1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నాన్నగారి దివ్యస్మృతులు

నాన్నగారి దివ్యస్మృతులు

Ravuri Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : August
Issue Number : 1
Year : 2013

-1959 పూర్వార్థంలో అనుకోని పరిస్థితులలో నా కన్నతల్లి, నా తోబుట్టువులతో నేను మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాను. అపుడు నా వయస్సు ఎనిమిదేళ్లు. నాటి నుండి మా కుటుంబ సభ్యులంతా జిల్లెళ్ళమూడి తరచు వస్తూండేవారం. నా తల్లిదండ్రులు సంవత్సరంలో ఎక్కువరోజులు అమ్మ సన్నిధిలో అమ్మసేవలో ఉండేవారు. మా స్వగ్రామము చెరుకూరు. అది జిల్లెళ్ళమూడికి 7, 8 మైళ్ళ దూరాన ఉంది.

ఒకసారి సెలవుల్లో జిల్లెళ్ళమూడి వచ్చాను. Ball Badminton doubles ఆడుతున్నారు. ఆ నలుగురి ఆటగాళ్లలో ఒక పెద్దాయన పంచె బిగించి కట్టుకొని ఉన్నారు. నేను వేడుకగా నిలబడి తదేకంగా చూస్తున్నాను. ఆట మధ్యలో బంతి దూరంగా వెళ్ళి ముళ్ళపొదల్లో చిక్కుకుంది. అంతా చూస్తూ నిలబడి ఉన్నారు. నన్ను పిలిచి ఆ పెద్దాయన ‘ఎవరబ్బాయివిరా’ అని అడిగారు. ‘చెరుకూరు నరసింహమూర్తి గారి అబ్బాయి నండీ’ అన్నాను. ‘అయితే మనవాడివేగా ! కాస్త ఆ బంతి వెతికి తీయరా!’ అన్నారు. బంతి తీసి వారికిచ్చా. మళ్ళీ ఆట మొదలైంది. శింగుపాలెం తాతయ్యగారబ్బాయి సోమశేఖరం నా స్నేహితుడు. వాడు అక్కడ కనబడితే ‘ఆ పెద్దాయన ఎవరు ?’ అని అడిగా. ‘అదేమిటి? నీకు తెలియదా ? అమ్మ భర్త. నాన్నగారు’ అని చెప్పాడు. అంతకు ముందు వారిని చూచాను. ఆయన ఎవరూ అనే ఆలోచన చేయలేదు. వారు ఫలానా అని నాకు ఎవరైనా చెప్పే సందర్భంగానీ కలగలేదు ! అమ్మ సాక్షాత్తు దేవతగా అందరిచే పూజలందుకుంటుంటే, ఈయనేమిటి ఇంత సామాన్యంగా ఉన్నారు ? అనిపించింది.

1962 సంవత్సరము అని గుర్తు. అందరింటి నిర్మాణం కోసం లోతుగా పునాదులు తవ్వారు. ఆ రోజుల్లో అందరింటి అక్కయ్యలు అన్నయ్యలతో పాటు నిత్యం అమ్మను దర్శించుకునేందుకు వచ్చిన సోదరీసోదరులు కూడా స్వచ్ఛందంగా శ్రమించేవారు. కూలీల్ని పెట్టలేదు, నేటి పిల్లర్స్ కట్టడాలు నాటికి మొదలుకాలేదు. పెద్దవారంతా పనుల్లో పాల్గొంటే పిల్లలందరం పునాదుల ప్రక్కనే ఆడుకొంటున్నాం. మా ఆటలో పేచీ వచ్చింది. సాగర్ అన్నగారి కుమార్తెలు ఝాన్సీ లేక హైమ కావచ్చు. కోపంతో చేత్తో నెట్టాను. ఆ అమ్మాయి పునాది గోతిలో పడింది. పెద్దగా ఏడ్చింది. నాకు భయం వేసింది. ఇదంతా నాన్నగారు చూస్తున్నారు. ఆయనకి బాగా కోపం వచ్చింది. ఒక బెత్తం తీసుకొని ‘ఆడపిల్లని పునాదుల్లోకి నెడతావు! వెధవా !’ అంటూ నన్ను దండించటానికి వెంటపడ్డారు. కానీ నేను ఆయనకు చిక్కలా. చివరకు ఆయన ఒక చోట నిలబడి ‘ఇంకొకసారి ఆడపిల్ల జోలికి వస్తే నీ ఒళ్ళు చీరేస్తా! వెధవా’ అంటూ హెచ్చరించారు.

