“నేను నేనైన నేను. అన్ని తానైననేను” అని ఘంటాపథముగా నొక్కి వక్కాణించి, ఆచరణశీలియై, మార్గదర్శియై, విశ్వజననియై మాతృశ్రీ అవతారమూర్తియై “అమ్మ” అందరికీ అమ్మయై వెలుగొందిన మన ప్రేమావతారమూర్తి దక్షిణ భాగమున సుస్థిరస్థాన మేర్పరచుకున్న మహానుభావుడు నాన్నగారు. “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరా” అను నట్లుగా నాన్నగారితో నేను ఆ నేను అన్న మేను అమ్మ. సాధారణముగా అమ్మతో తొలి స్పర్శ కల్గి అంతా అమ్మే అని జీవనం ప్రారంభించి చనువుగా ఉంటూ ఏమి కావలసి వచ్చినా అమ్మ ద్వారా నన్నీ అడగటం పరిపాటి. కనుక జిల్లేళ్ళమూడి వెళ్ళి అమ్మను చూచి ఆనందబాష్పములు రాల్చి అమ్మ దివ్యచరణార విందములు స్పృశించి ఏవో ! చెప్పనలవి కాని ఆనందానుభూతిని పొందటం అందరికీ అనుభవైక వేద్యమే.
ప్రస్తుతం అమ్మ అనంతోత్సవములు, నాన్నగారి జయంత్యుత్సవములు కలిసి జరుపుతున్న యీ శుభతరుణములో నాన్నగారి సాహచర్యంతో నా అనుభవము పొందుపరచదలచి యదార్థ విషయము మీ
ముందుంచుతున్నాను.
ఆనాడు అంటే 1978 సంవత్సరంలో జూన్లో జిల్లెళ్ళమూడి గ్రామంలో ప్రవేశించాను. అంతకు ముందు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 75, 76 ప్రాంతాలలో రాజమండ్రి గోదావరీతీరంలో వేద, స్మార్త విద్యను కొంచెం పఠించి ఆర్.యస్.యస్. కార్యకర్తగా అజ్ఞాతవాసం, కారాగార సందర్శనం ఇత్యాది కార్యక్రమాలు ముగించి స్నేహితులు వార్త ద్వారా జిల్లెళ్ళమూడి చేరి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో “సాహిత్య విద్యా ప్రవీణ” కోర్సులో జేరి, విద్యాధ్యయనం సాగిస్తున్న రోజులు. ఎన్నో ఆచార, సంప్రదాయ, సమిష్టి కుటుంబాల వారితో, వ్యష్టి కుటుంబ వ్యక్తులతో పరిచయం, చాలప్రాంతాల అలవాట్లు గతంలో చూచిన నేను ఒక్కసారిగా జిల్లెళ్ళమూడి రావటం, అంతా క్రొత్తదనం తొలి అమ్మదర్శనం ఏవో తెలియని ఏడుపు. కళాశాల ప్రవేశం అధ్యాపకుల ఆదరణ, విద్యాబోధన కొంచెం కష్టమనిపించినా క్రమేపి ఆ ఆనందమే ఆనందము. ఆర్.యస్.యస్. శాఖ ముఖ్యశిక్షక్గా గ్రామస్థులతో, ఆవరణలో వారితో కళాశాల విద్యార్థినీ బృందంతో అమ్మ ఆశీస్సులతో బ్రహ్మాండంగా సాగుతున్నది జీవితం. బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు కరణంగారు 1978 నవంబరులో (కార్తీకమాసం) తొలిసారిగా స్పర్శనం, భాషణం అకస్మాత్తుగా ఆనందం జరిగింది. అతఃపూర్వం ఆగష్టు 15 కళాశాల పతాకావిష్కరణలో దర్శనం జరిగింది. క్రొత్త కనుక ఏ అనుభూతి లేదు. ఈశ్వరేచ్ఛ కార్తీకమాసంలో ఆవరణలో పోస్టు ఆఫీసు చివరిగదిలో యుండేది. ఎదురుగా నవారు మంచం, బొంత, దిండు, కల్గి నాన్నగారు కూర్చోన్నారు. సాయంత్రం 5 గంటలకు సమయం “ఒరేయి! ఇట్లా రారా ! అనే పిలుపు ఎంత ఆనందం కల్గించిందో ఏ లోతుల్లోకి పోయి పదాలు వెతికినా లేవు. నమస్తే అండి – అన్నాను. కనీ కనిపించని మందహాసం, కళ్లలో అరుదుగా కనిపించే నీలిరంగు కళ్లు. ఏవో నమలుతున్నట్లు అన్పించే దవడల కదలిక. చిన్న బొట్టు అదొకరకమైన తేజో విలాసమూర్తి నాకు గోచరించాడు. ఏరా నీవెక్కడి నుండి వచ్చావు? ప్రశ్న : విశాఖపట్నం జిల్లా అండీ అన్నాను. బాగుందా ? చదువు సాగుతున్నదా? అన్నం సహిస్తున్నదా? అని అడిగే ప్రశ్నలకు బిత్తరపోయాను. ఎందుకంటే అప్పటికి 10, 15 రోజుల నుండి నాలాంటి క్రొత్త విద్యార్థులు ఏవో సాకులు చెప్పి పలాయనం చిత్తగిస్తున్నారు. నన్ను కూడా ప్రిన్సిపాల్ విఠాల రామచంద్రమూర్తిగారు, సీనియర్ విద్యార్థులు కొంతమంది ఫరవాలేదు, వెళ్లకు, చదువుకో బాగుంటుంది కొద్ది రోజులలో అంతా అలవాటవుతుంది. లే అని చెప్పడం జరుగుతున్నది. మరి అది తెలిసి అడిగారా! లేక వారి సొంత ఆలోచనా? అన్పించింది. వాకబు ప్రారంభించా. అర్థనారీశ్వరుడు గదా యీ నాగేశ్వరుడు అనుకున్నాను. అమ్మ భర్త కదా ! గ్రామం, విశ్వజననీ సంస్థ. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు చాల గొప్పవారు. అతనితో మన పరిచయం ఏమంత సమంజసముగా ఉంటుంది? మనతో మాట్లాడటానికి ఇష్టపడతారా ? అనే ఆలోచనల్లో ఉండేవాణ్ని. అట్లాంటి పరిస్థితులలో ఒక్కసారిగా బంధువుల్లో ఒకరిలా, తండ్రివలె ఆ పిలుపుకు చైతన్యదీప్తి కలిగినట్లయింది. సరే ! క్రమేణ నాకిష్టమయిన నాటకరంగము, క్రీడారంగము నాన్నగారికి ఇష్టమగుట ఒక అదృష్టము. సిద్ధాంత రీత్యా మాత్రం వారు నెహ్రూ కుటుంబ అభిమాని. నేను ఆర్.యస్.యస్. కార్యకర్తను అయినా విచిత్రమైన సంఘటన అమ్మ కల్పించింది తెలియపరుస్తాను.
నాకు ఇష్టమైన పనులలో పెద్దవారిని, రాజకీయ, పండితవర్గము వారిని అలా కోన ప్రభాకరరావుగారిని, పరకాల శేషావతారము గారిని, సి. నాగభూషణం గారిని, (నటులు) మరోనటుడు సి. హెచ్. నారాయణరావుగార్ని, క్రీడాకారుడు పిచ్చయ్యగార్ని నాన్నగారే స్వయంగా పరిచయం చేసారు. తలచిన కొద్దీ ఆనందం కల్గించే సన్నివేశము. సుబ్బారావు అన్నయ్య కూడా ఆ విధముగానే క్రొత్తవారిని, పెద్దవారిని ప్రత్యేకముగా పరిచయం చేసేవారు. అమ్మ దయవలన పండితలోక దర్శనం జరిగింది. ప్రదసారాయ కులపతి గారు నిర్వహించిన సరస్వతీ సామ్రాజ్యవైభవము అంతులేని ఆనందము కల్గించింది. సాయంత్రం పూట గాని, రాత్రి 8 గంటలు దాటిన తరువాత గాని, ఉదయం గాని తీరికను బట్టి నాన్నగారితో టేబుల్ టెన్నిస్ భోజనాలయ ఆవరణలో ఆడుతున్నప్పుడు ఇతడు ముదుసలి కాదు సవ్యసాచి అన్పించేవారు. కోర్టులో బేడ్మెంటెన్ ఆడినా అంతే స్థాయిలో ఒక్కొక్కసారి కొండముది రామక్రిష్ణగారు వాలీబాల్ ఎక్కువగా ఆడినా బ్యాట్ కూడా తీసుకొని నాన్నగార్ని ఉత్సాహపరుస్తూ ఆడుతుంటే నాన్నగారు రెచ్చిపోయి ఆయనకు ఆయనే సాటిమేటి అనిపించారు. తరువాత చెప్పారు నేను బ్యాడ్మెంటన్ ప్లేయరునిరా అని.
