(గత సంచిక తరువాయి)
సమ్యగ్దర్శనం
శక్తిని వ్యష్టిగా కాక సమష్టిగా దర్శించమనేది అమ్మ ప్రబోధం. ఒకసారి ఆర్షవిజ్ఞాన నిధి, సంస్కృతాంధ్ర భాషాకోవిదులు శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావుగారి గోష్ఠిలో పాల్గొనే సదవకాశం నాకు అమ్మ సన్నిధిలో లభించింది. వారు “అమ్మా! ప్రహ్లాదునకు స్తంభంలో స్థితికారకుడగు శ్రీమహావిష్ణువును దర్శించే భాగ్యం అనుగ్రహించావు. మాకు కూడా ..” అని ఆగారు.
అందుకు అమ్మ “దృష్టిలో మార్పు రావాలి, నాన్నా! స్తంభంలోని రాయిగా, ఇసుకగా, మట్టిగా, నీటిగా, ఆకాశంగా విభజించుకుని చూస్తే అవన్నీ విడివిడిగా ధరణీగర్భసంభూతములే కదా! విడగొట్టినా, శక్తియొక్క భాగములుగా, సమగ్రంగా స్తంభంగా చూసినా అదే. దాన్ని విష్ణువుగా చూడు, శక్తిగా చూడు అన్నీ ఒకటే. ఆ సమగ్ర భావనతో దర్శనం-ప్రతి విషయంలోను అనుభవైక వేద్యమే. అంతే, నాన్నా!” – అన్నది.
క్రియాసిద్ధిః సత్వే భవతి
మోక్షప్రాప్తి కోసం ఉపాసనలు, యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వహిస్తాం. సుఖసంపదలపై కాంక్ష పెరిగిననాడు కష్ట నష్టాలకు లోనవుతాం. కాగా, వారి వారి అవసరాలకి తగ్గట్టు అమ్మ అనుగ్రహిస్తుంది, తన ఒడిలో లాలిస్తుంది, పోషిస్తుంది.
D.K. పట్టమ్మాళ్ గానం చేసిన లలితా సహస్ర నామ స్తోత్ర Cassette లభ్యమవడం, క్రమేణ అటువింటూ ఇటు చదువుతూ అభ్యాసం చేసినందున సులభంగానే నోటికి వచ్చింది. ఇంతలో – శ్రీ హైమవతీ జయంత్యుత్సవ సందర్భంగా లలితా కోటి నామ పారాయణ యజ్ఞం గురించి తెలుసుకుని మా కుటుంబ సభ్యులం జిల్లెళ్ళమూడి వెళ్ళాం. నాటి మహాక్రతువులో పాల్గొని ధన్యులమయ్యాం. అది మరపురాని మధురస్మృతి. తదాది శ్రీ చక్రవర్తి గారు, కుసుమ అక్కయ్య గార్లతో సాన్నిహిత్యం దినదినాభివృద్ధి అయింది.
ప్రయాణమై అమ్మ అనుజ్ఞకోసం వెడితే అమ్మ ప్రసాదంగా కుంకుమ పొట్లాలిచ్చేది. ఆ పొట్లాలకు వాడిన వార్తాపత్రికలలోని అంశాలకు ఆ రోజు గ్రహస్థితికి గల సంబంధం నన్ను ఆశ్చర్యచకితుడ్ని చేసేది. అది నిత్యనూతనంగా అబ్బుర పరిచేది. సాధారణంగా రామకృష్ణఅన్నయ్య కుంకుమభరిణ తన చేతిలో ఉంచుకుని అమ్మకు అందిస్తే, అమ్మ రెండు వేళ్ళతో కుంకుమ తీసి బొట్టుపెట్టేది. ఒకసారి రామకృష్ణ అన్నయ్య కుంకుమభరిణ క్రిందపెట్టి ఏదో పనిమీద వెళ్ళాడు.
అన్నయ్య లేని విషయాన్ని అమ్మ గ్రహించింది. ఆశ్చర్యం. ఆ చేత్తోనే 25-30 మందికి వరుసగా బొట్లు పెట్టింది. అది చూసి నేను వెళ్ళి అమ్మకి కుంకుమ భరిణ అందించాను. తర్వాత ఆ భరిణలోని కుంకాన్నే వాడింది.
