దైవం మానుష రూపేణ భువిపై అవతరించ సంకల్పించినప్పుడు తమ పరివారంతోనే వస్తారని కదా నానుడి. అమ్మ దివ్య ప్రణాళికలో నాన్నగారూ ఒక భాగమే. ఆ ప్రణాళిక ననుసరించే అన్నీ జరుగుతుంటాయి. ఆ ప్రణాళిక ఏమిటో చూద్దామా !
అమ్మ బాల్యంలోనే 6 సంవత్సరములు నిండకమునుపే తన నిర్ణయాన్ని తెలియపరిచింది.
అమ్మ చినతాతగారైన చిదంబరరావుగారికి, వారి కుటుంబానికి స్నేహితులు, గురుతుల్యులు అయిన లక్ష్మణాచార్యుల వారు నృసింహోపాసకులు. వీరు తఱచుగా వీరింటికి వచ్చి పోతుంటారు. వీరు అమ్మలో బాలా త్రిపురసుందరినీ, నృసింహస్వామిని దర్శించిన మహానుభావులు.
వారు అమ్మను వారింటికి తీసుకెళ్ళి దేవతార్చనకు ఎదురుగా ఆసీనురాల్ని చేసి మూడు గంటలు అమ్మతో సంభాషణానంతరం ముగ్ధులై తల్లీ ! నీవెవరవో చెప్పమ్మా అంటే అమ్మ మౌనంగానే ఉన్నది. పోనీ నేనెవరినో చెప్పమ్మా పలుకమ్మా పలుకుగల తల్లీ ! పలుకవేమీ అనగా అమ్మ – “నీవు పలికే – పలుకే నేను నాయనా !” అని అక్షరమే తానయిన అమ్మ జ్ఞాన సరస్వతే తానుగా సృష్టీకరించింది.
మరొక సందర్భంలో – ఆచార్యులు గారు అమ్మను వారింటికి తీసుకెళ్ళారు. తిరిగి చిదంబరరావు గారింటికి ఇద్దరూ కలిసి వస్తుండగా త్రోవలో ఒక పెద్ద త్రాచు ఇద్దరి మధ్యనా నుంచుని ఉన్నట్లు కనబడుతుంది. ఆచార్యులుగారు ఉలికి పడి అమ్మా ! దూరంగ వెళ్ళు అది త్రాచు పాము, విషం” అంటారు. అమ్మ – ఆ కాటులో ఘాటు లేదు లెండి అంటుంది. ఆ పాము ఆచార్లగారి నిలువెత్తునా లేచి సరాసరి వారి వంకనే – చూస్తూంటే ఆయన నిశ్చేష్టుడై చలనం లేని వారై ఒక అరగంట గడిచాక కళ్ళు తెరవగా – పాము అమ్మను చుట్టుకున్నట్లు దర్శించారు. వెంటనే వారు అమ్మ పాదాలపై వ్రాలి నేను పాము అంటే భయంలేనివాడ్ని. నా కెందుకింత భయం. అయినా నిన్ను చుట్టవేసుకున్న దేమిటమ్మా అనగా
“అది పాము కాదు నాయనా నాగేంద్రుడు. ‘ఆ నాగేంద్రుడే నన్ను చుట్టుకుని ఉన్నాడు. నేను నాగేంద్రుడిని చుట్టించుకున్నాను. ఆ నాగేంద్రుడే. నాగేశ్వరుడై వస్తాడు. వాడే నాకాధారం. వాడి ఆకారమే నేను” అని ప్రకటితపరిచింది.