నాన్నగారికి పౌరాణిక నాటకలన్నా, పద్యగానం అన్నా ఎంతో ఇష్టం; తరచు ఆ పద్యాలను పాడుకునేవారు. అందు విశేషానుభవం గల శ్రీ బెండపూడి యోగయ్యగార్ని, నా తండ్రి శ్రీ రావూరి నరసింహం గార్ని, హార్మోనియం విద్వాంసుడు రాధ అన్నయ్య ఒకచోట చేర్చి నాన్నగారు పద్యాల కచేరి ఏర్పాటు చేసేవారు. నాన్నగారితో సహా అందరూ పోటీపడి పద్యాలను ఆలపిస్తూండేవారు కొన్ని గంటలు. అమ్మ కూడా వచ్చి విని ఆనందించేది. అమ్మ నాన్నగార్ల చెంత కూర్చుని పాడేవారూ, వినేవారూ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందేవారు. ఎప్పుడైనా నాన్నగారు ఆరుబయట మంచంపై పడుకొని పెద్దగా పద్యాలు పాడేవారు. వారు పాడటం విని అమ్మ తన ప్రక్కనున్న వారితో నాన్నగారి జ్వరం వచ్చినట్లున్నదని, టెంపరేచర్ చూసి ఫలానా హోమియో మందు వేయమని చెప్పేది. ఆయన హుషారుగా పద్యాలు పాడుకుంటుంటే అమ్మ జ్వరం వచ్చిందని అంటున్నదేమిటని మాకు ఆశ్చర్యం వేసేది. కానీ అది నిజం. జ్వరం చూసి మందు వేసేవాళ్ళం; అది తగ్గేది. చిత్రంగా ఉన్నది కదా !

అమ్మను దర్శించుకునేందుకు వందలు, వేలమంది యాత్రికులు వచ్చేవారు. రాత్రి, పగలు అనక నిర్విరామంగా భోజనాలు చేస్తూండేవారు, అమ్మ దర్శనం చేసుకునేవారు. సంస్థ కార్యక్రమాలు ముమ్మరమైనాయి. ఇన్ని, ఎన్ని జరిగినా నాన్నగారు మాత్రం నిరాడంబరంగా ఉండేవారు. నరసరావుపేట పడక కుర్చీలో కూర్చుని గ్రామకరణంగా, పోస్టుమాస్టరుగా ప్రజల సేవాకార్యక్రమాలను నిర్వహించేవారు, మనలో ఒకరిగా ఆనందించేవారు.

జిల్లెళ్ళమూడి చరిత్రలో నాన్నగారి స్థానం చాల ప్రత్యేకమైనది. ఈ ప్రపంచానికి ఆరాధ్యదేవత అయిన అమ్మ తనకు ఆధారం, ఆరాధ్యదైవం నాన్నగారేనని ప్రకటించింది. తను ఏమి సంకల్పించినా ముందుగా నాన్నగారి పాదాలకు నమస్కరించి వారి అనుమతితోనే ఏ కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టేది. నాన్నగారు మాత్రం తనకు ఒక గుర్తింపు, ప్రత్యేకస్థానం కావాలని ఏనాడూ కోరుకోలేదు. అందుకు ఎవరైనా ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించేవారు.