అమ్మకి వస్తుసామగ్రితో అవసరం ఉన్నదా? లేదా? కేవలం స్వీయ సంకల్ప ప్రభావం వలన వస్తువులు సమకూరుతాయా? అవును అని అర్థమయింది. మరొక ఉదాహరణ
ఒకనాడు ఒక సోదరుడు బుట్టతో పళ్ళుతెచ్చి అమ్మ పద సమీపాన ఉంచి నమస్కరించుకున్నాడు. హాలులో దాదాపు 25-30 మంది ఉన్నాం. ఒక్కొక్కరికి బొట్టుపెట్టి బుట్టలోంచి ఒక పండు తీసి అమ్మ ఇచ్చింది. ఆఖరున పళ్ళు తెచ్చిన సోదరునికి ఒక పండుతోపాటు ఖాళీ బుట్ట ఇచ్చి, అవతలపారెయ్యమని చెప్పింది. అతడు ఆశ్చర్యంగా నాతో అన్నాడు – “నేను తెచ్చింది 18 పళ్ళు. ఇంత మందికి అమ్మ ఎలా పంచింది?” అని. ఆ వైనం అర్థంకాలేదు. వాటిని మహిమలు అని అంటే అవి అమ్మకి సహజం, మనకి విశేషం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి తానే అయిన శక్తికి అసాధ్య మేముంటుంది?
కర్త, కర్మ, క్రియ – అమ్మే
ఒకనాడు రాజమండ్రిలో సో॥ ఐ. రామకృష్ణారావు కలిసి తను జిల్లెళ్ళమూడి వెడుతున్నానని చెప్పాడు. నాకూ వెళ్ళాలనే ఉన్నది కాని డబ్బులు లేవు అన్నాను. ‘డబ్బులు నా దగ్గర ఉన్నాయి. పద’ అన్నాడు. బొకారో
మద్రాసు రైలులో ప్రయాణం పెట్టుకున్నాం. రిజర్వేషనులు దొరకలేదు. IInd. Class tickets కొనుక్కొని, Ist Class బోగీ ఎక్కాం జనం రద్దీ తట్టుకోలేక. T.C ని కలిసి E.F.T చెల్లిస్తామని చెప్పాము, ‘ఖాళీ లేదు, వీలుపడదు, దిగిపోవాలి’ అని చెప్పాడు. కిం కర్తవ్యం – అని మధనపడుతున్నాం. అంతలో ఒక Cabin లోంచి ఒక అమ్మాయి వచ్చి ఎవడో త్రాగి గోలచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమెను T.C. వేరొకచోటకి మార్చి మాకు Cabin లో berth లు ఇచ్చాడు. అదనంగా చెల్లించాల్సిన సొమ్ము కట్టాము.
హాయిగా ప్రయాణించి బాపట్లలో దిగేటప్పటికి రాత్రి గం.3.00 లు అయింది. రిక్షా మాట్లాడుకుని జిల్లెళ్ళమూడి చేరాం. తెల్లవార వచ్చింది. రిక్షా మాతృశ్రీ మెడికల్ సెంటర్ మలుపు తిరిగేసరికి అమ్మ మేడపై నుండి చేతులు ఊపుతూ సాదరంగా ఆహ్వానిస్తోంది. వడివడిగా అమ్మ దరిజేరి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా “అమ్మా! I Class లో తీసుకువచ్చావు కదమ్మా!” అన్నాము విస్మయంతో.
అందుకు సమాధానంగా అమ్మ “ఎలా వచ్చారు అన్నది అనవసరం. వచ్చారు. అది అన్నిటికన్నా ముఖ్యం” అన్నది.
ఆశ్చర్యం – మేము వస్తున్నట్లు ముందురోజు వసుంధర అక్కయ్యకి అమ్మ చెప్పిందట. ఆ సమయానికి మేము ఇంకా బయలుదేరలేదు. ప్రతి పనిలో మన ప్రమేయం ఏమిటి? ఎంతవరకు? కర్త, కర్మ, క్రియ – తానే అని అమ్మ అడుగడుగునా ఋజువుచేస్తూనే ఉన్నది. అయినా కర్తృత్వాన్ని నెత్తిన వేసుకుని మనమే ఏదో చేస్తున్నాం అని అహంకరిస్తాం. అదే ఆశ్చర్యకరమైన వాస్తవం, దురవగాహ్యం.
(సశేషం)
(సమర్పణ: ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం)