(గత సంచిక తరువాయి)
‘పుట్టువులేని నీ కభవ! పుట్టుట క్రీడయకాక’ – అని దేవతలు ప్రార్థించినట్లుగా నామరూపాదులతో నిమిత్తం లేని భగవంతుడు నామరూపాలు ధరించి మానవుల మధ్య సంచరించడం ఒక లీల. దైవం మానవరూపాన్ని ధరించి భూమిపై నడయాడడం ఒక అద్భుత సన్నివేశం. ఆ అద్భుతాన్ని మనం కనులారా చూశాం.
ఒకసారి చీరాల డాక్టరుగారు శ్రీ పోట్లూరి సుబ్బారావుగారు అమ్మతో ‘ఒకే సమయంలో జిల్లెళ్ళమూడిలోనూ చీరాలలోనూ ఉండగలవా?’ అని అడిగారు. అందుకు అమ్మ “అక్కడా ఇక్కడా కాదు సర్వత్రా ఉంటాను” అన్నది. రూపం పరిమితం కాని ఆ శక్తికి ఎటువంటి పరిమితులు, పరిధులు, నిబంధనలు లేవు. అందుకే ‘నా జీవితం అబద్ధం, చరిత్ర బద్ధం’ అన్నది అమ్మ. “సృష్టి అనాది, నాది” అని ప్రకటించిన అమ్మ తనదైన తానైన సృష్టితో ఆడుకోవడానికే మానవ రూపంలో అవతరించింది.
మానవరూపంలో ఉంటూ మాధవిగా అభివ్యక్తం కావడమే లీల. ‘సర్వవ్యాధి ప్రశమని’ అయి కొందరికి వ్యాధి నయం చేసిన సంఘటనలూ, అవసరం అనుకుంటే తానే మరో రూపంలో వెళ్లి వైద్యం చేసిన సంఘటనలూ అమ్మ జీవిత చరిత్రలో ఎన్నో కన్పిస్తాయి. ఇవన్నీ అబద్ధంగా అనిపించే నిజాలు; చరిత్రబద్ధమైన సత్యాలు.
వీరమాచినేని ప్రసాదరావుగారు అందరికీ సుపరిచితులే. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారితో కలిసి వారు అమ్మతో ఎన్నో తాత్విక సంభాషణలు చేసిన జిజ్ఞాసువు. తాము అనుసరిస్తున్న సామ్యవాద సిద్ధాంతం అందరింటిలో అతి సహజంగా ఆచరణలో చూసి ఆశ్చర్యచకితులై అమ్మను గురించి తెలుసుకోవాలని అమ్మవద్దకు తరచుగా రావడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే అమ్మ వారికొక అనుభవాన్ని ప్రసాదించింది.
1972లో ప్రసాదరావుగారి కుమారుడూ కోడలూ జీపులో ప్రయాణిస్తుండగా ఆ జీపును ఒక లారీ వేగంగా ఢీకొన్నది. ఆ ప్రమాదంలో వారి కోడలికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. మెదడు దెబ్బ తిన్నది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు; కానీ ఆశావహంగా లేరు. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా అని వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆపరేషన్ సమయం ఆసన్నమయింది. బంధువులందరూ ఏం జరుగుతుందోనని ఉద్విగ్నులై ఉన్న సమయంలో శ్రీ జమ్మి వెంకటరత్నం గారు అమ్మ వద్దనుండి ప్రసాదము, తీర్థమూ తెచ్చి ఇచ్చారు. అవి చూసిన ప్రసాదరావు గారికి అమ్మ మన వెంటే ఉండి రక్షిస్తోంది అన్న విశ్వాసం కలిగింది.
ఇంతలో డాక్టర్ రూపంలో ఆపరేషన్ థియేటర్లోకి అమ్మ వెళ్తూ ఆయనకు కన్పించింది. ఆపరేషన్ జయప్రదంగా పూర్తయింది. అరుదైన ఆ శస్త్రచికిత్స సఫలం అవడం, అన్నీ సక్రమంగా ఉండి ఆమె కోలుకున్న తీరు వైద్యులనే ఆశ్చర్య పరిచింది. ఏదో ఒక బలమైన శక్తి మీ కోడలిని జీవింప చేసిందని ప్రసాదరావుగారితో వైద్యులు చెప్పారు. మరి వారి అనుభవం కాదన లేని సత్యం. అన్ని రూపాలు తానైన అమ్మ డాక్టర్గా దర్శన మివ్వడంలో ఆశ్చర్య మేముంది. అందుకే అమ్మ నిరాకారుడు అంటే అన్ని రూపాలు తానైన వాడని నిర్వచించింది.