పలు విధాల అమ్మను దర్శించిన ఆచార్యులుగారు “ముగురమ్మల మూలపుటమ్మా నీకాధారమేమిటమ్మా నీవే ఆధారమయితే” అనగా
“ముగురమ్మల మూలపుటమ్మ అంటే – ఆది అయి అనాది అయి ఈనాటి కిది అయింది. (ఈ అమ్మగా వచ్చానని తెలియ చెప్పటమేగా) ముగ్గురు మూర్తులకు తల్లి మూలపుటమ్మ మూడు భాగాలై అన్ని అవస్థలు మూడుగా చేసి తను త్రిపుటియై… బాలై, బాలాత్రిపుర సుందరై, మూడు గుణాలు, మూడు కాలాలు, మూడు పూటలు, మూడు అవస్థలు, శరీర భాగాలు మూడు, మూడు మూర్తులై, ఆ మూడు మూర్తులకు భార్యలై, ఆ మూడు సత్వరజస్తమోగుణాలై ప్రపంచమే ఒక భూతంలో నుంచి అనేకంగా మారి పంచబడ్డది. అందుకు నాకాధారం కావల్సి వచ్చింది. అని తనకు అంతా వర్తమానమే” అంటూ అమ్మ విపులీకరించింది.
ఒకరోజు చిదంబరరావు గారి ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా ఆచార్యులవారు అమ్మ గురించి కొద్ది కొద్దిగా తెలియచేస్తూ, ఇంతకూ ఈ తల్లి ఎవరి భార్య కావలసి ఉన్నదో అయిన సంబంధాలేమైనా వున్నాయా ? అని అడుగగా ఎవరూ ఏమి మాట్లాడలేదు. అమ్మే కల్పించుకుని “ఆయనే సంబంధం. అయిన సంబంధాలు ఏమున్నై. సంబంధమే ఆయన బంధమే ఆయన” అంటుంది. తన అనుభవాన్ని విస్మరించిన ఆచార్యుల వారు ఆయన ఎవరని అడుగుతారు. “మీరు కూడా అడుగుతారేం? మొన్న చెప్పాను కదా అని జ్ఞప్తి చేసి నిర్ణయం మారదన్న విషయాన్ని రూఢి చేసింది.
అమ్మ – బాల్యంలోనే అమ్మ వాత్సల్యాన్ని చూరగొన్న పుత్రుడు మౌలాలి. ఆ సోదరుడు ఎన్నో అనుభూతుల్ని పొందిన మహాభక్తుడు. వివాహాత్పూర్వమే – అమ్మ, నాన్నగారు మాట్లాడుతుండగా అమ్మ కొరకు వచ్చిన మౌలాలి దూరంగా నుంచుంటే – అది గమనించిన అమ్మ “దగ్గరకు రాలేదేం నాయనా” అని అడిగింది. “నాన్నగారుంటే రాలేనమ్మా. వారితో పరిచయం లేదు కదా ! భయం. ఇక్కడున్నంత చనువు, ప్రేమ అక్కడ వుండదమ్మా. ముఖంలో ఏదో ముడత, కోపం, ఉద్రేకం కనపడతై” అంటే అమ్మ “అది శివుడు సోమశేఖరునిగా ఉన్నప్పుడు అట్లాగే వుంటాడు నాయనా” సోమశేఖరుని లక్షణం అని అభివర్ణించింది.
వివాహానికి పూర్వము అమ్మ మేనమామ అయిన చంద్రమౌళి సీతారామయ్యగారు నాన్నగారు అమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్తున్న సందర్భంలో అమ్మను ముద్దుచేస్తూ వాడికి (నాన్నగారికి) జీవకళ తక్కువ అని హాస్యం చేస్తే – అమ్మ “పోన్లెండి మీ మాదిరి జీవకళ అఖర్లేదు. జీవంలేని శిలలను చూశారు. వాటికి జీవం కలవారి నందర్ని చైతన్యం లేని రూపం రక్షిస్తున్నది. అట్లాగే వారు మనందర్ని రక్షిస్తారు. ఏనాటికో ఒకనాటికి మీరు అందరూ వారికి మొక్కేరోజు అంటూ రాకపోదు” అని సృష్టీకరించింది.
సీతారామయ్యగారు – “ఇంకా నయం వాడికన్నావు నీకే మొక్కుతారనలేదు బతికించావన్నారు ?