“ఉత్తమే క్షణకోపస్య” అన్నట్లు తమాషాగా భలే కోప్పడేవారు. అర్థరాత్రి 12.30ని.లు సమయంలో విజయనగరం జిల్లా టూరిస్టు బస్సులు 2 తిరుపతి నుండి జిల్లెళ్ళమూడి వచ్చాయి. ఆవరణలో పరీక్షార్థులమై తిరుగుతూ చదువుకుంటున్నాము. నన్ను తెలిసినవారు, నాకు తెలిసినవారు యున్నారు. సీతాపతిగారు, నేను వాళ్ళకి కుళాయిలు చూపెడుతున్నాం. భోజనమును ఏర్పాటు చేస్తున్నాము. నాన్నగారు మెలుకువు కల్గి లేచి వచ్చారు. ఏందిరా గోల ఈవిడగారు తయారైంది. ఎక్కడెక్కడి నుండి వస్తారో ఎప్పుడు రావాలో కూడా తెలీదు వీళ్లకి ఏంది భాస్కరా ! వాళ్లు మీ ఊరేనట్రా ! చెప్పు ఆ శేషయ్య గార్కి, రేపు. ఎందుకు జరుగుతున్నదీ యిదంతా, వేదాంత వైరాగ్య వాక్యములనుకుంటూ శయ్యాగృహంలోనికి వెళ్లారు. ఇటువంటి ఈ సంఘటనలు చాలా యున్నాయి. క్షణమే కోపం. హైమాలయంలో అర్చకస్వాములు సెలవు పెట్టినా, బాపట్ల నుండి రాకపోయినా అభిషేకం చేయటానికి పాల్గొనేవాడిని, ఒకసారి కాలేజి సమయంలో వడివడిగా హైమాలయానికి పరిగెడుతుంటే, ఏరా ఈ పూజలు అభిషేకాలు చేస్తావురా ? అని అడిగారు. అవునండీ అందుకే వెళ్తున్నాను. చాలామంచిదిరా, పనికొస్తావు అని వూరుకున్నారు.
కరణం పాత్రలో గ్రామస్థులతో మాట్లాడటం, మున్సబుగారి కుటుంబసభ్యులతో చర్చించటం, నాటికలు రిహార్సల్సు చూచి ప్రోత్సహించటం. ఆడుతున్నప్పుడు సునాయాసంగా మాతో ఆడటం, స్లాబులు వేస్తున్నప్పుడు ఆ చేతి పుండ్లు చూచి మందులు యిప్పించుట, గుండిగలతో నీళ్ళు మోస్తున్నప్పుడు శక్తికి తగ్గ బిందె పట్టుకోవాలిరా. సులువు సూత్రం తెలుసుకోవాలి అను సూచనలు యివ్వటం.
