(పుణ్యభూమి, కర్మభూమి అయిన ఈ భారతావని ఎన్నోయుగాల నుండి ఎంతో మంది అవతారమూర్తులకు, ఋషులకు, యోగులకు, అవధూతలైన మహాపురుషులకు పుట్టినిల్లయింది. అటువంటి మహాపురుషుల పవిత్ర చరిత్ర పఠనం ఆధ్యాత్మిక వికాసానికి మానసిక చైతన్యానికి దోహదపడగలదనే విశ్వాసంతో శ్రీ చంద్రమౌళి వెంకటకృష్ణ క్లుప్తంగా వ్రాసి అందించే యీ మహాపురుషులు దివ్యచరితల ధారా వాహిక ప్రచురణలో ఐదవ భాగము ఎడిటర్)
సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ – 2
విఠల్ పంత్, రుక్మిణీబాయి, నలుగురు సంతానంలో, మొదటివాని పేరు ‘నివృత్తి’ అంటే యోగశాస్త్రంలో, జ్ఞానేంద్రియాలను అదుపులోవుంచి, శాంతపరుచునది అని అర్థం చెప్పారు. రెండు సంవత్సరాల తరువాత జ్ఞానదేవుని జననం – జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అని, మూడవ సంతానానికి చెందిన వానిని ‘సోపాన్’ అని, అంటే ‘మార్గమని’ ఆఖరి సంతానం అయిన శిశువుకి ‘ముక్తా’ అని నామకరణం చేశారు. ‘ముక్తా’ – అంటే ముక్తి. ఈ నలుగురు సంతానం సార్ధక నామధేయులుగా గుర్తింపు పొందారు.
విఠల్ పంత్ నలుగురు సంతానం అతి చిన్నతనంలోనే అత్యంత మేధావులుగా, ఆధ్యాత్మిక సంపదలో అగ్రగాములుగా నిలవటమే కాక తల్లితండ్రుల పట్ల వినయ, విధేయతలు కలిగి, నలుగురికీ ఆదర్శప్రాయులుగా రాణించారు.
విటల్ పంత్ కష్టాలు కడతేర లేదు. పిల్లలికి వయస్సు వచ్చిన తరువాత, వారికి సంధ్యావందనం లాంటి క్రతువులు జరపవలసి ఉంది. అది ఆచారం, సంప్రదాయం. పెద్దలు ఆశీస్సులు, దీక్షను ఇవ్వకలిగిన, వేదపండితులు అవసరం. విఠల పంత్ తన ప్రార్ధనను కుల పెద్దలకి విన్నవించాడు. కుల పెద్దలు, సమావేశమై నిర్ణయిస్తాము అని చెప్పారు.
ఒకసారి సన్యాసాశ్రమం స్వీకరించి, తరువాత మరోసారి గృహస్థాశ్రమం స్వీకరించటం మహానేరం. అంతటి నేరం విఠల్ పంత్ చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం తెలుపమని పెద్దలను ప్రాధేయపడ్డాడు. అభం శుభం తెలియని తన పిల్లలికి తాను చేసిన పాపాన్ని అంటకట్ట వద్దని ప్రార్థించాడు మహాపండితుని చెలామణిలో ఉన్నవారంతా. మత గ్రంధాలు, శాస్త్ర సాహిత్యమంతా కూలంకషముగా పరిశీలించి, తలలు అడ్డంగా తిప్పారు. విఠల్ పంత్ చర్య శాస్త్ర విరుద్ధం. ఈ సమస్యకు పరిష్కారం లేదని తేల్చి చెప్పారు. ఇంకా అనుమానం ఉంటే ‘ప్రతిష్టాన’ (పైఠాన్) పురం వెళ్ళి అక్కడి పండితులను సంప్రదించమని సలహా ఇచ్చారు.
