(గత సంచిక తరువాయి)
కన్నీటిలోని దివ్యత్వం
అమ్మను దర్శించుకున్న క్షణం నుండి బంధు మిత్రులకు అమ్మ అవతార వైభవం, అమ్మతో అనుభవాలను ఏకధాటిగా వివరిస్తూ వుండడం, అమ్మ సాహిత్యం – ముఖ్యంగా అమ్మ జీవితచరిత్ర ‘మాతృశ్రీ జీవిత మహెూదధిలో తరంగాలు’, ‘అమ్మ – అమ్మ వాక్యాలు’ ఒకటికి పదిసార్లు చదవడం; మళ్ళీ మళ్లీ పారాయణ చేసినందువలన కొత్త విషయాలు గోచరించడం నాకు అనుభవమైంది.
ఒకసారి మా బంధువులందరిని తీసుకుని జిల్లెళ్ళమూడి వెళ్ళాను. మేడమీదికి వెళ్ళి కూర్చున్నాం. లోపల గదిలో ఎవరో అమ్మతో మాట్లాడుతున్నారు. రెండు గంటలు వేచి ఉన్నాం, కానీ అమ్మ దర్శనం కాలేదు. ఎదురుగా నున్నది ద్వారం, ఆ ద్వారం వెనుక గదిలో అమ్మ వుందని తెలుసు. తెరతీయగరాదా! అంటూ అమ్మ ధ్యాసలో కాలం కరిగిపోతోంది.
ఎట్టకేలకు అమ్మ దర్శనానికి రమ్మని పిలుపు వచ్చింది. వైకుంఠద్వారాలు తెరుచుకున్నాయి. గుమ్మంలోనే అమ్మ సుందర దివ్యమంగళ విగ్రహ సందర్శన భాగ్యం కలిగింది. నేరుగా వెళ్ళి అమ్మ పావన పాదపద్మాలకు నమస్కరించుకున్నాను. అమ్మ ఆప్యాయంగా నా తలను, వెన్నును రాస్తూ అనునయంగా ‘ఏం నాన్నా!’ అని పలకరించింది. అంతే దుఃఖం కట్టలు త్రెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. మాట పెగలడం లేదు. “ఎందుకు నాన్నా, దుఃఖం?” అమ్మ అడిగింది.
మాట పెగలక, గుక్క తిప్పుకోలేక పోతున్నాను. మాటల కందని మూగవేదన అది. గద్గద కంఠంతో ఉగ్గ పట్టుకుని “ఇంత చేరువలో వుండి కూడా నీకు ఎంతదూరంగా సున్నానో అనే భయందోళనకు గురి అయ్యానమ్మా” అన్నాను. “ఇక్కడే ఉన్నాను కదా నాన్నా!” అన్నది అమ్మ. అవును. అమ్మ సర్వాంతర్యామి. గది లోపల ఉంది, వెలుపల ఉంది, నిన్న-నేడు – రేపూ ఎప్పుడూ ఉండేదే అమ్మ. గదిలోనే కాదు, సకల జీవుల హృదయ కుహరాల్లోనూ కొలువై ఉంది.
అమ్మ ఒడిలో వ్రాలి అశ్రుధారలతో అమ్మ పాదాలను అభిషేకించటం అన్నయ్యలు అక్కయ్యలు అందరికీ సర్వసాధారణమైన అనుభవమే. మనం ఎందుకు దుఃఖిస్తున్నామో మనకే తెలియదు. అది ఒక విధంగా ఆధ్యాత్మిక పునర్జన్మ. ఒక పరిణామస్థితి. జీవన్ముక్తికి సోపానం. దీనిని కన్నీటిలోని దివ్యత్వం (Baptism of Tears) అని అభివర్ణించారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ. అది నా దృష్టిలో -అనాది మాతా శిశుపవిత్రప్రగాఢ బంధానికి, పరతత్త్వసాన్నిధ్య మహనీయ భాగ్యానికీ చిహ్నము. అంతటి అదృష్టం పురాకృత పుణ్యవిశేషమే. పరమేశ్వరి అమ్మ పవిత్ర సన్నిధిలోని ఇట్టి విభూతులను సంస్మరించుకోవటం సర్వోత్కృష్టమైన సాధన.
అమ్మమాటలు – అర్థంకావు
అమ్మ తనకు తానుగా ఆదేశించిన, నిర్దేశించిన పనుల ఆవశ్యకత – అర్థం ఆ సమయంలో అర్థం కావు. ఉదాహరణకి ఒక స్వీయ అనుభవం.
ఒక రోజున అమ్మ హఠాత్తుగా “నాన్నా! హైమాలయం వద్ద బావి చూసిరా!” అంది. బావి చూడటం ఏమిటో నాకు అర్థం కాలేదు. అయినా వెళ్ళి తొంగిచూశాను. చేదతో నీళ్ళు తీసి మొత్తం లోతు కొలిచి, నీటి మట్టం కొలత కూడా తీసి ఆ వివరాలు అమ్మకి తెలిపాను. అమ్మ విన్నది. అంతే.
తర్వాతకాలంలో – 1983 లో శ్రీమాత (Vizag Guest House) భవన నిర్మాణ సమయంలో జిల్లెళ్ళమూడి నల్లరేగడి నేల, అక్కడ పునాదులు తీయటానికి అలనాటి వివరాలు అవసరమైనాయి.
భారీవర్షం – అమ్మ కారుణ్యామృత వృష్టి
ఒకసారి అమ్మ- “నాన్నా! నేను కడప వెళ్ళాను. అక్కడ వర్షాలు కురవక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నాకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కాగితాల మీద “అమ్మా! నీళ్ళు’, ‘అమ్మా! నీళ్ళు’ అని రాసి నాకు అందించారు. నేనేం చేస్తాను. నాన్నా!” అని ఒక సందర్భాన్ని వివరించింది. ఏ సందర్భం లేకుండా తనకు తానుగా ఈ విషయం ఎందుకు చెప్పిందో ఆ సమయంలో నాకు అర్థం కాలేదు.
కాసేపు ఆగి అమ్మ మరలా చెప్పనారంభించింది, “నేను తిరిగి జిల్లెళ్ళమూడి వచ్చేశాను. తిరిగి వచ్చిన మరుసటి రోజు ఉదయం కడప నుంచి కొందరు రైతులు ఒక జట్టుగా వచ్చి ‘అమ్మా! నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. అక్కడ కురిసిన భారీవర్షానికి ఒక్కరాత్రిలో వెయ్యి ఎక్కరాల చెరువు నిండిపోయి, కట్టలు త్రెంచుకుని పొలాలన్నింటినీ తడిపి, ముద్దచేసి ధాన్యం చల్లుకోవటానికి సిద్ధం చేసింది అన్నారు” అని. వాక్కులోని మధురభావాలు వీచికలలో ఓలలాడుతూ సార్ధనయనాలతో వింటున్న నా ఆనందానికి అశ్చరానికి హద్దులు లేవు.
అమ్మకైతే మూడు కాలాల విభజన లేదు. అంతా వర్తమానమే. కానీ, అమ్మ కావాలని చెప్పిన ఈ ఉదంతం నా పట్ల జరుగబోయేదే అని నేనెట్లా ఊహించగలను?