1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధ్యానానికి ప్రధానం – రూపమా ? భావమా ?

ధ్యానానికి ప్రధానం – రూపమా ? భావమా ?

Parsa Hara Gopal
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 1
Year : 2013

‘అంఆ’ మనందరికీ అమ్మ. కని, కాపాడుతున్న ‘అంఆ’. “నేనునేనైన నేను” ‘అంఆ’. ఏ రూపులో చూసినా ఏ రీతిలో చూసినా, మన అమ్మ – అమ్మే కదా! అమ్మలో మార్పు లేదు ‘అంఆ’ ఫొటోలో మార్పు వుండదు. వివిధ సందర్భాలలో వివిధ సమయాలలో అంత ఫొటోలు తీస్తారు. అవి మనం చూస్తాం. ఎన్ని రంగులు మారినా, ఎన్ని సన్ని వేశాలు మారినా, ఎన్ని ఋతువులు మారినా, మారనిది అంఆ..

అయినా ఒక్కొక్కసారి, ఒక్కొక్క ఫొటోలో అమ్మ వేరువేరుగా కనిపిస్తుంది. వేరు వేరు ఫొటోలు వేరు వేరు స్పందనలు ఇస్తాయి. వేరు వేరు ఫొటోలు, వేరు వేరు జ్ఞాపకాలను తీసుకొస్తాయి. ఫొటో వేరైనంత మాత్రాన ‘అ’ వేరు కాదు కదా! అయినా ఎందుకీ తేడా మన భావనలో? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఆలోచించి తెలుసుకోగలిగే, శక్తి, భక్తి లేవు. అందుకే కదా! ఈ వేదన, దైనందిన సంవేదన.

మా పెద్ద బావగారు, అక్కయ్య హైదరాబాదు నుంచి చక్కటి టేకు పూజా మందిరం మాకు బహుమతిగా పంపారు. ఆ మందిరాన్ని ఈశాన్య మూలగా ఇంట్లో పెట్టి, అమ్మపాదాలు, ఫొటో పెట్టి రోజూ పూజ చేసుకుంటాము. మొదటగా దానిలో పెట్టిన అమ్మ ఫొటోలో, అమ్మ నీలం రంగు చీరకట్టుకుని వుంది. గజమాల వేసుకుని వుంది. కొద్దిగా నెరుస్తున్న జుట్టుతో వున్నది. పూజ చేసేటపుడు మనసులో ఏకాగ్రత లేకపోవడం పెద్ద సమస్య అయింది. ఎంత ప్రయత్నించినా మనసు అంఆ పాదాల వద్ద ధ్యాస వుంచడం జరగడం లేదు.

ఫిబ్రవరి ధాన్యాభిషేకం తర్వాత జిల్లెళ్ళమూడి నుంచి కొత్తఫొటో వచ్చింది. ఇందులో అమ్మ ఎర్రని చీర నల్లని రవికతో నిల్చుని రెండు చేతులు చాపి పసివాడిని పిలిచే తల్లిలాగా వున్నది. ఈ ఫొటోలో వున్న అమ్మ మెడలో ‘తెల్లని పూలమాల వుంది. అంత నవ్వుతూ ప్రేమమూర్తి, వాత్సల్యం పొంగి పోతున్న తల్లిలాగా వుంది. ఎంత చక్కని ఫొటో, ఎంత బావుంది. ఈఫొటోను మా పూజ మందిరంలో పెట్టాము. ఈ ఫొటో పెట్టిన తర్వాతనైనా మనసు నిలకడగా వుంటుందేమోనని ఆశ గల్గింది. కనీసం పూజ చేసుకుంటున్న పది నిమిషాలయినా అంత పాదాల వద్ద మనస్సు లగ్నమవాలని కోరిక. అలా జరగడం లేదనే బాధ.

ఆ బాధను ఎవరికి చెప్పుకోను. అమ్మకు తప్ప, కనీసం పదినిమిషాలయినా నిలకడగా వుండని ఈ మనస్సుకు, ఏ శిక్షవిధించినా తప్పు లేదనిపించింది. అంతటి అదృష్టం నాకు లేదు. ఈ మనస్సుకు నిలకడలేదు.

అలాగే ప్రతి రోజూ పది నిమిషాల ఏకాగ్రతకోసం ప్రయత్నిస్తూనే వున్నాను. బాధ పడ్తూనే వున్నాను.

ఏమి చేస్తే ‘అంఆ’ పాదాలపై ఏకాగ్రత కుదురుతుంది. నదికి రేవులాగా స్థిమితం లేని ఈ మనసుకు. అంఆ ఫొటో ఒక ఆధారమా? అంఆను చేరటానికి ఈ ఫొటో ఒక నావా? ఒక దారా? ఒక దీపమా? తెరచాపా? ఏమిటి? ఫొటోలు మార్చినా పరిస్థితిలో మార్పులేదు. ఏదో ప్రపంచం మునిగిపోయినట్లు అన్నీ పిచ్చి ఆలోచనలే. అన్నీ ఆలోచనలు పూజ సమయంలోనే వస్తాయి. ఆఫీసు పనులన్నీ అప్పుడే గుర్తుకు వస్తాయి. ఏం చేయాలి? అని మథనపడుతూ పాత విశ్వజనని పత్రికలను చూడటం మొదలు పెట్టాను.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ‘అంఆ’ పుస్తకాలు తెరచి సమాధానం కోసం వెతకడం ఒక అలవాటుగా చేసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే వెతుకుతున్నాను. ఆ పత్రికలలో అమ్మ ఫోటో ఒకటి కన్పించింది. ఈ ఫొటోలో అంఆ కాలుమడత వేసుకొని, ఎరుపు రంగుచీర, ఎరుపురంగు రవికతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని ఎర్రని దిండు మీద కూర్చుని వున్నది. ఎర్రటి రవికకు వెడల్పయిన అంచువున్నది. అంఆ రెండు చేతులు మడచి కూర్చున్న ఎడమ మోకాలు మీద వున్నాయి.

‘ఆహా’ ఇప్పటికి కనిపించావా? అమ్మా! అనుకున్నాను. వెంటనే ఈ ఫొటోను మందిరంలో మధ్యగా పెట్టి మిగిలిన ఫొటోలను వెనక్కి పెట్టాను.

చేసిన మార్పు చిన్నదైనా క్రమక్రమంగా అభివృద్ధి కనిపిస్తూ వుంది. నెమ్మదిగా మనస్సు స్థిమితంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది. ఆందోళన తగ్గి, ఆనందం కొద్ది కొద్దిగా ఎక్కువవుతూ వస్తోంది. కొన్ని నిమిషాలైనా కనీసం అంఆ పూజ ఏకాగ్రతతో చేసుకోగల్గుతున్నాను.

‘దీని భావమేమి తిరుమలేశా’ అన్నట్లు ఈ ప్రశ్నకు సమాధానం తెల్సుకునే అవసరం నాకు లేదు. నా ప్రార్ధనకు, నా ఆర్తికి అంత కరుణించింది. నాకు అదే పదివేలు. రెండు నిమిషాలైనా అంత పాదాలపై ధ్యాస వుంచగల్గుతున్నాను. అంతటా వున్నది అమ్మయే యనితెలిసినా రూపంలో (ఫొటోలో) ఇంత భేదం వుంటుందని నేను ఎప్పుడూ ఊహించలేకపోయాను. అంతా అంత దయ.

జయహో మాత……

ప్రార్ధన : తెలిసిన అక్కయ్యలు, అన్నయ్యలు ఈ విషయంపై మీ అభిప్రాయాలు వ్యక్తపరిస్తే సంతోషిస్తాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!