అమ్మ – “ఏరోజు ఎటువంటి రోజు వస్తుందో మనకేం తెల్సు ఎవరికి ఎవరు మొక్కవలసి వస్తుందో” అన్నది. అది అక్షరాల కాలక్రమంలో వారు అమ్మను దైవంగా గుర్తించి, ఆరాధించి స్థానికంగా కొంతకాలం అమ్మ సన్నిధిలో ఉండే అదృష్టాన్ని పొందటం కొందరికి విదితమే.
చిత్రాతి చిత్రంగా పలురకాల మలుపులతో మెలికలతో అమ్మ నిర్ణయానుసారం అమ్మ కళ్యాణం నాగేశ్వరునితో (నాన్నగారితో) కడు వైభవంగా భావపురిలోని చిదంబరరావుతాతగారింట్లోనే జరిగింది (1936 – మే -5న)
పరమేశ్వరులైన నాన్నగారితో ఆత్మీయులు గాను, సన్నితులుగాను, ఒక అనుబంధాన్ని మనకు అమ్మ ఏర్పరిచింది. వారి అనుగ్రహానికి పాత్రతనొసగింది.
మా నాన్నగారి కుటుంబం బాపట్లలో ఉండగ మా నాన్నగారు, అందరి నాన్నగారు స్నేహితులని విన్నాను. కళాప్రియులైన అందరి నాన్నగారు, మా నాన్నగారు కలిసి నాటకాలు వేసే వాళ్ళనీ విన్నాను. ఆ రోజుల్లోనే అమ్మ దృష్టి మా నాన్నగారిపై సారించింది. తత్ఫలితం గానే మా కుటుంబం అమ్మకు చేరువకావటం జరిగిందేమో ! మరి.
మా నాన్న గారికి అధ్యాపక వృత్తి కారణంగా. మేము చీరాల వెళ్ళటం జరిగింది. కొంతకాలం తదుపరి అమ్మను గూర్చి పలురకాల విశేషాలను, విషయాలను వినటం జరిగేది. నాన్నగార్ని నాగులు అంటారు మా నాన్నగారు. నాగులు భార్యకు హీక్టీరియాట అని ఒకరకంగానూ, ఆ రాముడే అమ్మ అని రామ భక్తులైన రంగన్నబాబుగారి ద్వారాను విన్న మా నాన్నగారు అమ్మను దర్శించి ఆపై జిల్లెళ్ళమూడి మమ్మల్ని తీసుకురావటం జరిగాయి.
నాన్నగార్ని మా నాన్నగారు ‘నాన్నగారు’ అని పిలిస్తే నువ్వు నాన్నగారని పిలవటమేమిట్రా అనేవారు. అయినా అమ్మ ఇచ్చిన స్థానానికే గౌరవం ఇచ్చేవారు.
నాన్నగారికి కొంతకాలం భోజన సదుపాయాలను చేయగలిగే మహదవకాశాన్నీ భాగ్యాన్ని నాకు కల్పించింది. ఈ రోజుకూ వంట చేసేటప్పుడు వారి రుచులను గుర్తు తెచ్చుకుంటూ చేస్తాను.
