“అమ్మా! మీ చిత్రం ముందు కూర్చుని నా మొఱ ఆలకించమని వేడుకుంటున్నాను. మళ్ళీ ఏమిటో నా మనస్సు కలుషితమైనదనీ, మీరు నా మొర వినటం లేదేమోననీ అనిపిస్తుంది” అని ఒక సోదరి అంటే అమ్మ “నేను వింటున్నా, వినకపోయినా నీ మొరే నిన్ను రక్షిస్తుంది” అని అన్నది. ఈ సత్యాన్నే మరొక సందర్భంలో “విశ్వాసమే భగవంతుడు” అని వివరించింది. అంతేకాదు. మరొక అడుగు ముందుకు వేసి “నన్ను నమ్ముకో; నిన్ను నమ్ముకో ఏదైనా సరే, విశ్వాసమే భగవంతుడు” అని అన్నది. అమ్మ వాక్యం ఆస్తికులకూ, నాస్తికులకూ సర్వులకూ సమపాళ్ళలో సంతృప్తికరమైన తరణోపాయాన్నీ, తరుణోపాయాన్నీ ప్రసాదిస్తుంది ఆప్తవాక్యం కనుక.
“నమ్మకం కల్గడానికే ప్రార్థన, నమ్మికాదు” అనే ‘అమ్మవాక్యంలో నమ్మికాదు. అనేభాగం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ముందుగా ప్రార్ధన ఆవశ్యకతను ప్రాధాన్యతను వివరిస్తాను.
‘పృధివ్యాం పుత్రాస్తే జనని బహవః సన్తి సరళాః
పరం తేషాం మధ్యే విరళ తరళోహం తవసుతః
మదీయోయం త్యాగః సముచితమిదం నోతవశివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి॥ అని శంకరులు,
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాం
తాపార భూతదయమును
తాపసమందార! నాకు దయసేయగదే’ – అని పోతనగారు
‘సంత్యక్త స్సాధుసంగః సమదఖిలతతేర్వాంఛితోశస్త సంగః
నాభ్యస్తా బ్రహ్మ విద్యా జ్వలదుదరకృతే క్షుద్ర విద్యాహ్యుపాత్తా
విశ్వశ్రేయోవిచారో మనసిచన కృతో వర్థితా స్వార్థచింతా
బాలోzయం క్షమ్యతాం హే త్రిభువన జనని ప్రాపితాయే అనసూయే॥
అని శ్రీ రాధాకృష్ణ శర్మగారు చేసిన ప్రార్థనలు, స్తోత్రాలు, కొన్ని ఉదాహరణలు. ఆ దారి సాధకులకి, బాధాతప్తహృదయాలకి చతుర్విధ పురుషార్థ ఫలప్రాప్తికి ఆదర్శం, మార్గదర్శకం, కార్యసాధకం. మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియసీ. కనుకనే సకలజనారాధ్య అమ్మ “హరినారాయణ గోవింద, అర్జున సారధి గోవింద” అంటూ సోదరీ సోదరులతో ఉచ్ఛైస్వరంతో సామూహిక నామ పారాయణ చేయించేది. శ్రీ హైమాలయ ప్రాదుర్భావ పవిత్ర సమయంలో “హైమ మనకు దారి అనుకొని నామం చెయ్యండి. ఇది తపస్సాధకులకు నిలయం అవుతుంది” అని ఒక దారిని, గమ్యాన్ని హామీని ఇచ్చింది.
‘ఒక్క నీవే తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా, అమ్మా’ అనేది హైమ అనన్య సామాన్య ఆకాంక్ష. ఆలక్ష్యం హైమ అక్కయ్య అనన్య భక్తికి ఏకాగ్రతకి దర్పణం పడుతోంది. అట్టి అంకురితమైన దీక్ష అలవడాలంటే మాటలా? కానేకాదు. కనుకనే వేదాలు ‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ’ – సద్వస్తువుని తెలుసుకోవాలంటే తపించు. తపస్సు ఒక్కటే మార్గం అని శాసిస్తాయి. ఈ సందర్భంలో భేదమోదముల నడుమ నిలిచి నిను కొలిచే భాగ్యము ఎవరికోలే! అంటూ శ్రీ రాజు బావగారు ఒక రసవత్తమైన ప్రధానమైన అంశాన్ని చాటారు.
