అమ్మపూజ అయినా, ఏ శుభకార్యమైనా, యతీశ్వరుల పాదపూజైనా, బిక్షకు ఆహ్వానించినా, ఎంతో ఆదుర్దా, ఆందోళనతో కంగారుగా ఉంటుంది. అనుకున్నట్లుగా చేయగలమా, సమయానికి అందరూ వస్తారా, వస్తువులు, పూజాసామగ్రి సిద్ధంచేసుకున్నామా, తెలిసీతెలియని తనంతో పూజనీయులకు ఏమన్నా అసౌకర్యం కలిగిస్తామేమో. ఇలా భయంభయంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంవల్ల అన్నీ సవ్యంగా జరిగి, ఆయా సందర్భాలు తలుచున్నపుడల్లా మనసు పరవశిస్తుంది మంచి గంధపు చల్లదనంలా, పొగడపూల లేత పరిమళంలాగా, పున్నాగపూల సన్నాయి లాగా.
అవి 1984 సం|| ఆషాఢపూర్ణిమనాటి స్మృతులు. మా మామగారు స్వర్గీయ డాక్టరు వల్లూరు సుబ్బారావుగారి జన్మదినం. మా అత్తగారికి, భర్త జయంతి సందర్భంగా జిల్లెళ్లమూడిలో అమ్మపూజ చేసుకోవాలని జిల్లెళ్లమూడి వెళ్లాము.
శ్రీరామకృష్ణ అన్నయ్యతో ఇలా అమ్మ పూజచేసు కోవాలనుకుంటున్నాము అని చెబితే, సాయింత్రం డాబా మీద వెన్నెల్లో పూజచేసుకుందురు అని ఆమోదించారు.
చల్లని సాయంత్రం వేళ, వెన్నెల వెలుగులలో, పూజకు ఏర్పాట్లు చేసుకుని, అమ్మరాకకోసం చకోరాల్లా ఎదురుచూస్తూ ఉండగా, శ్వేతవస్త్రధారిణియై, అమ్మ మెల్లిగా నడచివచ్చి ప్రశాంతంగా కుర్చీలో సుఖాసీను రాలైంది.
శ్రీరామకృష్ణ అన్నయ్య నిర్వహణలో, అమ్మపాద పూజ ఆనందంగా తృప్తిగా జరిగింది. అమ్మకు బచ్చలిపండురంగు బిన్నిసిల్కుచీర, జాకెట్టు, పళ్లు, పూలు, 3,000/- రూపాయలు అత్తయ్యగారు తన చేతులు మీదుగా సమర్పించి తృప్తులయ్యారు. కోరిక నెరవేరిందన్న ఆనందంతో, అమ్మకు హారతియిచ్చి, నమస్కరించి బొట్టు, ప్రసాదం తీసుకున్నాము.
అమ్మ 3,000/- రూపాయలు రామకృష్ణన్నయ్యకు యిచ్చి, అప్పట్లో P.F.D.S స్కీము ఉండేది. సభ్యత్వరుసుము ఒక్కొక్కరికి రూ.150/- మా ముగ్గురి పేర్లతో సభ్యులు చేర్పించి, మిగతా పైకం అన్నపూర్ణాలయానికి వినియోగించమని చెప్పారు.
మర్నాడు అమ్మవద్ద శలవు తీసుకుని గుంటూరు. వెళ్లాలని, అమ్మకు చెప్పాలని వెళ్లాము. అమ్మ మా అత్తగారికి లేత ఆకుపచ్చరంగు, నాకు ముదురు వైలెట్ రంగు బిన్నీసిల్కుచీరలు ప్రసాదంగా యిచ్చారు. అమ్మకూడా మేము ఇచ్చిన బిన్నీచీర కట్టుకుని, మీరిచ్చిన చీర కట్టుకున్నాను అన్నట్లుగా చేతితో సంజ్ఞచేశారు. రామకృష్ణన్నయ్య చేత జరీధోవతి, కండువా తెప్పించి, కండువా భుజానవేసుకుని, ధోవతి మెడనుండి పాదాలవరకు కప్పుకుని, తర్వాత తీసి మావారికి భుజాలనిండుగా కప్పి ఆశీర్వదించారు. “వాళ్లిద్దరికీ కట్టుకున్నవి యిచ్చాను. నీకు చుట్టుకున్నవియిచ్చాన”ని చమత్కరించారు.
మా అత్తగారు తనచేతి బంగారు గాజులు జత తీసి అమ్మచేతిలో పెట్టారు. అమ్మ ఒక్కక్షణం గాజులవంక చూచి, ‘నువ్వుంచుకోమ్మా’ అని మళ్లీ అత్తయ్యగారికే యిచ్చారు. మేము అవి కరిగించి క్రొత్తగా, అమ్మచేతి ఆదితో గాజులు చేయించి సమర్పిద్దామని ఆలోచించి వసుంధర అక్కయ్యని అమ్మచేతి గాజు ఆదికి యిమ్మని అడిగితే, అక్కయ్య ఎర్రని మట్టిగాజు యిచ్చారు. ఏ కారణంచేతో తెలీదు ఆ సమర్పణ జరగలేదు. అమ్మ ఆలయప్రవేశం విగ్రహప్రతిష్ట సమయంలో, పునాదిలో నా చేతిగాజు సమర్పించే భాగ్యం కలిగింది. అమ్మ చేతి ఆదిగాజు మాత్రం, ఒక్కపట్టుబట్టలో చుట్టి, చక్కటి భరిణలో, ‘మా మూలధనం’గా ఉన్నది.
జీవితంలో ఒక్కసారి మాత్రమే అమ్మచల్లని చేతులు మీదుగా భోగిపళ్లు పోయించుకున్నాము. అందరం చిన్నపిల్లల మైపోయాము. ముందువైపు చీరకుచ్చెళ్లు పొడవుగా, పమిటచెంగు వెనకవైపు విశాలంగా పరచుకుని, అమ్మచేతి భోగిపళ్లు, చిల్లరడబ్బులు, పూలు దొర్లిపోకుండా జాగ్రత్తపడేవాళ్లు అందరూ. ఆనాటి 1. పైసా, 2 పైసలు, 5, 10 పైసలు అరుదుగా పావలా, అర్ధ, రూపాయి బిళ్లలు ఇన్నేళ్లుగా ఈ నాటికి ఎంతో అపురూపంగా, అమ్మమనకు ప్రసాదించిన ‘సిరులూ, సంపదలు’ అవి అనే భక్తిభావంతో భద్రంగా దాచుకుంటున్నాము.
వృద్ధులు గతంలో బ్రతుకుతారు అనే నానుడి ఉందికదా! కాని గతమంతా వ్యర్థంకాదని, సార్ధకమే ననిపించే జీవితాల్ని అమ్మ మనకు ప్రసాదించింది. ధన్యులమేగదా మనమందరం.