1. Home
  2. Articles
  3. Mother of All
  4. నమ్మకమే దైవం

నమ్మకమే దైవం

K. Rani Samyuktha Vyas
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 6
Month : October
Issue Number : 4
Year : 2007

“దైవాన్ని నమ్మటం” అని అందరూ అంటుంటారు. కానీ నమ్మకమే దైవం అంటాను నేను. “బ్రహ్మజ్ఞానం అంటారుకానీ జ్ఞానమే బ్రహ్మం అంటాను నేను”. ఈ మాటలు అమ్మ తన వద్ద కూర్చున్న శ్రీపాద గోపాలక్రిష్ణమూర్తిగారితో అన్నది. (“శ్రీవారి చరణసన్నిధి” అను గ్రంధం వసుంధర రాసినది) ఇంకా చాలా చాలా మాట్లాడింది. వాటన్నింటినీ వ్యాఖ్యానించే శక్తి నాకు లేదనుకుంటాను. ఇంత వరకూ మహాత్ములైనా ఇంత సూటిగా, సూక్ష్మంగా చెప్పగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో జటిలమైన విషయాలను అతిసూక్ష్మంగా సులభంగా పామర జనులకు అర్థమయ్యేట్టుగా చెప్పటం ఆమెకే సాధ్యం. తల్లి తన పిల్లలకు అక్షరాలు దిద్ది పెట్టినంత ఓర్పుతో పరమార్థ విషయాలను వచ్చేవారికి విడమరచి చెప్పేది. ఎంతో సౌమ్యంగా సరళంగా మాట్లాడేది. “సంతృప్తే సంపద” ఎప్పుడే స్థితిలో వుంటే ఆ స్థితిలోనే హాయిగా వుండి ఇంకేమీ అక్కర్లేదనుకునే నిండైన మనస్థితే నిజమైన ఆధ్యాత్మిక స్థితి అని అనేది.

జీవితమంతా ఆరాటంతో కీర్తి, డబ్బు, పదవి అనే ఎండమావుల వెంట పరుగెత్తి, అశాంతి, దిగులునీ మిగుల్చుకునే అనేకమందికి ఆమె మాటలు పన్నీటి జల్లుల్లాగ సేదతీరుస్తాయి.

ఇక కొంత మంది ఆధ్యాత్మికంగా పురోగతి లేదని నిరాశపడుతూ ‘స్థితప్రజ్ఞత్వం” “ఆత్మసంయమనం” వంటి స్థితులు ప్రసాదించమని కోరగా, ఆ కోరికలు కూడా లేకుండా ఉండటమే ఆధ్యాత్మికత అని చెప్పింది.

నా విషయంలో “నమ్మకం” అని అమ్మ అన్న మాట ఎలా మంత్రంలాగ పని చేసిందో వివరిస్తాను. అమ్మ నిర్యాణమైన రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ అమ్మతో సంబంధం సత్సంగం నాకు ప్రాప్తించాయి. అంత వరకూ కాల ప్రవాహంలో వేగంగా కొట్టుకు పోతున్న నాకు సంసారనావకు దొరికిన ఒక కొయ్యబల్ల ఆధారంగా భావించాను. అమ్మ దేహంతో వుండగా ఆమెతో చాలా చనువుగా ఆత్మీయంగా మెలగటం చేత అమ్మను నేను ఆత్మీయురాలుగానే తప్ప దైవంగా భావించలేదు. అది నా అదృష్టమో దురదృష్టమో. చెప్పలేను. ఆ మాయలో ఉండబట్టే అమ్మతో చనువుగా వుండి ఆమె సాన్నిధ్యాన్ని ఆనందంగా అనుభవించానేమో అనిపిస్తుంది.

ఇక హైమవతీ దేవి సంగతి సరేసరి. అప్పుడప్పుడూ పసితనం వీడి లంగా ఓణీలు ధరించి అక్కయ్యా అంటూ చనువుగా మాట్లాడే ఆమెను దేవతా స్వరూపిణిగా ఊహించలేకపోయాను. అదే మాట తమ్ముడు సింహాద్రి శాస్త్రితో ఫోనులో మాట్లాడుతూ నాకేదైనా నిదర్శనం లభిస్తే తప్ప హైమను దైవంగా నా మనస్సు స్వీకరించటం లేదని. ఆమె పట్ల ఎనలేని ప్రేమాగౌరవాలు వున్నాయని చెప్పాను.

