విశ్రాంతి ఉద్యోగిగా ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తుండే నేపధ్యంలో విషయపరిజ్ఞానం పెంపొందించుకునే సాధనలో క్షణం తీరికలేకుండా వుండే పరిస్థితి ఏర్పడింది. పెద్దలు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనయప్రసాద్ గారు వ్రాసిన “ఖండికలు” వల్ల ప్రేరేపితుడనై “విశ్వజనని” మాసపత్రికకి పదుల సంఖ్యలో కొన్ని వ్యాసాలు వ్రాసే భాగ్యం అమ్మ ప్రసాదించింది. ఒకరోజు హైదరాబాద్ నుండి ఒక మిత్రుడు ఫోన్ చేసి “విశ్వజనని” మాసపత్రికలో నీ వ్యాసాలు బాగుంటున్నాయి. శ్రీనాన్నగారి “శతజయంతి ఉత్సవాలు’ జరుగుతున్నాయి కదా ! శ్రీ నాన్నగారి గురించి మంచి వ్యాసం వ్రాయవచ్చు గదా అని అడిగాడు. అంతే వ్యాసం రాద్దామా అని స్పందన ఏర్పడింది. నాకు “అమ్మగురించే తెలిసింది చాలా తక్కువ” అనుకున్నాను. అంటే అమ్మ గురించి కొంత తెలుసు అన్న అర్థం నాకు స్ఫురించింది. కానీ శ్రీ నాన్నగారి గురించి అసలు ఏమీ తెలియదే. వారి రూపురేఖలు నా మనోఫలకం మీద ముద్రవేసి కూడా లేదు. ఇక శ్రీ నాన్నగారి గురించి వ్యాసం వ్రాయటం అసంబద్ధం అనిపించింది. కానీ ఏదో ఒక శక్తి నన్ను వ్యాసం వ్రాయమని మనస్సుని తొలుస్తునే యున్నది.
ఇంతలో నా మనమరాలు చి॥ అఖల తాతయ్యా ఈ ‘సమ్” కాస్త వివరించవా అని అడిగింది. మనమరాలి సమస్య ఏమిటంటే రేఖాగణితంలో తెలియని బిందువుని గుర్తించాలి. ఆ బిందువు స్వతంత్ర పతిపత్తి కలిగి యుంటుంది. కానీ దానిని గుర్తించే విధానం యొకటి యున్నది. ఉదాహరణకు గుర్తించాల్సిన బిందువు “Z” అనుకుంటే దానిని గుర్తించేందుకు “X” “Y” అను తెలిసిన రెండు బిందువుల సహాయం స్వీకరించాలి. Zఅనే బిందువు నుండి X ఇంతదూరములో యున్నదని Y ఇంత దూరములో యున్నదని తెలుసుకొనాలి. అలా XY ల సహాయంతో Z అనే బిందువు గుర్తించాము. కానీ ఇక్కడ Z అనే బిందువును గుర్తించిన తర్వాత XY ల ప్రాధాన్యతలు గురించి విశ్లేషణ చేసుకోవాల్సిన పనిలేదు కారణం స్వతంత్ర పత్తిపత్తి కలిగిన ప్రత్యేకమైన అస్థిత్వము కలది కనుక Z ప్రాధాన్యత గురించి ఆలోచించాల్సిన పనిలేదు. బాగా అర్ధమయిందంటు ఆనందంగా వెళ్ళిపోయింది నా మనమరాలు. నాకు మాత్రం అర్థంకాని ఎన్నో విషయాలు నా మనస్సును తొలిచి వేస్తున్నాయి.
ఇక్కడ కొన్ని ఉపనిషత్ వాక్యాలు నాకు స్ఫురించినవి. తెలియని “ఆత్మ”ని విశ్లేషించాలంటే ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనదని వివరిస్తే అందరికి అంతగా అర్థం కాదు. అదే అందరికి తెలిసిన ఆకాశాన్ని తీసుకొని ‘సర్వవ్యాప్తియైన ఆకాశం సూక్ష్మమైన ఇసుక రేణువులో యున్నట్లే ఆత్మజీవునిలో సర్వవ్యాప్తియై యున్నదంటే కొంత అర్థమయ్యే అవకాశం వుంటుంది. ఇలా తెలియని విషయాలను తెలిసిన విషయాల సహాయంతో తెలుసుకునే సాంప్రదాయం మనం చాలా చోట్ల గమనిస్తాము. ‘తత్ దూరే తద్వంతికే తదంతరస్వి సర్వస్య” అనే ఈశా వాశ్యోప నిషత్ మంత్రం, అలాగే అణోరణీయాన్ మహతో మహీయాన్” అను కఠోపనిషత్ వాక్యం ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. ఇక్కడ నాకు తెలియని బిందువు శ్రీ నాన్నగారు. శ్రీ నాన్నగారిని గురించి వ్యాసం వ్రాయాలనే తపన ఎవరో మిత్రుడు కలిగించటం, తెలియని నాన్నగారి గురించి వ్యాసం వ్రాయాలని నేను తపనపడటం, తెలియని బిందువు గురించి తెలుసుకునే విధానం బాగా చెప్పానని నా మనమరాలు ఆనందపడటం, అన్నీ యాదృచ్ఛికంగా జరిగినా నా మనస్సు మాత్రం జిల్లెళ్ళమూడి అమ్మ శ్రీ నాన్నగారి గురించి వ్యాసం నాతో వ్రాయిస్తుందనే విషయం మనస్సులో ముద్రపడిపోయింది. అక్టోబరు సంచికకి అందేలా వ్యాసం వ్రాద్దామనుకున్న నా ఆలోచన సఫలీకృతం కాలేదు.
