అమ్మ మహా సిద్ధి పొందిన తరువత కొన్ని నెలలు అయిన తరువాత వాత్సల్యాలయంలో నేను శిష్ట్లాప్రసాదు కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఒకరు వచ్చి అమ్మకి నమస్కారం చేసుకుని నాతో సంభాషణ చేశారు. అమ్మ ప్రబోధంలోని కొన్ని విషయాలు మాట్లాడారు. “మన హిందూ వేదాంతంలో జన్మలని గురించి చెప్పారుకదా! అమ్మ లేవని చెప్పారని అంటున్నారు, జన్మలు ఉన్నాయా? లేవా?” ఆ అడిగే పద్ధతిలో సాత్వికత ఒకవైపూ, తన సంశయాన్ని నిర్దుష్టంగా వ్యక్తపరిచే తీరు కనపడింది. అప్పుడు “ఆధ్యాత్మిక వైద్య శిఖామణి” అనెడి శీర్షికతో వ్యాసం ఒకటి వ్రాశాను అది మాతృశ్రీ సంచికలో వస్తుంది. దానిలో సంశయానికి సమాధానం వుంటుంది” అన్నాను. “ఏమో…… ఎప్పుడు వస్తుందో అది నాకు పోష్టు చెయ్యండి” అన్నారు. తత్త్వ చింతన – విషయ జిజ్ఞాసతో అంతకుముందు ఎవ్వరూ అడగలేదు. అప్పుడు నేను “ఈ గ్లాసుని పట్టుకుంటే వేడి ఉందా? అంటే లేదు కదా! దీనిలోని పరమాణువుని ఛేదిస్తే ఎంతో వేడి వచ్చి చుట్టు ప్రక్కల ఎంతో ప్రాంతాన్ని దహించే ఉష్ణం పుడుతుంది అంటారు, ఈ చర్చకూడా అటువంటిదే” అన్నాను. తరువాత నేను వ్రాసిన వ్యాసాలని గురించి వివరించాను. “అమ్మ సూక్తుల వివరణ – మహాత్ముల వాక్యాలకి సమన్వయం ఈ విధంగా వ్రాస్తున్నాను” అన్నాను. వారు “శ్రీపాద వారు అమ్మ వాక్యాలని సంకలనం చేస్తే మీరు, వాటిని వివరిస్తూ వ్రాస్తున్నారు అన్నారు. “పి.యస్.ఎన్. మూర్తి” అని వారి అడ్రస్ వివరాలు చెప్పారు. వారి మొదటి పరిచయంలోనే వారి పట్ల గొప్ప భావం ఏర్పడింది. నాతో కూర్చున్న ప్రసాద్ “చాలా బాగా అడిగారు. వారు అడిగే పద్ధతి చాలా బాగుంది” అన్నాడు.
తరువాత కొంత కాలానికి హైదరాబాద్ వెళ్ళి విద్యానగర్లో వున్న వల్లూరి రమేష్ వాళ్ళ ఇంటి వెళ్ళాను. రమేష్ మూర్తిగారిని కలిసి “పీయూష వచ్చాడు. మీకు తెలుసా” అని అడిగాడు. “అయ్యో తెలియకపోవడమేమిటి” అని రమేష్ ఇంటికి వచ్చి నన్ను వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ రోజు వారి ఇంట్లో వారు ఒక్కరే వున్నారు. వారి సతీమణి ఎక్కడికో వెళ్ళారు. ఆయన వడ్డిస్తూ “ఊఁ…….. మీకు ఏది కావాలంటే అది వడ్డించుకోండి” అంటూ సొంత పినతండ్రి పెద్దనాన్న లాగ స్వతంత్రం … చూపించారు.
ఒకప్పుడు సికింద్రాబాద్ లో ఆకుల నరసింహులు గారిని చూడకుండా ఎప్పుడూ వచ్చేవాడ్ని కాదు. తరువాత పి.యన్.ఎన్.మూర్తిగారిని వి.శ్రీరామమూర్తి గారిని (ఖైరతాబాద్) వీరిద్దర్నీ చూడకుండా వస్తే ఏదో కొరతగా వుండేది. అటువంటి ఆత్మ బంధువులు అయినారు. వీరు “అమ్మ సాక్షాత్ పరమేశ్వరి” అని వారి విశ్వాసాన్ని ప్రకటించేవారు. “పరమాత్మ తత్త్వం” అనెడి పుస్తకం రచించారు. ఈ గ్రంథాన్ని జిల్లెళ్ళమూడిలోనే ఆవిష్కరించారు. “అమ్మకోటి” వ్రాసి జిల్లెళ్ళమూడికి పంపించారు. ఏదీ లెక్క పెట్టేవారుకాదు. నేను ఇంత చేశాను అనెడి భావంలేని సర్వ సమర్పణ చేసెడి వ్యక్తి ఈయన. నేను పాకలో వుంటే పాకలో బిల్డింగ్ లో వుంటే బిల్డింగ్లో కి వచ్చి నన్ను కలిసేవారు. భౌతికమయిన స్థితి గతులకి అతీతమయినది ఆత్మీయత అనేది. వీరి ప్రవర్తనలో కనపడేది. 1993లో హైదరాబాద్లో నాకు పైల్స్ ఆపరేషన్ జరిగింది. నన్ను విష్ణు నర్సింగ్ హోంకి తీసుకుని వెళ్లటం టెస్టులు చేయించటం అంతా వీరే చూశారు. కేవలం వేదాంత చర్చలు – రచనలే కాక మనిషికి అవసరానికి అండగా నిలిచే వ్యక్తిత్వం వీరిది. నాకంటే పెద్దవారే అయినా నన్ను ఎప్పుడూ “దత్తన్న” అనేవారు. 1999 విజయదశమికి హైదరాబాద్ లో నేను వ్రాసిన చిన్న బుక్ లెట్ “అమ్మ – విజయదశమి” అనెడి పుస్తకాన్ని వీరే ఆవిష్కరించారు. వీరే ఆ సందర్భంలో మాట్లాడారు. పెద్దవారు మీరురాగలరో లేరో అనుకున్నాను అన్నాను. నీ దగ్గర్నుండి ఫోన్ వచ్చిన తరువాత రాకపోవడమేమిటి?” అన్నారు. అమ్మ పట్ల భక్తి – నా పట్ల వాత్సల్యం వారిని ఆ విధంగా రప్పించింది. అంతరంగా నికి మహోన్నత భావామృతాన్ని వారు సంభాషణల ద్వారా అందచేశేవారు. అటువంటి వారు భౌతిక దేహం చాలించటం తీరని వెల్లి అనిపించింది. కాని వారి వాత్సల్యం, మనిషిని భౌతికమయిన స్థితిగతులకు అతీతంగా ఆదరించే సేవా త్యాగనిరతి అమ్మ అంటే అకుంఠిత విశ్వాసం మనందరికి ఆదర్శం. ఇట్టి గుణ సంపత్తి మనందరిలో వారి స్మృతిని నిలుపుతుంది. “మరుపులేకపోవడమే అమరం” అని అమ్మ ప్రబోధం. వీరు అమరులై అమృతమూర్తులై మన మనస్సులో నిలిచారు.