(పుణ్యభూమి, కర్మభూమి అయిన ఈ భారతావని ఎన్నోయుగాలనుండి ఎంతో మంది అవతారమూర్తులకు, ఋషులకు, యోగులకు, అవధూతలైన మహాపురుషులకు పుట్టినిల్లయింది. అటువంటి మహాపురుషుల పవిత్ర చరిత్ర పఠనం ఆధ్యాత్మిక వికాసానికి మానసిక చైతన్యానికి దోహదపడగలదనే విశ్వాసంతో శ్రీ చంద్రమౌళి వెంకటకృష్ణ క్లుప్తంగా వ్రాసి అందించే యీ మహాపురుషులు దివ్యచరితల ధారా వాహిక ప్రచురణలో ఏడవ భాగము – ఎడిటర్).
సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ – 2
నివృత్తినాధుడు, జ్ఞానేశ్వర్, సోపాన్, ముక్తాదేవి నలుగురు, ప్రకృతి దృశ్యాలను కనులారా చూచి ఆనందించి, ఊరూరూ తిరుగుతూ, అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న పరవారా నది ప్రాంతంలో ఉన్న ‘నెవాషి’ అనే గ్రామం చేరుకొన్నారు. ఆ ఊరి ప్రజల కోర్కెమన్నించి అక్కడ కొంత కాలం నివసించటానికి నిర్ణయించు కొన్నారు.
నిగూఢభరితమైన ఆధ్యాత్మిక సత్యాలను వక్రీకరించి ప్రజలు వాటి సిసలైన అర్థాలను తెలుసుకోక పోవటం జ్ఞానేశ్వరునికి మనస్థాపం కలిగించింది. కేవలం సంస్కృతం తెలిసిన వారికే ఆధ్యాత్మిక విషయాలు తెలిసి ఉండటం చేత, ప్రజాబాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరాఠి భాషలో భగవద్గీతను వ్రాయటానికి పూనుకొన్నాడు. భగవద్గీత గురించి వ్రాయటం అనేది అత్యంత కష్టతరమైంది. సంస్కృత పదాలకు అర్థం తెలిసినంతలో భగవద్గీత అర్ధం అయింది అని అనుకోవటం పొరపాటు. అర్జునుడికి, వ్యాస మహర్షికి “ఒక్కింతే” తెలుసు అని చెప్పిన పెద్దల మాట అర్ధరహితం కాదు. ఆచరించటం అనేది సామాన్యుడికి దుర్లభం. జ్ఞానేశ్వర్, షిర్డీసాయి. రాఘవేంద్రస్వామి లాంటి మహనీయులు తప్ప అన్యులు ఆ మహావాక్యాలను ఆచరణలో పెట్టలేరు.
జ్ఞానేశ్వర్, భగవద్గీతను మరాఠీ భాషలో అనువదించారు. దానిని జ్ఞానేశ్వరి అని అంటారు. ఈ గ్రంథరాజం తెలుగులో కూడా ఇటీవలకాలంలో అనువదించ బడింది. మహాత్ముల వ్యాఖ్యలను తప్ప, సామాన్యుల రచనలు శ్రేయస్కరం కాదని ఈ వ్యాస రచయిత అభిప్రాయం. “జ్ఞానేశ్వరి”ని భావార్ధ దీపిక అని అసలు పేరు సార్ధక నామం అని చెప్పవచ్చు. ఈ మహారచన చేసిన నాటికి జ్ఞానేశ్వర్ వయసు పద్నాల్గు సంవత్సరాలు మాత్రమే.
జ్ఞానేశ్వర్ కాలంలో అనేక అద్భుతాలు, మహత్యాలు జరిగినయ్. అకారణంగా మాత్రం కాదు.
చరిత్ర పుటలలో స్పష్టంగా తెలియజేసిన సంఘటన ఒకటి ఉన్నది. సచ్చిదానంద్ అని పిలువబడే భక్తుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. అతను కాలం తీరటంతో మరణించాడు. కాని అతని సతీమణి అలా అనుకోలేదు. రాగబంధాలు తీరక ఆమె తన భర్తపట్ల, తన సంతాపాన్ని విపరీతంగా వ్యక్త పరచి జ్ఞానదేవుడికి విన్నవించింది. జ్ఞానేశ్వరుడు ఆమెపట్ల జాలిపడి “సచ్చిదానంద్ నిజాయితీపరుడు, స్వచ్ఛమైనవాడు, ఎలా మరణిస్తాడు’ అని అనటంతో ‘సచ్చిదానంద్ మరణశయ్యపై నుంచి లేచి కూర్చున్నారు. జ్ఞానేశ్వర్‌కి శిష్యరికం చేశారు. జ్ఞానేశ్వర్ రచించిన “జ్ఞానేశ్వరి” అపురూప గ్రంథాన్ని, ఆయన నోట వెలువరించినప్పుడు రచించాడు.