అంతలోనే తమ్ముడు సింహాద్రి శాస్త్రిగారింట్లో హైమ 64వ జన్మదినోత్సవానికి ఆహ్వానం వచ్చింది. ఫోనులో కూడా రమ్మని పిలిచారు. నేనెల్లాగయినా ఆ కార్యక్రమానికి హాజరవ్వాలని చాలా పట్టుదలతో వున్నాను. నాకు ఆ రోజున ఎన్నో అవరోధాలు వచ్చాయి. ఆ రోజే మా వియ్యంకుల అబ్బాయి పెళ్ళి. దానికి కుటుంబ సభ్యులతో నేను హాజరవ్వాలి. నేను పట్టువదలని విక్రమార్కుడిలా వెంటనేవచ్చి పెళ్ళికి హాజరవుతానని చెప్పి రానుపోను టాక్సీ మాట్లాడుకుని ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. జీవితంలో మొదటిసారిగా లలితా సహస్రం పఠించి కార్యక్రమం ముగించేవరకూ వుండకుండా ప్రసాదం, కుంకం తీసుకుని హడావుడిగా వచ్చి పెళ్ళికి హాజరయ్యాను. అనారోగ్యంతో ఎక్కువ వేగంగా నడవలేని మనిషిని రెండు కార్యక్రమాలు నిర్విఘ్నంగా శ్రీ పూర్తి చేశాను. తర్వాతే అసలు కథ మొదలయింది. ఒక వారం రోజులలోపల నాకు రక్త పరీక్షలో తెల్లరక్త కణాలు కొన్ని వేలు ఎక్కువగా వున్నాయని ప్రమాదమని డాక్టర్లు. చెప్పగా హాస్పిటల్లో చేరాను. నాకు వచ్చిన జబ్బేమిటో తెల్సుకోవటానికి డాక్టర్లు తికమక పడ్డారు. తర్వాత వెంటనే ఎమర్జెన్సీలో చేర్చి 24 గంటలు పైగా సెలైనులో రకరకాల మందులు ఎక్కించారు. ఆ సూది పొట్లతో శరీరం తూట్లు పడి భాధతో అమ్మనూ, హైమనూ తలచి కన్నీరు కార్చాను. మరణమే మేలని తోచింది ఆ సమయంలో, తర్వాత రెండు రోజులకు వాళ్ళ వైద్యం పూర్తి అయ్యాక నాకాలుకి ప్రమాదమైన జబ్బు వచ్చిందని నేను చాలా అదృష్టవంతురాలిననీ, వాళ్ళమందులు నా శరీరంపై పనిచేయకపోతే నాకాలు పూర్తిగా తీసివేయవలసి వచ్చేదని చెప్పారు. నా ఒళ్ళు జలదరించి ఒక్కసారి అమ్మకూ, హైమకూ నమస్కరించుకున్నాను. వెంటనే తమ్ముడు సింహాద్రి శాస్త్రికి ఫోను చేసి నేను హైమ జయంతికి రావటంవల్లనే నాకు గండం తప్పినట్లుగా భావిస్తున్నానని చెప్పాను. ఆ విధంగా నా అపోహలను ఆమె తొలగించింది.

తర్వాత కొన్నాళ్ళు తరుచుగా చిక్కడపల్లిలోని సోదరుడు కామరాజు ఇంట్లో అమ్మ సత్సంగానికి కొన్ని వారాలు హాజరయ్యాను. అప్పుడు సజీవ ప్రమాణంలో వున్న అమ్మ ఫోటో వంక చూస్తూ వుండాలనిపించేది. ఒకసారి హఠాత్తుగా అమ్మ కనురెప్పలు. అల్లల్లాడించినట్లు కనిపించింది. కళ్ళు నులుముకొని చూసినా అదే దృశ్యం కనపడింది. అది నా భ్రాంతి అనుకుని ఎవ్వరికీ చెప్పలేదు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే నా ఎడమకన్నుకి కాటరాక్ట్ ఆపరేషను చేశారు. ఆపరేషను చేసిన కంటికి వెంటనే దృష్టిరాలేదు. వారం రోజులు అంతా మసకగానే వుంది. నేను మామూలుగానే కాస్త ఆదుర్దాపడి అమ్మ నామం జపించాను. తర్వాత నెమ్మదిగా తెరిపిన పడి పూర్తి దృశ్యం కనపడ్డాక ఊపిరి పీల్చుకున్నాను. అనుకున్న ప్రకారం హైమ ఆలయానికి పూజనిమిత్తమై 6/- పంపించాను. ఆ చెక్కును శాస్త్రి జిల్లెళ్ళమూడికి పంపించారు. ఈ నా అనుభవమే మనిషికి నమ్మకం అనేది ఎంత శక్తిలాగ పనిచేస్తుందో అమ్మ చెప్పిన మాట “నమ్మకమే దైవం” అనేది ఎంత సత్యమో పాఠకులు గ్రహించగలరు. సత్సంగంలో కళ్ళ రెప్పలు ఆడించటం ఈ అనుభవంకోసమేనేమో.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!