“పద్మపత్రమివాంభసా” అన్నట్లుగా సంస్థాగత కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నా, తనకు పట్టనట్లుగా కన్పించినా, అన్ని, అంతటా ఆలోచిస్తూ కీలకమైన మౌలికమైన సలహా సహకారములు అందజేసే వారు. నాకు బాగా తెలుసు. అమ్మ అనయాయులందరికీ పెద్దాయిన, నాయన నాన్నగారే. రాఘవరావు మామయ్యను సిగరెట్లు మానమని నయానా, భయానా చెప్పేవారు. లోకనాథం బాబయ్యకు అసలు మాట్లాడటానికే భయం. నాన్నగారే ముందుగా పలుకరించి అభయం యిచ్చేవారు. నిర్భయముగా, నిర్మొహమాటముగా, కుండబద్దలు కొట్టేటట్లుగా గంభీరస్వరము, సంప్రదాయ దుస్తుల ఖద్దరు పంచె, బనియను లాల్చీ నిరాడంబరముగా, హిందూ మతమును ఆరాధిస్తూ మిగిలిన మతములన్నింటినీ ఆదరిస్తూ ఉపకారం చేయటానికి ఉరకలు వేసే మనస్సుతో ఉత్సాహముగా వయస్సును మరచి మరీ ప్రవర్తించేవారు మంచి ఆరోగ్యశాలి.
విచిత్రమైన సంఘటన
1983 వ సంవత్సరము “రక్షాబంధన్” శ్రావణ పౌర్ణిమ రాఖీ దినోత్సవము ఆర్.యస్.యస్. శాఖలో సంప్రదాయబద్ధముగా జరిపే ప్రక్రియ. రక్షలు కట్టుకోవటము నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష,అని ప్రతిజ్ఞచేస్తారు. నాకు కనిపించిన ఎప్పుడూ ఆస్థాన విద్వాంసులు వలె కాలేజి పంద్రాగస్తు త్రివర్ణ పతాకం నాన్నగారే ఆవిష్కరిస్తున్నారు. అర్హత, నిండుతనం, భేషుగ్గా ఆయనకే చెల్లింది. ఈసారి నుండి “భగవధ్వజం” నాన్నగారి చేత ఎగురవేయిస్తే మంచిది అనిపించింది. ముఖ్యశిక్షక్ని, సంఖ్యకు లోటు లేదు, సభ నిండుగా ఉంటుంది. ఫరవాలేదు. కాని కరడు కట్టిన కాంగ్రెస్వారు, నెహ్రూ కుటుంబంపై ప్రేమాభిమానం గలవారు, ఒకరకమైన సిద్ధాంతం పుణికిపుచ్చుకున్న పుణ్యజీవి. అవన్నీ ప్రక్కన పెడితే, భాస్కరశర్మ, ఏమో ? ఎందుకిది ? తన మనసుకి నచ్చినవ్యక్తి, అభిమాని. అడిగితే కాదనకూడదు. అనుకున్నారేమో ? నేను మాత్రం కాస్త చనువుగా, కొంచెం భీతితో నాన్నగారు వచ్చి తీరాలన్న ప్రీతితో సాహసం చేసి ఆర్.యస్.యస్. శాఖ రక్షాబంధనంనకు ఆహ్వానించాను. కొంచెం నసిగినా, ఏదో సరదా సణుగుడు ప్రారంభించి ఉత్సాహముగా విచ్చేసారు. ఆవరణ వారు గ్రామస్థులు, ఖగ్గావారు, రెడ్డివారు, కోమట్లు, శ్రీ పన్నాలవారు, విఠాల వారు, బి. ఆర్.కె. గారు, ప్రసన్నాంజనేయశర్మగారు, విద్యార్థులు అందరూ హాజరయినారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున సంఘస్థాన్ ప్రస్తుతం రాధ అన్నయ్య సమాధి గల్గిన సువిశాల పంట భూములలో ఏర్పాటు చేయుట జరిగినది. నిత్యం హాజరవుతున్న దత్తాత్రేయశర్మ మన్నవ, రావూరి ప్రసాద్ తెనాలి వెళ్లారు. అమ్మపై అంతస్థు నుండి సాయంకాల సమయం తెల్లటి చీర భారతమాత వలె వీక్షించు శుభసమయం బౌద్ధిక్ విఠాలవారు నిర్వహించారు. నాన్నగారిచే ధ్వజావిష్కరణ ప్రణామ్ తీసుకొనుట జరిగినది. వికిర అని సంజ్ఞ రాగానే అందరూ ఒక్కచూపులో నేరుగా అమ్మని, మమ్ములను అమ్మ పరస్పర వీక్షణములతో నాన్నగారితో సహా మేమందరము ప్రణామ్ని నమస్కారముగా (అప్రయత్నం) మార్చివేయుట జరిగినది. అమ్మవద్ద రామక్రిష్ణ అన్నయ్య, వసుంధర అక్కయ్య, బ్రహ్మాండం శేషక్కయ్య, బుద్ధిమంతుడు అన్నయ్య వగైరాలున్నారు. నాన్నగారు కాషాయధ్వజం ఎగరేస్తున్నా రేమిట్రా? భాస్కరశర్మ తీసుకెళ్లింటాడు. – అని అన్నట్లు తరువాత తెల్సింది.