విఠల్ పంత్ పెద్దల సలహాను పాటించి కుటుంబ సమేతంగా, పవిత్రమైన గోదావరి తీరాన, నాసిక్ సమీపంలో ఉన్న త్ర్యంబకేశ్వర్ క్షేత్రానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ‘బ్రహ్మగిరి’కి ప్రదక్షిణాలు చేశారు. ఒకనాటి రాత్రి, పర్వత ప్రాంతంలో ఇరుకు మార్గాన ప్రయాణిస్తుంటే, భయంకరమైన చిరుతపులి ఎదురుపడి వారిని చంపబూనటంతో అందరు అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి నివృత్తినాధుడు తప్ప అంతా ఇల్లు చేరుకొన్నారు. పాపం నివృత్తి ఆ పులికి బలైపోయినాడు అని అంతా దుఃఖించారు. కాని దైవ సంకల్పం మరోలా ఉంది. నివృత్తి నాధుడు బ్రతికి క్షేమంగా బైటపడ్డాడు. కాకపోతే మార్గం తప్పి, ఒక కొండ గుహను చేరాడు. అచ్చట ఎందరో యోగులు, వన్య మృగాలతో సహజీవనం గడపటం, ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా ఉండటం గమనించాడు. ఆ కొండ గుహలను పరిశీలిస్తూ లోపలికి ప్రవేశించాడు. అదృష్టవశాత్తు నివృత్తి నాధుడికి అత్యంత తేజోమయుడైన ఋషీశ్వరుడి దర్శనమైంది. ఆ ఋషి పుంగవుడు, నివృత్తి నాధుడ్ని చిరునవ్వుతో ఆహ్వానించి, ఆశీర్వదించాడు. తాను గోరన్నాధుడి శిష్యుడ్ని అని తన పేరు గైనినాధుడు అని చెప్పాడు. “నీకు దీక్షను ప్రసాదించను ప్రసాదించమన్నది తన గురువాజ్ఞ అని స్పష్టంగా చెప్పి, ఆదీక్షను తన తమ్ముడైన జ్ఞానదేవుడికి సంప్రదాయబద్ధంగా ప్రసాదించాలని వివరించాడు, నివృత్తి నాధుడు తపస్వి ఆజ్ఞను శిరసావహించాడు. వారం రోజుల్లో దీక్ష పూర్తి చేసుకొని నివృత్తినాధుడు ఇంటికి జ్ఞాన సంపదతో తిరిగి వచ్చాడు. అందరు ప్రేమాను రాగాలతో నివృత్తి నాధుడ్ని ఆహ్వానించారు. నివృత్తినాధుడు ఋషి ఆజ్ఞప్రకారం జ్ఞానేశ్వరుడికి దీక్షను ప్రసాదించాడు. అనతి కాలంలోనే అందరూ సంస్కృత సాహిత్యంలో దిట్టలైనారు. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అనంతంగా కలిగింది. ఇదంతా కనులారా చూసి విఠల్ పంత్, రుక్మిణీ బాయి నిష్క్రమించటం మంచిదని నిర్ణయించుకొన్నారు. తమ నిర్ణయాన్ని, పిల్లలికి తెలియచేసి ప్రయాగ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ పుణ్యదంపతులు ఆ నదిలోనే తమ ప్రాణాలు విడిచారు.
త్ర్యంబకేశ్వరంలో ఉన్న విఠల్ పంత్ పిల్లలు తల్లితండ్రుల మరణవార్త విని దుఃఖించారు. వారి తల్లితండ్రుల కిచ్చిన అపకీర్తిని క్షాళనం చెయ్యటానికి, ప్రతిష్టాన పురానికి వెళ్ళటానికి నిశ్చయించుకొన్నారు.
అలకాపురిలోని పండితుల వద్ద నుండి తాము పొందిన ప్రశంశా పత్రాన్ని ప్రతిష్ఠానపుర పండితులు చూచి, గృహస్థాశ్రమం నుండి సన్యాసాశ్రమం స్వీకరించి మరల గృహస్థ జీవనం ఎంచుకోవటం సిగ్గు చేటు ఛ. ఛ. అన్నారు. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, జీవిత కాలమంతా మంచి పనులు చేస్తూ అహర్నిశలు హరినామ భజన చెయ్యటం అని తీర్పు చెప్పి, నివృత్తినాధుడు కోరినట్టుగా ‘శుద్ధి’ పత్రం ఇవ్వటానికి నిరాకరించారు. అంతే కాక ‘శుద్ధి’ పత్రం కోరినందుకు ఆ చిన్నారులను ఆ సభలోని వారు హేళన చేసి దూషించారు.
సభా ప్రాంగణం ప్రతిధ్వనించేటట్టుగా నివృత్తి నాధుడు బిగ్గరగా స్పష్టంగా “నేను అభయుడ్ని, నామరహితుడ్ని, నిరాకార ఆత్మ అన్ని ప్రాణుల్లో ఉంటుంది. నేను, ఆకార, నిరాకారుడ్ని. శాశ్వతంగా ఉంటానుగా అని ప్రక్కనే ఉన్న జ్ఞానేశ్వరుడు ‘అవును ఇది నిజం’ – అన్నాడు. ముగింపుగా మహామేధావిగా పేరు గాంచిన ‘సోపాన’ ఇలా అన్నది. “వీరు మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు. “మనం మలినం చెందినట్టుగా భావిస్తున్నారు కాని పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి? పాండవులు, ఋషులు వ్యాసుడు, వాల్మీకి, ఏ కులానికి చెందినవారు?’ జ్ఞానేశ్వరుడు, తన చెల్లెలు సోపానను సమర్థిస్తూ అడిగాడు – “పేరులో ఏముంది? ఏదీ బ్రహ్మ సృష్టికి ఆవల లేనప్పుడు, అంతా ఆయనే అయినప్పుడు, నా ఆత్మ నీ ఆత్మకి కాని, ఆ ఎద్దు ఆత్మకి భిన్నమైంది కాదు”. జ్ఞానేశ్వరుడు అన్నమాటకు, పండితులు అతన్ని ఎత్తి పొడుస్తూ, అలాగైతే “ఆ ఎద్దు వేదం చదువుతుందా” అని సవాలు విసిరారు.
