అవును. నాకు కొద్ది రోజులలో కలుగబోయే తీవ్రమైన శారీరకబాధ (నడుం నొప్పి)ను, నా చిన్నారి చెల్లి, బంగారు తల్లి హైమవతీ దేవి ముందుగానే సూచించింది.
– ఆ మధ్య ఒక రాత్రి నేను పడుకుని నిద్రలో ఉండగా కలలో హైమవచ్చి నన్ను కూచోబెట్టి పైన మెడ నుంచి క్రింది నడుం వరకూ నిలువునా నా వెన్నును నిమర సాగింది. కలలో కూడా ఆ తల్లి స్పర్శ ఎంత హాయిగా ఉందంటే – కన్న తల్లి తన బిడ్డను ఒళ్ళు నిమురుతూంటే ఆ బిడ్డ ఆనందంతో ఎలా కేరింతలు కొడుతుందో నాలోనూ అంత ఆనంద పారవశ్యం కలిగి – “అమ్మా! అమ్మా! అలానే నిమురమ్మా! అలానే వ్రాయమ్మా!” అంటూ పులకించి పోయాను. అయితే అప్పుడు నాకు అనిపించలేదు – హైమతల్లి అలా ఎందుకు నా వెన్ను నిమిరిందో.
కాని, ఆ తరువాత నాలుగు రోజులకు నాకు భయంకరమైన నడుం నొప్పి, వెన్నునొప్పి కలిగి రెండు రోజులపాటు పడుకోలేక, కూచోలేక చాలా బాధ పడ్డాను. చివరకు దగ్గినా తుమ్మినా నడుం ఖరేల్ ఖరేల్ మనేది. అప్పుడుకాని తెలిసింది. కాదు నిమిరిందో. అంతకు ముందు హైమ కలలో కనబడి నా వెన్ను ఎందుకలా
ఆ రోజుల్లోనే రవన్నయ్య (అమ్మ పుంభావ స్వరూపం) కనబడి “Rhus Tox వేసుకోండి, తగ్గుతుంది” అన్నారు. ఆ విధంగానే రెండు డోసులు ఆ హోమియో మందు వేసుకోగానే మొత్తం నా నొప్పులు మాయమైపోయాయి. దానికి కారణం హైమ అంతకు ముందుగానే ప్రసాదించిన హస్త స్పర్శ కావొచ్చు – లేదా ఆమె రక్తాన్ని పంచుకు పుట్టిన రవన్నయ్య మాట ప్రభావమైనా కావచ్చు.
ఆ తరువాత కొద్ది రోజులకే ఇంకొక అద్భుతం జరిగింది. నాకు Eosinophilia సోకి బాపట్ల వెళ్ళి బ్లడెస్ట్ చేయించుకునేందుకు బాపట్ల ఋషీకేర్ హాస్పటల్కు వెళ్ళాను. టెస్ట్లన్నీ అయినాక నర్సింగ్ హోం నుండి బయటకు మెట్లు దిగివస్తూ, స్టీల్ రెయిలింగ్ మీద వేసిన నా ఎడమచేయి తడబడి దబ్బున మెట్లమీద జారి పడ్డాను..
మామూలుగా అయితే ఎత్తు మెట్ల మీద నుంచి జారిపడిన వాడు వెనక్కుపడి నడుం విరగ్గొట్టుకోవడమో లేదా ముందుకు పడి ముఖం బ్రద్దలు కొట్టుకోవడమో జరిగేది. కాని, నేను మాత్రం ఎవరో రెండు చేతులా ఎత్తి పట్టుకుని మెట్ల మీద కూచోబెట్టినట్టుగా ఆఖరి మెట్టు మీదకు జారి చతికిల పడిపోయాను. అలా జారటంలో నా నడుంకు కాని, వెన్నుకుగాని ఒక దెబ్బ, ఒత్తిడి కూడా కలుగ లేదు.
కొంతసేపటి వరకూ ఏమైందో నాకు తెలియలేదు. కాని, అది చూచి రోడ్డుపైన నాకోసం ఎదురు చూస్తున్న ఆటో రాఘవరావు మాత్రం పరుగెత్తుకు వచ్చి నన్ను లేవదీసి – “అదేంటి సార్! ఎవరో సరిగ్గా చేతులతో తీసుకవచ్చి కూచోబెట్టినట్లు కూచుండిపోయారు?” అంటూ తీసుకెళ్ళి ఆటోలో కూచోబెట్టాడు.
అలా ఎలా కూచుండిపోయానో అతనికి ఏం చెప్పను!
“అయ్యో! బిడ్డ పడిపోతున్నాడని” అమ్మే వచ్చి పట్టుకుందో, “అమ్మో! అన్నయ్య పడిపోతున్నాడని చిట్టి తల్లి (అడవులదీవి మధుగార్కి క్షమార్పణతో – ఎందుకంటే హైమను ‘చిట్టితల్లి’ అని పిలిచేది ఆయనే కాబట్టి) హైమే వచ్చి పట్టుకుందో తెలీదు.
మొత్తం మీద ఆ యిద్దరి దేవతల దయవల్ల నేను శరీరం మీద ఒక్క దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాను.
అయినా ఆ యిద్దరూ బింబ ప్రతిబింబాలు కదా! అందుకనే అమ్మను తలచినా హైమను కొలిచినా ఒకటే.
జయహోమాతా ! ఓం హైమా !