అలాగే మరో రూపంలో ఒక సోదరి బాధను ఎలా తీసివేసిందో తెలుసు కుందాం. సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి అమ్మమ్మ, పార్శ్వపు నొప్పితో బాధ పడుతోంది. అమ్మ దర్శనం చేసుకుంటే ఆ బాధ తీరుతుందని ఆమె ఆశ. ఆమె జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని తన నొప్పి సంగతి అమ్మకి చెప్పి ‘నువ్వే కరుణించాలి’ అన్నది. అందుకు అమ్మ, “మానవ శరీరం కదమ్మా! బాధలు తప్పుతాయా!” అన్నది చిరునవ్వుతో. అమ్మ ప్రసాదం తీసికొని ఇంటికి వచ్చాక ఆమె ‘మహిమలు మహిమలు అంటారు. కానీ అక్కడ ఏ మహిమలు లేవు. ఊరికే ఎండనపడి వెళ్ళాను. ‘అనుకున్నదట కోపంగా’
కానీ విచిత్రమేమిటంటే ఆ మరునాడు ప్రొద్దున ఒక పల్లెటూరి స్త్రీ వీరి ఇంటికి వచ్చి “నేను పార్శ్వపు నొప్పికి పసరు వైద్యం చేస్తాను. ఇక్కడ ఎవరో పార్శ్వపు నొప్పితో బాధ పడుతున్నారని తెలిసి వచ్చాను” అంటూ ఆమెకు పసరు వైద్యం చేసి వెళ్ళిపోయింది. బాధ తగ్గిన తరువాత చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆమెకోసం వెతికించారు. ఆమె గురించి ఎవరూ తెలియదన్నారు. ఇలా ఎన్నో రూపాలలో అమ్మ దర్శనమిచ్చి రక్షించింది.
భాగవతంలో – బ్రహ్మదేవుడు గోవత్సలను గోప బాలురను అంతర్థానం చేసిన ఘట్టంలో శ్రీకృష్ణ పరమాత్మ –
‘గోపాలసుతులు లేరని గోపికలకుఁ జెప్పనేల? గోపాలకులున్
గోపికలు నలర బాలుర క్రేపులరూపముల నేఁ జరించెదననుచున్ ‘
అంటూ అన్ని రూపాలను తానే ధరించాడు.
‘రూపాంబు లెల్లనగు బహురూపకుఁడిటు బాలవత్సరూపంబులతో
నేపారు టేమి చోద్యము రూపింపగ నతిని కితర రూపము గలదే?’
ఈ జగన్నాటకంలో అందరి రూపాలూ ధరించే అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు బాలుర, లేగల రూపాలు ధరించడంలో ఆశ్చర్యం ఏముంది? ఏ రూపంలోనైనా ఉన్నది ఆ పరమాత్మే..
అలాగే ‘మీరంతా నేనే, మీదంతా నేనే, ఇందంతా నేనే, అన్ని నేనులు నేనే” అని ప్రకటించిన అమ్మ వివిధ రూపాల్ని ధరించడం లేక అనేక రూపాలలో తానే అమ్మగా దర్శన మివ్వడంలో వింత ఏముంది? అది అమ్మకు సహజం, మనకు అద్భుతం.
ఒకసారి శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబుగారి నాన్నగారు శ్రీ లింగేశ్వరరావు గారు శ్రీ జిడ్డు ప్రసాదుగారితో జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ సన్నిధిలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ గురించి చర్చ జరిగింది. ఉన్నదొకటే అదే విశ్వంగా అనేక రూపాలుగా ఎలా ఉన్నదో అమ్మ వివరించింది. అపుడు లింగేశ్వరరావుగారు “నీకు అలా అన్పిస్తుంది కానీ మాకు అనుభవానికి రావటం లేదు” అన్నారు. ఆ తరువాత అమ్మ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి ఇద్దరూ 7వ మైలురాయి దగ్గరకు వచ్చి బస్సుకోసం వేచి చూస్తున్నారు.
అమ్మ తన లీలను ప్రారంభించింది. ఇంక లింగేశ్వరరావు గారికి ఎవరిని, దేనిని చూసినా అమ్మే కనిపిస్తోంది. ఇంటికి వెళ్ళారు. ఇంట్లో వాళ్లు, చుట్టు ప్రక్కల వాళ్లు అందరూ అన్నీ అమ్మ రూపాలే. ఆ విధంగా భిన్నత్వంలోని ఏకత్వాన్ని అనుభవం ద్వారా తెలియచేసింది అమ్మ. అవతారమూర్తి అయిన అమ్మ జీవితంలోని ప్రతి సంఘటనా ఒక లీలయే.
(సశేషం)