ఇక “నాకు తెలియని నాన్నగారు” గురించి తెలుసుకొని వ్యాసం వ్రాయాలంటే నాకు రెండు కేంద్ర బిందువులు నా దృష్టికి వచ్చాయి. అవి ఒకటి “అమ్మ” రెండవది శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు వ్రాసిన “విశ్వజననీవీక్షణము” అనే రసవద్గీత. ఈ రెండు బిందువుల ఆధారంగా (నేను గ్రహించనివి) తెలియని శ్రీ నాన్నగారి గురించి వ్రాయటం ప్రారంభించాను.
నా మొదటి తెలిసి కేంద్రబిందువు అమ్మ : అమ్మ అంటే ఆదరణ, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే నిబద్ధత, అమ్మ అంటే పాతివ్రత్యానికి పరాకాష్ఠ”. అలాంటి అమ్మని ఆశ్రయిస్తే శ్రీ నాన్నగారి వైశిష్ట్యాన్ని సులువుగా ఆవిష్కరించ వచ్చును. అమ్మని గురించి మనకి ఎంత తెలిసినా మనకి తెలిసింది సున్న. తెలియవలసింది అనంతము. కాగా తెలిసినంతలో అమ్మని అమ్మ గొప్పతనాన్ని చెప్పుకుందాము. శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలో అమ్మని పొగుడుతు శ్రీ నాన్న గొప్పతనాన్ని తెలియపర్చారు.
“విరించిః పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనమ్,
వితంద్రీ మహేంద్రీ వితతిరపి సం మీలతి దృశాం
మహాసంహారేస్మిన్, విహరతి సతిత్వత్పతిరసౌ||
అంటారు. అనగా ఓ పతివ్రతామతల్లీ ! మహా ప్రళయ కాలమున విష్ణుమూర్తి తన అస్తిత్వము కోల్పోయినా, యముడు నిశ్చేష్టుడైనా, కుబేరునికి అంతిమదశ ఏర్పడినా, అమరులైన ఇంద్రాది దేవతలు అమరత్వము కోల్పోవు పరిస్థితి ఏర్పడినా నీ పతి మాత్రము కడు సమర్థముగా ఆనందముగా ప్రకృతి యందు అప్రతిహతంగా విహరిస్తూనే యుంటాడు. ఈ ప్రత్యేక శ్లోకము అమ్మ పాతివ్రత్య మహిమను తెలియచేసే మంచి ఉదాహరణ పూర్వక శ్లోకము. అమ్మవల్లనే అయ్యవారు ప్రళయకాలమందు సంచరించ కలుగుతున్నాడు. ఇక్కడ అమ్మ ప్రాధాన్యత కన్న అయ్యవారి వ్యక్తిత్వ విశేషాలు గమనార్హం. ఇక్కడ కూడ అమ్మ, శ్రీ నాన్నగారల విశిష్ట లక్షణాలు మనం విస్మరించరాదు.
ఇక రెండవ బిందువు “విశ్వజననీవీక్షణం” శ్రీ నాన్నగారి బుద్ధికుశలత, నిబద్ధత, నిజాయితీలు శ్రీనాన్నగారి వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకుంటే తెలిసి విషయాలు. శ్రీ నాన్నగారితో అమ్మకి వివాహం కాక మునుపే నాన్నగారు అమ్మని హెచ్చరించిన విధానం శ్రీ నాన్నగారి వ్యక్తిత్వ వివరణకి మంచి ఉదాహరణ. పెండ్లికి ముందే శ్రీ నాన్నగారు అమ్మతో “మా ఇంటికి నా యిల్లాలుగా వస్తే నానా కష్టాలు పడాలి. సుఖాలు అక్కడ దొరకవు. సంపదలేదు. అన్ని పనులు నీవు చేయాల్సి వస్తుంది. నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక్కొసారి ఉపవాసాలు కూడా
చేయాల్సి వస్తుంది. ఇల్లు లేదు. సెంటు భూమి లేదు. తినటానికి కంచాలు లేవు పడుకోటానికి మంచాలు లేవు. నాకు వచ్చే జీతం ఆరు రూపాయలు. వీటితో నలుగురు మనుష్యులం బతకాలి” అని అమ్మతో తన గురించి వాస్తవాలు తెలియపర్చారు. ‘నూరబద్ధాలు ఆడైనా యొక పెళ్ళి చేయాలి” అన్న నానుడికి విరుద్ధంగా అన్ని నిజాలు వెల్లడించిన భోళా శంకరులు శ్రీ నాన్నగారు. వారు అమ్మకి దొరకటం అమ్మ అదృష్టం. ఇంకా చెప్పాలంటే మన అదృష్టం. కారణం “గంగరాజు గందరగోలగాడైతే గంగమాంబ ఏమి చేయ గలదు”. శ్రీ నాన్నగారు సహృదయులు కనుకనే అమ్మ మనమధ్య చరించి ప్రేమను పంచి, అందరికోసం అందరిల్లు అందించింది.