1970 ఆగష్టు నుంచి సంస్థ సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ మా కుటుంబ సభ్యులంతా అమ్మ సన్నిధిలోనే ఉండేవాళ్ళం. మాతృశ్రీ స్పోర్ట్స్ అండ్ కలర్చరల్ లీగ్ పేరిట ఆటల పోటీలు నిర్వహించే వాళ్ళు. ఒకనాటి క్రికెట్ మాచ్లో స్థానికులు, స్థానికేతరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దానికి అమ్మ స్వయంగా వచ్చి తిలకించింది. ఆ రోజు నాన్నగారు ఖద్దరు లాల్చీ వేసుకుని, పంచె బిగించి యువకునిలా బౌలింగ్, బ్యాటింగ్ చేసి అందరికీ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించారు. ఇక అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఆటలన్నీ నాన్నగార్కి ఇష్టమే. అయినా బాల్బాడ్మాంటన్ అంటే అమితమైన ప్రేమ, ఇష్టం. తాను గెలవాలని పట్టుదలగా ఆడేవారు. తాను ఓడిపోవటానికి ప్రత్యర్థికి ఏ పరిస్థితిలోనూ అవకాశం ఇచ్చేవారు కాదు. నా మీద వాత్సల్యంతో ‘ఏరా ! వరప్రసాదం’ అని పిలిచేవారు. Badminton ఆటలో ఆయన Back ఆడేవారు, వారి partner గా నేను Front ఆడేవాడిని. ‘మా వరప్రసాదం కొడితే ఇక తిరుగుండదు’ అని మురిసిపోయేవారు. ఎవరు బాగా ఆడినా వారి ఆటను ప్రశంసించేవారు, ప్రోత్సహించేవారు. అదే Sportive Spirit.

నాన్నగార్కి కాంగ్రెస్ పార్టీ అంటే చాల ఇష్టం. గాంధీ, నెహ్రూ కుటుంబాల త్యాగనిరతిని కొనియాడేవారు. ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే సహించేవారు కాదు. కాగా 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయాన్ని రుచి చూసింది. ఈ ఫలితాలు విని నాన్నగారు తట్టుకోలేరేమో అని అంతా భయపడ్డాం. కానీ ఆయన ఎప్పటిలాగే చిరునవ్వుతో మమ్మల్ని పలకరించారు. ధీరోదాత్తులు వారు. ఆయన ఇష్టా యిష్టాలతో నిమిత్తం లేకుండా ‘మీ అభిప్రాయాల్ని మీరు వెలిబుచ్చండి. బిడియపడవద్దు’ అంటూ ఎదుటివ్యక్తిని గౌరవిస్తూ ఉండేవారు; కానీ వారి స్వతంత్ర భావాలను విశ్వసించి ఆంతరంగికంగా రాజీపడేవారు కాదు.

ఒకసారి అంధసోదరుడు శిరిగిరి సుబ్బారావు, నేనూ గదిలో తెల్లవారుఝామున 4 గంటలకు శృతి పెట్టె సహాయంతో సరళీస్వరస్థానాలు వివిధ స్థాయిల్లో సాధన చేస్తున్నాం. మనిషి అలికిడి అనిపించి తలుపుతీశాను. ఎదురుగా నాన్నగారు. ఆశ్చర్యంతో లోపలికి సాదరంగా ఆహ్వానించాను. “మీ గొంతులు విని వచ్చాను. మీ సాధన నన్ను ఇక్కడికి రప్పించింది. ఒరేయ్, వరప్రసాదం! నువ్వు అచ్చు గ్రామఫోను రికార్డులా పాడుతున్నావురా” అంటూ వారి అనురాగభరిత శుభాశీస్సుల్ని అందించారు.

