“తోలు నోరు కాదు, తాలుమాటరాదు” ఈ వాక్యం బ్రహ్మ నిరూపణను సూచిస్తున్నది. అమ్మ నోటి మీదకు వచ్చే ప్రతి వాక్యము ఒక మహావాక్యమే. ఈ మహావాక్యాలు అనుభవంలోకి రావాలనుకునే జిజ్ఞాసువులకు సాధన అవసరం. సాధ్యమైనదే సాధన అన్నది కదా! అమ్మ – నాకు సాధన ఆచరణలో ఉన్నంతవరకు విన్నవించు కుంటున్నాను. ఇది సాధన తొలిదశ మాత్రమే.
ముందుగా తానెవరో తెలుసుకోవాలి, తానెవరో తెలియాలంటే అమ్మ కంటే తాను భిన్నంగా లేననే భావన నిరంతర చింతన చేయాలి. ఈ దేహమున్నంతవరకు అమ్మకు దాసిని. జీవాత్మభావనలో అమ్మలో నేను ఒక అంశమాత్రమే – ఆత్మబుద్ధితో ‘నేనే అమ్మను. అంటే ఆత్మస్వరూపిని అనే అనుభవం స్థిరపడడానికి ఆత్మానాత్మా వివేకం చాలా అవసరం. ఆత్మానాత్మ వివేకం వల్ల దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. దేహం ఆత్మకాకపోలేదు. రెండూ ఒకటే అనే స్థితి వచ్చేదాకా రెండూ రెండే. ముందుగా ఈ దేహాన్ని గురించి తెలుసుకుందాం:
పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచప్రాణేంద్రియములు, పంచ విషయేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము (మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము) జ్ఞాత ఈ 25 తత్వములతో కూడినది ఈ దేహం.
వాక్కు, పాణి, పాద-పాయువు, ఉపస్థం అనేవి కర్మేంద్రియాలు. చర్మం, కన్ను, చెవి, నోరు, ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు – జ్ఞాతృ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతరింద్రియాలు. ఈ ఇంద్రియాలతో అమ్మను ఆరాధిస్తే అంటే అమ్మ గుణగణాలను గూర్చే మాట్లాడు, అమ్మకు సేవకే చేతులు ఉపయోగించు, అమ్మకు ప్రదక్షిణం చేయటానికే అడుగులు వేయి అమ్మనే నిరంతరం నీ నేత్రాలతో దర్శించు, అమ్మను గూర్చిన విశేషాలే విను, అమ్మను గూర్చి పాడాడు, ప్రసంగించు, అమ్మనుండి వచ్చే సంగథాలే పీల్చు అమ్మను గూర్చి తెలుసుకో, అమ్మ యందే మనస్సు లగ్నం చేయి, నీ బుద్ధిని అమ్మ యందే ప్రచోదన చేయి, నీ చిత్తం అమ్మలో లయం చేయి. నీ అహంకారం అమ్మ కన్న భిన్నంగా లేదని తెలుసుకో. నీవు చేసే ప్రతికార్యము అమ్మ పనే అనే నిరంతర చింతన చేయి. మృణ్మయ రూపమైన నీ దేహం చిన్మయరూపమౌతుంది.
అమ్మ ఏదిచ్చినా వాడిచ్చిందే అనుకోమన్నది. కష్టం సుఖం రెండూ అమ్మ ఇచ్చినవే అయితే ఇక వాటితో మనకు తాదాత్మ్యం ఎందుకుంటుంది? అవి నీవి కావు కదా! నీకు సాక్షిగా వాటిని చూస్తున్నావు కదా ! అప్పుడు వాటితో నీకు సంగం ఎక్కడ ? అన్నింటికి ఆధారమైన చైతన్యశక్తియే అమ్మ కదా! చీమలో దోమలో కాక చీమగా దోమగా అమ్మ ఉన్నానంటున్నది కదా! అలా భావన స్థిరమైతే ఈ దేహమే కాదు సర్వం నీవనే భావన తోస్తుంది.
ఇక అమ్మ మాటకు వస్తే మాటకు ఆధారం మనసు. మనసుకు ఆధారం జ్ఞాత. అంటే వ్యష్టిలో ఇంద్రియాలకు ఆధారంగా ఉన్న శక్తి. కొండ నాలుక ఆధారంగా పెదవుల ద్వారా వ్యక్తమయ్యే వాక్కు వైఖరి. తనలోనికి చూసుకుంటూపోతే ఈ వాక్కుకు ఆధారం కంఠస్థానం, ఇది మధ్యమ, తరువాత హృదయస్థానం, ఇది పశ్యంతి. తరువాత నాభిస్థానం, ఇది పరాసాధకుడు జ్ఞాతస్థానంలోకి నివృత్తి సంయమనం చేసినట్లయితే అది పశ్యంతి, దృక్, దృశ్య వివేకం పశ్యంతి స్థితి నుండే సాధ్యమవుతుంది. ఈ సమస్త వ్యవహారాన్ని దృక్, దృశ్యంగా విభజించి తాను (అమ్మ) కేవలదృక్ గా నిలబడి దృశ్యాన్ని నిరసిస్తూ ప్రజ్ఞానఘనమైన ‘పరా’ అనే స్థితిలో నుండి వచ్చేవే అమ్మ వాక్కులు.
ఈ మహావాక్యాలను అర్థం చేసుకోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలని నా భావన. అమ్మ ఏదైనా నా అనుభవంలో నుండే చెపుతున్నానన్నది. వాచ్యార్థము వరకు సరిపెట్టుకోకుండా, అనుభవంలోకి వచ్చిన నాడు ‘అమ్మ’కు బిడ్డగా చెప్పుకునే అర్హత మనకు వస్తుంది. ఇదే నా వేదన, నివేదన.