నాన్నగారికి నేను వంట చేసిపెట్టే రోజుల్లో వంట అయ్యాక అమ్మకు నివేదన ఇవ్వటం అలవాటు. ఒక రోజు నాన్నగారికి, మరో ఇద్దరికీ త్వరగా భోజనం పెట్టాల్సిన అవసరమేర్పడింది. అమ్మకు నివేదన తీసివుంచి నాన్నగారి వాళ్ళకి భోజనం పెట్టాను. నాన్నగారు భోంచేసి అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళారు. (ప్రస్తుతం అఖండ నామం జరిగే ఆలయం). నేను పనిచూసుకొని అమ్మ దగ్గర అవకాశం చూసుకుని నివేదన తీసుకెళ్ళిన నన్ను చూసిన నాన్నగారు ఏమిటమ్మా! అది తినటానికేమైన తెచ్చావా అన్నారు. అమ్మకు నివేదన తెచ్చాననగా నేను భోంచేశాక తెచ్చావేమిటి ? పోనీ నేను తినకముందైనా తీసి అవతల పెట్టావా ? అన్నారు. ఆ ధ్వనిలో తనకంటే ముందే ఇవ్వమన్న ఆదేశమే విన్పించింది. నాన్నగారి దృష్టిలో అమ్మ దేవతయే. అమ్మను ధ్యేయంగా పెట్టుకుని ధ్యానం, జపం కూడా చేశారని విన్నాను.
అమ్మ బామ్మగారు పోయినప్పుడు మూడవ రోజున నిండుకుండలోని అన్నం, పప్పు, కూర తీసుకురమ్మని కబురుచేసింది. అప్పట్లో వంట చేస్తున్న సోదరి తిరుమలమ్మ గారు అన్నీ విస్తట్లో పెట్టుకుని తెస్తే అన్నీ రుచిచూసి పదార్థాలన్ని కలిపి నాన్నగారికి, బాబాయికి పెట్టమ్మా ! ముందు ఇది తిని తర్వాత అన్నం తినమని చెప్పమని కబురు చేస్తే నాన్నగారు వారి తమ్ముడు లోకనాథంగారు అమ్మ ఆదేశాన్ని ఆచరించారు. మరి నాన్నగారి ఆలోచన ఏమిటో మనకు అవగతంకానిది. అమ్మ తీరు మనకు అంతుపట్టనిది. అమ్మ నాన్నగార్ల సంభాషణలో “ఆ! అట్లా ఆశీర్వదించమ్మా ! అనటం విన్న నేను నాన్నగారి చేత ఇలా పలికించిందేమిటబ్బా అని ఆచ్చెరువొందటం నా వంతయినది.
నాన్నగారు పనిమీద గ్రామాంతరం వెళ్ళేటప్పుడు అమ్మకు చెప్పి బొట్టు పెట్టించుకుని వెళ్ళేవారు.
1954లో నాన్నగారు విజయవాడలో ఒక చోట కూర్చుని వెళ్తూ తన సంచి మరిచి పోయి వెళ్తుంటే అమ్మ గొంతు విన్పించిందట. “సంచి మరచి వెళ్తున్నారు తీసుకోండి”అని. వెంటనే నాన్నగారు వెనక్కి వెళ్ళి ఆ సంచీ తెచ్చుకున్నారు. ఆ సంచీలో అతి ముఖ్యమైన కాగితాలు ఉన్నైట.
1963లో నాన్నగారు మొక్కపాడు వెళ్ళారు. జిల్లెళ్ళమూడిలో కళ్ళు మసుకుని పడుకుని వున్న అమ్మ “నులకమంచం” కాళ్ళు ఒత్తుకుంటై దిండు వేసుకోండి” అంటోంది. అమ్మ మంచం పక్కనే కూర్చున్ననేను అమ్మ ఎవరితోనో మాట్లాడుతున్నదే అనుకుంటూ అమ్మనడిగాను ఎవరికమ్మా చెప్పున్నావు అని. అమ్మ ఏం మాట్లాడలేదు. బహుశ నాన్నగారితోనేమో వారు రాగానే అడుగుదా మనిపించి నాన్నగారు రాగానే మీరు ఏ మంచం మీద పడుకున్నారు అని అడిగితే ఎందుకమ్మా నులక మంచం మీద పడుకున్నానన్నారు. కాళ్ళక్రింద దిండు వేసుకున్నారా అంటే లేదన్నారు.
1972లో నాన్నగారికి జె.వి క్రిష్ణారావు గారి ఆసుపత్రిలో ఆపరేషన్ జరగబోతుండగా నాన్నగారు అమ్మకు ఒక ఉత్తరంలో “ఆపరేషన్ తిలకిస్తూ, ఆ సమయంలో నీవు జిల్లెళ్ళమూడిలో ఉండిననూ, నా చెంతనే ఉండగలవని నమ్మిక అని వ్రాశారు. అంతకుముందు ఎన్ని సంఘటనల ఆధారంగా ఆ నమ్మిక ఏర్పడిందో ! మరి 1975లో జిల్లెళ్ళమూడిలో అందరింటిపై నక్సలైట్లు దాడిచేసినప్పుడు అంతకు కొద్ది నిముషాల ముందే నాన్నగారిని మాములుగా పడుకుండే స్థలం నుండి మరోచోటుకి పంపింది. లేనియెడల ‘ఆనాడు నాన్నగారికి ప్రాణ సంకటం ఏర్పడి వుండేది. నిత్య జీవితంలో కూడ అమ్మ నాన్నగారిని అంటిపెట్టుకుని వున్నది. వెన్నంటే వున్నది. నాన్నగారు గ్రామాంతరం వెళ్ళినా అమ్మ అదృశ్యంగా నాన్నగారి వెంటనే వుండేదట. కొన్నిసమయాల్లో అమ్మ కంఠం వినిపిస్తూండేదనీ నాన్నగారే స్వయంగా వెల్లడించేవారు.
బామ్మ గురించి కబుర్లు చెప్తూ – మీ అమ్మగారు నడుంబిగించి కోడలిగా, అమ్మగా కూడ అన్నీ చేసింది అని చెప్పి ఆరోగ్యం బాగలేనప్పుడు అవసరమయితే చొక్కాను చిలకకొయ్యకు తగిలించినట్లు తీసి వెయ్యగలదని నా నమ్మకం అనీ, మీ అమ్మగారిది గూఢమంచు ప్రయాణం అనీ కబుర్లు చెప్పేవారు. అమ్మ ఆశీర్వచనంలో అచంచలమైన విశ్వాసం ఉన్నట్లు నాన్నగారి మాటల్లో దృఢంగా అనిపించేది.
1981కి పూర్వం హైమాలయం పక్కన ఒక పూదోట ఉండేది.నేను హైమాలయం నుంచి వస్తుండగా (పెద్దబ్బాయి) సుబ్బారావన్నయ్య కూతురు స్వీటీని ఎత్తుకున్న నాన్నగారు కలిశారు ఆ తోటలో. మంచి సువాసన, అందమైన ఒక పువ్వును కోసి ఎంత బాగుందో చూడవే పువ్వు అంటూనే ఇద్దరం కలిసి వాత్సల్యాలయానికి వచ్చాం. నాన్నగారు అంత మెచ్చుకున్న పువ్వును అమ్మ చేతికివ్వలేదు. వరండాలో పడుకుని వున్న అమ్మ పాదాలపై వుంచారు. (పాదాలపై వుంచాలన్న భావం కలిగింది ఆ మహాత్మునికి). ఆ అపురూపమైన దృశ్యాన్ని ఈ నా చక్షువుల కందించింద
అమ్మ. మనసు నిండా ఆనందమే.
జిల్లెళ్ళమూడిలో అందరూ కలిసి ఒకే వంటలో ఒకేచోట భోజనం చేస్తే బాగుంటుందని అమ్మ సంకల్పించింది.
దర్శనార్థం వచ్చే యాత్రికులు, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ఆవరణలో సేవచేసేవారు. విడిగా వంటలు చేసుకునే వారినీ మాన్పించి 1981 జనవరి 16వ తేదీన సామూహిక భోజనాలను ప్రారంభించటం జరిగినది.
అమ్మ సంకల్పించిన ఈ ఏర్పాటుకు నిరాడంబరులైన నాన్నగారు కూడా తానే స్వయంగా కంచం తీసుకుని వచ్చి బంతిలో కూర్చునేవారు. వారిది మహోన్నతమయిన స్థానమయినా అతి సామాన్యులుగా స్నేహశీలిగా, పరామర్శలతో, పలకరింపులుతో కలివిడితో ఆత్మీయులుగా సంచరించే వారు.