1980 లో అమ్మకి తీవ్ర అనారోగ్యం చేసింది. వైద్యం నిమిత్తం హైదరాబాద్ లో సో॥ శ్రీ టి.రాజగోపాలచారింట్లో ఉంది. ఎందరో సోదరీసోదరులు ఆందోళనతో వందల సంఖ్యలో వస్తుండేవారు. వైద్యులు ఎన్నో పరీక్షలు చేశారు, మందులు వాడారు. ప్రయోజనం లేకపోయింది. దీని ప్రభావం నాన్నగారి మీద చూపింది. ఎప్పుడు ? ఎలా ? ఏమిటో ! అనే ఆందోళనతో నాన్నగారు చిక్కిపోయారు. ఒకసారి అమ్మతో ఆయన ఏకాంతంగా 1,2 సార్లు మాట్లాడారు. మర్నాటి నుంచీ అమ్మ ఆరోగ్యం మెరుగైంది. అకస్మాత్తుగా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఈ సంతోష సమాచారం అందరినీ పరమానందభరితుల్ని చేసింది. సంతోషంతో అమ్మ దర్శనార్థం వందలాది సోదరీ సోదరులు హుటాహుటిన వచ్చి చేరారు. అమ్మ, నాన్నగారు హాలులో ఒక మంచం. మీద ఆసీనులై ఉన్నారు. హాలులో, ఇంటి ఆవరణలో, రోడ్డుమీద జనం క్రిక్కిరిసి ఉన్నారు.

ఆ సమయంలో ప్రక్కప్రక్కనే కూర్చొని ఉన్న అమ్మ నాన్నగార్లకి నమస్కరించుకోవాలనే కోరిక నాలో ఉప్పెనలా ఉవ్వెత్తున లేచింది. అందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఏం చేయాలో తెలియదు. ఎవరితో చెప్పుకోను ? ఎవరిని ఆశ్రయించను ? అని మధనపడుతున్నాను. ఉన్నట్టుండి నాన్నగారు ‘ఓరేయ్ ! ఇటు రారా !’ అని పిలిచారు. నేను బిత్తరపోయాను. జనం ప్రక్కకు తొలగి, దారి ఇచ్చారు. ‘ఇక దణ్ణం పెట్టుకో’ అన్నట్లు నాన్నగారు తన పాదాలు, అమ్మ

పాదాల వంక చేత్తో చూపించారు. నా కళ్లలో నీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా మనసారా జననీ జనకులు చరణాలకు . నాన్నగారు ప్రేమగా నా వీపు తట్టారు. నా మనస్సులోని కోరిక నాన్నగారికి ఎలా తెలిసింది?

అమ్మ – నాన్నగారు ఒక నాణానికి బొమ్మ బొరుసులా? వ్యక్తావ్యక్త ద్వైతాద్వైత స్వరూపాలా ? మన జ్ఞానానికి మేధకి అందేది కాదు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరింటి వాసులకి అమ్మ ఒక సూచన చేసింది – అందరూ కలిసి అన్నపూర్ణాలయంలోనే భోజనం చేయాలి – అని, వేరుకుంపటి వద్దు అని. మధురమైన అమ్మ కోరికను ముందు నాన్నగారు ఆచరణలో చూపించారు. ఏ నియమాలూ, నిబంధనలూ నాన్నగారికి వర్తించవు. అన్నపూర్ణాలయం గంట మ్రోగగానే అందరింటి పెద్దగా, ఆదర్శవంతంగా తన కంచం, గ్లాసు తెచ్చుకుని అందరితో పాటు సహపంక్తిభోజనం చేసేవారు. చుట్టూ పడ్డ ఎంగిలి మెతుకులను ఎత్తి, శుభ్రం చేసి వారి కంచాన్ని వారే తీసి వేసేవారు. వారు చూపిన విశిష్టమార్గాన్ని అందరూ అనుసరించారు. సాయంత్రం 4 గంటలకు మామూలుగా Badminton ఆడేవారు ఖుషీగా,

1981, ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి జిల్లెళ్ళమూడి చరిత్రలో అంధకారం, హాహాకారం అలుముకున్నది. ఆవేళ వస్తువు లేని నీడ, అర్థం లేని శబ్దం అయింది. నాన్నగారు శరీర త్యాగం చేశారు. నా గుండెల్లో రాయి పడింది, అణువణువూ ఒణికింది, కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అమ్మను తలచుకుంటే దుఃఖం ముంచుకు వస్తోంది. ఎందరికో ప్రాణదానం చేసిన సర్వశక్తి స్వరూపిణి, సౌభాగ్యదేవత అమ్మ. తన ప్రాణనాధుని విషయంలో కాలస్వరూపిణిగా లయకారిణిగా రూపుదాల్చిందే! ఇక నాబోటి అల్పం ? కొండంత అమ్మ కోరి అండగ ఉన్నదనే విశ్వాసం దూదిపింజంలా ఆ ఘోరవిపత్తు అనే పెనుగాలికి కొట్టుకుపోతున్నట్లు కలవరపడ్డాను. నా గదిలో ట్యూబ్ట్ వైపు చూస్తూ దారుణమానసిక సంఘర్షణతో సతమతమౌతున్నాను. అకస్మాతుగా ట్యూబ్ లైట్ వెలుగు మాయం అయింది. నక్షత్రాల కాంతులు, పాలపుంతల వెలుగులు ఆ స్థానంలో నా ముందు ప్రత్యక్షమయ్యాయి.

