ఫిబ్రవరి 17వ తేది ప్రతి సంవత్సరం జరుగు తున్నట్లుగనే నాన్నగారి ఆరోధనోత్సవాలు ప్రారంభమైనవి. ఈ సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయంలో మహా రుద్రాభిషేకం దాదాపు 22 మంది రుత్విక్కులు మహాన్యాసం పఠిస్తుండగా శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు దంపతులు ప్రారంభించగా అనేక మంది సోదరీ సోదరులు పాల్గొన్నారు. మహాన్యాసానంతరం మహారుద్రాభిషేకం జరిగింది. అట్లాగే శ్రీ నవనాగనాగేశ్వరాయంలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం జరిగింది. సిద్ధి వినాయక ఆలయంలో కూడా ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఈ అభిషేకాలలో కూడా విశేషంగా సోదరి సోదరులు పాల్గొన్నారు.
తదనంతరం శ్రీ అనసూయేశ్వరాలయంలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు దంపతులు బియ్యంతో అభిషేకం ప్రారంభించారు. అన్నపూర్ణాలయం కళ్యాణవేదిక పైన అమ్మ నాన్నగార్లకు శ్రీ ఐ. హనుమబాబు ఆధ్వర్యంలో శ్రీ చక్కా శ్రీమన్నారాయణ దంపతులు, బెంగుళూరు నుండి శ్రీ అంగర హైమానంద్, విశాఖపట్నం నుండి శ్రీమతి కుసుమాచక్రవర్తి శ్రీ కె.కామేశ్వరరావు గారు, శ్రీ టి.టి. అప్పారావు గారు మొదలగువారు ప్రారంభించగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారు మాట్లాడుతూ అన్నపూర్ణేశ్వరి జిల్లెళ్ళమూడి అమ్మకు నిత్యాన్నదాన వితరణ ఎంతో ప్రీతిపాత్రమైనదని చెప్పారు. నాన్నగారి ఆరాధనోత్సవ భాగంగా ధాన్యాభిషేకం కూడా జరుగుతున్నట్లు తెలిపారు. ఏడాది కొకసారి ఈ ధాన్యాభిషేకం చేసి భక్తులిచ్చిన ధాన్యాన్ని ఏడాది పొడవున అన్నవితరణకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ యజ్ఞంలో దాదాపు 3000 మంది సోదరీ సోదరులు పాల్గొని అమ్మ ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ధాన్యాభిషేక మహోత్సవమునకు, “వణుకూరు” గ్రామము నుండి శ్రీ చక్కా వెంకట సుబ్బారావు గారి ద్వారా, “గొల్లనపల్లె” గ్రామం నుండి “మాతృశ్రీ మెడికల్స్” వారి ద్వారా, “గోపవరపు గూడెం” నుండి శ్రీ రామమూర్తిగారి ద్వారా, “సూరంపల్లి” నుండి శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి ద్వారా, “అయ్యంకి” గ్రామము నుండి శ్రీ వెంకటేశ్ గారి ద్వారా, “బొమ్మవానిపాలెం” నుండి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా దాదాపు 8 బస్సులలో భక్తులు ప్రత్యేకంగా వచ్చారు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి ద్వారా వచ్చిన 300 బస్తాలలో ఈ యేడు కూడా 115 బస్తాల ధాన్యం సమర్పించిన మస్కట్ వాస్తవ్యులు శ్రీ చక్కా సత్యనారాయణ అభినందనీయులు. ఈరోజు ఆర్.టి.సి. బాపట్ల యాజమాన్యంవారు ఆర్.టి.సి. బస్సులు ప్రత్యేకంగా నడిపారు. ఈ మహోత్సవంలో అనేకమంది సోదరీ సోదరులు, కాలేజి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు వాలెంటర్లుగా పనిచేశారు. బాయ్స్ స్కౌటు వాళ్ళు కూడా వాలెంటర్లుగా పాల్గొన్నారు. ఈ ధాన్యాభిషేకంతో స్వయంగా పాల్గొన్నవారికి – క్యాష్, డి.డి. కైండ్ ద్వారా సేకరించి పంపిన సోదరీ సోదరులకు శ్రీవిశ్వజననీ పరిషత్ ధన్యవాదములు అర్పిస్తున్నది.
రాగద్వేషాలకు ఆధారమైన వాడివల్లే సృష్టి జరిగింది.