“తప్పకుండా… అన్నీ అంతా ఆ బ్రహ్మే అయినప్పుడు, కులరహితుడైన బ్రహ్మ అన్ని ప్రాణులద్వారా గాలి పీలుస్తాడు. వేదాలు చెప్పే కులం మన గుణాలనుద్దేశించి, పుటక గురించి కాదు. వేదం విశ్వవిశిష్ఠత చెందినది, అందరికీ చెందినది”.
“జాగ్రత్త, వేదాలు గురించి ప్రస్తావించకు, నువ్వు చెప్పేది నిజమైతే, ఆ ఎద్దు వేదం చదవాలి” అని పండితులు జ్ఞానేశ్వరుడ్ని హెచ్చరించారు.
జ్ఞానేశ్వరుడు, విశిష్ఠపండితుడ్నినుద్దేశించి “ప్రభు!” నా మనవి ఆలకించండి. ఈశ్వరతత్వం అన్నింటిలో అంటే చేతనా అచేతన రూపాల్లో ఉంటుంది. అలాగే ఈ ఎద్దులో ఉంది”.
హ… హ… అని సభాప్రాంగణంలో అందరు హేళనగా నవ్వి, అచ్చట ఉన్న ఎద్దును ప్రాంగణంలోకి నడిపించారు.
“జ్ఞానేశ్వర్ ! డాంబికాలు కాదు నీవన్న మాటల్ని ఋజువుపరచు” అని పండితులు జానేశ్వరుడ్ని నిలదీసారు. బ్రహ్మజ్ఞాని అయిన జ్ఞానేశ్వరుడు చిరునవ్వుతో, కరుణతో మండపంలో ఉన్న ఎద్దుని సమీపించి మృదువుగా అరచేతితో నిమిరి “అంతటా వ్యాప్తి చెందిన ఆత్మ నీలోనూ ఉంటే అందరికి తెలిసేట్టుగా నిజం పలుకు” అని ఋగ్వేదంలో ‘ఓం’ అని అన్నదానికి ఉన్న మంత్రం చదవగా, హీనంగా చూడబడే ఆ ఎద్దు జ్ఞానేశ్వర్ అందించిన మంత్రాన్ని స్పష్టంగా చదివి పూర్తి చేసింది. సభా ప్రాంగణమంతా స్థాణువై నిలిచింది. చరిత్రకి అందని సత్యం. ఎన్నడూ ఎవరూ కని విని ఎరుగని సత్యం. అన్ని జీవరాసుల్ని జడపదార్థాల్ని శాసించే ‘ఆత్మ’ అనేది ఒకటే నని రుజువైంది.
పండితుల నేత్రాలు అశ్రువులతో నిండినయ్, తలలు సిగ్గుతో దించుకొన్నారు. సభకు అధ్యక్షత వహించిన పండితుడు ముకుళిత హస్తాలతో జ్ఞానేశ్వరుడి ముందు నిలబడి శిరస్సు వంచి “ప్రభూ మమ్మల్ని మన్నించు, అజ్ఞానంతో ప్రవర్తించి, మిమ్మల్ని హేళన పరిచాం. మా నేత్రాలకు క్రమ్మిన మసకలు తొలగి పోయినయ్… క్షంతవ్యులం” అని మరోసారి అన్నాడు.
తలలు పండిన పండితులు జ్ఞానేశ్వరుడి సున్నిత చరణాలపై తమ శిరస్సులు వాల్చి క్షమాభిక్ష కోరినారు.
చెమ్మగిల్లిన మసక నేత్రాలను తుడుచుకోని, పదజాలాన్ని వెదుక్కుంటూ, అలకాపురి పండితులు సిగ్గుతో, తలలు వాల్చి జ్ఞాన స్వరూపులైన నివృత్తి నాధుడు కోరినట్టుగా లాంఛన ప్రాయంగా శుద్ధి పత్రం సమర్పించారు. బహుశా అది ఆనాటి ఆచారం కావచ్చు. తమ తల్లిదండ్రులు నిర్దోషులు పుణ్యదంపతులు అని వారిని తిరస్కరించిన పండితులు అంగీకరించటం నివృత్తినాధుడికి అవసరం లేక పోయిన సమాజానికి, గతించినవారి ఆత్మసంతుష్టికి ఆసరం అయింది.
– సశేషం