కష్టాల్లో దేవుని ఎలాగూ స్మరిస్తాం, మ్రొక్కుకుంటాం, దేవులాడతాం. మరి సుఖాల్లో వొళ్ళు మరచి నిద్రిస్తాం. ఆదమరచి విహరిస్తాం. స్పృహలేకుండా ప్రవర్తిస్తాం. మరల చురుక పడగానే ఉలక్కిపడి లేచి వణికిపోతూ హఠాత్తుగా ప్రదక్షిణలూ, అభిషేకాలు, అష్తోత్తర సహస్రనామార్చనాదులూ ఆచరిస్తాం. భయభక్తులతో అంజలి ఘటిస్తాం.
‘త్వత్సన్నిధౌ ప్రశమితైరపి తే పరోక్షే క్రోధోద్య తై ర్భయదసంశయ సర్పరాజైః దష్టోస్మి అనన్య శరణస్య శివేZనసూయే మాతర్భవాని! మమదేహి కరావలంబం’
అంటూ పరమేశ్వరి అమ్మ చేయూత కోసం ప్రార్ధిస్తూ శ్రీ శర్మగారు అమ్మ దివ్యప్రభావాన్ని చాటారు.
పూర్వాపరాలు అన్నీ తెలిసి కూడా, మాయ తెరలు కళ్ళని కప్పగా, అంధులమై సంచరిస్తాం. మాయ అంటే ఏమిటి, అమ్మా? అని ప్రశ్నిస్తే నేను చేస్తున్నాను అనుకోవటం అని సరళంగా స్పష్టం చేసింది. కనుకనే త్యాగరాజస్వామి’ జ్ఞానమొసగరాదా? అంటూ శ్రీరామచంద్రప్రభువును అర్ధిస్తారు. మానవ ప్రతినిధిగా.
అసలు విషయం మరొకొటి ఉంది. అసలు దైవాన్ని ఎందుకు ప్రార్ధించాలి? అనేది. ఇందుకు వేదం సరియైన సమాధానాన్ని ఇస్తుంది. ‘రసోవై సః’ దైవం కంటే మధురమైనది, శ్రేష్ఠమైనది, శ్రేయస్కరమైనది ఈ సృష్టిలో లేదు. దేవుడు ఒక్కడే పరమ ఆప్తుడు అని. శ్రీమన్నారాయణుని నగరాజధరుడనీ, సర్వేశ్వరుని నీలకంఠుడని స్తుతిస్తాం. అమృతోత్పాదనకై ఆరంభించిన క్షీరసాగర మధనానికి కీలకమైన మంధర పర్వత భారాన్ని ఎవరు వహిస్తారు అని అంటే విష్ణువు; ఆ క్రమంలో ప్రభవించిన లోకభీకర హాలాహలాన్ని ఎవరు త్రాగుతారు అని అంటే శివుడు స్వచ్ఛందంగా ఆదుకున్నారు.
ఒకసారి నేను, ‘అమ్మా! మా భారాన్ని నీ మీద వేసి హాయిగా ఉంటాం’ అని అంటే “వెయ్యండిరా” అని వెంటనే “భారం అని నువ్వు అన్నావు కానీ నేను అనలేదు, నాన్నా!” అన్నది ఆపద్భాంధవి అమ్మ. అదే దైవ ఆర్త త్రాణపరాయణత్వం, లోకకళ్యాణ కారక కంకణ ధారణా స్వభావం.
సారాంశం ఏమంటే ఎప్పటికైనా సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందనే ఆశతో నిరంతరం ప్రార్థనలు చేస్తాం. కాగా ‘నమ్మి’ అనే పదపరంగా ఆలోచనచేస్తే, సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు ఎవరు అని ప్రశ్నించుకుంటే ప్రహ్లాదుడు, నారదుడు, సక్కుబాయి, తుకారం, రామదాసు, పురందరదాసు.. ఎందరో అకించన వైష్ణ వాంఘ్ర సంస్థాన రజోభిషక్తులు, సంహృత కర్ములు ఉన్నారు. ఇక మన కళ్ళ ఎదుట మసలిన మహనీయుడు ప్రాతఃస్మరణీయుడు సోదరుడు రహి! ఈ దృక్పధంతో చూస్తే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్న రీతిగా ‘సంపూర్ణ విశ్వాసం’ కల్గడం అనేది ఒక ఆదర్శం మాత్రమే సామాన్యులకు సామాన్యంగా.