వారు వాత్సల్యాలయానికి వచ్చినప్పుడు వంట ఇంట్లో నేను కుర్చీ వేసేదాన్ని. ఆ కుర్చీని తీసివేసి నీవు నాకు మర్యాదలు చెయ్యటమేమిటని చిన్ని వంట గదిలోకి వచ్చి నా పక్కన నుంచుని తినటానికేమైనా వున్నయిటే అంటూ డబ్బాలు వెతుక్కుని కావలసినవి అడిగి చేయించుకునేవారు.
పెద్దబ్బాయి సుబ్బారావు వివాహం అయ్యేటంతవరకు నాన్నగార్ని పూర్తిగా సేవించుకునే అవకాశాన్నిచ్చింది. నేనిలా వుండగలగటానికి నాన్నగారు, అమ్మగారి ఆశీస్సుల నంతంగా వున్నాయి. నేనంటే ఎంతో ప్రేమగా వుండే నాన్నగారు అమ్మతోసహా నాదగ్గర ఆసీనులైవున్నారు.
అమ్మను నీకంటే ముందు నన్ను నీలో కలుపుకోమని అర్థిస్తే నువ్వు నన్ను దాటించటం నీ ధర్మం నీవు అడగటానికి వీల్లేదు అని నన్ను శాసించింది అమ్మ. నాన్నగారు అమ్మకు అనారోగ్యం వున్నప్పుడు నీ తదనంతరం నా పరిస్థితేమిటనగా నాన్నగారి కోరికను మన్నించి ఆచరణాత్మక ప్రబోధాన్నందించింది.
నాన్నగారి జన్మనక్షత్రమయిన పునర్వసులో – మానవ దేహాన్ని వదిలి అమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేషానక్షత్రంలో అనసూయేశ్వరులై ఆవిర్భవించారు.
సకల జీవులకు చైతన్యం ఇచ్చే అమ్మ నాన్నగారికి చైతన్యం ప్రసాదించి ఆయనే మనకు రక్ష అని బాల్యంలో చెప్పినట్లుగా మనకు రక్షకునిగా ఏర్పరిచి ఆలయంలో అమ్మే అఖండ జ్యోతిని వెలిగించింది ఈనాటికీ వెలుగుతున్నదా జ్యోతియే .
మహన్యాస సహిత ఏకాదశ రుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు, లక్షనామార్చనలు ఏర్పరిచి అమ్మ కూడా నిత్య పూజలో పాల్గొని నాలుగు సంవత్సరాలనంతరం అమ్మ కూడా నాన్నగారి సరసన చేరి అర్చనలందుకుంటూ విచక్షణ లేని వీక్షణతో శివశక్తిస్వరూపు లిద్దరూ మనలను ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీస్సులకై రండి – వేగిర పడండి.
నాన్నగారి ఆలయ ప్రవేశానంతరం “అనసూయేశ్వర నమో నమో ! శ్రీ నాగేశ్వర నమో నమో !” అన్న నామాన్ని భ్రమరాంబక్కయ్యకు ప్రేరణ కల్పించగా అమ్మా నాకిలా ప్రేరణ కల్పించావు ఈ నామం జరిగితే బాగుంటుంది అని అమ్మకు విన్నవించింది. ఆ విన్నపాన్ని ఆలకించిన అమ్మ చేయించు అన్నది. కానీ అమ్మ అన్నట్లు దేనికైనా సమయం రావాలి కదా !
నాన్నగారి శతజయంతి ఉత్సవాల్లో ఆ నామానికి సమయం ఆసన్నమైంది. భ్రమరాంబక్కయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు నాన్నగారి నామం చేస్తూ పునీతులవుతున్నారు.