ముందే ఒక మాట చెప్పాలి. “నాకు తెలిసిన నాన్నగారు” అని శీర్షిక పెట్టడంలో ఉద్దేశం నాకు నాన్నగారిని గురించి చాలా తెలుసునని కాదు. నాకు తెలిసింది కొంతే. ఆ కొంతలో కొంత చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం.
నాన్నగారు అని మనం గౌరవంతో పిలుచుకున్న బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు చాలా గొప్ప వ్యక్తి. అమ్మకు పతిదేవుడు కావటం వల్ల ఆయనను నాన్నగారు అని పిలుచుకొన్నాము. అమ్మను “అమ్మా !” అని పిలుస్తాము. కాని నాగేశ్వరరావు గారిని నాన్నగారు అంటాము. అమ్మను అమ్మా అని పిలవటంలో చనువు ఉంది. సాన్నిహిత్యం ఉంది. “నాన్నాగారూ!” అని పిలవటంలో గౌరవం ఉంది. ఒకింత దూరం కూడా ఉంది. మనతో మాట్లాడేటప్పుడు అమ్మ ఎప్పుడూ “మీ నాన్నగారు” అనే అంటుండేవారు. నాగేశ్వరరావు గారు “మీ అమ్మగారు” అంటూండేవారు. గారు శబ్దం లేకుండా ‘అమ్మను గురించి ఆయన మాట్లాడిన సందర్భం నాకు తెలిసినంతలో లేదు.
బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు చాలా గొప్పవ్యక్తి. ఎందువల్ల ! గొప్పతనం ఆయన జిల్లెళ్ళమూడి గ్రామానికి కరణం అయినందువల్ల వచ్చినది కాదు. అమ్మకు భర్త అయినందువల్ల ఆయనను గురించి మనందరం తెలుసుకొనే అవకాశం కలిగింది. కాని అందువల్లనే ఆయన గొప్పవారు కాలేదు. వ్యక్తిగా ఆయన గొప్పతనానికి కారణాలు ఉన్నాయి.
నాన్నగారు నాకు తనతో మాట్లాడే అవకాశాలు చాలా కల్పించారు. నేను జిల్లెళ్ళమూడి వెళ్లినప్పుడల్లా ఆయన గ్రామంలో ఉంటే మేమిద్దరం తప్పనిసరిగా ఎంతో కొంతసేపు మాట్లాడుకొనేవాళ్ళము. ఆయన తనతో కలసి భోజనం చేసే అవకాశాలను కూడా చాలాసార్లు కల్పించారు. అది ఆయన ఔదార్యం, నా అదృష్టం. అమ్మను చూడటానికి వచ్చిన చాలామందితో ఆయన మాట్లాడేవారు. అలాగే నాతోనూ మాట్లాడారు. కాని, నాకు బహుశ ఇతరుల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు, మేము ఎక్కువ సేపు మాట్లాడి ఉండవచ్చును. నాన్నగారు రాజకీయాలలో పాల్గొనక పోయినప్పటికీ అపారమైన రాజకీయ పరిజ్ఞానం కలిగినవారు. ఆయనకు దగ్గర స్నేహితులలో ఒకరు కోనా ప్రభాకరరావుగారు, మంత్రిగా, స్పీకరుగా, గవర్నరుగా పనిచేసిన ప్రముఖ నాయకుడాయన. అరే, ఒరే అనుకునే స్నేహబంధం వారిది. నాన్నగారు కాంగ్రెస్ పార్టీ అభిమాని. కాని ఎప్పుడూ సభ్యులు కారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి కాంగ్రెస్ చరిత్ర తెలిసినవారు. తన అభిమానాన్ని ఆయన దాచుకోరు. నేను పత్రికలలో పనిచేస్తున్నవాడను గనుక నాతో ఆయన ప్రధానంగా రాష్ట్రపరిస్థితులను, గురించి, ముఖ్యంగా రాజకీయపరిణామాలను గురించి మాట్లాడేవారు. జర్నలిస్టుగా నాకు ఒక పార్టీ పట్ల ప్రత్యేకమైన అభిమానంగాని, మరొకపార్టీ పట్ల వ్యతిరేకత గాని లేదు. అది నా విధానం. నాయకుల విషయంలోనూ నా వైఖరి అదే. అభిప్రాయాలు ఉంటాయి. కాని, అవి పార్టీలతోనూ, నాయకులతోనూ నా సంబంధాలను ప్రభావితం చేయవు. నాన్నగారికి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని సరదాగా నేను ఆ పార్టీని ఆక్షేపిస్తూ మాట్లాడేవాడిని. ఆయనకు బాధకలిగేది. అది కొద్దిపాటి కోపంగా కూడా మారేది. ఆవేశంతో కాంగ్రెస్పార్టీని సమర్ధిస్తూ మాట్లాడేవారు. కోనా ప్రభాకరరావు గారు నాకు గూడా తెలుసు. మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది. అయినా, నాన్నగారిని కాస్త కవ్వించడానికి “ఆయన బాపట్లకో, గుంటూరుజిల్లాకో రాష్ట్రానికో ఏమి చేశాడండీ?