“భర్తంటే శరీరం కాదమ్మా, భావన” అని అమ్మ ఓదార్చ గలిగిందంటే శ్రీ నాన్నగారి ప్రభావం అమ్మ మీద ఎంత పనిచేసిందో అర్థం చేసుకొనవచ్చు. శ్రీ నాన్నగారిది అమ్మతో అభేదస్థితి. “అమ్మా ప్రసాదం తిన్నాను ఇక వెడతాను” అంటే నాన్నగారికి చెప్పి వెళ్ళు” అనటం. అమ్మకి పండ్లు తెస్తే నాన్నగారికి ముందు ఇచ్చిరా అనటం అమ్మ వంతైతే, ‘వెళ్ళొస్తానని చెప్పితే అమ్మకి చెప్పావా” అని అడగటం. నాన్నగారు నమస్కారం అంటే నాకెందుకు అమ్మకి పెట్టండి నమస్కారాలు” అనటం అమ్మకి శ్రీనాన్నగారి అభస్థితిని తెలియచేస్తుంది.
స్పష్టంగా చెప్పాలంటే జిల్లెళ్ళమూడికి అసలైన కేంద్రబిందువు శ్రీ నాన్నగారే. శ్రీ నాన్నగారే కనుక తన అసామాన్యతను చాటుకొని సామాన్యుని వలె సాదాసీదా భర్తగా ప్రవర్తించి ఉండినట్లయితే జిలెళ్ళమూడి నేడు ఇంత అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకొని యుండక పోయెడిది. శ్రీనాన్నగారి ఔన్నత్యమనే జిల్లెళ్ళమూడికి కలిగిన ఆధ్యాత్మిక ఉన్నతికి కారణము. శ్రీ నాన్నగారు అమ్మకిచ్చిన స్వేచ్ఛ, వారిచ్చిన చేయూత, వారు కల్పించిన సమయనిబద్ధతలే మనందరికి అమ్మ ద్వారా లభించిన ప్రేమాభిషేకాలు, అనురాగ స్నానాలు, అమృత ప్రసాదాలు అనే విషయం నిర్వివాదాంశము. శ్రీ నాన్నగారి వ్యక్తిత్వం అనన్య సామాన్యము. బ్రహ్మ, విష్ణు, రుద్ర మహేశ్వరులు నలుగురు అమ్మ మంచానికి నాలుగు కోళ్ళైతే సాక్షాత్తు శివుడు తెల్లని కాంతియనే మిషతో అమ్మ కప్పుకునే దుప్పటిగా మారి అమ్మశరీరపు రంగు తాను పొంది అమ్మ కనులకు ఆనందం కలిగించాడు (సౌందర్యలహరి 92వ శ్లోకం) అలాగే శ్రీ నాన్నగారు అమ్మని మనకి వదలి అమ్మని మనం సేవించకొనే యోగం మనకి కల్పించి తాను మాత్రం పతిగా అమ్మకి సరియైన సమయంలో ఆనందం చేకూర్చిన శ్రీ నాన్నగారు అభినందనీయులు. కనుకనే అమ్మా నాన్న గార్లది అభేదస్థితిగారు.
ఇడా – పింగళా అనే రెండు నాడులే అమ్మ మరియు శ్రీ నాన్నగారు. ఇలా ఉచ్ఛ్వాస – నిశ్వాసలనే రెండు పాములను సమన్వయం చేసి కుండలినిని ప్రజ్వలింపచేసుకొని సహస్రారంలో శ్రీ నాన్నగారిని అందుకోవటం కోసమే నాగేశ్వర ప్రతిష్ఠ, అలాగే నాగేశ్వరుడైన నాన్నగారిని హృదయ ప్రతిష్ఠ చేసుకొని ఆ ఆధారంతో అమ్మని మనం గుర్తించగలిగే బహిరంగ ప్రక్రియయే జిల్లెళ్ళమూడిలో శ్రీ నాగేశ్వర ప్రతిష్ఠ. శ్రీ నాన్నగారు అమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా మేం ఉన్నాం మీ వెంటే మీలోనే కాక అనసూయేశ్వరాలయంలో, నాగేశ్వరాలయంలో అనే ఆ విషయం మనం మరిచిపోకుండా ఉండేలా చేసిన మహిమాన్విత మహా వ్యక్తిత్వాలు అమ్మవి శ్రీ న్నాగారివి. అందుకే వారిద్దరు ప్రాతః స్మరణీయులు.