ఆ కాంతి ప్రవాహంలో నల్లని ఆకృతిలో ఐదుతలల నాగేంద్రుడు పడగలు విప్పి చుట్టు చుట్టుకొని భూమి నుండి దిగంతాలవైపు వేగంగా దూసుకు వెళ్ళటం కనిపించింది. నాలుగు దిక్కుల నుండి గంభీరస్వరం మేఘగర్జనవలె ‘ప్రతిష్ఠ జరగాలి’, ‘ప్రతిష్ఠ జరగాలి’, ‘ప్రతిష్ఠ జరగాలి’ అంటూ ముమ్మారు వినిపించింది. ఉలిక్కిపడ్డాను. క్షణంలో వాస్తవలోకంలోకి వచ్చాను. తెరచిన కళ్ళు తెరచినట్లే ఉన్నాయి. కావున అది కలకాదు. అద్భుతదర్శనం. దానిని ఎవరికైనా వివరిస్తే లోలోపల నవ్వుకుంటారేమోనని అప్పట్లో చెప్పలేదు. అసలు అట్లాంటివి నమ్మే వ్యక్తిత్వం కాదు నాది. కనుకనే ఆ అనుభవం నాకు కలిగిందేమో! ఇక నమ్మకపోవటం ప్రశ్నేలేదు.

తెల్లవారింది. 17వ తేదీన అమ్మ స్వయంగా నాన్నగారిని ఆలయప్రవేశం చేయించింది; దానికి శ్రీ అనసూయేశ్వరాలయం అని నామకరణం చేసింది. ఆ వివరాలు మనందరికీ తెలిసినవే. అమ్మ విశ్వకల్యాణం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసింది. అంతవరకు శోకసముద్రంలా ఉన్న అమ్మ క్షీరసాగరకన్యకలా ప్రశాంత దరహాస భాసురయై దర్శనం ఇచ్చింది. బిడ్డల కోసం గుండెను రాయి చేసుకుని నిలిచింది.

శ్రీ నాన్నగారి మహాభినిష్క్రమణం అనంతరం భయావహంగా నాకు కన్పించిన అపూర్వదృశ్యం తర్వాత కాలంలో కార్యరూపం ధరించింది. వారు సామాన్యులు కారు; అమ్మకే ఆధారభూతులైన అసామాన్యులు. ఎందువల్ల నంటే – నాన్నగారి పేరు నాగేశ్వరుడు. వారి నిష్క్రమణా నంతరం నాగేంద్రుడు స్వస్వరూపంతో భువి నుండి దివికి వెళ్ళిన దృశ్యం గోచరించింది; ఆకాశవాణి గంభీరస్వరం వలె ‘ప్రతిష్ఠ జరగాలి’ అని ధ్వనించింది; మర్నాడే వారు. అనసూయేశ్వరులుగా సుప్రతిష్ఠితులైనారు. నాన్నగారి ప్రతిష్ఠలో ఈవిధంగా ఎంతో అర్థము, అంతరార్ధము, పరమార్థము నిబిడీకృతమై ఉన్నాయి. మహిమాన్వితులైన ‘నాన్నగారి సోమశేఖరతత్త్వం’ అవ్యక్తంగానే ఉన్నది. శ్రీ అనసూయానాగేశ్వరుల, జగన్మాత – జగత్పితల శ్రీ చరణాలకు శతసహస్రాధిక వందనములు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!