ఒక్క మంచి పనిలేదు ఘనంగా చెప్పడానికి” అంటే ఆయన రెచ్చిపోయి ప్రభాకరరావుగారు ఎన్నెన్ని మంచి పనులు చేశారో ఏకరువుపెట్టేవారు. నాన్నగారు కాస్త గొంతు పెంచి, కోపంగా మాట్లాడుతుంటే మేము దూరంగా బయట ఉన్నప్పటికీ, అమ్మ గదిలో ఉన్నప్పటికి అన్నీ గమ నిస్తూండేది. తరువాత అమ్మతో మాట్లాడుతున్నప్పుడు “నాన్నగారికి ఎందుకు కోపం వచ్చింది? నువ్వు ఏమన్నావు? ఆయన ఏమి మాట్లాడారు?” అని అడిగేది. నేను చెప్పేవాడిని. అప్పుడు, మరికొన్ని సందర్భాలలో కూడా నాన్నగారి పట్ల నాకు గౌరవం ఇనుమడింపచేసే విధంగా అమ్మ ఆయనను గురించి ఎన్నో మంచి మాటలు చెప్పేది. కేవలం మాటలే గాదు. అమ్మ నాన్నగారి పట్ల గౌరవాన్నీ, భక్తిశ్రద్ధలను చేతలలో చూపేది. అమ్మ ఉదయం పళ్లు తోముకొని ముఖం కడుక్కున్న తరువాత తన మంగళసూత్రాలమీద నీరు పోసి, దానిని తీర్థంగా తీసుకొనేవారు. నాన్నగారి ఆలయప్రవేశం తరువాత కూడా. నా ఆసక్తిని గమనించి ఒకసారి అమ్మ చెప్పారు. అవి నాన్నగారి పాదాలుగా భావించి తాను తీర్థం తీసు కొంటున్నానని వివరించారు. నాన్నగారికి బాధకలగటం గాని, కోపం తెప్పించేట్లుగాని మాట్లాడవద్దని అమ్మ వాచ్యంగా చెప్పలేదు గాని హితవు మృదువుగా అందించింది.