ఆ తరువాయి నాన్నగారు నాతో ఓ. క్రమశిక్షణ, వ్యాయామం వీటి వరకు ఫరవాలేదు గాని, మతోన్మాదం, కాంగ్రెస్ని దూషించటం యిలా కొన్నింటిలో ఏకీభవించలేనురా. నేను వచ్చేవాణ్ణి కాదసలు. నీవలనే వచ్చాను. నీ గురించే వచ్చాను అని చాలాసార్లు అన్నారు. కొందరు ఆశ్చర్యము వ్యక్తం చేశారు. నాన్నగారి రాకతో సంఘపరివార్ కుటుంబము పెరిగి పెద్దదైనది.ఆ తరువాయి సంఘ పెద్దలు భాగయ్యగారు, కప్పగంతుల కోటేశ్వరశర్మగారు, సోమయ్యగారు, హాల్దేకర్లు వచ్చి అమ్మ ఆశీస్సులు, నాన్నగారి అభినందనలు వస్త్ర, భోజన సత్కారంలో తీసుకొని ఆనందించారు. గుంటూరుజిల్లాలో సంఘశిబిరములకు జిల్లెళ్ళమూడి సంఖ్య 300 తగ్గేది కాదు. వత్రోత్సవమునకు, నాన్నగారే స్వయముగా ఏరా ? మీవాళ్లు ఎంత మంది సర్వీసుకు రాగలరు అని అడిగితే మనవాళ్లు అని అనండి నాన్నగారూ ! అదేలే పోనీ మనవాళ్లు అని చమత్కారంగా అని సంఖ్య తెలుసుకొనేవారు. అమ్మ కరుణామయి, నాన్నగారు కరుణామయుడు ప్రస్తుతంలో మన పాట్రన్ బ్రహ్మాండం రవి అన్నయ్య వద్ద కాసేపు నిల్చొని పరిశీలన చేస్తే అన్ని కోణాలలో నాన్నగారు పూర్తిగా దర్శనమిస్తారు.
రామక్రిష్ణా మఠము వారి త్రిమూర్తి చిత్రాలు వివేకానంద, రామక్రిష్ణ, శారదామాత, అర్కపురి అందరిల్లు వారి త్రిమూర్తి చిత్రాలు హైమ అమ్మ నాన్నగారలు స్టికర్సుగా యీ యుగళ ఉత్సవముల సందర్భముగా ముద్రించినట్లయితే బాగుండుననే ఆలోచన. అరవైయ్యో పడిలో ఉన్ననూ, ఇరవయేళ్ల యువకునిగా క్రీడారంగంలో భాసించిన వ్యక్తి వార్థక్యంను మరచి యౌవనవంతుడై సేవా, సహాయాలందించిన మూర్తి, త్రికరణశుద్ధిగా గాంధీ మార్గమును ఆచరించు శక్తిమాన్, ఎందరికో స్ఫూర్తి గల్గించిన నాన్నగార్కి ప్రేమ సవినయ సాదర నమస్కార సుమములతో.