అలకాపురి ప్రజలు, నివృత్తినాధుడు, జ్ఞానేశ్వర్, పేరు ప్రఖ్యాతలు విని, తమ దురుసుతనం వలన దూరమైనందుకు విచారము చెందినారు. వారిని మరల తమ ఊరికి రప్పించుకోవాలని ప్రయత్నించతలచారు. నివృత్తినాధుడు, ఈ సంగతి గ్రహించి జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయ్ తో తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ప్రజలు ఆ నఁ గురుని అత్యంత ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. తమ జీవితాలు ధన్యమైనట్టుగా భావించారు. అదే సమయంలో ఈ నలుగురు మహనీయుల్ని పోగొట్టుకున్నందుకు ఎంతో విచారించారు “నెవాష” ప్రజలు.
మహారాష్ట్ర దేశంలోకి ముస్లింలు ఇంకా ప్రవేశించని రోజులు. ఆ పుణ్యభూమిపై, జ్ఞానేశ్వర్ కన్న అయిదుసంవత్సరాలు పెద్దయిన, నాల్గవ్. ఇతను దర్జీ; నరహరి – కంసావి. గోరో – కుమ్మరి, చోకమేళా అతని భార్య, స్వాతా 1 తోటపనివాడు, జానాబాయి – పనిమనిషి వీరంతా చాల తక్కువ కులస్థులు. కాని ఆధ్యాత్మిక రంగంలో అగ్రకులాల వారికన్నా అనూహ్య శిఖరాలు అందుకొన్నవారు. వీరంతా విఠల సంప్రదాయకులుగా చెలామణి అయినారు. వీరిని ‘వకారిస్’ అంటే యాత్రకులని అర్థం. జ్ఞానదేవ్ వీరందరిని కలసి తన్మయత్వం చెందాడు. ఈ మహనీయుల భక్తిరస రచనలతో మహారాష్ట్ర దేశం మారుమోగింది. జ్ఞానదేవుడ్ని – తమ గాయకుడిగా భావించారు. పాండురంగడి నామంతో, విఠలుడి నామంతో మహారాష్ట్రదేశం పునీతం చెందింది. నామదేవ్ రచించిన కొన్ని అభంగాలు ఉత్తరాన ప్రసిద్ధి చెందిన గురుగ్రంధ సాహెబ్ అనే పవిత్ర గ్రంధంలో చోటు చేసుకొన్నాయి. అదే విధంగా కేరళలో కూడా గోరా రచనలు ప్రసిద్ధి కెక్కినాయి.
ఆధ్యాత్మిక జ్ఞానానికి జ్ఞానేశ్వర్ ప్రాముఖ్యత యిచ్చారు. “సముద్రానికి వాటి అలలకి ఉన్న సంబంధమే నాకూ వస్తువులకి” ఉన్నది అన్నారు. “సూర్యుడికి మెరుగులు దిద్ద సాధ్యమా అని అడిగారు” బూటకపు భక్తుల్ని ఈసడించారు. “తమ గొప్పలు తోరణాలుగా అల్లటం ఆలయాల మీద చీపుళ్ళు పాతటం” అని అన్నారు.
“విశ్వంలో కనిపించే అజ్ఞానం ఎంత నిజమైంది అంటే చిత్రపటంలోని వర్షంలో తడవటంలాంటిది” అన్నారు జ్ఞానేశ్వర్. గురువు, గురుభక్తికి ఎంతో ప్రాధాన్యత యిచ్చారు.