అమ్మ నాకు తనతో మరెవ్వరూ లేకుండా మాట్లాడే అవకాశాలు 1960-70 మధ్యకాలంలో అనేకసార్లు కల్పించింది. అది నాపై అమ్మ చూపిన కరుణ. తలుపులు వేసి మాట్లాడుకొంటున్నప్పు డెప్పుడైనా నాన్నగారు వచ్చేవారు. ఏదైనా కుటుంబ విషయాలు మాట్లాడు కొంటారేమోనని నేను బయటికి వెళ్లేవాడ్ని. ఒక్కొక్కసారి అమ్మ వెళ్లవద్దన్నట్లు నా చేతిని నెమ్మదిగా నొక్కేది. అప్పుడు నేను ఆగిపోయేవాడిని. నాన్నగారు వచ్చినప్పుడు అమ్మ పమిట సర్దుకొని ఆయన ఏమి చెపుతారో జాగ్రత్తగా వినాలన్నట్లు ఒద్దికగా కూర్చునేది. ఆయన వచ్చినప్పుడు పడుకొని ఉంటే లేచి కూర్చొనేది. బిడ్డల పైన ప్రేమా, ఎంతోమందిమి ఉన్నప్పటికీ సరదాగా ఛలోక్తులు విసరుతూ ఉండే అమ్మ నాన్నగారు రాగానే ఒక్కసారిగా భర్త పట్ల భయభక్తులు కలిగిన భార్యగా మారిపోయేది. ఆయన భోజనం చేశారో లేదో పడుకొన్నారో లేదో తనకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండానే తెలిసినప్పటికీ ఇతరులను అడిగి తెలుసుకొంటూండేది. నాన్నగారికి శ్రద్ధగా సేవచేయమని అందులో ఒక సందేశం ఇమిడి ఉంది. నాన్నగారు రాత్రి పడుకొనే వేళ వెళ్లి ఆయనకు సేవచేసి వస్తుండేది. కాళ్ళు పిసికి వస్తున్నానని చెప్పేది. అమ్మ తిరిగి వచ్చాక ఆమెకు కాళ్లు, చేతులు పిసికే అవకాశాన్ని అక్కడున్న బిడ్డలకు ఇస్తుండేది.
నాన్నగారి గొప్పతనం ఆయన మాలాంటి వారెందరికో అమ్మ దగ్గర చనువుగా మెలిగే అవకాశాన్ని కలిగించటం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వాళ్లూ అమ్మ ఒడిలో వాలిపోతారు. బ్రహ్మాండం సుబ్బారావు (నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు) అమ్మఒడి “పరిష్వంగాల జీవనది” అన్నాడు. కవితాత్మక వర్ణన. ఎంతో ఆర్తితో తమ కష్టాలను చెప్పుకోడానికి వచ్చిన బిడ్డలను, వాళ్ల వయస్సుతో నిమిత్తం లేకుండా అమ్మ దగ్గరకు తీసి, ఒడిలో చేర్చుకొని ఓదారుస్తున్న దృశ్యాలు సర్వసాధారణం. అమ్మ అప్పుడప్పుడు అనేవారు నాన్నగారి మంచితనం వల్లనే మీ అందరూ నా దగ్గరకు రాగలుగుతున్నారు. నా పిల్లలు వలె నా ఒడిలోకి వచ్చి చనువుగా ఉండగలుగుతున్నారు అని. ఎవరైనా తన భార్యతో పరపురుషులు ఇలా దగ్గరకు వస్తే చూసి భరించగలరా? అది నాన్నగారి గొప్ప మనసు” అన్నారు. అది అక్షరాలా నిజం. ఒకసారి నాన్నగారు ఈ ప్రస్తావన చేశారు. “మీ అందరికీ ఆమె అమ్మ. నాకు భార్య. భర్తగా నాకు, భార్యగా తనకు కొన్ని విడి బాధ్యతలు ఉంటాయి. అందరు దంపతులు గానే మేమూ” అన్నారు. నాన్నగారి అవసరాలను గుర్తించి ఏ విధమైన అసంతృప్తి, లోటు రాకుండా జాగ్రత్త పడుతుండేది అమ్మ. నాన్నగారు గ్రామాంతరం వెళ్లేటప్పుడు అమ్మకు చెప్పి వెళ్ళేవారు. అమ్మ బొట్టుపెట్టి పంపిస్తుండేది. అమ్మకు ఒకింత నలతగా ఉన్నట్లు కనిపిస్తే నాన్నగారు తరచు అమ్మదగ్గరికి వచ్చి ఎలా ఉన్నదీ పరామర్శించి వెళుతుండేవారు.
అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాదు వచ్చి 1980లో కొన్ని రోజులు రాజగోపాలాచారి గారి ఇంట్లో ఉన్నారు. అప్పుడు నాన్నగారు కూడా వెంట వచ్చారు. అమ్మ రాత్రింబవళ్లు చాలా బాధ పడుతుండేది. నాన్నగారు చాలా దిగులుపడ్డారు. ఆందోళన ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుండేది. అమ్మ బాధను చూడలేక, అమ్మను చూడకుండా ఉండనూ లేక ఆయన పడిన అవస్థను నేను చూశాను.
నేనొకసారి కట్టుబట్టలతో జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మను చూసి వెంటనే తిరిగి వెళ్లాలని ఆలోచన. కాని, అమ్మ ఉండమన్నది. గుడ్డలు తెచ్చుకోలేదమ్మా అని చెప్పాను. నాన్నగారు తన వద్ద ఉన్న ఖద్దరు ధోవతి కొత్తది నాకు ఇచ్చారు. నాకు 1962 వరకు సిగరెట్లు తాగే అలవాటు ఉండేది. అమ్మతో చాలా ముఖ్యమైనవి విషయాలు మాట్లాడుతున్నప్పుడు సైతం కుతిగా వుంటే “అమ్మా! ఇప్పుడే వస్తా” అని చెప్పి బయటికివెళ్ళి సిగరెట్టు కాల్చి వచ్చేవాడిని. అమ్మ ఓపికగా వేచిచూచేది. కొన్నాళ్లకు ఆపని నాకే అసహ్యం అనిపించింది. అమ్మ నాకు విడిగా మాట్లాడే మహాదవకాశాన్ని ఇస్తే ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోకుండా సిగరెట్ల కోసం బయటికి వెళ్లడమేమి టనిపించింది. అంతకు ముందునుంచే సిగరెట్లు మానేయాలనే ఆలోచన నాకు ఉంది. ఇప్పుడది బలపడింది. నా ఆర్థికపరిస్థితులు, చైనాతో భారతదేశానికి యుద్ధం వచ్చి పౌరులందరు ఎంతో కొంత విరాళాలను రక్షణనిధికి పంపిస్తుంటే నేనేమీ ఇవ్వలేకపోయిన దుస్థితి మొదలైన కారణాలు సిగరెట్లు మానేయాలని నిర్ణయానికి కారణాలైనాయి గాని మానలేకపోయేవాడిని. అమ్మ దర్శనానికి వెళ్ళిన ఒకసారి ఎలాగైనా అమ్మకు చెప్పాలి? అమ్మతో చెపితే సిగరెట్లు మానగలననే ఆలోచన వచ్చింది. ఎన్నిరోజులు ఉన్నా చెప్పలేకపోయాను. సిగిరెట్లు మీద ప్రీతి నాకు తగ్గలేదని అర్థమవుతున్నది. ఇక కొద్దిసేపటిలో హైదరాబాదుకు బయలుదేరతాననగా అమ్మ దగ్గర కూర్చున్నాను సెలవు తీసుకుందామని. అమ్మ కబుర్లు చెపుతున్నది. అమ్మ నా సంకల్పం చెప్పడానికి అలా అవకాశం ఇచ్చింది. అయినా చెప్పలేదు. ‘అమ్మా! బయల్దేరుతానమ్మా!’ అన్నాను. అమ్మ “సరే నాన్నగారితో చెప్పిరా” అన్నది. నేను నాన్నగారితో చెప్పాను. “ఇప్పుడు దుర్ముహూర్తం. కాసేపు ఆగి వెళ్ళండి” అన్నారు. దురలవాటు బలం నా సంకల్పం కార్యరూపం దాల్చకుండా చేసింది. నేను మళ్లీ అమ్మ దగ్గరకు వెళ్ళాను. చూడగానే అమ్మ నవ్వింది. అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాను. అమ్మ దురభ్యాసాలను గురించి వాటివల్ల కష్టాలు పడ్డవాళ్లను గురించి మాట్లాడటం మొదలు పెట్టింది. నేను బిత్తరపోయాను. “నువ్వు చెప్పదలచుకొన్నదేదో చెప్పరా!” అన్నట్లున్నవి అమ్మ మాటలు. అప్రయత్నంగా “ అమ్మా ! సిగరెట్లు మానేయాలనుకొంటున్నానమ్మా. మానేస్తా” అన్నాను. అమ్మ విని ఊరుకొన్నది. సంభాషణ మరో అంశంమీదకు మళ్ళింది. అటుతరువాత నేను సిగరెట్లు తాగలేదు. రోజూ అయిదారు పెట్టెల సిగరెట్లు కాల్చేవాడిని. ఒక్కసారిగా మానేయటం వల్ల ఇబ్బంది నాకేమీ కాలేదు. పైగా ఆకలి పెరిగి ఆరోగ్యం కుదుటపడింది. ఇలా నాచేత సిగరెట్లు మాన్పించిన సంఘటనలో నాన్నగారి పాత్ర చిన్నది కాదు. ఆయన ఎప్పుడూ చెప్పని విధంగా కాస్సేపు ఆగి వెళ్లమని చెప్పడం, తిరిగి వెళ్లినప్పుడు అమ్మతో సంభాషణ నేను సిగరెట్లు మానేస్తానని చెప్పడానికి దోహదం చేయడం ఒక దానితో ఒకటి సంబంధం ఉన్నవే.
