలుపు చప్పుడయింది.
ఒక అమ్మాయి – ఒళ్ళో పళ్ళెం, అందులో వెంకటేశ్వరస్వామి వారి చిత్రపటం పెట్టుకుని “తిరుపతి వెళ్తున్నాం, జోగి కోసం వచ్చాను” అంది. ఒక రూపాయి పళ్ళెంలో వేసి నమస్కారం చేశాను. “అందరిళ్ళకీ వెళ్ళను. అయినవాళ్ళంటికే వెళతాను. ఐదు రూపాయలు వెయ్యండి” అన్నది. చిరాగ్గా తోచినది. వేశాను కదా! అంత ఇంత అని లెక్క ఏమిటి?” అన్నాను. మళ్ళీ అదే మాట – ‘అందరిళ్ళకూ వెళ్ళను …”అని. నాకు అనుమానం వచ్చి ‘మీరు ఎవరు! ఎవరి తాలూకు బంధువులు!’ అని అడిగాను. ‘నేను సుబ్బారావు చెల్లెలిని’అన్నది. మా కాలనీలో నలుగురు సుబ్బారావులు ఉన్నారు. కనుకనే ‘ఏ సుబ్బారావు గారు?” అని అడి ఎవరో అడిగాను. ‘తోట సుబ్బారావు’ అన్నది. ఆ వ్యక్తి ఎ తేల్చుకోలేక ‘సరేలే’ అంటూ పళ్ళెంలో ఐదు రూపాయలు వేసి నమస్కరించాను. “మీకు మంచి జరుగుతుంది” అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తలుపుకి తాళం వేసి వీధిలోకి వచ్చి చూట్టూ నాలుగైదు వీధులు వెదికాను. ఆమె ఎక్కడా కనపడలేదు.
విశాఖ అధ్యయన పరిషత్ సభ్యురాలు కుసుమక్కయ్య నా సందేహానికి సమాధానం ఇచ్చారు “వచ్చింది వేరెవరో కాదు, హైమక్కయ్య” అని. అప్పుడు ఆ ముఖకవళికలు, కట్టు-బొట్టు తీరు, మాట సొంపు, మేని ఛాయ పోలికలన్నీ గుర్తుకొచ్చాయి.
సృష్టిక్రమం – సృష్టి ధర్మం:
East Zinc Shelter Colony లో వున్నప్పుడు ఒకనాటి సాయంకాలం దాదాపు గం. 7.00 లకు ఒక బ్రహ్మాండమైన గోధుమవన్నె నాగుపాము లాన్లో కనిపించింది. దేనినైనా మింగినదేమో మందంగా పడి ఉంది. 5/6 అడుగుల పొడవు వుంది. దగ్గరలోనున్న స్నేహితులను పిలిచాను. వారు బలమైన కర్రలుతెచ్చి ఆ సర్పాన్ని హతమార్చారు; పుల్లలూ చితుకులూ ప్రోగుజేసి దహనం చేశారు.
నాటినుండి అనుదినం రాత్రి ఆ నాగుపాము నాకు కలలో కనిపించేది. “అలా పాము కలలోకి రావడం మంచిది కాదు” అన్నారు మా అమ్మగారు. కానీ, ఏం చేయాలో ఎవరూ సూచించలేదు.
అనతికాలంలోనే అమ్మను దర్శించుకునే అవకాశం, అదృష్టం కలిగాయి. నిస్సంకోచంగా ఉదంతాన్ని ఆప్తబాంధవి అమ్మకి వినిపించాను.
నిశ్చలంగా అమ్మ “పామూ అమ్మే. చంపిందీ అమ్మే. తనలోనే పుట్టి తనలోనే ఐక్యమవుతుంది కదా! అంటే అమ్మని అమ్మే లీనం చేసుకుంటుంది. ఇది సృష్టిక్రమం – సృష్టిధర్మం. దానిని గురించి మరొక ఆలోచన అనవసరం” అని నిర్ధారించింది. అంతే. ఆనాటినుండి ఆ సర్పం ఎన్నడూ నా కలలో కనిపించ లేదు.
అమ్మ పంచకృత్య పరాయణ అని అవగతమైంది. సృష్టి స్థితి లయాలే కాక పునస్సృష్టి చేసే అనుగ్రహ శక్తిగా అర్థమైంది.
– (సశేషం)