అలందకి కొంత దూరంలో ‘చాంగ్ వ’ అనే హఠయోగి ఉండేవాడు. అతను హఠయోగంలో నిష్ణాతుడు. అతను హఠయోగం ద్వారా తన ఆయుర్దాయాన్ని పద్నాలుగు వందల దాక పెంచుకొన్నట్టుగా ప్రతీతి. అతను జ్ఞానదేవిని చూడాలని తలచాడు. ఆయన తన వందలాది శిష్యులతో జ్ఞానేశ్వర్ దర్శనానికి, మేళతాళాలతో, జంతు చర్మదుస్తులు ధరియించి, నాగుపామును చర్నాకోలుగా చేతబట్టి, నుదుటన వీభూతి రేఖలు పులుముకొని, జటాజూటాలు భుజాలదాకా వ్రేలాడుతూ, భయంకరమైన చిరుతపులి నెక్కి బయల్దేరాడు. జ్ఞానేశ్వర్, నివృత్తుడు, సోపాన్, ముక్తా, ఒక పిట్టగోడ మీద కూర్చుని యేవో కబుర్లు చెప్పుకొంటున్నారు.
“అన్నా! జ్ఞానేశ్వర్, ఆలోయల్లో వినిపించే శబ్దాలు ఏమిటి?” అని ముక్తా అడిగింది.
“ఛాంగ్ దేవ మనల్ని కలవటానికి చిరుత పులి ఎక్కివస్తున్నాడు” అని జ్ఞానేశ్వర్ అన్నాడు.
“అలాగా… అయితే మనమంతా వెళ్ళి వారికి స్వాగతం పలకాలిగా” అన్నారు.
“అవును ఆ యోగీశ్వరుడి దగ్గరకి వెళ్ళి మనం శ్రద్ధా భక్తులు విన్నవించుకోవాలి” అని అన్నాడు.
తాము కూర్చుని ఉన్న గోడను చేత్తో తట్టి “ఆ యోగి దగ్గరకి మమ్మల్ని తీసుకెళ్ళు” అన్నాడు జ్ఞానేశ్వర్ వెంటనే ఆ గోడ ప్రాణం ఉన్న వాహనంలా కదిలి ముందుకు సాగింది.
చాంగ్వ యోగి ఆయన అనుచరులు, జ్ఞానేశ్వర్, అతని అన్నదమ్ములు, చెల్లెల్ని ఆ గోడమీద ప్రయాణం చేస్తూ రావటం చూచి, నోట మాట రాక నిశ్చేష్టులైనారు. అందరూ, ఆ మహనీయుల్ని చూసి ముకుళిత హస్తాలతో తలలు దించుకొన్నారు. జ్ఞానేశ్వర్, ముకుళిత హస్తాలతో తనను సమీపించటం చూసి పరుగున చాంగ్ దేవరి, జ్ఞానేశ్వర్ దగ్గరకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.
“నేను మూర్ఖంగా ఇన్ని సంవత్సరాలు అజ్ఞానిగా వ్యవహరించాను. కాలమంతా వృధా అయింది. అతి చిన్నతనంలోనే జడపదార్థంలో ప్రాణం పోశారు” అని జ్ఞానభిక్ష కోరాడు.
జ్ఞానేశ్వరుడు దయాళువై చాంగ్వని అనుగ్రహించాడు. చాంప్డేవ, తన శిష్యుల్ని పంపించి వేసి బాలమహాత్ముడైన జ్ఞానేశ్వర్‌కు బాల శిష్యుడైనాడు. ముక్తాబాయిని గురువుగా స్వీకరించాడు. ముక్తాదేవి రచనలు భక్తిరసామృత పదాలు. ఈ రోజుకీ మహారాష్ట్రలో విస్తృత ప్రచారంలో ఉన్నవి.
జ్ఞానేశ్వర్, నామదేవ్, అంతా కలసి పండరీపూర్ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత, తాను దేహాన్ని త్యజించతలచానని వెల్లడించాడు. ఎంత వారలకైనా ఈ సమయం రాక తప్పదు.
సిద్ధేశ్వర్ ఆలయానికి కుడి ప్రక్కన సమాధి ఏర్పటు జరిగింది. ఆ సమయంలో నాల్గవ్ కూడా ఉన్నట్టు చరిత్ర చెపుతున్నది. జ్ఞానేశ్వర్ సమాధి చెందిన నాటికి ఆయన వయసు 21 సం.లు తరువాత కొద్దికాలానికే, నివృత్తి, సోపాన్, ముక్తాదేవి కూడా కాలం చేశారు.