(గతసంచిక తరువాయి)
శ్రీ అనసూయేశ్వరాలయంలో పంచాయతన ప్రతిష్ఠ
1980 లో మా కుటుంబ సభ్యులందరం అమ్మ దర్శనార్థం వెళ్ళాం. ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, సాయంత్రం సంధ్యావందనం, అభిషేకాలు – పూజలలో పాల్గొంటూ సంతోషంగా గడుపుతున్నాం.
ఒకనాడు మా అబ్బాయి రాజేష్, రెండేళ్ళ పిల్లవాడికి జ్వరం వచ్చింది. బరువుగా ఊపిరి తీసుకుంటున్నాడు. సరిగా అన్నం తినటంలేదు. అది చూసి నా భార్య విచారిస్తూ ఉన్నది. అమ్మ ఒక్కసారి వాడివైపు చూసింది. అంతే. జ్వరం తగ్గింది; బాధలూ లేవు. ఎప్పటిలాగ చలాకీగా ఆడుతున్నాడు. ఆ Miracle చూసిన నా శ్రీమతి దిగ్భ్రాంతిచెందింది. ఈ తల్లి ఆవేదనను గుర్తించిన ఆ తల్లి ఏ మాయచేసిందో, ఏ మహిమ ప్రదర్శించిందో అని అనుకున్నాను. జగములనేలే చల్లని తల్లికి హృదయనీరాజనాలు నర్పించాము.
ఆ పసివాడు అన్నపూర్ణాలయంలో అన్నం తినలేకపోతున్నాడని కన్నతల్లి బాధపడుతుంటే చూసి అమ్మ హైమాలయంలో ప్రత్యేక నివేదన చేసే వంటమనిషిని పిలిచి “రేపటినుంచి ఈ పిల్లలకి, ఆ తల్లికి అక్కడే భోజనం ఏర్పాటు చెయ్యి” అని ఆదేశించింది. మనసెరిగిన తల్లి మమకారగర్భాలయ కదా అమ్మా!
రెండు మూడు రోజులలో తిరిగి వెళ్లామని అనుకుని అమ్మవద్దకు వెళ్ళాను. “నాన్నా! ఇక్కడి భవనాలకు Valuation Report తయారుచెయ్యి” అని చెప్పింది. “ఎందుకు అమ్మా?” అని అడిగితే, “వాటి అవసరం ఎప్పుడైనా ఉంటుందేమో!” అన్నది. “సెలవుపెట్టుకోలేదు కదమ్మా” అంటే, “నాన్నా! ఫరవాలేదు. సెలవు పొడిగించమని Telegram పంపించు. ఇస్తారు” అని మార్గదర్శనం చేసింది. సరేనని బాపట్ల ప్రయాణమైనాను.
“బాపట్లలో చిదంబరరావు తాతగారింట్లో, మేడపైకి వెళ్ళే మెట్లదారిలో ఉన్న కిటికీ దగ్గర నేను కూర్చుని వచ్చిపోయేవారందరినీ చూస్తూ ఉండేదాన్ని. నువ్వు ఆ మేడపైకి వెళ్ళి చూడాలి” అనికూడా ఆదేశించింది. అమ్మ ఆదేశాన్ని శిరసావహించి బాపట్ల వెళ్ళి మా అధికారికి Telegram ఇచ్చి, చిదంబరరావు తాతగారి ఇల్లు చూసి వచ్చాను. తప్పని సరిగా వివాహానికి హాజరు కావాలని కారణం చూపించాను. అప్పటికి నాకు May 5 అమ్మ కళ్యాణదినోత్సవం అనిగాని, ఆ రోజున అమ్మ చేతులమీదుగా పెళ్ళిళ్ళు జరుగుతాయని గాని నాకు తెలియదు.
జిల్లెళ్ళమూడి ఆలయాలు, భవనాల Valuation Report తయారుచేయడానికి కావలసిన వివరాలను రామకృష్ణ అన్నయ్యవద్ద సేకరించి శ్రీ అనసూయేశ్వరాలయం, శ్రీ హైమాలయం, అందరిల్లు, అన్నపూర్ణాలయం వీటి అన్నిటి వివరాలతో ఒక పట్టిక తయారుచేసి ఇచ్చేందుకు కృషిచేస్తున్నాను.
ఒకరోజున అమ్మతో అన్నాను, “అమ్మా! ఆలయం యొక్క గర్భం చాల విశాలంగా ఉంది. అంత విశాలమైన గర్భాలయం ఏ మూర్తి ప్రతిష్ట దృష్టిలో పెట్టుకుని జరిగిందమ్మా?” అని. ముక్తసరిగా “పంచాయతనం” అని సమాధాన మిచ్చింది.
తీరా అంతా తయారుచేసి అమ్మచేతికి ఇస్తే ఆఫీసులో ఇమ్మని చెప్పింది. అసలు అమ్మ ఆ Reportని భౌతిక నేత్రాలతో చూడలేదు. అమ్మ దృష్టిపథానికి అడ్డుగోడలు, అవరోధాలు ఎక్కడ ఉన్నాయి? బహుశః అమ్మ అంచనాలకి అనుగుణంగా Report రాలేదేమో అని మధనపడ్డాను. అయినా Valuation కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను.
(సశేషం)