2013 సంవత్సరానికి విశ్వజననీపరిషత్తు వారు ప్రచురించిన క్యాలెండర్లో అమ్మ, నాన్నగారు ఉన్న చిత్రాన్ని ప్రచురించారు. అందులో అమ్మ రెండు పాదాలలో ఒకటే పూర్తిగా కనిపిస్తుంది. నాన్నగారి రెండు పాదాలలోనూ ఒకటే బాగా కనిపిస్తుంది. పెద్దలకు మ్రొక్టేప్పుడు ఎవరమూ ఒక పాదానికి మ్రొక్కము. ఇప్పుడు మనకు తన పాదం ఒకటి చూపించి రెండవపాదం నాన్నగారి పాదానికి మ్రొక్కమన్నట్లున్నది ఈ చిత్రం. మొదటిది మనం పూజించే అమ్మపాదం. రెండవది అమ్మ పూజించే నాన్నగారి పాదం. ఆ రెండు కలసి అమ్మ దివ్యమాతృత్వం. అది అమ్మ నాన్నగారికి ఇచ్చిన గౌరవం. తాను ఇవ్వటమే కాదు. మనందరినీ ఇవ్వమంటున్నది.
ముందే చెప్పాను. నాన్నగారిని గురించి నాకు తెలిసింది తక్కువేనని. తెలిసిన దానిలోనూ కొంతే చెప్పాను. నాన్నగారిని గురించి సమగ్రంగా చెప్ప గలిగిన శక్తి అమ్మకే ఉన్నది. అమ్మకు తెలిసిన చాలా విషయాలు మనలో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. నాన్నగారిని గురించే కాదు. ఎవరి గురించైనా అందరికీ అన్ని విషయాలూ తెలియవు. అత్యంత ప్రసిద్ధులైన వారి విషయంలో వారి జీవిత విశేషాలను గురించి పరిశోధనలు జరుగుతాయి. జీవితచరిత్రలు వెలువడుతాయి. వారందరూ గొప్పవాళ్లే. గొప్పతనం వేరు, కీర్తివేరు. కీర్తి, గొప్పతనం కలసి కొందరిని ప్రసిద్ధులను కావిస్తాయి. ప్రసిద్ధులు కాకపోయినా, గొప్పవాళ్లయిన వారు కొందరు ఉంటారు. నాన్నగారు అందులో ఒకరు.
నాకు వలెనే ఎంతో కొంత తెలిసిన సోదరీ సోదరులు ఇంకా కొందరున్నారు. వాళ్ల పరిస్థితి ఇంతే.
నాన్నగారు చాలా గొప్పవ్యక్తి అనడానికి ఆయన దయవల్లనే అమ్మ దగ్గరకు మనందరం వెళ్లి, చనువుగా ఉండగలిగామన్న ఒక్క కారణం చాలు. నాన్నగారి శతజయంతి సందర్భంగా ఆయన స్మృతికి శతసహస్ర వందనాలు.